సరస్వతక్కయ్య విశాఖ మాతృశ్రీ అధ్యయన పరిషత్ కార్యక్రమాలలో తరచు పాల్గొనేది. దుర్గాష్టమికి ||అధ్యయన పరిషత్ తరుపున ప్రేమ సమాజంలో అందరికీ అమ్మ ప్రసాదం పంచేవాళ్ళము. అలా వెళ్ళినప్పుడు మంచంలో లేవలేని వ్యక్తి సేమ్యా పాయసం తినాలని ఉంది అని అడిగితే 10 లీటర్ల పాలు, దానికి తగిన పంచదార, సేమ్యా, జీడిపప్పు వేసి పాయసం చేసి రిక్షాలో పెట్టుకొని తీసుకువెళ్ళి అందరికీ పంచింది. ఇంతగా ఎందుకు చెప్తున్నానంటే ఆ ముసలి అతనిని లేపి అతని ప్రక్కన కూర్చుని ఎంతో ఆప్యాయంగా అతనికి పెట్టింది. అమ్మ చెప్పిన ఆదరణ స్వయంగా చూసి ఆశ్చర్య పోయాను. అందరితో ఎంతో కలివిడిగా ఉండేది.
సరస్వతక్కయ్య భర్త అప్పారావు గారికి ఒంట్లో బాగాలేదు. అద్దెకున్న ఇంటి వాళ్ళు ఖాళీ చేయమన్నారు. ఎటూ పాలుపోని పరిస్థితి అప్పుడు కేశవన్నయ్య కూతురు భగవతి, వాళ్ళ ఆయన చేసిన సాయం మరువలేనిది. వైజాగ్ నుంచి జిల్లెళ్ళమూడికి అంబులెన్స్ మాట్లాడి, మనిషిని సాయం ఇచ్చి పంపించారు. చుట్టుప్రక్కల ఉన్నవారికి ఇవ్వవలసిన బాకీలన్ని తీర్చేసారు. అక్కయ్య ఎప్పుడూ చెప్పుకుని మురిసిపోయేది.
ఆయన జిల్లెళ్ళమూడిలో పోవడం వల్ల ఆయన అంత్యక్రియలను ఎంతో ఘనంగా జరిగాయని చెప్పింది. రాముడక్కయ్యకు రోజూ టిఫిన్ పెట్టమని హోటల్లో డబ్బు తనని అడగవద్దని నెలకొక మారు తను ఆ డబ్బునుఇచ్చేది. పనివాళ్ళకు కొత్త బట్టలు తెప్పించి వాళ్ళందరికిఇచ్చేది.
అప్పారావుగారు మరణించాక రెండవ నెలలో పెన్షన్ గురించి కనుక్కోవటానికి రావాలని అంటే, 2వ నెలలో ఎలాగా అని అనుకుంటే వసుంధరక్కయ్య నాకు ఫోన్ చేసి ఇది పరిస్థితి అంటే మా ఇంటికి వచ్చేయమని చెప్పాను. అమ్మ దగ్గరకు వెళ్ళాక అన్నీ అమ్మే అనుకుంటూ మంచి చెడూ అంటూ ఏమీ లేవు. 4 రోజులు ఉంది. అప్పుడే కారులో తనని M.R.O. ఆఫీసుకు తీసుకు వెళ్తే అక్కడ తనకు కావల్సిన సర్టిఫికేట్స్ తెచ్చుకొని పెన్షన్ సెటిల్ చేసుకుంది. తన మంచితనంతో ఆఫీసులో వాళ్ళు ఆలస్యమయినా కూడా అంత్యక్రియలకు ఇచ్చే డబ్బు కూడా తనకు ఇచ్చారు.
అలా ఎవరికైనా చిన్న చిన్న అవసరాలకు తాను సర్దుబాటు చేసేది. అందరితో బాగా ఉండేది. ఆలయంలో పూజలకని, అన్నపూర్ణాలయంకు ఇస్తుండేది. నాకు పెన్షన్ వచ్చే సదుపాయం వుంది కదా! అని లేని వారికి తాను ఇస్తుండేది.
అన్నయ్య సెవెన్ హిల్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను మధ్యాహ్నం అమ్మకు నివేదన కోసం మందిరంకు వెళ్తానని, ఆటైమ్కి నువ్వు మందిరంకు వస్తే ఆ నివేదన అన్నయ్యకు ఇస్తానని చెప్తే అలాగే వచ్చి తీసుకు వెళ్ళేది. ముందుగా ఫోన్ చేస్తే మీ ఇద్దరికీ తీసుకు వస్తాను అంటే ఫరవాలేదు అది చాలు అని ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చి తీసుకు వెళ్ళేది.
ఆ దంపతులు ఇద్దరూ జిల్లెళ్ళమూడి గడ్డ మీదే జీవితం చాలించడం వాళ్ళు చేసుకున్న అదృష్టం. వాళ్ళు ధన్యజీవులు.