అమ్మను గూర్చి లోకానికి తెలియజేసే ‘మాతృశ్రీ’ పత్రికకు 1973 లో చందాదారునిగా చేరి అమ్మను చూడాలనే ఉత్సుకత కలగగా జిల్లెళ్ళమూడి వచ్చారు మాన్య సోదరులు శ్రీ రామబ్రహ్మంగారు. అమ్మ చెప్పిన “అనుకున్నది జరుగదు తనకున్నది తప్పదు” అనే సూక్తి | వారిని చాలా ప్రభావితం చేసింది. 1975 జనవరిలో అమ్మ వద్దకు మొదటిసారి వచ్చారు. అంతకు ముందు అమ్మ వద్దకు వెళ్ళటానికి అంగీకరించని వారి తండ్రి గారు అంగీకరించారు.
అక్షర లక్షల నామజపం చేస్తే ఆ దైవం దర్శన మిస్తాడని విన్న రామబ్రహ్మంగారు. ”శ్రీరామ’ నామాన్ని నిరంతరం జపిస్తుండేవారు. అమ్మవద్దకు వచ్చినపుడు నిజంగా అమ్మ దైవం అయితే నాకు శ్రీరామునిగా దర్శనం ఇవ్వాలి అనుకున్నారు. వారు మనసులో శ్రీరాముని భావించిన రూపంలో అమ్మ దర్శనం ప్రసాదించింది. సృష్టిగా తనే పరిణామంచెంది సర్వత్రా వ్యాపించి ఉన్న అమ్మ రామబ్రహ్మంగారి భావన నెరవేర్చకుండా ఉంటుందా! దానితో వారు సంతృప్తి చెందారు. ఒకసారి అమ్మవద్దకు …. వస్తుంటే మరొక సంఘటన జరిగింది. జిల్లెళ్ళమూడి రాగానే అమ్మకు ఆవిషయం చెప్పకుండానే “కాగల కార్యం గంధర్వులే తీరుస్తారు” అన్నది. తన గంధర్వునిగా రక్షణ కల్పించింది మనల్ని కనిపెట్టి ఉన్నది అన్న స్ఫురణను కలిగించింది.
మరొకసారి అమ్మ కొద్ది ప్రసాదాన్ని చాలమందికి పంచగా వారికి ఆశ్చర్యాన్ని కలిగించి అమ్మ సిద్ధశక్తులు కలిగినది అనే భావన స్థిరంగా నిలబెట్టింది. అమ్మ ఏ పాదాలకు నమస్కరించినా నాకే అందుతుంది అన్నది. అలాగే అమ్మ తను ఏర్పాటు చేసిన అన్ని సంస్థలకు ఆలయాలనే పేరు పెట్టింది. అన్నపూర్ణాలయం, హైమాలయం, విద్యాలయం, వైద్యాలయం, ఆదరణాలయం, అనసూయేశ్వరాలయం అని నామకరణాలు చేసింది. అంటే ఏ పనిచేసినా భగవత్సేవగానే భావించాలి అనే భావన మన హృదయాలలో నాటటానికే ఈ రకమైన ఆలయాలు అనే చింతనను మనకు ఇచ్చింది అనిపించింది రామబ్రహ్మం గారికి.
“పదిమందితో కలిసి పనిచేయడం, పదిమంది కోసం పని చేయడం – మమకారాన్ని చంపుకోవడం కాక పెంచుకోవడం, విస్తృతం చేయడం – మానవుడు మాధవుడుగా మారటానికి మంచి మార్గం. సులభమార్గం” అన్న అమ్మ మాటలు వారికి శిరోధార్యాలయినాయి.
రామబ్రహ్మంగారు అమ్మ అమ్మ వాక్యాలు, భాగవతము, భగవద్గీత, లలితాసహస్ర నామాలు, బాగా అధ్యయనం చేశారు. వారు మాట్లాడితే ఎక్కువ గీతాశ్లోకాలు, లలితానామాలు వినిపిస్తుంటాయి. వారిమాటలూ, వారి ఎత్తూ, చెప్పే విషయంలోని స్పష్టత, వ్యక్తీకరణలోని సమగ్రత్వం చూస్తుంటే ఉద్రేకపరుడా అని కొందరికి అనిపించవచ్చు. కాని వారు శాంతమూర్తి. ఇతరులు చెప్పేవి శ్రద్ధగా వింటారు. వారు దాదాపు పన్నెండేళ్ళు శ్రీవిశ్వజననీపరిషత్ అధ్యక్షులుగా ఉన్నారు. వారు నిర్వహించిన కార్యవర్గ సమావేశాలలో వారి చాకచక్యం కనిపిస్తుంది.
ప్రత్యేకించి కళాశాల బాధ్యత వారికి అమ్మ అప్పగించింది. దాని అభివృద్ధికి వారు పడ్డ తపన అనితరసాధ్యం. కళాశాల భవననిర్మాణం కోసం విద్యార్థినీ, విద్యార్థుల వసతి గృహాల నిర్మాణాల కోసం కోటి రూపాయల దాకా వారు వసూలు చేశారు.
విద్యార్థులతో – అధ్యాపకులతో వారు చేసే సంప్రదింపులు – ఆలోచనలు వారి సౌకర్యాల అభివృద్ధికి – భోజనాలు ఉపాహారాలు అన్ని విషయాలలో ప్రత్యేక శ్రద్ధ కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. అది పాఠాలు తపస్సుగా వారు భావించారు. దీక్షాదక్షతతో కార్యక్రమాలు తీర్చిదిద్దుతుండేవారు. కళాశాలకు NAAC రికగ్నిషన్ తేవాలని ఎంత కృషిచేశారో!
పన్నెండేళ్ళ విశ్వజననీపరిషత్ అధ్యక్ష పదవి విరమణ తరువాత కూడ వారు కోరిన దొకటే- విద్యాపరిషత్ అభివృద్ధి. సంస్థలో తానొక కార్యకర్తగా ఉంటానని కోరుకున్నారు. అలాగే విద్యాపరిషత్ డెవలప్ కమిటీకి అధ్యక్షులుగా పనిచేస్తున్నారు. కళాశాల పట్ల అమ్మ అప్పగించిన బాధ్యత – తనకు దాని పట్ల ఉన్న ప్రేమ వారిని నిద్రపోనివ్వకుండా చేస్తూనే ఉన్నది. ఉన్నది ఉన్నట్లుగా, నిర్భయంగా, సంయమనంతో చెప్పగలిగిన వారు. అమ్మ సిద్ధాంతాలను అధ్యయనం చేసి ఆచరణలో పెట్టాలనే తపన గలవారు పెద్దలు శ్రీ రామబ్రహ్మంగారు.