అమ్మను ప్రథమంగా 1971 మే లో దర్శించారు. అమ్మ రామచంద్రమూర్తిగారిని “నాన్నా! ఈ ఊళ్ళో ఉద్యోగం చేయవచ్చుగదా!” అన్నది. అమ్మను చూచినప్పటి నుండే వారికి కావలసిన ప్రదేశం అమ్మ సన్నిధే అనిపించింది. 1972 జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కాలేజిలో ఆచార్యునిగా వచ్చారు. అమ్మ దివ్యమంగళరూపానికి ముగ్ధులై ఆనందానుభూతిలోని దివ్యమకరందాన్ని తనివిదీరా గ్రోలాలనిపించింది. ఆ రసాస్వాదనతో, అమ్మతో సంభాషణలలో రెండు దశాబ్దాల పాటు ఆచార్యునిగా, ప్రాచార్యునిగా, అమ్మకు అత్యంత సన్నిహితునిగా మసిలారు.
అమ్మ సాహిత్యాన్ని చదవటమే గాక, అమ్మ మాటలలోని అనుభవసార వేదాంత నిధులను పొదివి పట్టుకుని ఆచరణలో పెట్టటానికి ప్రయత్నించారు. సర్వ సమ్మతమైనదే నా మతం అన్న అమ్మ సంపూర్ణ మానవతా మంత్రాన్ని అవగాహన చేసుకొన్నారు. శుద్ధ వైదిక కుటుంబంలో పుట్టిన వారు అమ్మ వద్ద క్రొత్త జన్మ ఎత్తారు. కులమతాలకతీతమైన మానవతా మంత్రంతో గుణాలకు కూడా అతీతమైన జ్ఞానశిఖరాగ్రాన ఉన్న అమ్మ అద్వైతమూర్తి, మన అదృష్టవశాత్తూ అమ్మగా వచ్చిందనే సత్యాన్ని ఆకళింపు చేసుకున్నారు. అమ్మను చూచిన నాటి నుండి నేటి వరకు కష్టనష్టాలు రెండూ అమ్మ ఇచ్చినవి గానే సంతోషంగా స్వీకరించారు.
“ఇతరులలో లోపాలెంచకుండా జిల్లెళ్ళమూడిలో ఉండగలగటం అది ఒక తపస్సు – అది ఒక అదృష్టం – అందరిల్లు ప్రపంచానికి నమూనా” అన్నది అమ్మ. అన్ని రకాల జీవులూ ఉంటారిక్కడ. రామచంద్రమూర్తి గారిని కూడా ఇబ్బంది పెట్టిన సందర్భాలు లేకపోలేదు. అయినా అవి కూడా అమ్మ ప్రసాదించినవే అనే నిబ్బరాన్ని తెచ్చుకున్నారు అమ్మ అనుగ్రహంతో.
శ్రీ విశ్వజననీపరిషత్ అన్ని కార్యక్రమాలలోనూ ఇష్టంగా సేవ చేసేవారు. విద్యార్థులచే చేయించేవారు. అమ్మ స్వర్ణోత్సవాలలో, వత్రోత్సవాలలో సహోపాధ్యాయు లతో కలిసి శిష్యసమేతంగా, సకుటుంబంగా సేవలలో పాల్గొన్నారు. అన్నపూర్ణాలయం లోనూ, అన్ని కార్యక్రమాల లోనూ వడ్డనలలో సేవలలో పాల్గొంటుండే వారు. విద్యార్థి మన కళాశాల నుండి బయటకు వెళితే ఒక సంపూర్ణ ఆదర్శ విద్యార్థిగా రూపుదిద్దబడే విధంగా తగిన తర్ఫీదు ఇచ్చేవారు. ఆనాటి విద్యార్థులు ఈ నాటికీ, వారు రిటైరైన సమయాలలో కూడా రామచంద్రమూర్తి గారిని తలచుకుంటున్నారంటేనే వారి శిక్షణలోని విశిష్టత మన కర్ధమౌతుంది..
ఇక్కడ కళాశాలలో చదివే పిల్లలు పేద, అట్టడుగు వర్గాల నుండి వచ్చిన వారు. వాళ్ళకు అమ్మ ప్రేమతత్త్వాన్ని ప్రతిరోజు అసెంబ్లీలో మూడు నిమిషాలు తెలియజేస్తూ అన్ని సేవాకార్యక్రమాల్లో భాగస్వాములను చేసేవారు. పిల్లలను అమ్మ దర్శనానికి తీసుకొని వెళ్ళేవారు. అమ్మతో చనువుగా ప్రశ్నలు వేసి సమాధానాలు పొందుతూ అమ్మపట్ల భక్తినీ, విశ్వాసాన్నీ పొందేటట్లు తయారు చేసేవారు. ఈనాడు ఎందరో విద్యార్థులు డాక్టరేట్లు పొంది ప్రిన్సిపాల్స్, ఉన్నతోన్నతమైన అభివృద్ధిని పొందారంటే ఆనాటి రామచంద్రమూర్తిగారు, తోటి ఉపాధ్యాయులు తీర్చి దిద్దటమే – పిల్లలు ఇక్కడ ఉంటే అన్ని సంవత్సరాలు వారి ఆరోగ్యము, తిండి తిప్పలు చూస్తూ వారి అవసరాలకు లోటు లేకుండా కనిపెట్టి ప్రేమతో చూస్తూ తల్లిదండ్రులను వదిలి ఉన్నామనే చింతలేకుండా చేయాలనే అమ్మ మాటలు తు.చ. తప్పకుండా ఆచరణలో పెట్టేవారు.
అయితే క్రమశిక్షణ – భక్తి – వినయము – మాట మాట్లాడటంలోని సౌమ్యత పిల్లలు రామచంద్ర మూర్తిగారి నుండి నేర్చుకునే రీతిలో వారి ప్రవర్తన ఆదర్శవంతంగా ఉండేది – అందుకే ఎంతమందికో ఆరాధనీయులైనారు. ఈనాటికి అమ్మను భక్తితో సేవించే శిష్యులను తయారు చేసిన ఘనత వారికి వర్తిస్తుంది.