‘రసోవైస;’ – అని ప్రబోధిస్తోంది వేదం; అంటే భగవంతుని కంటె సర్వోన్నతమైనది సర్వోత్కృష్టమైనది లేదు అని..
సకల కార్యాలకూ కారణమై అకారణంగా సకల కార్యాలనూ నడిపించే సగుణమూర్తి అమ్మ. ఆ పరతత్త్వాన్ని ఆరాధించి, అనుగ్రహం పొందటానికి మార్గదర్శనం చేసేవి వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు. వాటికి మూలం సంస్కృత భాష. కనుకనే సకల విద్యాధి దేవత, సనాతన ధర్మ స్వరూపిణి అయిన అమ్మ 1971లో ఓరియంటల్ కళాశాలను స్థాపించింది. కళాశాల లక్ష్యాలు రెండు – ఆర్ష సంస్కృతీ పరిరక్షణ, అమ్మ మహత్వపూర్ణ సందేశవ్యాప్తి.
అమ్మ ఆచరణాత్మక సందేశం అంటే – వాత్సల్యం, ప్రేమ, లాలన, ఆదరణ, సంరక్షణం, సంసేవనం, ధర్మాచరణం, ఔదార్యం, మానవీయ విలువలు, కర్తృత్వ నడిపిస్తోంది. రాహిత్యం, సమతా భావన, పరహితార్థ కామన, తృప్తి, అకారణ కారుణ్యం, చరిత్ర ఎరుగని త్యాగం, ఏకోదర రక్తసంబంధ బాంధవ్యం ఎన్నో ఎన్నెన్నో కళ్యాణ గునవైభవం.
కళాశాల ప్రారంభమై దినదిన ప్రవర్ధమానమై 50 వసంతాలు పూర్తి చేసుకుని డిసెంబరు నెలలో స్వర్ణోత్సవాల్ని నిర్వహించుకోవటం ముదావహం. ఈ అర్ధశతాబ్ది కాలంలో కొన్ని వేలమంది విద్యార్ధినీ విద్యార్ధులు విద్యనభ్యసించి ప్రయోజకులై ఉభయతెలుగు రాష్ట్రాలలో సమున్నత స్థానాన్ని అలంకరించి మంచిపేరు తెచ్చుకోవటం మాతృసంస్థకు గర్వకారణం.
ఒక సంస్థ ఆధ్వర్యంలో ‘ఓరియంటల్ కళాశాల’ అలా పరిఢవిల్లటం ఒక ప్రత్యేకత. కళాశాల ప్రారంభమైన తర్వాత ప్రభుత్వ గుర్తింపు పరంగా, Grant-in-aid మంజూరు పరంగా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నది, వాటిని అధిగమించింది. క్రమేణ కళాశాలకు పటిష్ఠమైన భవనము, బాలుర వసతిగృహము ఏర్పడ్డాయి. ఇటీవల బాలికల వసతిగృహం నిర్మాణదశలో ఉంది. వీటి వెనుక అమ్మ అదృశ్యహస్తం, ఆశీర్వచన బలం వల్లనే సంభవమైనదని చెప్పక తప్పదు.
అమ్మ అనుక్షణం అహరహం కళాశాలని విద్యార్ధులని చల్లని చూపులతో పాలిస్తోంది. సంరక్షిస్తోంది. మన ఆర్ష సంస్కతిని పరిరక్షించుకుని భావితరాలవారికి అందజేయడం మన జాతి మనుగడకి ఔనత్యానికి అవశ్యకం. దానికి ఆలంబనం సంస్కృత భాష. అట్టి సంస్కృతభాషా వికాసాభివృద్ధికి కంకణం కట్టుకుని మన సంస్థ అభివృద్ధిపథంలో కళాశాలను నడిపిస్తుంది.
ఒక వంక aided కళాశాలలకు ముప్పు ముంచు వస్తోంది. Grant-in-aid posts లను ప్రభుత్వాధీనం చేయుదిశగా ఆదేశాలు అందినప్పటి నుండి మన కాలేజి భవిష్యత్, మనుగడ గురించి ఆందోళనచెందాం. కానీ, పరాత్పరి అమ్మ కృపవలన ప్రభుత్వం వారు అట్టి ఆదేశాలను వెనక్కి తీసుకోవటం వలన పూర్వపరిస్థితి నెలకొంటుందని ఆశిస్తున్నాం..
మనం అనుదినం దేవతార్చన అనంతరం ‘లోకా స్సమస్తా స్సుఖినోభవంతు’ అనీ, ‘శంనో అస్తు ద్విపదే శం చతుష్పదే అని విశ్వశ్రేయః కామనని ఆశించి ప్రార్ధిస్తాం. మన ఆరాధన స్వార్ధపూరితం కాదు, పరార్ధ పరమార్ధ నిమిత్తం కూడా. అట్టి మహత్వపూర్ణ సంస్కృతిని శ్రుతులుగా స్మృతులుగా జాతి మూల ధనంగా పరిరక్షిస్తూ వచ్చాం. ఇటీవల పాశ్చాత్య విధానాల మూలంగా భారతీయ సంస్కృతి, ఔన్నత్యం దెబ్బతింటున్నాయి. మన సంస్కృతికి మూలం సంస్కత భాషాభ్యసనం. కావున ఓరియంటల్ కళాశాలలు సర్వతోముఖాభివృద్ధి చెందాలి.
మన కళాశాల పూర్వ విద్యార్థులు అమ్మ ఆశయాలను ఆదేశాలను ఆచరణలో పెడుతూ సంస్థపురోభివృద్ధికి అన్ని విధాల కృషిచేస్తున్నారు. 50 ఏళ్ళుగా కళాశాలను ప్రగతిపథంలో నడిపించిన అమ్మ కరుణాకటాక్షవీక్షణాలు అలాగే మున్ముందుకూడా ప్రసరించి భవిష్యత్లో కళాశాల శత జయంతి
ఉత్సవాలను జరుపుకుని ఉజ్జ్వలంగా ప్రకాశించాలని, మిగిలిన ఓరియంటల్ కళాశాలలకు ఆదర్శప్రాయంగా ఉన్నత శిఖరాల్ని అధిరోహించాలని ఆశిస్తూ, ఇన్నేళ్ళుగా కళాశాల అభ్యున్నతికోసం అవిరళకృషి సల్పిన సంస్థయాజమాన్యానికి, అంకిత భావంతో పనిచేసిన ప్రాచార్యులకు, కరెస్పాండెంట్లకు హార్ధిక అభినందనలు తెలియచేస్తున్నాను. కలకాలం కళాశాల ఉత్తరోత్తరాభివృద్ధి చెందలని, జ్ఞానదీపంలా వెలగాలని వాత్సల్యామృతా వర్షిణి అమ్మ శ్రీచరణాలనంటి ప్రార్ధిస్తున్నాను. స్వస్తి. ‘