సామాన్యంగా లోకంలో ప్రేమ అనేది యువతీ యువకుల మధ్య ఉండే ఒక రకమైన ఆకర్షణ అనే అర్థంలోనే వాడబడుతున్నది. తల్లిదండ్రులకు తమ పిల్లలపై ఉన్న ప్రేమకు మమకారం అన్నారు. భార్యభర్తల మధ్య ఉండే ప్రేమ అనురాగం అన్నారు. స్వామిజీలపై, గురువులపై ఉన్న ప్రేమ గౌరవం అంటున్నారు. పెద్దలకు పిన్నలపై ఉన్న ప్రేమ వాత్సల్యం అంటున్నారు. నిజానికి గోవుకు తన బిడ్డను ప్రసవించినపుడు దానిపై ఉన్న మాయను నాలుకతో శుభ్రం చేస్తుంది. అందుకే ఆ దూడను వత్సల అన్నారు. అలాగే సమవయస్కులైనవారు ఆడవారు గాని, మగవారు గాని, వారి మధ్య గల ప్రేమను స్నేహం అంటున్నారు. భగవంతునిపై కల ప్రేమను భక్తి అని పేరు పెట్టారు. కాని ప్రేమ అంటే వదలి ఉండలేని స్థితి, అవతలి వారి కోసం అవసరమైతే ప్రాణమైనా అర్పించగల త్యాగం. అయితే దురదృష్టవశాత్తు వాటి నిజమైన విలువను గుర్తించగలవారు అరుదు.
అమ్మ “నేను గురువును కాను మీరు శిష్యులు కారు, నేను మార్గదర్శిని కాను మీరు బాటసారులు కాదు, నేను తల్లిని మీరు బిడ్డలు” అన్నది. అమ్మ గురువుకాదా? మార్గదర్శి కాదా? అంటే ‘గురు’ పదం అలా నేడు లోకంలో అపభ్రంశం పొందింది. అందుకే సోదరుడు భరద్వాజ నీవు సద్గురువును కాదన్నావా? అమ్మా! అంటే అమ్మ ఈనాడు గురువు అనే పదం సరియైన అర్థంలో వాడ బడటం లేదన్నాను కాని, నేను సద్గురువును కాదని అనలేదన్నది.
అలాగే ఈ లోకంలో ప్రేమ అన్న పదం రకరకాల రూపాంతరాలు చెందింది. కాని అమ్మ లేని (జీవి) సృష్టి లేదు కనుక అమ్మ దానికి మమకారం అనే పేరు అంగీకరించింది. “మమ” అంటే నాది అనుకోవటమే కదా! అమ్మ సృష్టి నాది అన్నది. ఈ సృష్టి తానే గనుక సృష్టితో తాదాత్మ్యం చెంది ఉన్నది. మీరు నా అవయవాలు, నేను కానిది యేదీ లేదు అన్నది. మనపైన మనకు ప్రేమ లేకుండా ఉండదు కదా! అందుకే అమ్మ తానే సృష్టిగా పరిణామం చెందింది కనుక సృష్టిపైన ప్రేమ లేకుండా ఎలా ఉంటుంది? బిడ్డ ఏం చేసినా, ఎన్ని తప్పులు చేసినా తప్పులుగా కనబడవు. అందుకే తల్లికి తప్పదు కాదు తప్పులే కనబడవు అన్నది. నరకాసురుడు దుర్మార్గుడని తల్లి ప్రేమించకుండా ఉంటుందా? అన్నది. అందరింట్లో బీభత్సం సృష్టించిన నక్సలైట్లను గుర్తించటానికి తెచ్చినప్పుడు బిడ్డలలో అడిగి తీసుకుండే వాడొకడైతే అదరగండంగా తీసుకుండే వాడొకడని వాళ్ళకు తింటానికి ఏదైనా పెట్టించండి ముందు అంది. అదీ. సహజమైన ప్రేమంటే. సంస్కరించటమే కాని సంహరించటం లేదు అమ్మ శబ్దరత్నాకరంలో. అందుకే ఏ విషయంలోనైనా పరిణామమే కాని నాశనం లేదన్నది.
బాల్యంలో 9 ఏళ్ళప్పుడు వాసుదాసస్వామి వద్దకు వెళ్ళితే తల్లిలేని పిల్ల అని తెలిసి స్వామి నిన్నందరూ ప్రేమించేటట్లు ఆశీర్వదించేదా అని అమ్మను అడిగారు. అందుకు అమ్మ నన్ను అందరూ ప్రేమించినా ద్వేషించినా నేనందరినీ ప్రేమించేటట్లు ఆశీర్వదించండి అంటుంది. అదేమిటమ్మా! అంటే ప్రేమంటే ఏమిటో తెలియాలంటే నాకు ఉంటేగా తెలిసేది. ఇతర్లకు ఉంటే నాకేమి అర్థమౌతుంది? అన్నది అమ్మ.
అలాగే అమ్మ చిదంబరరావు తాతగారింట్లో ఉన్నప్పుడు అమ్మ మేనత్త కనకమ్మగారి భర్త బ్రహ్మాండం వెంకట సుబ్బారావుగారు (నాన్నగారి తండ్రి) స్వర్గస్థుడయ్యాడు. ఆ చనిపోయిన శరీరం చుట్టూ లోకనాధం బాబాయి, వారి తమ్ముడు నరసింహారావు చేత నమస్కారం చేస్తారు. అమ్మ కూడా వెళ్ళి నమస్కారం చేస్తుంది. పిల్లలను మేడమీదకు తీసుకెళ్ళుతారు. అయినా ఏడుస్తుంటారు. అమ్మ వాళ్ల దగ్గర కూర్చొని “నాన్నా! యేడవకండి నేనున్నానుగా. లోకం నీవు ఇందాక నాన్నగారికి ఏమని దణ్ణం పెట్టుకున్నా” అని అడిగింది. లోకనాధం నాతో మాట్లాడుతూ ఉండు చదువు చెప్పు నాన్నా! అని పెట్టుకున్నా అంటారు. నువ్వు ఏమని పెట్టుకున్నా నరసింహం అని అడుగుతుంది నరసింహారావును. నన్ను యెత్తుకోమని పెట్టుకున్నానంటాడు అతను. వాళ్ళిద్దరూ కలసి అమ్మను అడుగుతారు. నీవు ఏమని దణ్ణం పెట్టుకున్నావు అని. నేను మిమ్మల్ని కనిపెట్టుకుని ఉంటానని పెట్టుకున్నా నాన్నా అంటుంది. అంటే ఏమిటి? అని నరసింహారావు అడుగుతాడు. మీ నాన్నగారు నిన్ను ఎత్తుకుండేవారనుకో, ఎవరూ లేకపోతే నేను ఎత్తుకుంటా. లోకనాథానికి రోజూ డబ్బులిచ్చేవారనుకో ఎవరూ ఇవ్వకపోతే కూలయినా చేసి నేను ఇస్తా. మీ నాన్నలేని లోటు మీ కుటుంబానికి ఏది కావలసినా మనిషిని చూపలేను కాని తక్కిన వన్నీ చూస్తా. అడుక్కొచ్చయినా పెడతా అంటుంది. మా మీద నీకెందుకింత ప్రేమ అనసూయా? అని లోకనాథం గారు అడిగాడు. అమ్మ అప్పుడు “నాకు ప్రేమ సహజం” లోకం. ఎవరు కష్టపడుతున్నా నాకు అట్లాగే ఉంటుంది. అన్నది.
అంటే అమ్మ ఎవరు బాధపడుతున్నా సహించ లేదు. అది తీర్చటానికి ఏం చేస్తే అవసరమో అది చేస్తుంది. అది అమ్మే చేస్తున్నది అనేది వాళ్ళు గ్రహించ లేకపోయినా. సర్వత్రా ఆ మమకారం ప్రసరిస్తుంది. అంధ సోదరుడు రాధాకృష్ణరెడ్డి అహర్నిశలు నామం చేస్తాడు ఆహారం తీసుకోకుండా. అప్పుడు అమ్మ ఏ పళ్ళో పాలో పంపిస్తుంది. అమ్మ పంపించిందని అంటే తీసుకుండే వాడు. అమ్మకు నివేదన తెచ్చారు. అమ్మ నివేదన తీసుకొని అక్కడ ఉపవాస దీక్షలో ఉన్న రామచంద్రరావు మాష్టారుగారికి అది ప్రసాదంగా బలవంతాన తానే తినిపించారు. 1958 లో అమ్మ మన్నవ వెళ్ళుతూ తన వెంట తీసుకెళ్ళిన పటిక బెల్లము, దారిలో కొన్న పదకొండు అరటిగెలలూ దారిపొడుగునా పంచుతూనే వెళ్ళారు. ఎవరైనా మా ఊరు రమ్మని అడిగితే మీకు కారున్నది కనుక నన్ను కారులో తీసుకెళ్ళుతామంటారు. కాని డబ్బు లేనివాడు అడగలేడు. కదా! నాకు ప్రతివాడిదగ్గరకూ వెళ్ళాలనే ఉంటుంది. లేనివాడు అమ్మకు కావలసిన సౌకర్యాలు డబ్బున్నవాళ్ళలా చెయ్యలేం కదా! అని రమ్మని అడగలేడు. నేను అటువంటి వాళ్ళ ఇళ్ళకు కూడా వెళ్ళగలిగిననాడు బయలు దేరుతాను. నేను బయలుదేరటానికి చాలా ఉండాలి. ఒక గుడిసె లోకి వెళ్ళితే వాడికి పెట్టటానికి తీసుకెళ్ళాలి. వాడు అమ్మకు ఏమి పెట్టలేకపోయానే అనుకోకుండా వాడిచేత పెట్టించుకోవటానికి కూడా నేనే తీసుకెళ్ళాలి. ఆ మధ్య చీరాల వెళ్ళినట్లు ప్రతి ఇంటికీ వెళ్ళగలగాలి. కూలీనాలీ చేసుకొనేవాళ్ళు, చెంచుల వాళ్ళూ, పాకీవాళ్ళు. అందరిళ్ళకూ వెళ్ళగలిగితేనే ప్రయాణం అనేది పెట్టుకుంటా. కుంటీ, గ్రుడ్డీ, ముసలి ముతకా అందరినీ చూడగలగాలి. అట్లా అయితే బయలుదేరాలి. అదీ అమ్మ మమకారం.
“ఒకింట్లో ఆమె కూలీకెళ్ళి తెచ్చినదానితో వండుతుండేది. నేను వెళ్ళినపుడు ఏమీ అమ్మకు పెట్టలేదే అని బాధపడుతున్నది. వాళ్ళ పిల్లలు తిని కంచాల్లో కడిగిన నీళ్ళుంటే అవి త్రాగాను. ఇంకో ఇంట్లో మాంసం ఉట్టి మీదది అవతల పెట్టమని భార్యను హెచ్చరిస్తుంటే నేను. వెళ్ళి కొంచెం మాంసం వేలుతో తీసి నోట్లో వేసుకున్నా.. ఇంకో ఇంట్లో చేపలకూర. అలాగే అందరిళ్ళల్లో. కుష్టువాళ్ళకూ తినాలని ఉంటుంది. హాస్పిటల్లో పెట్టీపెట్టక బాధ పడేవాళ్ళకూ పెట్టాలి” అన్నది అమ్మ మమకారం సర్వత్రా సహజ సిద్ధంగా, సర్వత్రా ప్రసరిస్తూనే ఉన్నది.
తిరుపతి నుండి ఒకసారి పి.వి.ఆర్. కె. ప్రసాద్ గారు ఇ.ఓ.గా ఉండగా వచ్చారు. దేవాలయానికి అంతధనం వస్తున్నది కదా ఇంత ఆహారం వచ్చినవారి ఆకలి తీరిస్తే బాగుంటుంది కదరా! అన్నది. అది అతని మనసులో నాటి తిరుపతి ఉచిత అన్నప్రసాదవితరణ పథకం ప్రవేశపెట్టారు. అది చూచి చాలా ఆలయాలు అనుసరించాయి. అమ్మను ఒక జ్యోతిష్కుడు ఏదన్నా ప్రశ్నవేస్తే సమాధానం చెపుతా నన్నాడు. అపుడు అమ్మ భూమిపై అందరూ ఆకలి లేకుండా ఉండే సమయం ఎప్పుడు వస్తుంది? అని ప్రశ్నించింది. నిజమే. అమ్మకు అలాటి కోరికలే ఉంటాయి. అమ్మ సంకల్పించినట్లుగా ఈనాడు ఎక్కడా ఆకలిచావులు కనిపించటం లేదు.
అమ్మ జీవితచరిత్రలో ఏ సన్నివేశం చూసినా . అమ్మ ప్రేమ మనకు ప్రత్యక్షంగా కనిపిస్తూనే ఉంటుంది. బాపట్ల రోడ్డుమీద పడి ఉన్న రహిని రక్షించి సేవ చేయటంలోనూ, రైల్లో ప్రయాణించే ముసలితాతనూ మనుమడ్నీ కడతీర్చడంలోనూ, తెనాలిలో శ్యామలను దగ్గరకు చేర్చుకోవటంలోనూ, పాకీదాని పిల్లవాడ్ని గొడ్ల క్రింద పడకుండా రక్షించటంలోనూ, మంత్రాయిని దగ్గరకు తీసుకోవటంలోనూ ఒక్క మానవులనే కాదు తన వద్దకు చేరిన కుక్కను, ఎద్దును, కోతిని, దోమను, చీమను దేనిని ప్రేమించలేదు? అన్నింటినీ ప్రేమానందంలో ముంచింది అమ్మ. అసలు నిజమైన, సహజమైన ప్రేమ అంటే అమ్మలాగా అద్వైత శిఖరాగ్రాన ఉండి లోకానికి ప్రేమను పంచటమేనేమో అనిపిస్తుంది.