“అడగనిదే అవసరాన్ని గమనించిపెట్టేదే అమ్మ” అంటూ తన స్వభావాన్ని, అపూర్వ ఆదరణ లక్షణాన్ని విస్పష్టంచేసింది అమ్మ. ఈ నిర్వచనానికి వివరణా అన్నట్లు “ఆకలితో జిల్లెళ్ళమూడి రావచ్చును, కానీ ఆకలితో జిల్లెళ్ళమూడి వదలి వెళ్ళకూడదు” – అన్నది అమ్మ. ఈ వాక్యంలో ‘ఆకలి’ అంటే క్షుద్బాధ అనేనా అర్థం? రూఢ్యర్థం అదే కావచ్చును. లోతుగా పరికిస్తే ఎవరు ఏ బాధతో విలవిలలాడుతుంటే ఆ బాధకి అమ్మ ఒక నివారణని ప్రసాదిస్తుంది – అని తెలుస్తుంది.
దైవాన్ని ఆరాధించేవారు నాలుగు విధాలు అని ఆర్తో జిజ్ఞాస ర్దార్థీ జ్ఞానీ (దుఃఖ సంతప్తులు, జిజ్ఞాసువులు, ప్రయోజనం కోరేవారు, జ్ఞానులు) అని ప్రబోధించారు గీతాచార్యులు. ఆ నలుగురు ఏ విభాగానికి చెందినప్పటికీ సర్వశక్తివంతమైన దైవానుగ్రహాన్ని అపేక్షించి, అర్రులు చాస్తూ, దిక్కులేక దిక్కుతోచక పరతత్త్వాన్ని ఆశ్రయించేవారే. వారంతా రక్తహస్తాలతో వచ్చారని ప్రేమతో ఆదరించి అమ్మ రిక్తహస్తాలతో వారిని పోనివ్వదు. అదీ ఆకలితో రావటం పోవటంలోని పరమార్థం. కొన్ని ఉదాహరణలు: –
- ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు పూర్వా శ్రమంలో డా॥ ప్రసాదరాయ కులపతి. కులపతి గారికి వివాహం కాకుండానే సన్యసించి పీఠాధిపత్యం స్వీకరించమని ఆహ్వానం వచ్చింది. వారికి అంగీకారమే. కానీ, వారి తల్లిదండ్రులు తీవ్రమనస్తాపానికిలోనై అమ్మను ఆశ్రయించారు. వారితో అమ్మ “మీరెందుకు
దిగులుపడతారు! ఎప్పుడేది జరగాలో అది జరుగుతుంది” అని అనునయించింది. అంతే. అప్పటికి అది వాయిదాపడి, కాలాంతరంలో వారు సన్యసించి పీఠాథిపత్యం వహించారు.
- శ్రీరామకృష్ణపరమహంస ప్రబోధములో ‘కామినీకాంచనములు’ అనేదానిని ‘కాంతాకనకములు’ అని ఒక సోదరుడు ప్రస్తావిస్తే అమ్మ “కామము అంటే కోరిక. ‘కామిని’ అన్నా కోరికే. వీళ్ళు ఎంత భాషాంతరీకరణ (అనువాదం – translation) చేసినా ‘కామిని’ అంటే కోరికే. కాబట్టి పరమహంస కోరికలను విడిచిపెట్టమన్నారు; స్త్రీని విడిచిపెట్టమనలేదు” అని వాస్తవాన్ని విపులీకరించింది.
- ‘సన్యాసికావాలి కానీ సన్యాసం పుచ్చుకోవటం కాద’నీ, ‘బుద్ధుడు వెళ్ళాడని వెళ్ళటం కాదు బుద్ధుడు వెళ్ళినట్లు వెళ్ళాలి’ అనీ అమ్మ సత్యసందర్శనం చేస్తుంది. “జీవితం బుద్బుదప్రాయం, యౌవనం ఝరీవేగతుల్యం” అంటూ వైరాగ్యాలను వల్లె వేస్తున్న వానితో “నువ్వు దీనినంతా ఎత్తిపారబోయాలని విశ్వజనని ప్రక్షాళనచేయాలని అంటే అదిపోదు. ఆ తరుణం వచ్చినపుడు అదే పోతుంది” అంటూ అద్వైతవాసనగానీ, వైరాగ్యసంపదగానీ ఆ శక్తి అనుగ్రహమేనని గుర్తించ మంటుంది అమ్మ.
- శ్రీ రాచర్ల లక్ష్మీనారాయణ గారి నాయనమ్మ జారిపడిపోయి మంచానపడింది. “నన్ను తనలో ఐక్యం చేసుకొమ్మని అమ్మకి చెప్పు”అని లక్ష్మీనారాయణ గారిని కోరింది. ఆయన ఆ మాట అమ్మకి విన్నవించు కున్నారు. నాలుగురోజుల తర్వాత శివరాత్రివచ్చింది. అమ్మ అన్నయ్యని పిలిచి “ఏరా! ఈవేళ మీ నాయనమ్మను పంపించేద్దామా?” అని అడిగింది అదేదో Ticket కొని రైలు ఎక్కించేంత తేలికమాటగా. “ఈవేళ వద్దమ్మా! మా నాన్న కోటప్పకొండకి వెడతాడు. ఇంటివద్ద ఉండడు” అన్నారు అన్నయ్య. “సరేలే” అన్నది అమ్మ. మర్నాడు అన్నయ్య ఇంటికి వెళ్ళేసరికి వారి నాయనమ్మ అంతిమ శ్వాస వదిలి ఉన్నది.
- శ్రీ విశ్వయోగి విశ్వంజీ గారిని అమ్మ లోపలికి పిలిచి ఒడిలో పడుకోబెట్టుకుని ఆప్యాయంగా శిరస్సు నుంచి వెన్నుపూసవరకు నిమిరింది. అన్నం తెప్పించి కలిపి మూడుముద్దలు చేసి ప్రేమతో తినిపించింది. “విశ్వజనని అమ్మ నాలో బ్రహ్మగ్రంధి, విష్ణుగ్రంధి, రుద్రగ్రంధి మూడింటినీ విచ్ఛేదనం కావటానికి దోహదంచేసిన శుభముహూర్తం అది” అని అమ్మ అన్న ప్రసాద మహిమను కీర్తించారు శ్రీ విశ్వంజీ.
- సో॥ M.చంద్రశేఖరరావు గారు “అమ్మా! నాకు ulcer వచ్చింది, డాక్టరు గారు operation చేస్తానన్నారు” అని విన్నవించుకున్నారు. అమ్మ వారి ఛాతీని తన చేతితో తడిమి “నాన్నా! డాక్టరుగారు operation చేస్తానంటే చేయించుకో. కానీ ఇక్కడ
ఏమీలేదు” అన్నది. కారణాలు తెలియవు. ఆయన డాక్టరుని కలవలేదు, operation చేయించుకోలేదు.
అమ్మ ఏమి ఇస్తుంది? ఏదైనా ఇస్తుంది ఏమైనా చేస్తుంది. అమ్మ పావన పాదస్పర్శతో వ్యాధుల నుంచి ముక్తులైనవారు కొందరు, మధ్యతరగతి స్థాయినుంచి కుబేరులైనవారు కొందరు, ఉపాధ్యాయుని స్థాయినుండి కళాశాల ప్రిన్సిపాల్స్ అయినవారు కొందరు… అలా వారి వారి రంగాల్లో అత్యున్నత స్థానాల్ని అనాయాసంగా చేరుకున్నారు.
అట్టి అసంఖ్యాక ఉదాహరణల దృష్ట్యా – “ఆకలితో జిల్లెళ్ళమూడి రావచ్చును,
కానీ, ఆకలితో జిల్లెళ్ళమూడి వదలి వెళ్ళకూడదు” – అనే అమ్మ వాక్యం ఒక అద్భుతవరం, అమ్మ అవతార విలక్షణ లక్షణం అని బోధపడుతుంది.
పదార్థ దృష్ట్యా – అమ్మ పెట్టే అన్నం క్షుద్బాధను శమింప చేసి, సంతృప్తిని కలిగిస్తోంది. అందలి పరమార్థాన్ని పరమ ప్రయోజనాన్ని స్పష్టం చేస్తూ శంకర భగవత్పాదులు “జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి” అని అన్నపూర్ణేశ్వరిని ప్రార్థించాలి అని ప్రబోధించారు.
సారాంశం ఏమంటే – అమ్మ పెట్టేది కేవలం ఆకలి తీర్చే అన్నం కాదు, మహాప్రసాదం. అందు అమ్మ వాత్సల్యం, అనుగ్రహం, ఆశీస్సులు, అనంతశక్తి, కరావలంబం … ఎన్నో ఉన్నాయి.
ఏతావతా ‘ఆకలి’ అంటే – ఇహపర సౌఖ్యాల కోసం, దుఃఖనివృత్తి కోసం, జ్ఞానవైరాగ్య సిద్ధి కోసం, మోక్షంకోసం – ఆర్తి, తపన, వేదనాగ్ని.
కనుక సర్వభాధాప్రశమని, సర్వార్థ సంధాత్రి అమ్మ.
ఎ.వి.ఆర్.సుబ్రహ్మణ్యం