గుంటూరు జిల్లా, పొత్తూరు గ్రామంలో 8.2.1934న జన్మించారు. కన్న తల్లిదండ్రులు వెంకట సుబ్బయ్య – పన్నగేంద్రమ్మ, దత్తత తల్లిదండ్రులు గోపాలకృష్ణయ్య – సంపూర్ణమ్మ, సతీమణి సత్యవాణి – సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. సుప్రసిద్ధ దినపత్రికలు “ఈనాడు” “ఆంధ్రప్రభ”లకు ప్రధాన సంపాదకులుగా చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ | ఛైర్మన్ గా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణ విభాగం ఛీఫ్ ఎడిటరుగా ‘చేశారు. స్టేట్ కన్స్యూమర్స్ కోర్టు న్యాయమూర్తిగా చేశారు. జంటిల్మన్ జర్నలిస్టుగా ప్రసిద్ధి వహించారు. కుర్తాళం శ్రీ సిద్ధేశ్వరీ పీఠానికి ధర్మాధికారిగా పనిచేశారు.
రాజావాసిరెడ్డి వెంకటాద్రినాయుడు, విధి నా సారధి, అమ్మనుగూర్చి ‘అంతా ఆమెదయే’ అనే గ్రంథం, ”ఆధ్యాత్మిక పదకోశం’, ‘యతికులపతి’ అనే గ్రంథాలే కాక జర్నలిజానికి పాఠ్యపుస్తకాలుగా ఎన్నో ఎన్నో గ్రంథాలు వ్రాశారు. ‘శ్రీ విశ్వజననీ పరిషత్’ అధ్యక్షులుగా మార్గదర్శనం చేశారు. ఎప్పుడన్నా సందర్భం వచ్చినప్పుడు “నేను ముగురమ్మల ముద్దుబిడ్డనయ్యా, కన్నమ్మ, పెంచినమ్మ, నన్నూ, మా అమ్మమ్మలను కూడా కన్నమ్మ జిల్లెళ్ళమూడి అందరమ్మ” అంటుండేవారు.
డాక్టర్ ప్రసాదరాయకులపతిగారితో కలసి మొదటిసారి జిలెళ్ళమూడి వచ్చారు. మల్లయుద్ధ, భారోద్ధరణ. విద్యలు నేర్చారు. ప్రేమమూర్తి, అమ్మతో అనుబంధం పెరగటం వల్ల హేతువాది ఆధ్యాత్మిక వాది అయినారు. వేదాన్ని నమ్ముతారు. ధ్యానయోగి, మహోన్నత మానవీయ లక్షణాలతో నక్సలైట్లు, ప్రభుత్వంతో చర్చలు జరగటానికి తోడ్పడ్డారు. అమ్మపై అచంచల విశ్వాసంతో అమ్మ చేసే ప్రశాంత విప్లవ మహోద్యమంలో భాగస్వామియైనారు. పుట్టిన పొత్తూరుకు, ఉద్యోగంలో పైకి తెచ్చిన భాగ్యనగరానికి ఎంతో సేవచేశారు.
జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ ఓరియంటల్ కాలేజి, ఓరియంటల్ హైస్కూలు, హోమియో హాస్పిటల్ రావటంలో విశేషకృషి చేశారు. అమ్మతత్త్వాన్ని తెలియ చేసే ‘విశ్వజనని, మదర్ ఆఫ్ ఆల్’ పత్రికలకు గౌరవ సంపాదకులు. అమ్మతో సన్నిహితంగా మెలుగుతూ చర్చలు చేస్తూ అమ్మ వెంట హైదరాబాద్ నగరంలో బీదసాదల స్లమ్ ఏరియాలు, పాఠశాలలు, వైద్యశాలలు సంచరించిన మానవతా మహోన్నతుడు.
డాక్టర్ పొత్తూరివారికి గుర్తుపెట్టుకోలేనన్ని సత్కారాలు జరిగాయి. ముఖ్యంగా మద్రాస్ యల్. రామయ్య గారు (1982), మద్రాసు తెలుగు అకాడమీ, డయోనారా ఓబుల్రెడ్డి గారు, అపోలో హాస్పిటల్స్ ప్రతాప్ సి. రెడ్డిగారు, సద్గురు శివానందమూర్తి గారు (2001), ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు (2000), పళ్ళెపూర్ణ ప్రజ్ఞాచార్యఅవార్డు, పి.వి.మనోహరరావు అవార్డు, అక్కినేని నాగేశ్వరరావు, వంశీరామరాజు, వరల్డ్ పీస్ ఫెస్టివల్ వారు (2009), ప్లేబాక్ సింగర్ బాల సుబ్రహ్మణ్యం సాంస్కృతిక సంస్థ, విజయభావన పురస్కారం (విజయనగరం 2010), గుంటూరు శ్రీనాధపీఠం, విజయవాడ సిద్ధార్థ కళాపీఠం (2009), రామినేని ఫౌండేషన్ (2014), పొట్టి శ్రీరాములు విశ్వవిదాయలయం డాక్టరేట్ పురస్కారం, తెలుగు విశ్వవిద్యాలయం, వెంకటేశ్వర విశ్వ విద్యాలయం, రాజీవ్ గాంధీ సద్భావన అవార్డు, నాగార్జున విశ్వ విద్యాలయం, 2004 రాష్ట్రప్రభుత్వం ఉత్తమ జర్నలిస్టు అవార్డు, జాతీయ జర్నలిష్టు వంటివి ఎన్నో ఎన్నో. ఆశ్చర్యకరమైన విషయం- వెంకటేశ్వరరావు గారు తన 86 వ యేట అమ్మలో కలసిపోయిన 5.3.2020 తర్వాత కూడా శ్రీ వై. రాజశేఖరరెడ్డి జన్మదినోత్సవం నాడు భారతరాష్ట్రపతి రామనాధ్ కోవిందు చేతులమీదుగా జాతీయ ఉత్తమ జర్నలిస్టు పురస్కారాన్ని ఇవ్వగా వెంకటేశ్వరరావు గారి కుమారుడు ప్రేమగోపాల్ అందుకున్నాడు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే ‘జీవన సాఫల్యం’ అవార్డు అందించగా కుమారుడు శ్రీ ప్రేమగోపాల్ అందుకున్నాడు.
అంతటి మహానీయుడు పొత్తూరి వారు తెరవెనుక ఉండి మన కళాశాలకు, శ్రీ విశ్వజననీపరిషత్కు ఎన్నో
సేవలు అందించారు.