అమ్మను దైవంగా, అవతారమూర్తిగా, గురువుగా, ప్రవక్తగా, యోగేశ్వరిగా మనం ఆరాధిస్తున్నాం. అయినా, అమ్మ ఎవరు ? ఎందుకు వచ్చింది ? ఏమిటి ఈ అవతార పరమార్థం ? అమ్మ మనకు ఇచ్చే సందేశం ఏమిటి? అమ్మ మనకు ఎలాంటి శిక్షణ ఇస్తున్నది? అనే సందేహాలు మనల్ని వెన్నాడుతూనే ఉన్నాయి. మన ఊహలు, నమ్మకాలు ఎలా ఉన్నా అసలు అమ్మ ఏమి చెప్పింది ? తనను గురించి ఏమని పరిచయం చేసుకున్నది? అని ఆలోచిస్తే మనకు ఏమైనా సమాధానం దొరకవచ్చు. తనను గురించి తాను అమ్మ కొన్ని మాటలు చెప్పింది. ”తెలియనిది తెలియచెప్పటానికే నా రాక” అనే వాక్యం కూడా అలాంటి వాటిల్లో ఒకటి. అమ్మ అవతరణ పరమార్థాన్ని గురించి అమ్మే స్వయంగా ఇచ్చిన ఈ వివరణ గమనించదగినది.
మనకు తెలియనది ఏమిటి? అమ్మ ఏమి తెలియ చెప్పింది? ఎలా తెలియ చెప్పింది? అని పరిశీలిద్దాం.
”మనకు తెలియనిది ఏమిటి?” అని మనం ప్రశ్నించుకోగానే ”మనకి తెలిసింది ఏమున్నది కనుక?” అని నాకు అనిపిస్తోంది.
అమ్మ వాచ్యంగా చెప్పింది. ”నేను దైవాన్ని కాను; మీరు భక్తులు కారు. నేను గురువును కాను; మీరు శిష్యులు కారు. నేను అమ్మను; మీరు బిడ్డలు” – అని. అంతేనా! ”నేను అమ్మను. మీకు, మీకు, అందరికీ; పశు పక్ష్యాదులకు క్రిమికీటకాలకు కూడా” అని స్పష్టం చేసింది అమ్మ. కాకులకు గారె ముక్కలు అందించి పరవశించిన తల్లి, తన మంచం చుట్టూ కుక్కపిల్లలూ, పిల్లి పిల్లలూ మూగితే మురిసిపోయిన తల్లి అమ్మ. లలితాసహస్రంలో కనిపించే ‘ఆ బ్రహ్మకీటజనని’ జిల్లెళ్ళమూడిలో కొలువు తీరిందా! అనిపించక మానదు మనకు. పశుపక్ష్యాదులను, క్రిమి కీటకాలను ఇంతగా ప్రేమించటం, ఇలా లాలించటం మనకు తెలుసా? సాటి మానవుల విషయంలోనే మన ప్రేమ అంతంత మాత్రం కదా!
సృష్టిలోని మనం అందరం అమ్మ బిడ్డలమే అని, అన్నదమ్ములం, అక్కచెల్లెళ్ళం అని పరస్పర సహకారంతో సామరస్యంతో మనుగడ సాగించాలని మనకు తెలుసా? మనం ఆచరిస్తున్నామా?? అన్నవి శేష ప్రశ్నలే కదా!
”నాకు ఎవరిని చూసినా బిడ్డే అనిపిస్తుంది. నేనే మీ అందరినీ కని మీ మీ తల్లులకు పెంపుడిచ్చానని పిస్తుంది” అన్నది అమ్మ. ”బిడ్డల్ని కనటమే నా సాధన” అని కూడా అన్నది. ”నేనెపుడూ పచ్చి బాలెంతనురా” అని ప్రకటించిన ‘విశ్వసవిత్రి’ మన అమ్మ. మనం అందరం తన బిడ్డలమే కనుక అన్నదమ్ములమై, అక్కచెల్లెళ్ళమై ‘వసుధైక కుటుంబ’ భావనతో మెలగాలని మనకు ప్రబోధిస్తోంది అమ్మ. అందుకే తన నివాసానికి ‘అందరిల్లు’ అని నామకరణం చేసింది అమ్మ.
‘అందరిల్లు’ అనే పేరులోనే ఒక సందేశం దాగి ఉన్నదనిపిస్తుంది. ఎవరికి వారుగా కాక, మానవులందరూ ఒకరికి ఒకరుగా బ్రతకటం లక్ష్యంగా ఉన్న ప్రదేశం ‘అందరిల్లు’. దీన్నే భాగవతంలో ‘బృందావనం’ అన్నారు. ‘బృందాలు’గా ఏర్పడి ‘ఆవనం’ అంటే రక్షణ పొందటం ‘బృందావనం’. సమష్టిలో నుండి శక్తి ఆవిర్భవిస్తుందని మనకు తెలియచేయటానికే అమ్మ సామూహిక సాధనలను ప్రోత్సహించింది. ”వ్యక్తికి బహువచనం శక్తి” అంటారు ప్రజాకవి శ్రీశ్రీ.
”కారణమ్ములు చూడని కరుణ నీది
ప్రతి ఫలమ్మును కోరని వ్రతము నీది
ఎల్లరికి సొంతమగు ‘అందరిల్లు’ నీది
విశ్వజనయిత్రి నీకు వేవేల నతులు” – అని అమ్మకు ప్రణమిల్లుతున్నాను.
ఒకసారి అమ్మ వద్దకు ఒక జ్యోతిష శాస్త్రవేత్త వచ్చాడు. శాస్త్రాధ్యయనం పూర్తి చేసుకుని ఒక వ్యాసంగం ప్రారంభించాలని, మొదట అమ్మకు జాతకం చెప్పాలని అనుకున్నాడు అతడు. అమ్మ సన్నిధిలో కూర్చున్నాడు. అమ్మకు నమస్కరించి, తన అభిలాషను వ్యక్తం చేశాడు. ‘ఏదైనా అడుగమ్మా!’ అన్నాడు. మనం సాధారణంగా ఆరోగ్య సమస్యలో, ఆర్థిక సమస్యలో, పిల్లల చదువులు, ఉద్యోగాలు, పెళ్ళిళ్ళు ఇలాంటి వాటిని గురించో అడుగుతూ ఉంటాం. కానీ, అమ్మ ”ఈ ప్రపంచంలో ఆకలి బాధ లేకుండా పోయేరోజు ఎప్పుడు వస్తుంది నాన్నా!” అని అడిగింది. ఈ ప్రశ్నకు సమాధానం ఏ జ్యోతిష్య శాస్త్రజ్ఞుడు చెప్పగలడు ? అతడు కొంచెం తబ్బిబ్బుపడ్డాడు. అంతలో అతడికి ఒక ఆలోచన తట్టింది. అమ్మ తనను ఏమీ అడుగనక్కరలేకుండానే తానే అమ్మ జీవితంలో జరగబోయేవి చెప్తే సరిపోతుంది కదా! అనుకున్నాడు. ‘అమ్మా! నీరాశి ఏమిటి?’ అని అడిగాడు. తక్షణమే సమాధానం చెప్పింది అమ్మ. ”నా రాశి బియ్యపురాశి నాన్నా!” అని. ఆ జ్యోతిష్కుడు తెల్లబోయాడు. అమ్మ దీవెనలు అందుకుని సెలవు తీసుకున్నాడు.
సర్వకాల సర్వావస్థలలోను బిడ్డల ఆకలిని తీర్చాలనేదే అమ్మ తపన. ప్రపంచంలోని ప్రాణులందరూ తన బిడ్డలే కనుక ప్రపంచంలో ఆకలి బాధ లేకుండా పోవాలనే ఆరాటం అమ్మది. బిడ్డల ఆకలి తీర్చాలంటే తల్లికి కావలసింది బియ్యపురాశే కదా! అందుకని ”నా రాశి బియ్యపురాశి” అన్నది. సృష్టిలోని తల్లిదనం రాశీభూతమై అమ్మగా అవతరించిందని ఈ సన్నివేశం మనకు తెలియచేస్తుంది.
బిడ్డల ఆకలి తీర్చడాన్ని గురించే అన్నివేళలా అమ్మ ఆలోచన. ”లక్షమంది తిని వెళ్ళినా ఒక్కడు తినకుండా వెళితే బాధ” పడుతుంది అమ్మ. ”జిల్లెళ్ళమూడికి ఎవరైనా ఆకలితో రావచ్చును గాని, జిల్లెళ్ళమూడి నుండి ఎవరూ ఆకలితో తిరిగి వెళ్ళకూడదు” అన్నది అమ్మ. ఈ మాటల చాటున దాగిన అమ్మ ఆంతర్యాన్ని గమనిస్తే అమ్మతత్వమూ తెలుస్తుంది. అమ్మ మనకు ఇచ్చే సందేశమూ తెలుస్తుంది.
మాన్య సోదరులు శ్రీ ఎం.యస్.ఆర్. ఆంజనేయులు గారు మనందరికీ సుపరిచితులు. వారు తెనాలిలో ఉన్నతోద్యోగిగా బాధ్యతలు నిర్వహించారు. ఆ రోజుల్లో తమ ఇంటికి రావలసిందిగా ఒకసారి అమ్మను ఆహ్వానించారు. అమ్మ తెనాలి వెళ్ళింది. అమ్మ దర్శనం కోసం వేలసంఖ్యలో భక్తులు వస్తారని ఆంజనేయులు గారు తగిన ఏర్పాట్లు చేశారు. ఉదయం నుంచి రాత్రి వరకు జనం తీర్థప్రజగా వచ్చారు. పులిహోర, పెరుగన్నం మొదలైన ప్రసాదాలు సిద్ధం చేసి ఆంజనేయులు గారు అందరికీ పంచారు. వారి బంధుమిత్రులు, కుటుంబసభ్యులు, జిల్లెళ్ళమూడి సోదరులు అందరూ కార్యకర్తలుగా ఆంజనేయులు గారికి సహకరించారు. ఒక్క ఆంజనేయులు గారు మినహా అందరూ అమ్మ ప్రసాదం తీసుకున్నారు. కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత ఎంతో సంతృప్తిగా, కృతజ్ఞతాపూర్వకంగా ఆంజనేయులుగారు అమ్మకు ప్రణమిల్లారు. ”ప్రసాదం తిన్నావా నాన్నా!” అని అడిగింది అమ్మ. ”లేదమ్మా! నీ చేతి మీదుగా తీసుకోవాలనుకున్నాను” అంటూ దోసిలి పట్టారు ఆంజనేయులు గారు. అమ్మ ప్రసాదం పళ్ళికల వంక చూసింది. ఆశ్చర్యం! ఒక్క మెతుకు ప్రసాదమైనా అక్కడ మిగల్లేదు. తాటాకు బుట్టల్లో మధ్యలో అక్కడక్కడ చిక్కుకుని కనీసం నాలుగు మెతుకులైనా ఉండాలి కదా! అవి కూడా లేవు.
అప్పటికప్పుడు ఒక గుప్పెడు పులిహోరను సృష్టించటం అమ్మకు అసాధ్యమేమీ కాదు. సలసల కాగుతున్న పులుసు కళాయిలో చేయిపెట్టి, చెక్కు చెదరకుండా తన చేతిని బైటకు తీసి గుమ్మడికాయ ముక్క ఉడికిందో, లేదో చూసింది ఒకసారి అమ్మ. పొగాకు బేరన్‌లో అత్యధిక ఉష్ణోగ్రతలో రోజంతా ఉండిపోయి, సురక్షితంగా బైటకు వచ్చింది మరోసారి. అత్యల్ప సమయంలో అధిక సంఖ్యాకులకు వరుసగా ఉపదేశం పూర్తయ్యేటంత వరకు సూర్యోదయాన్ని ఆపింది అమ్మ. నూతన సంవత్సరం రెండు నిముషాలు ఆలస్యంగా వస్తే, శాస్త్రవేత్తల కంటే ముందుగానే గుర్తించింది అమ్మ. అగ్నిపరీక్షలను జయించిన అమ్మకు, కాలాన్ని శాసించగల అమ్మకు ఏదీ అసాధ్యం కాదు. అమ్మ సన్నిధిలో ఇలాంటి అద్భుతాలు ఎన్నో జరిగాయి. అమ్మ మహిమలు చేయదు. కాని అమ్మ సన్నిధిలో అవి జరిగాయి. మహిమలు ప్రదర్శించటం అమ్మ ఉద్దేశం కాదు. ”మంచిని మించిన మహిమలు లేవు” అని ప్రవచించిన అమ్మ ఒక మహత్తర సత్యాన్ని ఈ సందర్భంగా ప్రకటించాలనుకున్నదేమో.
ఆంజనేయులు గారి చేతిని తన చేతిలోకి తీసుకుంది. మృదువుగా నిమిరింది. ”ఇంతమందికి ప్రసాదం పెట్టావుగా నాన్నా! అలాంటి మనస్సు, ఆ అవకాశము నీకు నేనిచ్చే ప్రసాదం” అని ఆప్యాయంగా పలికింది అమ్మ.
ఎవరు ఎవరికి పెట్టినా అది పెట్టేవారి సంపద కాదని, అమ్మదేనని గుర్తించి మనం ధర్మకర్తలుగా వ్యవహరించాలని అమ్మ సందేశం. ఈ కర్తవ్యాన్ని మనకు ఎరుకపరచటానికే ఈ సన్నివేశాన్ని అమ్మ కల్పించు కున్నది. అంతేకాదు. పెట్టగలగటమే అమ్మ ప్రసాదం అని మనకు తెలియాలి.
ప్రసాదం అంటే పదార్థం కాదని, పరమార్థమని మనకు తెలియచేస్తోంది అమ్మ. అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని శ్రీకృష్ణుడు సమస్త ప్రపంచానికి గీతాప్రబోధం చేసినట్లుగా, ఈ సందర్భంలో ఆంజనేయులు గారిని నిమిత్తంగా చేసుకుని మనందరికీ ఆత్మీయసందేశం అనుగ్రహించింది అమ్మ.