అమ్మకు ప్రత్యేకించి ఒక మార్గమున్నదా! సర్వమార్గాలు తనవే నన్నది కదా! సర్వసమ్మతమైనదే నా మతం అన్నది కదా! సర్వసృష్టి తనదేనన్నది కదా? అమ్మకు ఒక పథమున్నదంటే ఇంకా ఇతరమతాలున్నట్లు అమ్మ పథము ప్రత్యేకించి వేరే ఒకటి ఉన్నట్లు అర్థం వస్తున్నది కదా! అంటే అక్కడే పప్పులో కాలేశారు. అమ్మ పథము సర్వసృష్టి ఆచరించే పథమే. ఈ సృష్టిలో సర్వజీవరాశిని సృష్టించినప్పుడే వాటికి తగిన ఆహారాన్ని సృష్టించిందా లేదా? ఏ జీవానికి తగిన ఆహారం వాటికి ఏర్పాటు చేసింది కదా!
అనలు సృష్టి చేయాలనుకున్నప్పుడు తానే రెండయింది కదా! తాను చైతన్యంగానో, ఆత్మగానో, బ్రహ్మము గానో ఉన్నప్పుడు ఈ సృష్టి లేదు. ఆహారము లేదు – తాను తానుగా ఒక రూపం ధరించినపుడు కదా! సృష్టి, ఆహారము అనే ప్రశ్న ఉత్పన్నమైనది.
ఆ చైతన్యమే ఆ అంతులేని అడ్డులేని, ఆది అంతము అయి, అన్నిటికీ ఆధారమైన స్థితికి, అనూయ లేని అనసూయగా అవతరించింది. అవతరించిన నాటి నుండి సర్వజీవకోటిని బిడ్డలుగా ప్రేమించింది, ప్రేమిస్తున్నది. అవతారంగా భౌతిక శరీరంలో ఉన్నప్పుడు, ఆనంతమైన ఆత్మశక్తిగా ఉన్నప్పుడూ అమ్మకు ఇదే తపన. అమ్మ అమ్మ కదా, బిడ్డల కడుపు నింపటమే తన ధర్మం కదా? ఆ తల్లి ధర్మాన్ని నెరవేర్చటమే అమ్మ వని. ఆహారం తనకు అవసరం లేకపోయినా బిడ్డల ఆహారం కోసం. తపించింది. లక్షమంది ఒకే వంక్తిని తిన్నా, ఒకరు తినకపోయినా తనకు బాధే అన్నది. అందుకే తన వద్దకు వచ్చినవారు తినివచ్చామన్నా కొద్దిగా ఆకలయినంత తినండి నాన్నా! అనేది. ప్రసాదంగా నయినా వారు తింటే అమ్మకు తృప్తి – నీ పూజేమిటంటే మిమ్మల్ని గూర్చి మీ ఆహారాన్ని గూర్చి ఆలోచించడమే నా పూజ అనేది. నాకూ ఆశ, అసంతృప్తి, ఉన్నయ్యనేది. మీకు ఇంకా బాగా పెట్టుకోవాలనే ఆశా, పెట్టుకోలేకపోతున్నాననే అసంతృప్తి అనేది.
అమ్మ బాల్యంలో బావట్ల బ్రహ్మాండం వారి సత్రంలో బిచ్చగాళ్ళంతా అడుక్కొని తెచ్చింది అందరూ కలుపుకొని భుజిస్తుంటే చూచి అ లా అందరూ సంపాదించింది అందరూ కలసి తినే నర్వులకూ స్వతంత్రమైన సత్రం కావాలనుకున్నది. దేవాలయం లేని ఊళ్లో దేవాలయం నిర్మించాలనుకున్నది. దానికి ప్రతి రూపంగానే జిల్లెళ్ళమూడి క్రొత్తల్లో 1946లోనే పిడికెడు బియ్యం పథకం ప్రవేశపెట్టి తన మార్గాన్ని తెలియజేసింది. అలా ప్రవేశపెట్టిందే నేటి నాన్నగారి గృహం అన్నపూర్ణాలయం. అమ్మ ఎప్పుడో ప్రారంభించిన ఆ మార్గం 1958 ఆగష్టు 15న రాజముద్ర వడ్డది. అన్నదమ్ములంతా కలసి ప్రారంభించిన యీ అన్నపూర్ణా లయాన్ని గూర్చి కదిలింది ఈ జగన్నాథ రథం ఆగదన్నది. అమ్మపథం ఆ రకంగా లోకానికి వెల్లడయింది. ఆదెమ్మగా ఆరంభించిన ఆ అమ్మరథం భౌతికంగా యీనాడు మన కళ్ళ ముందు దినదినాభివృద్ధి చెందింది. ఆకారం లేనప్పుడే ఇంకా ఎక్కువగా ఉపయోగపడుతున్నది.
అమ్మ జగన్నాథుడే కదా! నా కన్నా పురుషు డెవరురా? అన్నది. నిజమే మన శరీరమనే పురంలో ప్రతిష్ఠితుడై ఉన్న పురుషుడు అమ్మే కదా!
కృష్ణుని వద్దకు గోపికలంతా భర్తలను, పిల్లలను, ఇళ్ళను వదిలి వస్తుంటే స్వామి ఇలా వాళ్ళను వదిలి రావటం తప్పు కదా! అన్నాడు. దానికి గోపికలు నిజమే వాళ్ళను వదిలి రావటం ధర్మం కాదన్నావు కృష్ణా! పరమ పురుషుడవైన నిన్ను వదిలిపొమ్మనటం ధర్మమా? అని అడిగారు. ఆ పురుషులందరిని సృష్టించిన వరమ పురుషుడివి కదా! నీవు. అయినా మా శరీరం కాదు నీ వద్దకు మా ఆత్మలు సూక్ష్మరూవంలో వచ్చాయి, పరమాత్మగానం విని, దర్శించి, స్పర్శించి తరించటానికి. ఇది తప్పంటావా? అని అడిగారు.
నిజమే. అమ్మ జిల్లెళ్ళమూడి రావటమే పొందడం, రావటం ఎన్నడూ వృధాకాదు అన్నది. అందుకోసమే జిల్లెళ్ళమూడి సోదరీ సోదరులు గోపికలు లాగా మళ్ళీ మళ్లీ అమ్మ వద్దకు రావటం, అమ్మను విడిచి వెళ్ళలేని వారు స్థిరంగా అమ్మ సన్నిధిలోనే స్థిరపడటం. అమ్మ అనేది తనను వాళ్ళ ఇళ్ళకు, ఊళ్ళకు రమ్మన్నవారితో నేను రావటమేమిటి? మీరే తీసుకెళ్ళండి. మీ వద్దనే నన్ను నిలుపుకోండి -అని. నిజమే అమ్మచింతనలో అమ్మ భావనలో అమ్మ ఆచరించి చూపించిన పథంలో మనం అమ్మను మనసులోనే నిలుపుకొని ఉండగలిగితే అమ్మకు ఆరాధన, అమ్మకు అభిషేకం చేయటమే.
ఫిబ్రవరి 17 నాన్నగారు అమ్మలో కలిసిన రోజు. ఆయన అలా అమ్మను ఆరాధించారు. హైమా అంతే. అమ్మా! నీ వద్దకు వస్తున్నానంటూ అమ్మలో కలిసి పోయింది. నన్ను విడిచి నాన్నగారు లేరు అన్న అమ్మ వాక్కు నేను నీలోకే వస్తున్నానన్న హైమ వాక్కు మనకు మార్గదర్శనం అయింది.
నాన్నగారు అమ్మలో కలిసిన రోజే ధాన్యాభిషే కోత్సవం జరగటం యాదృచ్ఛికం కాదు. నాన్నగారి ఇల్లే మొదటి అన్నపూర్ణాలయం కదా! అందుకే, నాన్నగారి ఆరాధనోత్సవం రోజే ఆయన కిష్టమైన ధాన్యాభిషేకం ఏర్పాటు చేసింది. నాన్నగారు తనలో చేరిన నాటినుండే అభిషేకాలు రుద్రాభిషేకంతో ప్రారంభించింది. అ లాగే ధాన్యాభిషేకాలుగా పొడిగించింది. నాన్నగారికిష్టమైనది, అమ్మకు మార్గమైనది. నాన్నగారిమాటను జవదాటి ఎరుగదు కదా! ఆ యింటినే అందరిల్లు చేసింది. ఆ యింటినే అన్నపూర్ణాలయం చేసింది. అమ్మ సత్యమైన నిత్యమైన ఆ పథం జగన్నాథ రథమైంది.
నాన్నగారికిష్టమయిన, అమ్మ పథమైన యీ జగన్నాథ రధోత్సవంలో, ఫిబ్రవరి 17న మనమూ భాగస్వాములమై జగన్నాధ రధాన్ని మన ఓపిక కొద్దీ లాగటానికి, ధాన్యాభిషేకం చేయటానికీ సకుటుంబంగా పాల్గొని తరిద్దామా!