అమ్మ ఎవరిని ఎప్పుడు ఏ విధముగా వాడుకుంటుందో ఎవరికి తెలియదు. ఒక అమ్మకు తప్ప. ఎందుకంటే భూతభవిష్యత్ వర్తమానాలు అన్నీ తెలిసినది ఆమే కనుక అసలు అన్నీ అయినది ఆమె కనుక. నాటక రంగంలో రచయిత, దర్శకుడు, నటుడు ఒకరే అయిన వారు తన పాత్రను తాను పోషిస్తూ, ఇతరుల చేత ఏలా నటింప చేస్తాడో అదే తంతు అమ్మది. ఒక ప్రణాళికా బద్ధంగా నడిపించటమే ఆశక్తి పని.
అలాటి ప్రణాళికలో భాగంగా జిల్లెళ్ళమూడి అందరింట్లో హరిదాసుగారు, కొమ్మూరు డాక్టరు గారు, యోగయ్యగారు, శేషగిరిరావుగారు, రామకృష్ణ, గోపాలకృష్ణ, లక్ష్మీనారాయణ, దినకర్ల లాగానే కొంతకాలం సోదరుడు పూర్ణచంద్రరావు కూడా సేవచేసుకొనే అదృష్టాన్ని పొందాడు.
సేవాయజ్ఞములోన అర్పణము చేసెన్ జీవితమ్మంతయున్
నీ వాత్సల్యము నమ్ముకొంచు గడిపెన్ నిత్యమ్ము సంసారమా
నీవే దిక్కని తామరాకుపయినన్ నీరైన చందంబునన్
జీవించెన్ మన పూర్ణచంద్రుడిక వచ్చెన్ నేడు నీచెంతకున్
అమ్మ జన్మించిన మన్నవలోనే తనబాల్యం గడిచింది. తండ్రి మద్దినేని లింగయ్య. తల్లి నాగరత్నమ్మ. వారికి ఇద్దరు ఆడపిల్లలు. ఇద్దరు మగపిల్లలు. పెద్దకుమారుడు పూర్ణచంద్రరావు. ఎలిమెంటరీ విద్య మన్నవలో జరిగినా, హైస్కూల్ విద్య తాడిపర్రులో జరిగింది. తరువాత కళాశాల విద్య, ఎ.యం.ఐ.ఇ. విద్యలు గుంటూరులో చదివి భారత వైమానికదళంలో కొంతకాలం ఇంజనీరుగా ఉద్యోగించాడు.
చిన్నతనంలోనే అంటే 1960-61 ప్రాంతంలోనే జిల్లెళ్ళమూడి రావటం నేను చూచాను. పూర్ణచంద్రరావు మన్నవ ప్రసాద్ – భట్టిప్రోలు సుబ్బారావు కలిసి మన్నవ నుండి జిల్లెళ్ళమూడి రావటం నేనెరుగుదును – తర్వాత చాలకాలం ఉద్యోగరీత్యా యీ ప్రాంతంలో లేకపోవటం వల్ల అమ్మ దగ్గరకు రావటం నేను గమనించలేదు.
అనుకోకుండా గుంటూరులో నేను పనిచేసే పాఠశాల బైట ఒకరోజు కనిపిస్తే పలకరించాను గుర్తుపట్టి – బహుశా 1980-81 సంవత్సరాలలో అనుకుంటా. అప్పటి నుండి మళ్ళీ తరచుగా జిల్లెళ్ళమూడి రావటం మొదలైంది. ఆ సమయంలోనే పూర్ణచంద్రరావు ఇన్సూరెన్సు కంపెనీ సర్వేయర్ గా గుంటూరు కేంద్రంగా పనిచేస్తున్నాడు – అతనికి M.D.A. 104 నెంబరు గల ఒక కారుండేది. జిల్లెళ్ళమూడికి తరచుగా దానిలోనే వస్తుండేవారం.
అందరింటికి కావలసిన వస్తువులు తెస్తుండేవాడు. అమ్మ కూడా కొన్ని చెప్పి చేయించిన సందర్భాలున్నాయి. అమ్మ వత్రోత్సవాల సమయంలో బాగా క్రియాశీలకంగా పనిచేశాడు. అమ్మ వద్దకు చీరెలు తెచ్చి ఇవ్వటం గమనిస్తుండే వాడిని. అమ్మ పుట్టినరోజు పండుగలకు సరుకులు అన్నపూర్ణాలయానికి తీసుకుని రావటం చూచాను. ఏ పనిచేసినా బయటకు కనిపించేవాడు కాడు. చేసినట్లుండేవాడు కాదు. ఏ యజ్ఞం చేయించినా కేశవశర్మకు బాధ్యత అప్పగించేవాడు. ఏ సభ జరిగినా, కార్యక్రమం జరిపినా నా కప్పచెప్పుతుండేవాడు.
1984లో అమ్మ రవిని ఒక సంవత్సరం తన కోసం జిల్లెళ్ళమూడిలో ఉండమని కోరింది, ఉన్నాడు. ఆ సమయంలో స్టేట్బాంక్ లో అప్పటి బాంక్ మేనేజర్ చేసిన అవకతవక పనికి హెడ్కాషియర్గా ఉద్యోగం చేస్తున్న ‘రవి’ని మాచర్ల బదిలీచేయటం జరిగింది. అప్పుడు మాచర్లలో షుమారు ఒక 40 రోజులున్నాడు రవి. అప్పుడు పూర్ణచంద్రరావు రవి అక్కడ ఉన్న ఆకాస్త సమయంలో 4, 5 సార్లు వెళ్ళి రవికి కావలసిన మానసిక బలం, అండదండలు ఇస్తూ నిలబడ్డాడు. ఆ తర్వాత హైదరాబాద్లో సుబ్బారావు అనారోగ్యంతో డయాలసిస్ చేస్తున్న సమయంలో కూడా తన వంతు సహకారాన్ని అందించాడు.
లలితాసహస్రంలో 110 మంది వచ్చే దేవతలను ఆయాస్థానాలలో ఉంచి పూజించే ఒక ప్రణాళికలో కూడా దానికి కావలసిన అన్ని సహాయ సహకారాలు కేశవశర్మకు అందించి తోడ్పడ్డాడు. ఒక ధనుర్మాసంలో, ముక్కోటికి ముతైయిదువలకు ఎందరికో చీరలు తెచ్చి పంచాడు.
అమ్మ ఆలయంలో చేరింతర్వాత కూడా జిల్లెళ్ళమూడికి తన చేతయినంత ఆర్థికవనరులు చేకూరుస్తుంటే, తన సంపాదనంతా జిల్లెళ్ళమూడిలోనే ధారపోస్తున్నాడని ఇంట్లో వారు బాధపడ్డా లెక్కించలేదు.
అమ్మ సేవలో ఏ ఆర్భాటాలు లేకుండా సేవసల్పిన సజ్జనుడు పూర్ణచంద్రరావు – 1985 తర్వాత సంస్థలో కొంత అస్తవ్యస్తపరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ సమయంలో న్యాయశాఖ జోక్యం చేసుకొని సయోధ్యగా 1999లో ఒక ముగ్గురు సభ్యులతో ఒక పాలనా విభాగాన్ని ఏర్పాటు చేసింది. నాదెండ్ల లక్ష్మణరావు, వల్లూరి పాండురంగా రావు, మద్దినేని పూర్ణచంద్రరావులతో. అందులో పూర్ణచంద్రరావు కార్యదర్శి. ఆ కమిటీ 2002 దాకా తమ కార్యక్రమాలు సమర్థవంతంగా నిర్వహించింది. ఆ సమయంలో కూడా పూర్ణచంద్రరావు హైమాలయ పాలరాతి విగ్రహప్రతిష్ఠా కార్యక్రమంలో క్రియాశీలక పాత్ర నిర్వహించాడు. ఆ విగ్రహ నిర్మాణంలో 2 నెలలు జైపూర్లో ఉన్నాడు. మమ్మల్నందరిని కూడా ఆ విగ్రహాన్ని తీర్చిదిద్దడంలో సలహాల కోసం తీసుకెళ్ళాడు. అందరి సహాయ సహకారాలతో కేశవశర్మ గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం సర్వాంగ సుందరంగా ఈనాటి హైమాలయం రూపాన్ని తీర్చిదిద్దుకుని 2002 ఏప్రిల్ 24 ప్రతిష్ఠా కార్యక్రమం పూర్తిచేసుకొంది. హైమాలయ కార్యక్రమ యజ్ఞసమయంలోనే పూర్ణచంద్రరావు గారి కుమారుడు హరగోపాల్ బి.టెక్ పాసై ఇంకా ఉన్నత విద్య కోసం అమెరికాలో ఉన్నవాడు అకస్మాత్తుగా అర్థాంతరంగా పిన్నవయసులో అమ్మలో లీనమైనాడు. అయినా మనోనిబ్బరంతో ఆ యజ్ఞాన్ని ఒక యోగిలా నిర్వహించటం చెప్పుకోతగ్గ విషయం. అదే సమయంలో శ్రీ కులపతిగారి అంబికా సాహస్రిని పునర్ముద్రించాడు. టి.టి.డి. కళ్యాణమంటపం కూడా ఇతని హయాంలోనే నిర్వహణ బాధ్యత మనకప్పగించ టానికి కృషి చేశాడు. అతని నిర్వహణ కాలంలోనే వంటయింటి వెనుకవైపు ఎక్స్టెన్షన్, సుందరరామిరెడ్డి గారు స్టోర్స్ కట్టించడం కూడా జరిగి అన్నపూర్ణాలయ అభివృద్ధి జరిగింది.
1998లో అమ్మకు 75 సంవత్సరాలు నిండిన సందర్భంలో కూడా “అమృతోత్సవకమిటీ” కన్వీనర్ ఉత్సవాన్ని మహాద్భుతంగా నిర్వహించాడు. అమ్మ అనారోగ్యంతో జిల్లెళ్ళమూడిలో భౌతికంగా ఉన్న చివరి సమయంలో సమయానికి మందులు తీసుకొని రావలసి వస్తే అతని M.D.A.104 కారే ఉపయోగింపబడింది.
గుంటూరులో మాతృశ్రీ అధ్యయనపరిషత్ ఉపాధ్యక్షునిగా, అధ్యక్షునిగా కొంతకాలం ఆర్థికంగా, హార్ధికంగా సేవించాడు. 2001 లో గుండెకు ఆపరేషన్ చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. హైదరాబాద్లో సోదరి ఇంట్లో ఉండి చేయించుకున్నాడు. ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న సమయంలో సోదరుడు జేమ్స్ కాంపియన్ అవసరానికి కావలసిన సహాయం అందించాడు. పూర్ణచంద్రరావు చెల్లెలు కూడా ఒక డాక్టరు నర్సరావుపేటలో ఉండగా నేను కూడా వెళ్ళాను వాళ్ళింటికి.
అమ్మ కుటుంబం అంటే పూర్ణచంద్రరావుకు ఎంతో ఇష్టం. అందులో రవి కుటుంబంతో బాగా సన్నిహితంగా ఉండేవాడు. రవి బాధ తన బాధగా భావించేవాడు. గుంటూరులో రామరాజు కృష్ణమూర్తితో నాతోనూ ఎంతో అనుబంధం కలిగి ఉన్నాడు. నేను ఇల్లు కొనుక్కున్న సమయంలో అడగకుండానే తాత్కాలికంగా సహాయం అందించాడు. ఆ తర్వాత అతని కుమార్తె వివాహ సందర్భంలో నేను అడగకుండానే అలాగే తాత్కాలిక సాయం చేశాను. మాయిళ్ళలో ఒక మనిషిగా మసలేవాడు.
భార్య శ్రీమతి విజయలక్ష్మి ఇతని ఆరోగ్యం పట్ల, విచ్చలవిడిగా చేసే ఖర్చు పట్ల కొంత బాధపడుతుండేది. అయితే పిల్లల విద్య పట్ల లోటు లేకుండానే జాగత్త పడ్డాడనుకుంటాను. కుమార్తెను వైద్య విద్య చదివించి అల్లునిగా కూడా ఒక డాక్టర్నే తెచ్చి చేశాడు. వారిప్పుడు పిడుగురాళ్ళలో ఒక క్లినిక్ నిర్వహిస్తున్నారు.
పూర్ణచంద్రరావు చివరి రోజులలో 4 నెలలపై చిల్కు జిల్లెళ్ళమూడిలో అందరింటి ఆవరణలోనే కుమారి నందమూరి వెంకటరమణ ఆదరణలో అమ్మను హైమను ధ్యానిస్తూ కాలం గడిపాడు. 2014లో నడుములు నొప్పి పుట్టటం ప్రారంభమైంది. 2016లో స్పైనల్కార్డు ఆపరేషన్ జరిగింది. కాని బాగుకాలేదు. దాదాపు ఆరు సంవత్సరాలు పడక కుర్చీకి మంచానికే పరిమితమైనాడు. చివరలో మెడ కూడా నిలువలేని పరిస్థితి వచ్చింది. చివరి నాలుగు నెలలలో హైమతో, అమ్మతో మనస్సులోనే సంభాషిస్తూ కాలం గడిపేవాడు. అమ్మ 9 సంవత్సరాల బాలగా కనిపించింది. మహాపరి నిర్వాణానికి ఒక వారం ముందు పూర్ణచంద్రరావు కుమార్తె డాక్టర్ సునీత కారు పంపి తండ్రిని తెప్పిచ్చింది పిడుగురాళ్ళకు. 30.7.2021న ఈ బాధల నుండి 77 ఏళ్ళ వయస్సులో విముక్తుడై అమ్మలో ఐక్యమైనాడు.
అమ్మా! పూర్ణచంద్రరావు
“నీ దరికి వచ్చి-వచ్చిన
దేదయినన్ నీదు సేవ నెసగగ నెంచెన్
మోదమ్మందెనొ – వేదన
చేదుకొనెనొ తుదకు నీదు చెంతకె చేరెన్”
ధన్యుడు.