శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి: ‘జగదీశ్వరి అయిన అమ్మకు నాన్నగారు ఆరాధ్యమూర్తి. అయినా వారు అందరింటి సభ్యులలో ఒకనిగా మెలగటం నాన్నగారి నిరాడంబర ఔన్నత్యానికి పరాకాష్ఠ.. సాధ్వి, సదాశివ పతివ్రత అమ్మ” అంటూ ‘నిజతపః ఫలాభ్యాం’ కారణంగా అర్ధనారీశ్వరులైన అమ్మ నాన్నగారల శ్రీ చరణాలకు నమశ్శతములను సమర్పిస్తూ నాటి వక్తలకు, శ్రోతలకు అందరికీ శుభస్వాగతం పలికారు.
శ్రీమతి ఎల్. విజయ: యయా శక్త్యా బ్రహ్మా ….? ప్రార్ధనా శ్లోకాన్ని భక్తిభావంతో శ్రావ్యంగా ఆలపించారు.
శ్రీ ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం: ‘సర్వే జనాశ్చ యదుదార దయా విశేషాత్, ఆసాద్య మాతరం అజస్రం అఖండ భక్త్యా, సంసేవ్య జన్మ సఫలం కలయత్య తీవ, నాగేశ్వరో విజయతే సహి నిర్మలాత్మా’ అని డా॥ పన్నాలవారు వివరించినట్లు నాన్నగారి ఔదార్యం, దయ, ఆదరణ మూలంగా అందరూ అమ్మ దర్శన స్పర్శన సంభాషణాది భాగ్యాన్ని పొందగలిగారు అనే తాత్పర్యంతో 18 మంది సోదరీ సోదరులు నాన్నగారితో తమకు గల అనుబంధాన్ని పురస్కరించుకుని హృద్యంగా ప్రసంగించారు’ అంటూ సభను రసరమ్యంగా నిర్వహించారు.
శ్రీ వి. ఎస్. ఆర్. మూర్తి గారు: ‘సర్వాధార సర్వారాధ్య అమ్మ. అమ్మ అతివర్ణాశ్రమి; కానీ లోకం దృష్టిలో నాన్నగారే తనకు ఆధారం, ఆరాధ్యం అంటుంది. జగన్మాత జగత్పితలు గృహస్థాశ్రమ తత్త్వంలో రెండూ ఏకమై సగుణంగా కనిపిస్తాయి. రెండూ అభిన్నమైన అద్వైతస్థితిలో ఉన్న విశుద్ధ భావనా గరిమ. ఇది భౌతికదృష్టికి అందేది కాదు. నాన్నగారు నిరాడంబరులు, సంయమీంద్రులు. అమ్మ మహిమాన్విత తత్వాన్ని మహస్సుని సంపూర్ణంగా అనుభవించారు నాన్నగారు’ అంటూ ఆ ఉభయుల అగోచర తత్త్వవైభవాన్ని సుమనోహరంగా ఆవిష్కరించారు.
శ్రీ డి.వి.ఎన్. కామరాజు: ‘అమ్మ లేనిదే నాన్నగారు లేరు. వ్యక్తమైన పరాశక్తి అమ్మ అయితే, అవ్యక్తమయిన పరమశక్తి నాన్నగారు. వారి తత్త్వం మనకి అంత తేలికగా బోధపడదు; అందుకు అంతర్దృష్టి కావాలి. ఇద్దరూ వేరు కాదు, ఒక్కటే’ అంటూ వారి అభేదతత్త్వాన్ని చాటారు. శ్రీమతి ఎల్. విజయ: ‘చక్కని ఒక పల్లెలో ఎంచక్కని తల్లి, ఎంచక్కని తల్లి ఎంతో చక్కని తండ్రి’ అనే గీతాన్ని హృదయంగమంగా ఆలపించారు.
శ్రీ పి.ఎస్.ఆర్.ఆంజనేయప్రసాద్: ‘వస్తుతః నాన్నగారు చాలా గొప్పవారు, మహనీయులు, త్యాగధనులు. నాన్నగారివల్ల అమ్మకి మహత్వం సంప్రాప్తమైనది. అమ్మ ఆదిపురుషుడు, నాన్నగారు పరమ పురుషుడు. వారు అజాతశత్రువు; అందరినీ ప్రేమిస్తారు. అమ్మ నాన్నగారల అన్యోన్యానురాగం మహాద్భుతమైనది. నాన్నగారు సోమశేఖరుడు; తలమీద చంద్రుని/అమృతాన్ని ధరించారు. నాగేంద్రుడే నాగేశ్వరుడై వచ్చి తనకు ఆధారమవుతాడని అమ్మకి బాల్యం నుంచీ ఉన్నది. నాన్నగారు శరీరత్యాగం చేసినప్పుడు ఎవరో అన్నారు. “నాన్నగారు పరమపదించారు” అని. వెంటనే అమ్మ “వారు పరమపదించటమేమిటి? ఎప్పుడూ పరమపదం లోనే ఉన్నారు” అన్నది. అమ్మయొక్క భృకుటీ భేదనం, కపాల భేదనం వంటి యోగసిద్ధులకు నాన్నగారు ప్రత్యక్ష సాక్షి, అంటూ నాన్నగారి సంపూర్ణ మూర్తిమత్వాన్ని తత్త్వాన్ని విశదీకరించారు.
శ్రీ ఎమ్.దినకర్: ‘అమ్మ గృహస్థాశ్రమానికి పెద్దపీట వేసింది. సంసారం ఆధ్యాత్మిక సాధనకి అవరోధం కాదన్నది. సామాన్యగృహిణిగా ఉంటూ పతివ్రతా ధర్మాన్ని పోషించింది. నాన్నగారు అతి సామాన్యమైన స్థితినుండి అసామాన్యస్థితికి చేరి జగదీశ్వర స్థానాన్ని అలంకరించారు. ఒకరికొకరు ఆలంబనంగా ఉంటూ ఆదిదంపతులుగా సకల జనారాధ్యులయినారు. నాన్నగారు నాగేంద్రుడు అంటే కుండలినీ శక్తి. వారిని అమ్మ ఆలయ ప్రవేశం చేయించటంతో జగదీశ్వర స్థానాన్ని అలంకరించారు’ అంటూ వారి నిజ తత్త్వవైభవాన్ని సుబోధకం చేశారు.
శ్రీ మన్నవ లక్ష్మీనరసింహారావు మామయ్య: ‘చీరాల సోదరులు సంకల్పించగా 1958లో అమ్మ సువర్ణహస్తాలమీదుగా అన్నపూర్ణాలయాన్ని ఆరంభించక ముందు తన ఇంట్లోనే భక్తులకు బంధువులకు భోజన భాజనాల్ని ఆదరంగా సమకూర్చిన ప్రేమస్వరూపులు మా బావగారు. అందరింటి సభ్యులనే కాదు బంధువులనూ విశేషప్రేమాభిమానములతో ఆదరించేవారు. కష్ట సమయాల్లో నన్ను బావమరిదిగా అభిమానించి ఆదుకున్నారు. ఆచరణలో వారు down to earth man అంటే కలుపుగోలుతనం, నిరాడంబరత, ఆప్యాయత వారి సహజలక్షణాలు”అంటూ నాన్నగారి మాననీయ మానవీయ విలువల్ని చాటిచెప్పారు.
శ్రీ వై.వి.మధుసూదనరావు: ‘నా 1 1/2 సం.ల పసిప్రాయంలో మా నాన్నగారు తనువు చాలించారు. వారిని ‘నాన్నగారూ!’అని పిలిచే భాగ్యం నాకు కలగలేదు. జిల్లెళ్ళమూడి గడ్డపై అడుగుపెట్టగానే వారిని ‘నాన్న గారూ!’ అని పిలిచినప్పుడు నా సర్వేంద్రియాలూ పులకరించాయి. అమ్మ, నాన్నగారలు ఇరువురూ నన్ను కన్నబిడ్డలా ఆదరించారు. హైమ చిట్టి చెల్లెలుగా ధన్యత చేకూర్చింది. అది అమ్మ సన్నిధిలో నేను పొందిన మరపురాని మధురానుభూతి. అమ్మ నాన్నగారలకి కళ్యాణోత్సవాన్ని ప్రారంభించి నిర్వహించుకున్న మహద్భాగ్యాన్ని అమ్మ నాకు ప్రసాదించింది. ‘అంటూ అమ్మ కుటుంబసభ్యునిగ తన బంధాన్ని స్పష్టంచేశారు.
శ్రీ వై.వి.శ్రీరామమూర్తి: గంభీరత, సహృదయత, వినిపించారు. మేలు కలయికగా సాధారణంగా కనిపించే అసాధారణమూర్తి నాన్నగారు. అందరింటి సభ్యులు కాలేజీ పిల్లలు అందరితో కలిసిమెలసి ఉంటూ, వాళ్ళ కష్టాల్లో ఆడుకునేవారు. అమ్మ దేవుడు, నాన్నగారు. దేవదేవుడు. అమ్మ పార్వతీదేవి, నాన్నగారు పరమేశ్వరుడు’ అంటూ నాన్నగారి విశాలహృదయ ఔన్నత్యాన్ని శ్లాఘించారు.
శ్రీ టి.టి. అప్పారావు: ‘ఒకసారి నేను అమ్మ చెంతకు చేరినపుడు అమ్మ “నీకేమిటిరా! నీకు నాన్నగారి రికమండేషన్ ఉంది” అన్నది. “ఏమిటమ్మా ఆ విశేషం?” అన్నాను. అమ్మ వివరించింది. ఒకనాడు అమ్మతో నాన్నగారు “నీకేనా శిష్యులు, నాకూ ఉన్నారు. నా శిష్యుడు అప్పారావు” అని అన్నారు. అమ్మ ఏలూరు పర్యటనకు వచ్చినప్పుడు నాన్నగారు నేరుగా నా ఇంటికివచ్చి, నా ఆతిథ్యాన్ని స్వీకరించి ఆనందభరితు లయ్యారు” అంటూ ఆదిదంపతుల అనుగ్రహానికి పాత్రులయిన తీరును అందంగా వివరించారు.
శ్రీ లక్కరాజు సత్యనారాయణ (లాలన్నయ్య): ‘జగజ్జనని అమ్మ భర్త నాన్నగారు. అంతటి ఉన్నత స్థానంలో ఉన్నా వారు ఏనాడూ ఎవరినీ నిందించలేదు, తక్కువచేయలేదు. పిన్నలూ పెద్దలూ అందరినీ అభిమానించారు. ఆ రోజుల్లో అందరూ ముందుగా గౌరవంతో నాన్నగారిని పలకరించి, పిదప అమ్మ. దర్శనానికి వెళ్ళటం సంప్రదాయం. ఆ మహనీయునికి అమ్మయందు, అమ్మ మాటలయందు ప్రగాఢమైన విశ్వాసం. అమ్మ జగజ్జనని, నాన్నగారు జగత్పిత. అమ్మ నాన్నగారల సంస్మరణ, నామ సంకీర్తన సర్వార్ధదాయకం’ అంటూ తక్షణ తరణోపాయాన్ని సూచించారు.
శ్రీమతి బ్రహ్మాండం వసుంధర: ‘మా నాన్నగారూ. శ్రీ కోనా వెంకటసుబ్బారావు గారూ), నాన్నగారూ బాల్యస్నేహితులు. అయినా మా నాన్నగారు, నాన్నగారిని పూజనీయులుగా గౌరవించారు. కానీ నాన్నగారు వారిని స్నేహితునివలె అభిమానించేవారు’ అంటూ అమ్మ, నాన్న, హైమ మూర్తిత్రయ మత్స్యగాయత్రిని సభక్తికంగా వినిపించారు.
శ్రీమతి ఎన్. భ్రమరాంబ: ‘నాన్నగారు నన్ను కూతురుగాను, మా వారిని అల్లుడుగాను ఆదరించారు. ఒక దీపావళి పండుగకు స్వయంగా నన్ను జిల్లెళ్ళమూడి తీసుకువచ్చారు. గుంటూరు ఆస్పత్రిలో నాన్నగారు శస్త్రచికిత్స చేయించుకున్నప్పుడు వారికి కించిత్ సేవ చేసుకునే భాగ్యము మా దంపతులకు కలిగింది. నాన్నగారి నామాన్ని అమ్మ నా నోట పలికించింది, అది నా పురాకృతపుణ్యఫలం’అంటూ నాన్నగారి వాత్సల్యాన్ని మహత్వాన్ని ఉదాత్తంగా వర్ణించారు.
శ్రీ ఓంకారానందగిరి స్వామి: ‘నాన్నగారిది పరమేశ్వర తత్త్వం. వారు గురువులకు గురువు. నాన్నగారిని పొందటానికి అమ్మ జ్ఞాన, భక్తి, ఏకాంతిక ప్రపత్తి అనే మూడు మార్గాల్లో పయనించింది. నాన్నగారు ఆధునిక యోగి, స్థితప్రజ్ఞులు. అమ్మ అడుగు జాడల్లో నడిచిన అఖండ అద్వైత ఆనంద తత్త్వ స్వరూపులు’ అంటూ నాన్నగారి అలౌకిక తత్త్వాన్ని శాంత గంభీర స్వరంతో చాటి చెప్పారు.
డా॥ యు.వరలక్ష్మిః స్మృతే మధురం అన్నది అమ్మ. నాన్నగారు బాలల్లో బాల, యువకుల్లో యువకులు, పెద్దల్లో పెద్దలు; కళాకోవిదులు. వారు జీవితాన్ని ఒక క్రీడగా భావించారు. ఒకసారి అమ్మకి తీవ్ర అనారోగ్యం చేసింది. ‘డాక్టర్లు ఇలా అన్నారు’ అని సోదరులు అంటే, నాన్నగారు “ఇంతకూ మీ అమ్మగారు ఏం చెప్పారు? అని అడిగారు. ఆ మాట అమ్మయందు వారికి గల అచంచల విశ్వాసానికి ప్రతీక. అమ్మ ఇష్టాన్ని తన ఇష్టంగా మలచుకున్నారు. నాన్నగారు; నాన్నగారి విజయాన్ని తన విజయంగా భావిస్తుంది అమ్మ. దీనికి తార్కాణం ఏటా జిల్లెళ్ళమూడిలో జరిగే ధాన్యాభిషేక ఉత్సవం’ అంటూ నాన్నగారి ఔన్నత్యాన్ని నిసర్గ సుందరంగా విపులీకరించారు.
డా॥ బి.ఎల్.సుగుణ: నాన్నగారి వ్యక్తిత్వ వైభవాన్ని, ఆదరణ అభిమానాల్ని, అందరింటి యజమానిగా వ్యవహార దక్షతలకు దర్పణం పడుతూ తమతమ అనుబంధాల్ని మేళవించి ప్రసంగించిన ఆత్మీయ సోదరీ సోదరులకు, శ్రోతలకు, వక్తలకు, అందరికీ పేరుపేరున ధన్యవాదాల్ని తెలిపారు. శాంతిమంత్ర పఠనంతో సభ ముగిసింది.