శంకరాచార్యులు ‘దేవ్యపరాధక్షమాపణ స్తోత్రా’న్ని రచించారు. దానిని దృష్టిలో పెట్టుకొని ఒకసారి నేను, “అమ్మా! శంకరాచార్యుల వారు –
‘పృధివ్యాం పుత్రాస్తే జనని బహవః సన్తి సరళాః
పరం తేషాం మధ్యే విరళ తరళోహం తవసుతః |
మదీయోయం త్యాగః సముచితమిదం నో తవశివే
కుపుత్రో జాయేత క్వచిదపి కుమాతా న భవతి ॥’ అన్నారు. –
ఆయనే అల్పుడైతే నా బోటి వారి సంగతేమిటి? అని అడిగాను. అందుకు సమాధానంగా అమ్మ, “దాని అర్ధం ఆయన అలాంటి వారని కాదు. అలా ప్రార్ధించటం మనకి చేతకాదు; మనకి నేర్పటం కోసం అలా అన్నారు. అంతే” -అన్నది.
అదే విధంగా నలభై ఏళ్ళ క్రిందట సో॥ శ్రీ పన్నాల రాధాకృష్ణ శర్మగారు ‘మాతర్భవాని! మమ దేహి కరావలంబమ్’ అనే మకుటంతో 28 శ్లోకాలతో ‘శ్రీ అంబికా కరావలంబ స్తోత్రా’న్ని రచించారు. ఇటీవల శ్రీ శర్మగారే స్వయంగా అందించిన పదవిభాగ, ప్రతిపదార్ధ, భావ, వివరణ సహితంగా ఆ స్తోత్రాన్ని శ్రీ విశ్వజననీ పరిషత్ అచ్చువేయించింది.
మానవ హృదయదౌర్బల్య హేతువుల నన్నింటినీ తనపై ఆపాదించుకుని మానవ ప్రతినిధిగా ‘శివే! అనసూయే! మాతర్భవాని! మమదేహి కరావలంబమ్’ అంటూ అమ్మ ఆపన్న హస్తం కోసం ప్రార్థించారు; మనకి మార్గదర్శనం చేశారు. ఆర్తులకు ఈ స్తోత్రం ఒక పట్టు కొమ్మ, దిక్కు, తారక మంత్రం, తరుణోపాయం. ఆర్తులు అంటే ఎవరు? అందరూను. ప్రతి వ్యక్తికి కొన్ని లోపాలు, బలహీనతలు, మాలిన్యాలు, దోషాలు తప్పక ఉంటాయి. నిర్మల స్ఫటికం వలె శుద్ధమైనది అమ్మ (దైవం) మాత్రమే. శరీరధారణతోనే ఆకారమే వికారంతో వచ్చింది. ఈ స్తోత్రాన్ని చతుర్విధ పురుషార్ధ ప్రాప్తికి అవశ్యం నిత్యం పఠించవలసిందే; నిరవధిక ఆనంద ప్రాప్తికి ఆర్తితో పరితపించాల్సిందే. తక్షణం అమ్మ వస్తుంది. గుక్క పెట్టి ఏడిచే, తపించే, బిడ్డను అమాంతం ఎత్తుకుని వెన్ను నిమురుతుంది; పైట చెంగుతో కన్నీటిని తుడిచి గుండెలకు హత్తుకుంటుంది; ఉద్దరిస్తుంది.
ఈ స్తోత్రంలో విశేషాంశాలు అనేకం ఉన్నాయి. నాకు అందినంత వరకు కొన్నిటిని వివరిస్తాను. ఆ మహోన్నత భావపరంపరని తోడబుట్టిన వారితో పంచుకుంటాను. ‘ఈ సందర్భంగా ఒక ముఖ్యమైన మాట. ఈ 28 శ్లోకాల అర్ధం క్షుణ్ణంగా తెలిసినా తెలియకపోయినా ‘మాతర్భవాని! మమదేహి కరావలంబమ్’ (ఓ మాంగళ్యదేవతా! అమ్మా! నాకు నీ చేయూత నిమ్ము) అనే మకుటం యొక్క అర్థం తెలిస్తే చాలు తరించటానికి అని అంటారు పండితులు, పరమ భాగవతోత్తములు.
1.’కాల ప్రవాహ బహువేగ విఘూర్ణమాన
నానావిపన్మయ మహోగ్ర జల భ్రమీషు |
మగ్నస్య మృత్యు వశగస్య శివే2నసూయే |
మాతర్భవాని ! మమదేహి కరావలంబమ్ ||
(8)
దారుణమైన ఆపదల్లో చిక్కుకున్న సమయం జీవన్మరణ సమస్య. ‘ప్రాణం పోతుంది’ అని అంటే ‘నాకు బ్రతకాలని ఉంది, డాక్టర్’ అని అంటారు ఎవరైనా. కనుకనే ‘మృత్యువశగస్య’ – మృత్యుముఖమున ఉన్న నాకు నీ చేయూత నిచ్చి ఉద్ధరించవమ్మా !’ – అని వేడుకుంటున్నారు. ఇందుకు చక్కని ఉదాహరణ.
‘లావొక్కింతయు లేదు ధైర్యము విలోలంబయ్యె ప్రాణంబులున్
ఠావులు దప్పెను మూర్చ వచ్చె తనువున్ డస్సెన్ శ్రమంబయ్యెడిన్
సంరక్షింపు భద్రాత్మకా ॥’ – అనే గజేంద్రుని అంతిమ ప్రార్థన. ప్రాణాలు కడగట్టినపుడు గుండెలోతుల్లోంచి త్రికరణ శుద్ధిగా శరణాగతి సాధ్యమౌతుంది. ఆపదలు కలిగినప్పుడే అనన్యశరణ్య అమ్మ (దైవం) గుర్తొస్తుంది. ఈ వాస్తవాన్ని విశదీకరిస్తూ శ్రీ అన్నమాచార్యుల వారు.
‘ఆకటి వేళల అలపైన వేళలలను
తేకువ హరినామమే దిక్కు – మరి లేదు॥ ఆకటి వేళల॥ –
అని గానం చేశారు. ‘ఆకటి వేళ’ అంటే ‘క్షుద్బాధవేళ’ అనే కాదు, ‘ఆపదవేళ’. ఆ విపత్కర సన్నివేశాన్ని వివరిస్తూ ‘సంకెలబెట్టిన వేళ, ‘చంపబిలిచిన వేళ’ అంటూ ఎన్నో ఉదాహరణలను ఇచ్చారు. క్షేమంగా హాయిగా ఉన్న వేళల కూడా అమ్మ స్ఫురణ ఉండటం – అమ్మ నామస్మరణ ద్వారా కళ్యాణ గుణవైభవాన్ని గుర్తు చేసుకోవటమే నిజమైన భాగ్యము, సంపద, విభూతి, వరం.
‘దుర్వార గర్వభర పర్వత కూట కోటీ
మారోపితస్య సహసా తమసా పరీతమ్ |
గంతుం రసాతల మహో! యతతో2నసూయే!
మాతర్భవాని ! మమదేహి కరావలంబమ్ ॥’ (7)
“నేను చేస్తున్నాను” అనేది మాయాలక్షణం;
“నేను కాబట్టి చేస్తున్నాను’ అనేది గర్వాతిశయం. ఆ గర్వాతిరేకం వ్యక్తిని ఎంతో ఎత్తుకి తీసికెళ్ళి క్రిందకి పడవేస్తుంది. ఆ పతనం నేల మీదికి కాదు; గాఢాంధ కారం అలుముకున్న పాతాళలో కానికి (లోయలోనికి). ఎంత దెబ్బ తగులుతుందో? అసలు అస్తిత్వమే ఉండదు. దీనినే భర్తృహరి ‘పెక్కుభంగులు వివేక భ్రష్ట సంపాతముల్ అని అన్నారు. ఒకసారి పతనం ఆరంభమైనదంటే అది వినిపాతానికే దారితీస్తుంది.
‘మూర్తం మహాఘమివ మామవ మత్యలోకః
దూరాదపేత్య విచరత్యతి మాత్ర భీతః |
కః కాల సర్పరతి మాతనుతే2న సూయే !
మాతర్భవాని! మమదేహి కరావలంబమ్ ||’ (11)
ఈ శ్లోకంలో “అమ్మా! నన్ను చూసి పాపాత్ముడనని అందరూ భయపడుతున్నారు; అవమానించి వెలివేస్తున్నారు. నాకు దయతో నీ చేయూత నిమ్మా!” అని కవి ప్రార్థిస్తున్నారు.
“తనను తాను విమర్శించుకోవటం వివేకం;
ఇతరులను విమర్శించటం అవివేకం” – అన్నది అమ్మ.
కానీ సాధారణంగా ఇద్దరు ముగ్గురు ఒక చోట చేరారంటే చెవులు కొరుక్కోవటం లోనే లేని ఆనందాన్ని అనుభవిస్తారు. “ఎదుటి వానిలో మంచిని చూస్తున్నంత సేపూ నీలో దైవత్యం కలుగుతుంది” – అనే అమ్మ హితోపదేశం ఆచరణలో కష్టతమం.
కాగా పసివాని దగ్గర నుంచి ముసలివాని వరకు ప్రతి వ్యక్తీ పదిమందిలో గుర్తింపు (Social Recognition) కోసం శ్రమిస్తాడు. తాను అప్రయోజకునిగా దుర్మార్గునిగా ముద్ర వేయించుకోవాలనీ, మాటలు పడాలని ఎవరు ఉవ్విళ్ళూరతారు? కనుకనే శ్రీ శర్మగారు ‘కః కాల సర్పరతి మాతనుతే?” అని ప్రశ్నించారు. ఈ సందర్భంలో నే సో॥ నదీరా –
జారులు చోరులు జన్మతోనె దిగజార బోరనంది
వారలు కూడా మారి తీరు రహదారులున్న వంది
తక్కిన వేల్పుల తీరు వేరు, మా తల్లి తీరు వేరు’ – అని అమ్మ పై లక్షణ్యాన్ని వివరించారు. “దుష్టసంహారం అంటే దుష్టుని సంహరించటం కాదు, దుష్టత్వాన్ని సంహరించటం”. అని ఆచరణాత్మకంగా ప్రబోధించింది. అమ్మ; అసంఖ్యాకుల్ని సంస్కరించింది.
‘ఉన్మత్త సామజ సమస్య మనోభవాఖ్య
క్రూరోర గేంద్ర విషవేగ విమూర్ఛితస్య |
దుష్టస్య కష్టపతితస్య శివే2న సూయే! మాతర్భవాని !
మమదేహి కరావలంబమ్ ॥’ – (10)
ఈ శ్లోకార్థం: ‘కోరికలు కళ్ళాలు లేని గుఱ్ఱాల వలె అదుపు దప్పి పరుగిడుతున్నాయి. మనస్సు వికలమై విషపూరితమౌతోంది. ఈ దుష్టునికి బాధితునికి నీచేయూత నివ్వమ్మా !’ – అని. ‘కోరికలకు అర్థం లేదు’ అని అంటే, అమ్మ”, అర్థం ఉంది; కానీ అంతం లేదు” అన్నది. అట్టి సమయాన మనిషి ఉన్మాదిలా ప్రవర్తిస్తాడు.
శ్రీరామకృష్ణ పరమహంస ప్రబోధాలలో ఒకటి – కామినీ కాంచనములను వర్జించమని. ‘కామినీ కాంచనములు’ అనే సమాసానికి సమానర్థకంగా ‘కాంతాకనకములు’ అని వాడుకలో ఉన్నది.
దీనిని అమ్మ నిర్ద్వంద్వంగా ఖండించింది. “కామము అంటే ‘స్త్రీ’, కాంచనం అంటే ‘బంగారం’ అనీ అర్ధం చెపుతున్నారు. కామము అంటే కోరిక, ఎంతగా భాషాంతరీకరణ చేసినా ‘కామిని’ అన్నా కోరికే. కావున ఆయన (శ్రీ రామకృష్ణ పరమహంస) కోరికల్ని విడిచి పెట్ట మన్నారని అర్థం చెప్పుకోవాలి; స్త్రీని విడిచిపెట్టమని అనలేదు ఆయన. ఆయన ఉపాసించిన దుర్గాదేవి, భార్య శారదాదేవి స్త్రీలే” – అని సుదీర్ఘంగా వివరణ నిచ్చింది.
మరొక సందర్భంలో “నాన్నా! కోరికలు పోవాలని నువ్వు చీపురు – చేట తీసికొని తుడిచి పారవేద్దామనుకుంటే అవి పోవు ఇంకా పెరుగుతాయి. అపోయే రోజు వస్తే వాటంతట అవే పోతాయి” అంటూ అద్భుతంగా ఒక వినూత్న సత్యాన్ని ఆవిష్కరించింది. ‘నారీస్తనభరనాభిదేశం దృష్ట్యా మాగా మోహావేశం. ఏతస్మిన్మాం సవశాది వికారం మనసి విచింతయ వారం వారం ‘ అని శ్రీ శంకరులు ప్రబోధించిన వైరాగ్య సూత్రం వారికి సుసాధ్యం కావచ్చు; సామాన్యులకు అసాధ్యం.
శ్రీ శర్మగారు మరొక శ్లోకం –
‘కాంతా విమోహ మలినీకృత దృష్టి దుష్టః
త్వన్మంగళాకృతి విలోకన శాంత చిత్తః
కిం వా భవేత్తవ కృపాంతు ఋతే2న సూయే !
మాతర్భవాని ! మమదేహి కరావలంబమ్ ॥’ (19)లో
‘అమ్మా! స్త్రీ వ్యామోహంతో మలినమైన దృష్టిగల దుష్టుడను. నీ దయలేనిచో నీ దివ్యమంగళ విగ్రహదర్శనం వలన కలిగే శాంతిని ఎలా పొందగలను?” అని వారి ప్రశ్నలోనే సమాధానాన్ని చెప్పకనే చెప్పారు.
అమ్మ అనుగ్రహం వలననే ఇంద్రియనిగ్రహం సాధ్యం; అది అనితర సాధ్యం; అంతే.
– (సశేషం)