అమ్మను ప్రేమరూపిణిగా, ప్రేమమూర్తిగా, ప్రేమోన్మాదినిగానే లోకం గుర్తించటం సహజం. ఎందుకంటే మాతృత్వం యొక్క జీవలక్షణం ప్రేమ గనుక. అమ్మ ఈ అవతారం కావాలని ధరించింది. పూర్వం భారతవర్షంలో గాని మరే ఖండాలలో గాని ఇటువంటి అవతారం రాలేదు. ప్రసిద్ధమైన దశావతారాలను తిలకించినా అందులో దుష్టశిక్షణ శిష్టరక్షణ ప్రధానమైన గుణంగానే భాసించింది. ఆఖరికి ప్రేమతత్వానికి ప్రతీకగా నిలచిన కృష్ణావతారంలో కూడ దుష్టశిక్షణ తప్పలేదు.
అమ్మ అలా కాక ‘దుష్టత్వాన్ని శిక్షించాలి గాని దుష్టుణ్ణి కాదు’ అంటుంది. తల్లికి తప్పే కనిపించ దంటుంది. శిక్ష లేదు, శిక్షణే నంటుంది. ఏమైనా దుష్టత్వాన్ని శిక్షించే రీతిలోనో లేక బిడ్డలకు (మంచివాడైనా, చెడ్డవాడైనా) శిక్షణ జరిపే పద్ధతిలోని భాగంగానో, లేక తన లీలా విలాసంగానో, అప్పుడప్పుడు నాణానికి బొమ్మ బొరుసు రెండూ ఉంటవని చూడటానికో అన్నట్లు తన మహత్తర దైవీశక్తి రూప సందర్శనం కూడా మనకు అందించింది. దానికి సమయం సందర్భము తోడు చేసుకొంటుంది. తల్లి కాలస్వరూపిణి కదా ! అటువంటి విభూతులు మనకు కనిపింపచేసిన సందర్భాలలో ప్రధానమైనవి శరన్నవరాత్రులు.
అమ్మ రాజరాజేశ్వరిగా, బాలత్రిపురసుందరిగా, కామేశ్వరిగా, అన్నపూర్ణగా, భువనేశ్వరిగా, శివదూతిగా, గాయత్రిగా, సరస్వతిగా, మహాదుర్గగా, కాత్యాయనిగా, మహిషాసుర మర్దనిగా, మహాకాళిగా, విజయలక్ష్మిగా తన లీలా విశేషాలతో మహోజ్జ్వల కాంతిమంతంగా బిడ్డలకు సంభ్రమాశ్చర్యాలను ప్రసాదించిన సమయాలు నిజంగా జీవితంలో మరపురానివి.
త్రిమూర్తులు, కుబేరుడు, దిక్పాలకులకు అధీశ్వరే కాదు, గ్రహరాజైన సూర్యుణ్ణి కూడా ప్రకాశింపజేసే రాజరాజేశ్వరి అమ్మ – గుణత్రయం, జగత్రయం, మూర్తిత్రయం, శక్తిత్రయం (ఇచ్ఛాజ్ఞానక్రియ) అవస్థాత్రయం (జాగ్రత్, స్వప్న, సుషుప్తి) అనేటటువంటి అనేక త్రయాలకు ఆధీశ్వరి అమ్మ. భువన మంటే జలమని కూడా అర్థం. జలాధి దేవత అమ్మ. అందుకేనేమో అమ్మ అభిషేకప్రియ. చాలాసార్లు స్నానం చేసేది. భువనానందులైన ఈ నందనులను అనుగ్రహించటానికి వచ్చింది కనుక భువనేశ్వరి అమ్మ. లోకంలో అమ్మ సాయంతో నాన్న వద్ద పనులు సాధించుకోవటం సులువు. లోకసహజం. కాని అమ్మను నాన్నగారు ఆరాధిస్తారు. పతివ్రతకు పరాకాష్ఠ భర్తచేత సైతం తల్లిగా ఆరాధింపబడటం. ఒకరి కొకరు ఆరాధ్యులే. అందుచేతనే అమ్మ శివదూతిగా ప్రసిద్ధి గాంచింది.
గానం చేసిన వాళ్ళను రక్షించే తల్లి గాయత్రి. పగలు-రాత్రి, వెలుగు – చీకటులు, జాగ్రత్ సుషుప్తులు, సంధిస్థలమైన సంధ్యలో గాయత్రీ మాత ప్రవేశిస్తుంది. అసలు సంధ్య అంటే వృత్తికి వృత్తికి మధ్యకాలం అని అర్ధం. ఉదయం సాయంత్రం సంజ వెలుగు రాగానే గూళ్ళలోని పిట్టలు కూడా కలకలారావం చేస్తూ సంధ్యాదేవిని కీర్తిస్తాయి. బ్రహ్మవేత్తలు వేదమాతను కీర్తిస్తారు. సామాన్యులు ధన్యు లవటానికి “జయహోూమాతా శ్రీ అనసూయా రాజరాజేశ్వరి శ్రీ పరాత్పరి” అనే మంత్రాన్ని గానం చేస్తున్నారు. గానం చేసినా, చేయకపోయినా సుగతిని ప్రసాదించే అమ్మ, గానం చేసినవారిని రక్షించదా ? గాయత్రీమాతగా.
భాషారూపిణియైన అమ్మ బిడ్డలకు కోరినా కోరకపోయినా సూర్యకాంతిలాగా వెలుగును పంచిపెడుతుంది. వాస్తవిక ప్రయోజనం ఆనందంతో కూడిన సచ్చిదానందరూపిణి అమ్మ. సారస్వతోపాసకులైన బిడ్డలు ఎక్కడకు ఎప్పుడు వెళ్ళినా అమ్మ వాళ్ళకన్నా ముందే సరస్వతిగా ప్రవేశించి అందరినీ ఆనందపరవశులను చేస్తుంది. అంతర్వాహినిగా అంతరంగాన్ని జ్ఞానమయం చేసే సరస్వతి అమ్మ. విశ్వవ్యాపిని అయిన అమ్మకు పొందలేనిది ఏదీ లేదు. ఏ నామ రూపాలనయినా పొందగలదు. అమ్మకు దుర్గమ మయింది ఏదీ లేదు. తొమ్మిది సంవత్సరాల బాలగానూ పూజింపబడుతుందీ. పండు ముత్తెదువులకు, పతివ్రతాంగనాభీష్ట ఫలప్రదగానూ భాసిస్తుంది. అరుణారుణ వస్త్రధారిణియై శూల, శంఖ, చక్రపాణియై అమ్మ గులాబీ పూల రాశుల మధ్య గులాబీగజమాలతో కనిపిస్తుంటే ఆ ఆనందభయానక వాతావరణంలో, నిశ్శబ్దత ఆవరించగా కాలం స్తంభించిన సంఘటనలు హృదయ ఫలకాలపై చెరగని ముద్రలు వేసి అనుమానాలు, అభిమానాలు అన్నింటినీ ఛేదించి చండికగా అమ్మ నిలచింది.
అమ్మ కాలస్వరూపిణి, కాలాన్ని శాసిస్తుంది. కాళుడిని శాసిస్తుంది. కాళి అంటే మహిమ. అమ్మ మహాకాళి, మహిమలు అమ్మలో నుండి ఉద్భవిస్తవి. కాలమే కర్తవ్యాన్ని బోధిస్తుంది. కాలమే దైవం, అమ్మ నవరాత్రులలో మహర్నవమి నాడు నల్లని దుస్తులు ధరించి త్రిశూలధారిణియై, కిరీటశోభితయై, సింహవాహనయై జుట్టు విరబోసుకొని కోపానల జ్వాలలు కళ్ళ నుండి కక్కుతూ మహాకాళిగా మహిషాసుర మర్దనిగా చండిగా చాముండిగా దర్శనమిస్తుంటే నిరంతరం అమ్మసన్నిధిలో ఉండి చనువుగా అమ్మకు సేవలు చేసేవారు కూడా అమ్మను చూడటానికి, అమ్మ వద్దకు పోవటానికి భయపడేవారు.
అలా అమ్మ నవరాత్రులలో ఆయా దేవతామూర్తుల రూపాలలో మనకు దర్శనాలు ప్రసాదించి సర్వము నేనే – అన్నీ నేనే, అంతా నేనే అనే అద్వైత దీప్తితో బిడ్డలను అనుగ్రహించింది.
జిల్లెళ్ళమూడిలో విజయదశమి, ఒక ప్రశాంత సుందర సుమధుర సుమనోహర శరశ్చంద్ర చంద్రికాదీధితుల చిరునవ్వులు వెదజల్లుతూ విశ్వసమ్మోహినిగా, జగన్మాతగా బిడ్డలను ఆనందాబ్ధిలో ఓలలాడించే అమ్మ అనంత లీలా విలాసం.
లోకంలో వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు కూడా జరుపబడుతుంటవి. జిల్లెళ్ళమూడిలోని అందరమ్మ సమక్షంలో శరన్నవరాత్రులు అత్యంత ప్రాముఖ్యాన్ని, ప్రాచుర్యాన్నీ పొందినవి. యజ్ఞాలు, హెూమాలు, యాగాలు, యోగాలు సర్వసిద్ధులు ప్రసాదింపబడే శక్తిపీఠం కదా మరి. అడిగినదే తడవుగా అన్ని కోరికలూ తీర్చే కొంగు బంగారం హైమతల్లి, అడిగినా అడగకున్నా సర్వులకూ సుగతిని ప్రసాదించే మాతృమూర్తి వెలసిన దివ్యక్షేత్రం కదా ఈ జిల్లెళ్ళమూడి! తరలిరండి, తరించండి.