శ్రీ పి.యస్.ఆర్ అన్నయ్య గురించి అపేక్షగా, ఆత్మీయంగా అమ్మబిడ్డలమైన మనమందరమూ ఆప్యాయంగా ‘పి.యస్.ఆర్ అన్నయ్య’ అని పిలుచుకునే శ్రీ పోతరాజు సీతారామాంజనేయ ప్రసాద్ గురించి వ్రాయలని తపన. ఏం వ్రాయాలి? ఎలా వ్రాయాలి? ఎన్నని వ్రాయాలి? సకల ప్రతిభలూ మూర్తీభవించిన, ఆ మహామనీషి గురించి ఎన్ని వ్రాసినా, ఇంకా మిగిలే ఉంటాయి వ్రాయాల్సినవి.
పితామహులు, పితృదేవులు, అగ్రజులు, తాను, అనుజులు, పుత్రులు, పౌత్రుడు చి. రాధా విశ్వనాథ్, వీరంతా పోతరాజు కవితాలతకు విరిసిన కుసుమాలే. అగ్రజులు డా. శ్రీ ప్రసాదరాయ కులపతి గారంటే పి.యస్.ఆర్. అన్నయ్యకు ఎనలేని గౌరవం, ఆరాధన. అన్నగారితో కలిసి, అలనాటి శ్రీ కృష్ణ దేవరాయలు ‘భువన విజయం’ తలపింపచేస్తూ, దేశ విదేశాల్లో ప్రదర్శించిన రసమయ కావ్యరూపకాలు ‘శ్రీనాథ పీఠం’ ద్వారా ఎంతో ప్రాచుర్యం పొందాయి. అన్నదమ్ము లిద్దరూ, సమర్థులైన పరివారంతో, సూత్రధారులూ, పాత్రధారలూ అయి, తగు ఆహార్యంతో సహా రక్తి కట్టించారు.
అన్నగారు కుర్తాళం పీఠాధిపత్యం స్వీకరించి ‘శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి’గా ప్రసిద్ధులయ్యాక, స్వామి భక్తుడై, అనుచరుడై, కుడిభుజమై, కుర్తాళం పీఠకార్యక్రమం కానీండి, గుంటూరులో కాళీపీఠ కార్యక్రమం కానీండి, హైదరాబాదులో ప్రత్యంగిరా పరమేశ్వరీ దేవస్థాన బ్రహె్మూత్సవాలు కానీండి, ఏ సన్మాన, సత్కార సహాయ కార్యక్రమం కానీండి, పుస్తక, కవి పరిచయం కానీండి, అనసూయావ్రతం, హైమవతీవ్రతకల్పం కానీండి (ఈ ‘కానీండి’ అనే పదం అన్నయ్య ఎక్కువ ఉపయోగించేవారు) తనదైన శైలిలో, ఖచ్చితమైన సమయపాలన అద్భుతంగా నిర్వహించేవారు. నవరసాలు అలవోకగా పలికే, ‘జేగంట’ లాంటి కంఠస్వరం ఆ ‘వాగ్దేవి’ అన్నయ్యకు యిచ్చిన వరం.
అన్నయ్యతో కలిసి ఎన్నోసార్లు జిల్లెళ్ళమూడి వెళ్ళేవాళ్ళం. తమిళ సోదరులు వస్తే, అందరం కలిసి మద్రాసు వెళ్ళాము. అన్నయ్యతో ఆ ప్రయాణాలు అన్నీ స్వచ్ఛమైన సత్సంగాలే. ఎవరికి వారు అందరూ అన్నయ్య తమ సొంతం అనుకునేంతగా ఆప్యాయత పంచారు.
ఇక కుటుంబ విషయానికి వస్తే, ఏకైక సోదరి కుమార్తె చి. సౌ. జానకితో తన కుమారుడు చి. హైమానంద్ వివాహం జరిపించి, సోదర సోదరీ బంధాన్ని పటిష్టం చేసిన ఆత్మీయమూర్తి. మనుమరాలు, మనుమడుతో సంతోషంగా ఉన్నారు. తన అర్థాంగి శ్రీమతి శేషగిరిబాలను అనురాగ దేవతగా ప్రేమించారు. అమె రచనలను ‘గిరిబాల గీతాలు’గా ప్రచురించారు. ‘నాకన్నా ఎక్కువ చదువుకుందీ, ఎక్కువ సంపాదిస్తోంది’ అని భార్య ఔన్నత్యాన్ని శ్లాఘించిన ఆదర్శ భర్త. ఇక పెద్దబాబు ప్రేమ్ కుమార్ హిందీ భాషాపండితుడు. తెలుగున ఎన్నో కవితలూ అమ్మని భక్తితో కొలిచే గీతాలు వ్రాసి, శ్రావ్యంగా, స్ఫుటంగా, అలపిస్తే, పెదతండ్రి శ్రీ కులపతిగారి నైపుణ్యం అబ్బిందని అంతా సంబర పడ్డాము. ఇంతలోనే చిన్నవయసులోనే అనారోగ్యంతో దూరమవడం, బలీయమై ‘విధి నిర్వహణ’. ఎక్కువ కాలం గడవకుండానే 2, 3 సంవత్సరాలకే ప్రియ సతీమణి గిరిబాల పుత్రుడికి దగ్గరై, ప్రియపతికి దూరమైంది. ఆ వియోగం అన్నయ్యకు శరాఘాతం. ఆ క్రుంగుబాటును తనలోనే అణచుకుని మరింతగా తన విధులూ, రచనా వ్యాసంగం, విశ్వజనని పత్రికా నిర్వహణ కొనసాగించారు. జిల్లెళ్ళమూడిలో ఒకసారి కలిసినపుడు, కాశీ నుంచి తెప్పించిన పట్టుచీరలు మా అందరికీ యిచ్చారు. విశేషము ఏమిటి చీరలు యిస్తున్నారు అని అడిగితే, మా పెళ్ళై 50 సం.లు అయింది 50 మంది సువాసినిలకూ, అక్కయ్యలకూ యిస్తున్నాను అన్నారు. నేను, గిరిబాల ఉంటే ఇంకెంత బాగా చేసుకునే వారో కదా అన్నాను. అప్పుడు అన్నయ్య ‘బాల లేదని నేను అనుకోనమ్మా! నేను ఉన్నన్నాళ్ళు తను నాతోనే ఉంటుంది’ – అని ఒకింత ఉద్వేగంగా అన్నారు. ఈలాటి మన్ననే కదా ప్రతి యిల్లాలు కోరుకునేది. ఆ ఉద్వేగ భరిత క్షణాలు మనసు పొరల్లో ఈ నాటికీ పదిలం.
పి.యస్.ఆర్. ఛారిటబుల్ ట్రస్టు ఏర్పరచి, అమ్మ ఎంచుకున్న సహచరి, శ్రీమతి వసుంధర అక్కయ్యకు కనకాభిషేకం, ముత్యపు పాదాభిషేకం చేయడం, అక్కయ్య సేవలకూ, మంచితనానికి సముచితమూ, సమున్నతమూ అయిన సత్కారం. ఇక అమ్మ ఆస్థాన మధురగాయకుడు, అన్నివేళలా అమ్మ సేవలో నిమగ్నుడైన వాడూ, శ్రీ రావూరి ప్రసాద్ గారికి, ‘జీవన సాఫల్య’ పురస్కారం, నవరత్న సువర్ణమాల యిచ్చి ఆశీర్వదించడమూ అన్నీ అన్నయ్య సంకల్పం. ఆచరణ ఉన్నత ఆశయాలతో అన్నయ్య ఏర్పరచిన, పి.యస్.ఆర్ ఛారిటబుల్ ట్రస్ట్ అర్హులకు సహాయ సహకారాలు అందిస్తూ చిరకాలం వర్ధిల్లు గాక!
విశ్వజనని పత్రికలో సంపాదకీయం ఎప్పటికప్పుడు కొత్తదనంతో ఉంటుంది. ‘మదర్ ఆఫ్ ఆల్’ లో ధన్యజీవులు శీర్షికన అమ్మ భక్తుల గురించి, వాళ్ళ భక్తి, వాళ్ళ సేవ, త్యాగం ఎంతో హృద్యంగా వ్రాసే వారు. నిరంతరం అమ్మ ధ్యాస, సభా నిర్వహణ, పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ క్షణం తీరిక లేకుండా ఉండేవారు. అమ్మభక్తులు, అనుచరులూ, అమ్మే సర్వస్వంగా జీవించిన వారూ, ఒకరికొకరుగా తరలి వెళ్తున్నారు. భగవద్గీత చెప్పినట్లు, ‘జాతస్య హి ధృవో మృత్యుః, ధృవం జన్మ మృతస్యచ’ దివికేగిన అమ్మ బిడ్డలందరూ, ‘నవ శకంలో నవజాత శిశువులై తిరిగి భూమి జనించి, వృద్ధి పొంది, ప్రపంచమంతా అమ్మ ఆశయాలు, ఆకాంక్షలు, విశ్వజననీ పరిషత్ మహోన్నత ఆశయాలను గుర్తించే విధంగా నెరవేర్చాలని, ఆ ప్రయత్నంలో సఫలీకృతులు అవుతారని ఆ ఆశిద్దాం, ఎదురుచూద్దాం.
నిరంతరం అమ్మ ధ్యాస, అమ్మసేవ, అమ్మపై రచనా వ్యాసంగం, తను అనుకున్నవన్నీ నెరవేర్చుకుని, తృప్తుడై, అనాయాసంగా అమ్మ పావన పాదోధి చేరుకుని సేదతీరుతున్న, నిత్యశ్రామికుడు, ఆంజనేయ ప్రసాద్ అన్నయ్య స్మృతికి చందన సుగంధ పుష్పాంజలి.