1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శ్రీ కొండముది రామకృష్ణ

శ్రీ కొండముది రామకృష్ణ

Editorial Board - Viswajanani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : December
Issue Number : 5
Year : 2021

“వాడు అప్పికట్లకు కరణం నాకు ఉపకరణం. వాడు జనానికి దర్శనం ఇప్పించటానికి కూర్చుంటే నాకు హాయిగా ఉంటుంది. చిన్నవయసులోనే జిల్లెళ్ళమూడిలో పెద్ద బాధ్యతలు నెత్తికెత్తుకున్నాడు. వాడిదేముందిరా ! నీ అంతవాడు లేడు. నీవు చేయకపోతే ఎవరు చేస్తారీ పని, నీవే చేయాలన్నయ్యా అంటే పొంగిపోయి నెత్తినేసుకుని దగ్గరుండి అన్నీ జరిగేటట్లు | చూస్తాడు” అని అమ్మ మనసులో చోటు సంపాదించుకొన్న అనుంగు బిడ్డడు కొండముది | రామకృష్ణ.

జిల్లెళ్ళమూడి నాన్నగారితో దగ్గర బంధుత్వం ఉన్నది. బంధుత్వ రీత్యా జిల్లెళ్ళమూడి వెళ్ళిన సన్నివేశాలు తక్కువ. 1962లో అమ్మ జన్మదినోత్సవానికి ‘మాతృశ్రీ’ పేర ఒక అభినందన సంచిక తేవాలనే ప్రయత్నం జరిగింది. అప్పుడు ఆ పత్రిక సంపాదకత్వం వహించి దాన్ని వెలుగులోకి తేవటానికి ఆర్థికంగా హార్ధికంగా శ్రమించాడు తన సోదరుడు కొండముది బాలగోపాలకృష్ణమూర్తితో కలసి, అది మొదలు జిల్లెళ్ళమూడి రావడం ఎక్కువైందని చెప్పవచ్చు. అధరాపురపు శేషగిరిరావు గారు జిల్లెళ్ళమూడి సంస్థ బాధ్యతలు నిర్వహిస్తున్న రోజులలో అమ్మ వద్దకు వచ్చిపోతూ వారి బరువును కొంత భరించేవాడు. అమ్మ కోరికపై రామకృష్ణ తల్లి అన్నపూర్ణమ్మ గారు అమ్మ అతిలోక శక్తిపై నమ్మకంతో 1964 జనవరిలో అమ్మవద్దకు వచ్చి, జ్యోతిష్కులు రామకృష్ణకు త్వరలో మారకయోగం ఉన్నదని. చెప్పారని చెప్పి, తన భయాన్ని వ్యక్తపరచి, రామకృష్ణను అమ్మ చేతులలో పెట్టి “వీడ్ని నీకు అప్పజెప్పుతున్నాను. చంపుకుంటావో, రక్షించుకుంటావో నీ ఇష్టం” అన్నది. అమ్మ రెండు చేతులతో ఆప్యాయంగా అక్కున చేర్చుకొని ఆశీర్వదించి “వీడి సంగతి నేను చూచుకుంటాను. నీవు దిగులుపడబోకు” అని అభయం ఇచ్చింది. ఆ రోజునుండి రామకృష్ణకు జిల్లెళ్ళమూడి నివాసంగా మారింది. అప్పికట్లకు ఉద్యోగరీత్యా అప్పుడప్పుడు పోయి వచ్చేవాడు. అమ్మకు అప్ప చెప్పిన తల్లి అన్నపూర్ణమ్మ, భార్య పద్మావతి ఎక్కువ కాలం అప్పికట్లలో ఉండటానికి ఇష్టపడలేదు. అందువల్ల సంసారాన్ని కూడా జిల్లెళ్ళమూడి తరలించక తప్పలేదు. అప్పటి నుండి సంస్థ వేరు తను వేరు అనే భావన లేకుండా సేవచేశాడు. 1934లో పుట్టిన రామకృష్ణ మూడు దశాబ్దాలు కూడా నిండకముందే జిల్లెళ్ళమూడిసంస్థలో మూడు దశాబ్దాల సేవ చేశాడు గోపాలన్నయ్యతో కలసి,

చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో ఇంటి బాధ్యతల నీదటం, అప్పికట్లలో గౌతమగ్రంథాలయ స్థాపన, మూతపడిన రామాలయాన్ని ప్రత్యర్థులకు సామరస్యం కూర్చి తెరిపించడం, రక్షిత మంచి నీటి పథకాన్ని ఏర్పాటు చేయడం, విక్రమ స్పోర్ట్స్ క్లబ్, నాగార్జున కళాసమితి వంటివి నిర్వహించడం, వీటన్నింటిని మించి అమ్మ అనుగ్రహం జిల్లెళ్ళమూడి సంస్థ నిర్వహణకు తోడ్పడ్డాయి. రామకృష్ణ మంచి స్పోర్ట్స్మన్. చెడుగుడు పోటీలలో పాల్గొన్నవాడు – నాటకాలు ఆడినవాడు, ఆడించినవాడు.

జిల్లెళ్ళమూడి నాన్నగారు మాతృశ్రీ మాసపత్రిక పెట్టేరోజుల్లో రామకృష్ణతో “ఒక వ్యక్తిని గూర్చి ప్రతినెలా ఏమి వ్రాస్తారురా?” అన్న ప్రశ్నకు “అదేమిటి నాన్నగారు! చూసే కన్ను, వ్రాసే పెన్ను ఉంటే ఎంతైనా వ్రాయవచ్చు” అని సమాధానమిచ్చి ఆ రకంగా పుంఖానుపుంఖాలుగా సంపాదకీయాలు రచనలు చేసిన ప్రతిభా సంపన్నుడు రామకృష్ణ. ఇవన్నీ ఒక ఎత్తయితే అమ్మ సినిమాకు స్క్రిప్టు వ్రాయటం మరొక ఎత్తు. సినిమా సెన్సారు బోర్డు వారే ఇటువంటి రచన ‘న భూతో న భవిష్యతి’ అని మెచ్చుకున్నారు. రామకృష్ణ రచనలో కూడా కవిత్వం ఉట్టిపడుతుంటుంది. ఔచిత్య పదప్రయోగం అర్థ గాంభీర్యం, సునిశిత పరిశీలన సర్వేసర్వత్రా గోచరమౌతుంది. రామకృష్ణ మాతృదర్శనం, శ్రీ చరణ వైభవం, మాతృసంహిత, అన్నపూర్ణాలయం, వాత్సల్యగంగ, అనసూయా కళ్యాణం, హైమాలయం, అమ్మ, అవతారమూర్తి, దేవుడి గెలుపు, అంతస్సూత్రం, విశ్వసంస్తుతి వంటి గ్రంథాలెన్నో రచించాడు. మాతృ సంహిత అనే మాతృశ్రీ సంపాదకీయాల సమాహారం బృహత్తర గ్రంథం వ్రాతప్రతి ఎలక్షన్ కమీషనర్ శ్రీ జి.వి.జి.కృష్ణమూర్తి చేత ఆవిష్కరింపబడి అనంత కాలంలో ప్రచురింపబడింది. విశ్వసంస్తుతి తప్ప మిగతా రచనలన్నీ అమ్మను గూర్చి వ్రాసిన రామకృష్ణ హృదయస్పందనలే. అమ్మ ప్రసాదించిన అనుభవాల మాలలే. వీరి శ్రీచరణ వైభవంపై మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి విద్యార్థి ఒకరు పరిశోధన చేసి సెంట్రల్ యూనివర్శిటీ నుండి యం.ఫిల్ పట్టా, ఒకరు నాగార్జున యూనివర్శిటీ నుండి పి.హెచ్.డి. పట్టా తీసుకోవటం విశేషం.

అమ్మ వ్రాయించిన జీవిత చరిత్రలోని వానికి తనదైన శైలిలో ‘భాషా సౌష్టవం కూర్చి మాతృశ్రీ మాసపత్రికలో మాతృశ్రీ జీవితము ధారావాహికంగా ప్రచురించారు. దేవీచరణ్, రహి అనే కలం పేరుతో మాతృశ్రీలోఎన్నో రచనలు చేశారు.

రామకృష్ణ ఎవరినైనా తనవాడుగా తీసుకొంటే అమ్మకు, సంస్థకు ఉపయోగ పడతాడు అనుకుంటే ఎంతో సహాయసహకారాలందించేవాడు. జిల్లెళ్ళమూడిలో జరిగిన ఎందరి వివాహాలకో పెళ్ళి పెద్దగా నిలచి వాళ్ళనుకున్నదానికన్నా గొప్పగా చేయించేవాడు. జిల్లెళ్ళమూడిలో అభాగ్యజీవులెందరికో తనే కొడుకై తల కొరివి పెట్టేవాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా షుగర్ వ్యాధి శరీరంలోని అణువణువునూ కబళిస్తున్నా లెక్కచేయకుండా సంస్థ అభివృద్ధికి కృషిచేశాడు. మాతృశ్రీ విద్యాపరిషత్ను ఆయన బహిఃప్రాణంగా భావించాడు. శ్రీ విశ్వజననీ పరిషతు, విద్యాపరిషత్కు అధ్యక్షునిగా, కార్యదర్శిగా ఎంతోకాలం ఎన్నో బాధ్యతలు నిర్వహించాడు. అకుంఠిత దీక్ష – బహుముఖీనమైన ప్రజ్ఞ, కుశాగ్రబుద్ధి కలిగిన రామకృష్ణ అందరిచే అన్నయ్యగా పిలవబడుతూ కార్యనిర్వహణలో అందరింటి పెద్దగా ప్రతిభావంతునిగా ఏకత్రాటిపై సంస్థను ఏలాడు. అమ్మ సేవకు అంకితమై తన మనసులోని కోరిన మేరకు అమ్మ అనుగ్రహంతో జిల్లెళ్ళమూడిలోనే అమ్మ శ్రీచరణంలో 1998 ఆగష్టు 23న ఐక్యమైనాడు. 

అమ్మ తన సేవకు ఎన్నుకున్న వ్యక్తులలో కొండముది రామకృష్ణ అగ్రగణ్యుడు. ధన్యజీవి. విశ్వమానవాలయంలో ప్రధమ ప్రధాన అర్చకుడు.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!