1. Home
  2. Articles
  3. Viswajanani
  4. శ్రీ వివేకానందుని అంతరంగ తరంగాల్లో అమ్మ,

శ్రీ వివేకానందుని అంతరంగ తరంగాల్లో అమ్మ,

Radha
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : June
Issue Number : 11
Year : 2021

(గత సంచిక తరువాయి )

– రాధ

ఒకరు అమ్మను “మీరు హిందూ మత సంప్రదాయాన్ని పాటిస్తారా?” అని అడిగితే అమ్మ “”ప్రత్యేకించి ఏ సంప్రదాయాన్ని నేను పాటించను, నాన్నా!” అంటూ “సర్వసమ్మతమైనదే నా మతం” అని ప్రకటించింది. అన్ని మతాలకూ మార్గాలకూ అమ్మ – సమానమైన విలువనే ఇస్తుంది. ఆచరించేవాడికి ఏ -మతమైనా ఒకటేనని అమ్మ అభిప్రాయం. ప్రతిమనిషికీ ఏదో ఒక మతం అవసరమని కూడా అమ్మ అంగీకరించదు.

  1. “In a day, when you don’t come across any problems – you can be sure that you are travelling in a wrong path” అన్నారు స్వామి వివేకానంద.

“శిల ఉలిదెబ్బలతో అందమైన శిల్పం అయినట్లు బాధలు జీవితాన్ని చైతన్యతరంగితం చేస్తాయి. సహనమనే దేవతను ఆరాధించాలంటే బాధలనే పూజాద్రవ్యాలు కావాలి. బాధలు లేని జీవితం కంటే చావునయం” అనేది అమ్మ విలక్షణ అద్భుత ప్రవచనం.

సాధారణంగా మనం చూస్తుంటాం – ‘ఈ జనం చేస్తాం, నక్షత్రాలకి గ్రహాలకి శాంతి చేస్తాం, నీకు రక్షరేకు కడతాం. – నీ బాధలు పోతాయి’ అనే వారిని. అమ్మ అలా అనదు. “బాధలు పడటానికి కూడా సిద్ధంగా ఉండాలి, నాన్నా! సీత, సావిత్రి, హరిశ్చంద్రుడు కథల నుంచి మనం నేర్చుకునేదేమిటి? వాళ్ళతో పోలిస్తే మనము ఏం బాధలు పడుతున్నాం!” అంటూ జీవన సమరంలో మడమతిప్పని యోధుని వలె పోరాడమని వెన్ను తట్టి  |ప్రోత్సహిస్తుంది అమ్మ.

ఇదే సత్యాన్ని శ్రీస్వామి వివేకానంద అద్భుతంగా ఆవిష్కరించారు. “ఏ సమస్యలూ లేవు (పోయిగా ఉన్నాను) అనుకునే రోజున నువ్వు తప్పుడు దారిలో నడుస్తున్నావు – అని గుర్తించు ” అన్నారు. విద్యుక్తధర్మ నిర్వహణలో ఒక వ్యక్తి – స్త్రీ/పురుషుడు, పాలకుడు పాలితుడు ఎవరైనా దైవ – అనుగ్రహం వలన సాఫీగా ఒడుదుడుకులు లేకుండా గడువుతున్నాను” అనుకోవటం సబబుకాదు. తత్త్వతః అది దైవానుగ్రహం కాదు.

దైవం ఎక్కడ ఉంటాడు? ఆవేదన ఉన్నచోట, కష్టాలు కన్నీళ్ళు దొరిలే చోట, గ్లాని – శ్రాంతి నెలకొన్నచోట, ‘నాకు దిక్కు ఎవరు?’ అని అలమటించేచోట ఉంటాడు; వాడు/ఆ శక్తి/ఆ తత్త్వం జగత్కర్త, జగద్భర్త కాబట్టి.. ఒడుదుడుకులు, వడగాలులు చుట్టుముట్టిన చోటికి పరుగు పరుగున వచ్చి ఆదుకుంటాడు. మనం నడిచే బాట పూలబాట, నల్లేరు మీద బండి అనుకున్నప్పుడు. ‘You can be sure that you are travelling in a wrong path’ – అని ఉపదేశించారు. శ్రీవివేకానంద.

  1. “Astrology and all these mystical things are generally signs of a weak mind” అన్నారు స్వామి.

“అనుకున్నది జరగదు, తనకున్నది తప్పదు” అని అమ్మ స్పష్టం చేసింది. విధి – నిర్ణయము అనుల్లంఘనీయము అని ప్రబోధించింది..

“మానవుని నడకకి ఆధారం నవగ్రహాలు కాదు, రాగద్వేషాలు; ఆ రెంటికీ ఆధారం ‘నేను’ “అని వివరించింది. మానవుని నడిపించేది రాగద్వేషాలు – అంటే ఇష్టాయిష్టాలు. (Likes and di slikes), ‘ఇది కావాలి – ఇది వద్దు’అనే ఎంపిక.

“ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి” అనేది ఆరోకి. మనిషి ఏం చేసినా తన కోసమే, తన తృప్తి కోసమే చేస్తాడు. ఇతరులకోసం చేసినట్లుగా ఉన్నా అందుకు మూలం తన ఇష్టమే. తమ ఓటమికి అశక్తతకి నవగ్రహాలు కారణం.

ఏలినాటి శని, కాలసర్పదోషం, కుజదోషం అని భావిస్తారు.

ఈ అంశాన్నే “An excellent evasion of man to lay his disposition to the charge of a star” – అభివర్ణించారు William Shakespeare.

సాధారణంగా ఇవన్నీ మనోబలహీనతకి చిహ్నాలు – Signs of a weak mind అన్నారు వివేకానంద.

“మంచికేదో చెడుకూ అదే (ఆ శక్తే) కారణం; ఆపదలని కలిగించేదీ ఆపదలనుంచి రక్షించేదీ ఒకే శక్తి” అంటుంది అమ్మ. కనుకనే “సుఖానికి మార్గం ఒక్కటే ఏది చేసినా దైవం చేశాడనుకోవటమే” అని ఒక పరమ సత్యాన్ని ఆవిష్కరించింది; జీవననావకి చుక్కానిని అమర్చింది.

  1. “నువ్వు భగవంతుని కోసం ఎక్కడ వెతుకుతున్నావు? పేదలు, దుఃఖితులు, బలహీనులు … అందరు దైవాలు కాదా? ముందుగా వారినెందుకు పూజించకూడదు? గంగ తీరంలో బావి త్రవ్వడం ఎందుకు? ప్రేమకున్న అనంతశక్తిపై నమ్మకం ఉంచు” అన్నారు స్వామి.

‘దానం’అనే పదానికి వేదం అచ్చంగా ఇదే భాష్యం చెప్పింది. ఇక్కడే పాశ్చాత్య సంస్కృతికి ప్రాచ్య సంస్కృతికి భేదం స్పష్టంగా కనిపిస్తుంది. పాశ్చాత్యదేశాలలో ఒక దాత, ఒక (యాచకునికి) గ్రహీతకి ఒక డాలర్ ఇస్తే, గ్రహీత ‘Thank you, thank you’ అంటూ కృతజ్ఞతాంజలి ఘటిస్తాడు.

అదే భారతదేశంలో అయితే గ్రహీతని సుఖాసీనుని చేసి, అర్ఘ్యపాద్యాదులతో అర్చించి, ‘నారాయణ స్వరూపాయ తుభ్యమిదం సంప్రద  — -న మమ’ అంటాడు సవినయంగా. గ్రహీత సాక్షాత్తూ శ్రీమహావిష్ణు స్వరూపం అని సంభావన చేస్తాడు. ‘తుభ్యమిదం సంప్రదదే  న మమ’ “ఈ వస్తువు నాదికాదు, నీది” అనే తాత్పర్యంతో, ఆ సమయంలో నిర్లక్ష్యంగా, ఏమరుపాటుగా, అహంకారపూరితంగా ఉండడు. శ్రద్ధయా దేయం, శ్రియాదేయం. శ్రద్ధగా, తనశక్తి మేరకు ఇస్తున్నానని, ఇంత తక్కువే ఇస్తున్నానని సిగ్గుపడుతూ, అందుకు క్షమాపణకోరుతూ భయపడుతూ ఇవ్వాలని ప్రబోధిస్తుంది వేదం.

అమ్మగోరు ముద్దలు తినిపిస్తూ మనకి నేర్పిన పాఠం ఏమంటే

“తమ బ్రతుకు తాము బ్రతక లేని అనేక విధాల బలహీనులు ఉన్నారు. తమ కాళ్ళమీద నిలబడలేని వారికే గదా కఱ్ఱ ఆసరా; వారికి తోడు పడండి. అయితే అది వారిపై జాలితో చేసే సహాయమని అనుకోక, వారిని భగవత్ స్వరూపులుగా భావించి వారికి సేవచేయండి.

“కనిపించని దేవునిపై మనస్సు నిలవడం లేదనీ, ఏకాగ్రత కుదరడం లేదని బాధపడక, కనిపించే ఈ దేవుళ్ళను ప్రేమతో ఆరాధించండి. ఆ సేవలో కలిగే తృప్తే ముక్తి” అని. లక్షలమందికి అమ్మ అన్నం పెట్టింది. ఆ సందర్భంగా అన్నది, “నాన్నా! వాళ్ళ అన్నం వాళ్ళు తిని వెడుతున్నారు. మనం పెట్టటం కాదు”అని; ‘కర్మఫల పరిత్యాగం’ అంటే ముమ్మూర్తులా ఇదే.

ఇలా ఈ దృష్టితో అధ్యయనం చేస్తే ఇంకా అనేకానేక అంశాలు నభోమండలంలో నక్షత్ర మండలాలుగా, కార్తీకదీపసదృశ జ్ఞానప్రభలను ప్రసరింపచేస్తూ మన కన్నుల ముందు నిలుస్తాయి.

శ్రీస్వామి వివేకానంద వాణి సార్వకాలికమైనది, సాధికారికమైనది, సత్యసమన్వితమైనది.

అమ్మ వాక్కు ఆప్త వాక్కు, అపౌరుషేయమైనది, అమోఘమైనది. వివేకానందుని హృది మాతృశ్రీ మది. కావున తత్త్వతః శ్రీవివేకానందుని జాతిరత్నాన్ని కన్న భువనేశ్వరీదేవి మాతృశ్రీ అమ్మయే.

ఉపయుక్త గ్రంధావళి:

  1. స్వామి వివేకానంద – చికాగో ప్రసంగము; సూక్తులు – Internet
  2. ‘జగతికి దారి చూపగా భారతీ మేలుకో, K. S. రంగసాయి, స్వామి వివేకానంద 150వ జయంతి ఉత్సవ సమితి, హైదరాబాద్ ప్రచురణ. 
  3. అమ్మ – అమ్మ వాక్యాలు S.V.J.P. ప్రచురణ,

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!