అమ్మే తోడుగా మా అమ్మాయి బెంగుళూరులో ఉండటం వల్ల తరచుగా అక్కడికి వెళుతూ వుంటాను. ఒకసారి బెంగుళూరుకు వెళ్ళాలని అనుకున్నపుడు మా అమ్మాయి విజయవాడ నుండి కొన్ని పట్టుచీరలు కొని తీసుకొని రమ్మని అడిగింది. వాటితో పాటు బంగారు నగలు కూడా పట్టుకెళ్లాల్సి వచ్చింది. మొత్తం 15 చీరలకు పైగా సర్దుకున్నాను. నగలు కూడా అదే పెట్టెలో సర్దుకుని బయలుదేరాను. బస్సు విజయవాడ నుండి బయలుదేరిన అరగంట ప్రయాణం తరువాత బస్సు ఆపేశారు. మంగళగిరికి ముందుగా పొలాల దగ్గర, ఆబస్సు డ్రైవరు వాళ్ళు “ఏమండీ! ఇందాక రోడ్డు మలుపులో బస్సు క్రింద ‘లగేజీ డోరు’ తెరుచుకున్నది. మీరందరూ మీ లగేజీలు వున్నాయో, జారిపోయాయో చూసుకోండి” అన్నాడు. నా పెట్టె బాగా పెద్దది. బాగా లోపలకు పెట్టారు అన్న వుద్దేశ్యంతో అందరూ దిగాక నేను దిగాను. అక్కడ లైట్లు లేవు చీకటి. అందరూ వాళ్ళ పెట్టెలు వున్నాయని బస్సు ఎక్కుతున్నారు. నేను వెళ్ళి చూస్తే నా పెట్టె లేదు. ఇంకొక అతనిది బ్రీఫికే. అతనేమీ పెద్దగా పట్టించుకోలేదు. ఆ క్షణాన నా పరిస్థితిని చెప్పలేను. “అయ్యో! అప్పుడేమి చేస్తాం. చాలా దూరం వచ్చాము మేడమ్” అన్నాడు డ్రైవర్.
వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నాకేదో మతిపోయినట్లుగా అయి “అమ్మా” “హైమమ్మా!” అవి మాత్రం అనగలిగాను. మా అమ్మాయికి ఫోను చేసి విషయం చెప్పాను.
“గాభరా పడకమ్మా! అమ్మను, హైమక్కయ్యను పిలు” అని తలపులోకి వచ్చిన స్వామికి, అమ్మకి మొక్కింది. అపుడు వెంటనే మా మేనమామ కొడుకు విజయవాడలో పోలీసు ఆఫీసర్. తనకు ఫోన్ చేయాలని తోచింది. అపుడు నేను ఆ బస్సు డ్రైవర్లతో ‘మా వాడు పోలీసు ఆఫీసరు. వాడికి ఫోన్ చేస్తాను” అని చెప్పి వాళ్ళ ముందే వాడికి ఫోను చేసి విషయం వివరించాను. అపుడు వాడు “నువ్వేమీ కంగారుపడవద్దు. దొరుకుతుంది. దొరకకపోయినా నీకేమీ నష్టం లేదు. నేను చూస్తాను. ఆ ట్రాన్స్పోర్టు పేరు, బస్సు నెంబరు, డ్రైవరు పేరు మెసేజ్ ఇవ్వు” అన్నాడు. అది విన్న డ్రైవర్లు “మేము చూస్తామమ్మా, కంగారుపడకండి” అని రోడ్డు మీదకు వెళ్ళి విజయవాడ వైపు వెళ్ళే స్కూటర్ల కోసం నిలబడ్డారు. వెంటనే రెండు స్కూటర్లు వస్తూ ఉంటే ఆపి, వాళ్ళని రిక్వెస్టు చేసి ఇద్దరు వెళ్ళారు. నేను “ఏమిటి హైమ అక్కయ్యా నాకీ అవస్థ!” “అమ్మా! నువ్వు నా వెంటే వుంటావుగా ఏమిటి నా పరిస్థితి?” అని ఆర్తిగా నామం చేసుకుంటూ నిలబడ్డాను. 15 ని.లలో ఆ డ్రైవరు “ఈ పెట్టె మీదేనా మేడం” అని ఇచ్చారు. సర్వాంతర్యామి యైన అమ్మ నిమిషాలలోనే సమస్యను చక్కబరిచింది. “అమ్మా! మీరెంతో అదృష్టవంతులు. ఇంతసేపయినా ఎవరూ దాన్ని చూడలేదు. మాదీ అదృష్టమే. లేకపోతే ఇది పెద్ద సమస్య అయ్యేది” అన్నారు వాళ్ళు. అంతకు ముందు పెట్టె లోపల పెడ్తానంటే వద్దు దోవకు అడ్డం అన్నవాళ్ళు “అమ్మా! ఇదిగో మీ పెట్టి భద్రంగా మీ దగ్గర పెట్టుకోండి” అని వాళ్ళే తెచ్చి లోపల పెట్టారు.
జరిగిన విషయం వాళ్ళు తరువాత చెప్పారు. ఈ డ్రైవర్లు టార్చిలైటుతో చూస్తూ, వెళుతూ ఎక్కడ బస్సు డోరు తెరుచుకున్నదన్న అనుమానమో అక్కడ వెతికారట. అది చాలా పెద్ద సెంటరట. ట్రాఫిక్ బాగా వున్నదట. ఆ మలుపులో ఒక గొయ్యి వున్నదట. ఈ సూట్కేసు ఆ గోతిలోపడింది. చీకటిగా వుండడం, గోతిలోపల వుండటం వల్ల ఎవరి దృష్టి దాని మీద పడలేదు అని వాళ్ళు చెప్పారు. వాళ్ళ ఆశ్చర్యానికి అంతులేదు, అర్థరాత్రి దాటేవరకూ పదే పదే చెప్పుకున్నారు. స్మరణ మాత్రంగా ప్రసన్నమయ్యే దయామయి. అమ్మ ఆ రకంగా నాతోనే వుంటూ సదారక్షిస్తోంది.