1. Home
  2. Articles
  3. Viswajanani
  4. సంపాదకీయము..(యోగము – భోగము)

సంపాదకీయము..(యోగము – భోగము)

P S R Anjaneya Prasad
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : March
Issue Number : 8
Year : 2022

అన్ని విధాల కలిసి వస్తున్నవాడ్ని చూచి వీడు యోగపురుషుడురా అంటుంటాం. వీడికి అదృష్టయోగం పట్టిందిరా అంటాం. అపూర్వ వస్తుప్రాప్తి కలిగితే యోగము అంటాము. దైవయోగము, హఠయోగము, ధ్యానయోగము మొదలైనవి కూడా యోగాలనే తెలుస్తున్నది. అధ్యాత్మయోగము, సారస్వత యోగము అని కూడా అప్పుడప్పుడు వింటుంటాం.

వీటన్నింటిని బట్టి చూస్తుంటే కలయికే యోగము అనిపిస్తున్నది. దేని కలయిక. తాను భగవంతుని కన్నా వేరు కాదు అని తెలుసుకొని ఆ తెలివితో కలిసిపోవటం. అమ్మ యోగాన్ని గూర్చి చెపుతూ “యోగం యౌవనం లాంటిది. నాకు స్వాధీనం కానిదేమిటి?” అంటుంది అన్నది. యోగాభ్యాసం చేసేవారికి అమ్మ సలహా చెపుతూ ఆహార నియమాలేమీ అవసరం లేదు నాన్నా! మనసును నిలపటమే. మనసుకూ ఆహారానికి సంబంధం లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసాలే ప్రధానం. నన్ను నీవు కలుపు కోమని పైకి వెళ్ళినదే ఉచ్ఛ్వాస. బ్రహ్మస్వరూపం- క్రిందకు దిగిందే నిశ్వాసం మానవ రూపం. ఏ యోగం చేసినా భక్తే-భక్తి, యోగము, జ్ఞానమూ ఒక దాన్ని విడిచి ఒకటి ఉండవు. సర్వత్రా ఉన్నదాని మీద దృష్టి నిలుపలేవు గనుక ఒక గుర్తు పెట్టుకోవటం దేవుడనీ, కనుబొమల మధ్య అనీ, లక్ష్యం ఒక చోటు పెట్టుకుంటే మనస్సు నిలబడుతుందని. అక్కడే శక్తి ఉన్నదని కాదు సర్వత్రా ఉన్నది. “శ్వాస ఆగి కూడా బ్రతుకవచ్చు. ప్రాణమంటే శ్వాసకాదు. అవయవాలకే మనస్సు కట్టుబడేది ప్రాణాయామం. మనస్సు చేత అవయవాలు కట్టుబడేది భక్తి. దాన్నే భక్తియోగం అంటాం” అన్నది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు కర్మయోగము, జ్ఞాన యోగము, కర్మసన్యాస యోగము, ధ్యానయోగము, జ్ఞానవిజ్ఞాన యోగము, అక్షర పరబ్రహ్మయోగము, రాజవిద్యారాజగుహ్యయోగము, విభూతియోగము, విశ్వరూప సందర్శన యోగము, భక్తియోగము, క్షేత్రక్షేత్రజ్ఞ విభాగ యోగము, గుణత్రయ విభాగయోగము, పురుషోత్తమ ప్రాప్తియోగము, దైవాసుర సంపద్విభాగ యోగము, శ్రద్ధాత్రయ విభాగ యోగము, మోక్షసన్యాస యోగము అని 18 విధాల యోగాన్ని గూర్చి చెప్పాడు.

అనుభవయోగం వల్ల జ్ఞానం వస్తుంది. అనుభవించినా జ్ఞానం రాని వాళ్ళున్నారు కదా అంటే అమ్మ అక్కరలేదునాన్నా! సాధనతో పనిలేదు “పాతవారు ఏడుస్తూ నా వెంటబడతారు. క్రొత్తవాళ్ళను నేను వెతుక్కుంటాను. నాకవసరమైన వాళ్ళను లాక్కుంటాను” అన్నది అమ్మ.

ఎవడైనా కర్మలను కార్యదర్శిగాని, కోశాధికారి కానీ, “ఏ బాధ్యతలో ఉన్నా, నాపసుకునే చేస్తాడు. నాదను కోకపోతే ఎవడూ ఏ పనీ చేయలేడు. అ లా అనుకోవడం లోనే పనిమీద మమకారబంధం ఏర్పడుతుంది. దానివల్లనే రాగద్వేషా లేర్పడతాయి. శ్రీరాముడికి ప్రేమకారణంగా సీత ఎంతబంధమైందో, ద్వేషం కారణంగా రావణుడూ అంతే బంధమైనాడు. ఇంకా కాస్త ఎక్కువైనాడు. సీతనైనా వదిలాడు కాని రాముడు రావణాసురుని వదిలి ఊరుకోలేదు. అందుకే అమ్మ సర్వమూ తనదే అనుకున్నప్పుడు సుఖమూ తనదే దుఃఖమూ తనదే అంటుంది అటువంటి ద్వంద్వా తీతుడైనవాడికి బంధం ఉండదు. కర్మయోగం, కర్మసన్యాసయోగం రెండూ ఒకటే అటువంటివాడికి. అ లాంటి యోగాన్ని మనకు నేర్పటానికి నిలచింది అమ్మ. ప్రతిఫలాపేక్ష లేకుండా నిష్కామంగా తన బాధ్యతను నిర్వహించేవాడికి జ్ఞాని యేమి పొందుతాడో ఆ ఫలితమే సిద్ధిస్తుంది. అమ్మ దృష్టిలో “లౌకికము ఆధ్యాత్మికము అని రెండు లేవు. ఉన్నదంతా అదే” అన్ని క్రియలూ, అన్ని సంకల్పాలూ, అన్నిరూపాలూ, అన్ని నామాలూ వాడివే లోక కల్యాణం కోసం ఏవని నిర్వహించినా, బాధ్యతలో ఉన్నా వాటి ఫలితాలు వాడికేమీ అంటుకోవు. మీరంతా పుట్టింది ఇక్కడే. మీ తల్లులకు పెంపుడిచ్చాను. మీరంతా పరమాత్మ స్వరూపులే” అని అమ్మ అనటంలో ఇక్కడి కర్మక్షేత్రంలో పనిచేసే వారికి పూర్తిగా వర్తిస్తాయి. “మనం చేస్తున్నాం అనుకుంటాం. ఏ శక్తి ఆధారంగా మనం చేయ గలుగుతున్నామో అది మరచిపోతాం. మార్గాన నడచినా వాడే నడిపిస్తున్నాడనుకోవటమే సన్మార్గం” అని అమ్మ స్పష్టంగా చెప్పింది. తనువు, మనసు, బుద్ధి ఒకే విధంగా ఉంచుకుంటూ నిస్సంగులై బాధ్యత నిర్వర్తించే వారే యోగులు.

లక్షాధికారికి లక్షల మీద బెంగ. భిక్షాధికారికి భిక్షలేదని బెంగ. మనస్సులో శాంతి లేనివానికి స్వర్గానికి వెళ్ళినా సుఖం ఉండదు. మానసిక శాంతి కావాలంటే తృప్తి కావాలి. ‘తృప్తే ముక్తి’ అన్నది అమ్మ. అది యోగియైన వానికే ఉంటుంది. అమ్మ తనబిడ్డలకు ఆ యోగాన్ని అంత తేలికగా అలవోకగా అందించింది.

ఫలితాన్ని ఆశించకుండా బాధ్యత నిర్వహించే వాడు సంసారంలో ఉంటూ కూడా తృప్తిని పొందగలడు. అతడే నిజమైన యోగి. ఏ పనీచేయకుండా ఉండే నిష్క్రియుడికి ఎన్నడూ శాంతి కలుగదు. శరీరాన్ని విడిచి మనస్సు, మనస్సుని విడిచి శరీరమూ లేదు. సంకల్ప చిత్త స్వభావాన్ని విడువకుండా యోగికాలేరు. సర్వ సంకల్పాలు వదిలినది, సర్వసంకల్పాలు తానయినది అమ్మ మాత్రమే కనిపిస్తున్నది. “కౌపీన సంరక్షణార్థం అయం పటాటోపః” అని సంసారాన్ని వదిలిన వారిలో ఎంతమంది యోగులౌతున్నారో చెప్పటం కష్టం. చివరకు పంచభూతాలలో కలిసే “శరీరం కూడా ఆత్మే” అన్నది అమ్మ. అమ్మకు అందరూ సమానులే. అందరికీ పెట్టడం సమానమే. పంచడంలో తేడా ఉండవచ్చు. ఎవరికి ఎంతకావాలో, ఏది కావాలో తెలిసికొని పెడుతుంది. సంకల్పాలు కోరికలు జయించినవాడే యోగి. అమ్మ యోగీశ్వరేశ్వరి. ఒక తాంతియాటోపే, ఒక భగత్ సింగ్, ఒక క్రీస్తు కానీయండి, చనిపోయేటప్పుడు అబ్బ అమ్మ అనకుండా ప్రాణాలర్పించారు.

శీతోష్ణ సుఖదుఃఖాలలో శాంతంగా ఉండేవారే పరమాత్మశక్తి వరించి నిజమైన యోగులైనారు. అమ్మ సిద్ధాంతంలో మంచీ, చెడూ భగవంతుడివే. ప్రకృతికీ దానిమార్పులకూ తేడా లేదు. అమ్మకు అంతా వర్తమానమే, భూత భవిష్యత్తులు లేవు. యోగసాధనకు ఆహారనియమాలు, అక్కరలేదు. యోగానుభవం సాకారమైనదే అమ్మ. “రెండు లేనివాడు రెండు అయినవాడు భగవంతుడు” అన్నది అమ్మ.

చంచల స్వభావులమైన మానవులం అమ్మను ఆరాధించటానికి అచంచలంగా మనస్సును ఉంచటం ఎట్లా? అంటే అమ్మ చెప్పారు “చపలాయై నమః చంచలాయై సమః” అంటున్నారుగా. చంచలస్వరూపంగా ఉన్న అమ్మ అచంచలంగా చేసుకొంటుంది. నువ్వేమీ చేయవద్దు. ఆ దైవం ఏం చేయిస్తే అది చెయ్యి” అని. భజన కీర్తనలు హృదయంతో, ఆవేశంతో పాడితే ఎదుటివాళ్ళను కదిలిస్తుంది. నిత్యనూతనంగా ఉంటుంది. అభ్యాసం అంటే నిత్యసూతనం. రోకలి దంపు కాదు. అటువంటి దానినే అభ్యాసయోగం, అనుభూతి యోగం అంటారు” అన్నది అమ్మ. ఇలా చెప్పుకుంటూ పోతే యోగము. యోగిని గూర్చి ఎంతైన అమ్మ చెప్పిన విషయాలు తెలుసుకోవచ్చు.

భోగము అంటే సుఖము, ధనము. భోగం అంటే అనుభవము. పాము యొక్క పడగ అని కూడా అర్థం ఉన్నది. ఏతావాతా కనిపించింది ఈ సుఖము, ధనము అనుభవిస్తే పాము పడగన ఉన్నట్టేనేమో! ఈ భోగశబ్దము భగము నుండి వచ్చిందేమో అనిపిస్తుంది. భగము అంటే జ్ఞానము, వైరాగ్యము కలవాడు. విద్య అవిద్య తెలిసిన వాడు భగవాసుడు. ఈ పై లక్షణాలు తెలుసుకుంటే భోగము అబ్బుతుంది. నా కనిపిస్తుంది “భ” అంటే కాంతి. “గము” అంటే ప్రయాణించేది. గమించేది. ఏ కాంతి నుండి అంటే ఆత్మ కాంతి నుండి. జ్ఞానం కాంతి నుండి అనిపిస్తుంది. భగము అంటే యోని అనే అర్థం కూడా ఉన్నది. మనమంతా విశ్వయోని నుండి వచ్చినవారమే. మనం పొందుతున్న భోగాలు భోగాలు కావు, పాము పడగన పొందే మృత్యుభయాలు – నిజమైన యోగి వీని తేడా తెలుసుకొని నిత్యమైన శక్తివంతుడౌతాడు. అతడు నిజమైన భోగి. అతడే నిజమైన యోగి.

ఇలా యోగభోగాలను గూర్చి విచికిత్స చేసుకుంటూ పోతే ఎన్నో సంగతులు మనకు, మన మనస్సుకు సరియైన గతిని చూపిస్తాయి అమ్మచరిత్రలో.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!