” పరిత్రాణయ సాధూనాం 66
వినాశాయచ దుష్కృతామ్
ధర్మ సంస్థాపనార్థాయ
సంభవామి యుగేయుగే”
ప్లవ ముక్కోటినాడు జిల్లెళ్లమూడి వెళ్ళాను. తెల్లవారు ఝామున లేచి స్నానాదికములు పూర్తిచేసుకుని కాలినడకన బయలు దేరాను. అప్పటికీ ‘అమ్మ’ను చూసి రెండు నెలల పైగా అయింది. అందు వలన మనసుపడే తహతహచూచి సానుభూతితో కాళ్ళుకూడా గబ గబా సాగినాయి. ఒక్క గంటలో అక్కడకు చేరాను.
మాతృ మందిరం ముందున్న ఖాళీస్థలంలో జనం బారులుతీరి కూర్చున్నారు. మూడువందల ముఖాలపై వెలిగే ఏవో అనిర్వచనీయ మయిన ఆనందానుభూతులతో కూడిన దరహాసాల వెలుగుతో ఆపుణ్యస్థలి మరింత పునీతమై వెలుగొందుతోంది. వాళ్ళందరికీ ఒక చివరగా తూర్పున నేలకు అర్థగజం ఎత్తుననున్న ఒక సరివిక మీద “అమ్మ” కూర్చుని ఉన్నది.
లీలామానుషవిగ్రహం !
దివ్యమంగళ స్వరూపం ! !
“సంపూర్ణ పూర్ణిమాసాంద్ర చంద్రాసంత కాంత కాంతి స్ఫూర్తి కాంత !!! జీవనాజీవ రాజీవ రాజీస్స్నిగ్ధ దుగ్ధాభి మాణిక్యం !!!”
తదేకమయిన చూపుతో పుక్కిటిబంటి ఆనందంతో క్షణమాత్రం నుంచున్నానో లేదో ప్రసన్నమై, ప్రఫుల్లమై, విశాలమై, వినీలమై, కమనీయమై, కరుణారసభరితమై వెలుగొందే నేత్రాంచలాలగుండా జాలువారే అమృత వృష్టితో కూడిన అమ్మ దృష్టి నన్ను స్పృశించింది. లివ మాత్రమయిన చూపుచాలు మనిషిలోని సర్వకాలుష్యాలు కడిగి వేయడానికీ; మనసులోని సర్వ కశ్మలాలు తుడిచి వేయడానికీ, సమస్త ప్రాపంచిక బంధాలను విచ్ఛేదం చేయడానికీ; సకలలౌకిక గంధాలను నిర్మూలనం చేయడానికి. అలాగే రెండు చేతులూ యెత్తి నమస్కారం చేస్తూ నిలబడిపోయాను, అచేతనుడనై, అనిమేషుడనై…
“రా నాన్నా- యిట్లారా” అమ్మ మనసులోని అనురాగ మాధుర్యాన్నీ, వాత్సల్యామృతాన్ని పులుముకుని ఆ చిరు పెదవుల చిరుకదలికలో వినిపించిన ఆ తియ్యని మాటలకు తెప్పరిల్లి అమ్మపాదాల చెంతకు వెళ్లి కూర్చున్నాను. మృదులమై, మనోజ్ఞమై, కోమలమై, కోటిస్వర్గాలకన్న మిన్నయై, శిరీషకుసుమాలకన్న సున్నితమై, గులాబీ రేకులకన్న రాగరంజితములైన ఆ దివ్యచరణాలు సర్వపాపహరణాలు, భవసాగరతరణాలు కాక మరేమిటి? ఆ దివ్యసాన్నిధ్యంలో మనిషి సమస్త బాధాసముదయానికీ యావత్ బంధాలకు దూరమై అలభ్యమయిన అలౌకికమైన ఆత్మశాంతిని పొందగలడు. అనిర్వచనీయమయిన అవ్యక్తమయిన ఆపాత మధురమయిన ఆత్మానుభూతిని పొందగలడు.
అంతలో పళ్లెములతో పులిహోర, దద్ధ్యోదనం తీసుకు వచ్చారు. అమ్మ అందరకూ తనే స్వయంగా పంచుతానంది. అమ్మ మృదుహస్తాలతో ప్రసాదం యిస్తే… అది అమృతం గాక మరేమవుతుంది? జగజ్జనని జగన్మోహినిలా కాకుండా అందరికీ అనురాగంతో, ఆప్యాయతతో ప్రసన్న దృక్కులతో, ప్రమోదవాక్కులతో, మధ్య మధ్య దరహాసాలతో, పరిహాసాలతో అమృతం పంచుతుంటే… జనం తమ జీవితాలే పావనమయినట్లు, తరించినట్లు మధుర భావనలతో పులకించి పరవశించి పోయారు. అక్కడనుండి సాయంత్రందాకా ఆరాధనలూ, ఆర్చనలూ-పూజలు, పునస్కారాలు.
ఆ అమ్మ వైభవాలు, వాత్సల్యాలు- అన్నీ అనంతమూ, అమేయమూ, అనుపమానమూకదా!
అమ్మ……. ఆ రెండు అక్షరాలలో ఎంత ఆత్మీయత, ఎంత అభిమానం మరెంత ప్రేమ పెన వేసుకుని ఉన్నాయి!
రూపుదాల్చిన గాయత్రీమతల్లి, మూర్తీభవించిన యోగీశ్వరేశ్వరి. సకలకళలనూ నిఖల రసాలనూ జీర్ణించుకున్న అమృతవల్లి, రసానందైక కల్పవల్లి, కరుణామయి, కళారూవ, శ్రీరాజరాజేశ్వరీదేవి జిల్లెళ్ళమూడిలో నెలకొనియున్న మా అపరంజి అమ్మ అనసూయమ్మ.
అది మనోజ్ఞ ప్రశాంత వాతావరణం. తుషార శీతలమైన జలధారలతో నిండుగా పారే కాలువలూ గ్రామం చుట్టూ నిత్య కల్యాణంగా కనబడే పచ్చని పంట చేలూ మధ్య పర్ణకుటిలో అమ్మ లోకాలను కాపాడే చల్లని తల్లి. ఒకనాడు ఎవరూ ఎరుగని, ఎందుకూ గుర్తింపబడని మారుమూల పల్లెటూరు యీనాడు యాత్రిక జన సందో హంతో నిత్యమూ కళకళలాడుతున్నది. అన్నపూర్ణయై – అమ్మ అందరి ఆకలి దప్పులను తీరుస్తున్నది. అభయ ముద్రతో అమ్మ ఆశ్రిత కోటిని ఆదరిస్తున్న చల్లని చిఱునవ్వుతో, మెత్తనివాక్కులతో, ఆత్మీయమైన ఆదరణతో, ఆనన్యమైన వాత్సల్యంతో అమ్మ అందరినీ అలరిస్తున్నది.
కులాలకూ, మత భేదాలకు తావు లేని, మూఢ నమ్మకాలకూ, ఛాందన ఆచారాలకు చోటు లేని, కక్షలకూ కల్మషాలకు నెలవు కాని ఆ పుణ్యస్థలిలో, ఆ దివ్యసీమలో, అ పవిత్ర మాతృమందిరంలో అమ్మ సమక్షంలో అయిదు నిమిషాలు గడపండి. అలౌకికమైన బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. అమ్మ పాదాలను మీ చేతులతో ఒక్కసారి స్పృశించండి. అఖండమైన శాశ్వతమైన అవిస్మరణీయ ఆనందానుభూతి లభిస్తుంది. అమ్మ మీ శిరస్సుపైన తన అమృతహస్తంతో మృదువుగా నిమురుతుంది. అమ్మ మీ చేతిని తన చేతిలోకి తీసుకుంటుంది. అంతే! ఆస్పర్శ ఎక్కడికో ఎక్కడెక్కడికో ఉన్నత పథాలకు, ఊహాతీత లోకాలకు, దివ్యసీమలకు తీసుకు పోతుంది. మీ మనసు తృప్తితో నిండిపోతుంది, మీలో అమరశాంతి, పరిపూర్ణ ప్రశాంతి పరిఢవిల్లుతుంది. మీకు తెలియకుండానే మీ కళ్ళు ఆర్ధాలై వర్షిస్తాయి. మీలో కట్టలు తెంచుకుని ఆనందోద్వేగంతో దుఃఖం పొర్లి వస్తుంది.
అదొక దివ్యానుభూతి!
మరపురాని మరువలేని మధురానుభూతి !!
భావనకు తప్ప భాషకు అందని అవ్యక్తమైన ఆత్మానుభూతి !!!
ఆ అనుభవాన్ని హృదయంలో పదిలపరచుకోండి. పదేపదే తలచుకుంటే మనసు ఆధ్యాత్మికానందాన్ని అలౌకిక సుఖానుభూతిని పొందుతుంది. ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అప్రయత్నంగా కళ్ళు ఆశ్రుసిక్తా లవుతాయి. ఆత్మ అంతరాంతరాలలో ఏదోకదలిక ప్రారంభమౌతుంది.
“అమ్మ”కు చేయెత్తి మ్రొక్కుతాము.
శా॥ వేదాంత ప్రతిపాదితే భగవతే విశ్వాత్మనే శాంభవే
ఆదిత్యేందు కళాభి దివ్యనయనే హర్యక్ష సంచారిణే
పాదద్వందము బట్టువాడ జననీ! భద్రా! మహాకాళివై
మేధాశక్తి కవిత్వపుష్టినిడి; మమ్మేలంగదే శాంకరీ.
(‘మాతృశ్రీ’ 1962 అమ్మ జన్మదినోత్సవ అభివందనసంచిక నుండి) Matrusri Digital Centre, Jillellamudi వారి సౌజన్యంతో