“ఉత్పత్తిం ప్రళయంచైవ భూతానామాగతిం గతిమ్ |
వేత్తి విద్యామవిద్యాంచ సవాచ్యో భగవానితి॥”
అంటే భూతముల ఉత్పత్తి, ప్రళయము, గమన ఆగమనములు, విద్య, అవిద్యలను ఎవడు ఎరుగునో అతడు భగవాన్. (విష్ణుపురాణం)
విష్ణుపురాణంలో నిర్వచించినట్లు భగవాన్ షడ్గుణైశ్వర్య సంపన్న అమ్మ. “నా సంకల్పంతో మీరు జన్మ ఎత్తి నాలోనే లయమవుతారు” అనే అమ్మ వాక్యాన్ని తరచి చూస్తే ఆ ఆరుగుణాలు అమ్మలో దీపించే వైనం సుబోధకమవుతుంది.
కాగా, అమ్మ అంటే ఇది – ఇదే అని చెప్పటం అసాధ్యం. అటువంటి అమ్మ దరిచేరాలంటే, దివ్యదర్శన భాగ్యం పొందాలంటే అందరింటి భవనంలో మనం భౌతికంగా రెండు అంతస్తుల మెట్లు ఎక్కాల్సి వచ్చేది. అమ్మ 3వ అంతస్తులో ఆ మూల సౌధంబులో -ఉంటుంది. తత్త్వతః ఆ సోపాన సముదాయద్వయంలో ఒకటి నాన్నగారు, రెండవది హైమక్కయ్య.
1) నేలమీద నుండి రెండవ అంతస్తుకు చేర్చే మహనీయ మూర్తి నాన్నగారు : శ్రీ నాన్నగారు అమ్మకు పతిదేవులు. అమ్మ వాత్సల్యం సుస్పష్టం. కాగా నాన్నగారి ఆప్యాయత, ఆత్మీయత బహుధా అవ్యక్తం. నాన్నగారి అనుమతితోనే మనం మొదటి అంతస్తు మెట్లు ఎక్కగలం. ఆ మెట్లన్నీ వారి విశ్వజనీన వాత్సల్యం, ప్రేమ, ఆదరణ, నిరాడంబ రత్వం, అలౌకికత్వం. తిన్నగా వెళ్ళి అమ్మతో ఏదైనా విషయం ప్రస్తావన చేస్తే, అమ్మ అంటుంది. “ముందు నాన్నగారికి చెప్పండి” అని. సరేనని నాన్నగారి దగ్గరకి వెళ్ళి విషయప్రస్తావన చేస్తే “సరే గానీ, మీ అమ్మగారికి చెప్పారా?” అని అడుగుతారు. ముందుగా ఎవరికి చెప్పాలి? ఎవరికి చెప్పినా ఒకటే. వారు ఉభయులు శివశక్యైక్యస్వరూపం. అమ్మ సకల సంకల్పాలకీ దన్ను నాన్నగారే. నాన్నగారి ఆశీస్సులతో ప్రారంభమైన ఏ కార్యక్రమమైనా దిగ్విజయంగా సాగుతుంది. కనుక ముందుగా నాన్నగారికి చెప్పటం మన ధర్మం. నాన్నగారి గురించి మనకి తెలియజేస్తూ ఒక సందర్భంలో వారు ఆదిశివుని లక్షణం, అది సోమశేఖరతత్త్వం అన్నది; మరొక సందర్భంలో వారు నాగేంద్రులని, నాగేంద్రుడంటే మన వెన్నంటి కాపాడేదేనని అన్నది. తొలి రోజుల్లో అమ్మ దర్శనార్థం వచ్చే వారందరికీ అందరిల్లు, అన్నపూర్ణా లయం శ్రీ నాన్నగారి ఇల్లే. వారికి ఉన్నంతలో వచ్చిన వారికి ఆదరంగా తగిన సౌకర్యాలు కలిగించారు.
నాన్నగారు విశ్వకుటుంబ యజమాని, జగత్పిత. అందరింటి సోదరీ సోదరులకు అమ్మ ఒక పిలుపు నిచ్చింది- “వేర్వేరు కుంపట్లు వద్దు. అందరూ వచ్చి అన్నపూర్ణాలయంలో భోజనం చేయండి” అని. దానికి నాన్నగారు స్పందించి అనుదినం స్వయంగా తమ కంచము, గ్లాసు తీసుకొని అన్నపూర్ణాలయంలో భోజనం చేసేవారు.
2) రెండవ అంతస్తు నుండి 3వ అంతస్తుకు చేర్చేది హైమక్కయ్య:
మనమంతా ఒకే తల్లి పిల్లలం, మన తల్లి అనసూయమ్మ -అనే తాత్పర్యంతో ‘అన్నయ్యా!’, ‘అక్కయ్యా!’ అనే ఆప్యాయత నిండిన పిలుపుతో అమ్మత్వాన్ని ముందుగానే ఆవిష్కరించేది. మహనీయ మధుర ఏకోదర బాంధవ్య లక్షణం, తత్వం హైమక్కయ్యను చూసి నేర్చుకోవాలి. ఆ పిలుపులో, ఆ ఆదరణలోనే కరిగిపోతారు. హైమక్కయ్య కమనీయ సంబోధనలో ‘Sisters and Brothers of America!’ అన్న వివేకానందుని కంఠస్వరం వీనులవిందుగా వినిపిస్తుంది.
అమ్మ దర్శనార్థం వచ్చిన సోదరీ సోదరులను చూసి ఆనందంతో కేరింతలు కొట్టేది. వారు తిరిగి వెళ్ళిపోతూంటే మళ్ళీ ఎప్పుడు వస్తారో చూస్తానో అని దిగులు పడేది. ఎవరికి ఏ బాధ కలిగినా తనకి కలిగినట్లే గిలగిల లాడేది; అమ్మ పాదాలు పట్టుకుని కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ‘అన్నయ్యను బ్రతికించు! అక్కయ్యను ఒడ్డుకు ఎక్కించు!” అని దుఃఖించేది, అమ్మను ప్రార్థించేది, అమ్మతో పోట్లాడేది. అమ్మనామం నిరంతరం వినిపించాలని కోరేది. నిజం ఏమంటే హైమ అంటే – కరుణ, ప్రేమ, మమకారం, రాగం, త్యాగం, తపస్సు, ఉపాసన, మార్గం, గమ్యం, అమ్మతత్వానికి ప్రతిరూపం. హైమక్కయ్యను అర్థం చేసుకుంటే పారమార్థిక చింతన, విశ్వశ్రేయః కామన, పరహితార్థ తపన… వంటి లోకోత్తర కళ్యాణ గుణవైభవం కళ్ళముందు సాక్షాత్కరిస్తుంది.
3) ఇక మూడవ అంతస్తులో అమ్మదర్శనం. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాన్ని అధిగమించి, ఆనందమయకోశంలో అడుగు పెట్టడం. అమ్మ దర్శనం సర్వార్థదాయకం; సాలోక్య, సామీప్య, సారూప్య, సాయుజ్య రూప చతుర్విధ మోక్షప్రాప్తి. కొద్దిగా వివరిస్తాను- ఒక్క కోణంలోంచి మాత్రమే.
25-7-65న బాపట్ల ఆర్ట్స్ కాలేజి, ప్రిన్సిపాల్, శ్రీ వేదాంతం రామచంద్రరావు అమ్మ దర్శనార్థం వచ్చారు. వారి అబ్బాయిని అమ్మ దగ్గరకు పిలిచి, ముద్దు పెట్టుకొని అడిగింది ‘ఎవరబ్బాయివి?’ అని. వెంటనే ఆ చిరంజీవి ‘ప్రిన్సిపాల్ గారి అబ్బాయిని’ అన్నాడు. తక్షణం తడుముకోకుండా అత్యంత సహజంగా చిరునవ్వుతో అమ్మ, “మా అబ్బాయివి కాదూ?” అని అడిగింది. శాయమ్మగారితో చెప్పి గోధుమపిండితో చేసిన గవ్వలు తెప్పించి అందరికీ పెట్టింది. అంతలో నల్లకుక్క ఒకటి అమ్మ మంచం దగ్గరకు వచ్చింది. ఎవరో దానిని కొట్టబోగా అమ్మ “పోదు. అదీ అమ్మను వదిలి పోనంటుంది. వద్దులే, కొట్టబోకు, పడుకోనీ” అని అంటూండగా అది వెళ్ళి అమ్మ మంచం క్రింద దూరి పడుకున్నది.
తొలిసారి సోదరి మన్నవ సుబ్బలక్ష్మి జిల్లెళ్ళమూడి వచ్చారు. అప్పటికి వాళ్ళ నాన్నగారు. లేకపోవటంతో తల్లిని తన వద్దే ఉంచుకుని చూసుకుంటున్నది. మమకార అమృతరసోదధి అమ్మ. ఆమెను దగ్గర తీసుకుని “నువ్వు ఇక్కడ ఉండిపో” అన్నది. ఆమె కంగారుపడిపోయి “అమ్మో! నేను ఇక్కడ ఉంటే ఎలా? మా అమ్మ దిగులు పడుతుంది” అన్నది. వెంటనే అమ్మ, ఎప్పటిలాగే, “నేను నీ అమ్మను కానా?” అని
– శ్రీ విఠాల రామచంద్రమూర్తి గారి భార్య శ్రీమతి. శేషారత్నం 16 ఏళ్ళ వయస్సులో వివాహమై కాపురానికి వచ్చారు. ఆమె కన్నతల్లి వారి 12న ఏటనే దూరమైంది. శాశ్వతంగా. ఆమె తొలిసారి అమ్మ దర్శనార్థం వచ్చారు. సానుభూతితో శ్రీ రామకృష్ణ అన్నయ్య “అమ్మా! శేషు తల్లి లేని పిల్ల” అన్నాడు. అపుడు అమ్మ సోదరి శేషారత్నం గారిని దగ్గరకు తీసుకుని “నేను నీకు అమ్మని. నువ్వు నాకు హైమవు. అమ్మ లేదని ఎప్పుడూ అనుకోకమ్మా” – అన్నది.
అలా అమ్మ కొందరినే కన్నబిడ్డలుగా ప్రేమించిందా? కానే కాదు. అందరినీ అలాగే ప్రేమించింది, ఆదరించింది. అసలు విషయం, విశేషం ఏమంటే – అమ్మ మనల్నందరినీ తన కన్నబిడ్డలకన్న మిన్నగా ప్రేమించింది.
ఆ రహస్యాన్ని తెలియజేస్తూ శ్రీ బృందావనం. రంగాచార్యులు గారు –
“ఈ పరమార్థమేమొ వచియింపుము – నీకడుపారగన్న ఆ పాపలకన్న మిన్నగ నపారకృపన్ మము బోంట్ల పట్ల నీ వేపగిదిన్ వహించెదవొ!” అని ఆశ్చర్య ఆనందాల నడుమ అమ్మ దివ్యవాత్సల్యతత్వానికి భాష్యం చెప్పారు.
మధుర మమతామృతమూర్తులైన అమ్మ, నాన్నగారు, హైమక్కయ్య శ్రీ చరణాలకు సభక్తికంగా సాష్టాంగ నమస్కారములు ఆచరిస్తున్నాను.