సోదరి శ్రీమతి జె. సరస్వతి విశాఖపట్టణం నివాసి. భర్త పోలీస్ ఆఫీసర్. సరస్వతి అక్కయ్య తన పిల్లల్ని ప్రక్కఇంటి వారికి అప్పగించి ఆర్తితో ఏకైక దిక్కు అయిన అమ్మ సన్నిధికి తొలిసారి పరుగు పరుగున వచ్చింది. కన్నీటితో అమ్మపాదాంబుజాలను అభిషేకించింది. అమ్మ మమకారప్రపూర్ణమైన తన ఒడిలోకి ఆమెను తీసుకున్నది. అమ్మయే సర్వార్ధదాయిని, ఆపదోద్ధారిణి, అనంతశక్తి స్వరూపిణి అని విశ్వసించింది.
తాను జిల్లెళ్ళమూడినుండి తెచ్చిన అమ్మ తీర్థప్రసాదాలను భక్తి విశ్వాసాలతో రోగగ్రస్థులకి, పలు బాధాసంతప్తులకి అందించింది. వారికి సత్వరమే బాధావిముక్తి కలిగింది. వారంతా జిల్లెళ్ళమూడి వచ్చి కృతజ్ఞతతో అమ్మ ఎదుట అంజలిఘటించి జరిగిన మహత్వాన్ని అమ్మకు విన్నవించుకున్నారు. అటుపిమ్మట సరస్వతి అక్కయ్య జిల్లెళ్ళమూడి వెళ్ళింది. అపుడు అమ్మ “నువ్వు ప్రసాదం ఇస్తే జబ్బులు తగ్గుతాయట. నాకుకూడా ఇవ్వు’అని చిరునవ్వుతో పలకరించింది. అమ్మ అనుగ్రహానికి కారణం అకారణం కదా!
కారుణ్యమూర్తి అమ్మ తన పాదుకలను ప్రసాదించింది. వెన్నుతట్టి “నువ్వు బాధపడనవసరం లేదు. నేనెప్పుడూ నీతో ఉంటాను. నువ్వు నాలో ఉంటావు” అని అభయాన్నిచ్చింది, హామీనిచ్చింది. వాచ్యంగా చెప్పినా చెప్పకపోయినా అది అమ్మ అవతార ధర్మం, దివ్యమాతృ లక్షణం. మనందరం అన్నివేళలా అమ్మ బొజ్జలోనే ఉంటాం. మరి అమ్మ కుక్షిస్థాజాండభాండ కదా!!
2000 ప్రాంతం. నేను అమ్మ ఆలయంలో అర్చకత్వంచేసేవాడిని. రోజూ సరస్వతక్కయ్య వచ్చి శ్రద్ధగా తీర్ధప్రసాదాలను తీసుకువెళ్ళేది. నాకు తర్వాత తెలిసింది. ఆమె భర్తకు తీవ్ర సుస్తీ చేస్తే విశాఖపట్టణం నుంచి జిల్లెళ్ళమూడి తీసుకువచ్చింది – అని. కొన్నాళ్ళకి ఆయన కన్నుమూశారు. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు – అల్లుళ్ళు, విశాఖలో మెరుగైన వైద్య సదుపాయాలు ఉన్నారు, ఉన్నాయి. మరి, ఆ స్థితిలో ఏధైర్యంతో అక్కయ్య తన భర్తను జిల్లెళ్ళమూడి తీసుకువచ్చింది? తన భర్త చివరిరోజుల్లో ఆస్పత్రిలో oxyzen pipes, I.C.U. మధ్య నలిగిపోకుండా జిల్లెళ్ళమూడి మోక్షపురిలో జగజ్జనని అమ్మ నడయాడిన గడ్డమీద గడపటం పురాకృత పుణ్యఫలం – అని.
అంతేకాదు. వార్ధక్య భారం, అనారోగ్యాలు ముప్పిరిగొన్న తక్షణం కన్నబిడ్డలను, బంధాలను తెంచుకుని – ఏమైనాసరే – జిల్లెళ్ళమూడిలోనే ఉంటాను, ఇక్కడే తుదిశ్వాస విడుస్తాను అని ఒక దృఢనిశ్చయంతో వచ్చింది. కొడుకు ఎంత బ్రతిమాలినా తిరిగిపోలేదు. రోజూ తన ముంగిట్లో ‘అమ్మ తత్త్వ చింతన’ కోసం ‘సత్సంగాన్ని’ నిర్వహించింది. అందు మాన్యసోదరులు గోపాలన్నయ్య, టి.టి అప్పారావు గారు, ఎన్. లక్ష్మణరావు గారు అనుదినం పాల్గొనేవారు.
అక్కయ్య నడిచిన బాట వానప్రస్థం, సన్యాసం. వానప్రస్థం అంటే ఘోర అరణ్యంలో ఉండటంకాదు. విభిన్న ప్రవృత్తులు సంస్కారాలు గల వ్యక్తులమధ్య ఉంటూ సర్దుకుపోవడం, సామరస్యంగా జీవించడం. సన్యాసం అంటే కాషాయగుడ్డలు ధరించడం, సంసారాన్ని పరిత్యజించడం కాదు. సకలలోక శరణ్య అమ్మయే నాకు సర్వస్వం, ఆలంబనం, దిక్కు – అని సర్వాత్మనా నమ్మి సంసారబంధాలకు బందీకాక అమ్మ ఒడి చేరడం. ‘కా తే కాస్త కస్తే పుత్రః సంసారే యమతీవ విచిత్రః కస్య త్వం కః కుత ఆయాతః తత్త్వం చిన్తయ యదిదం భ్రాంతః’ అంటారు శంకరులు.
నీ భార్య ఎవరు! పుత్రులెవరు? ఎవరి వాడవు? ఎక్కడినుంచి వచ్చావు? తత్త్వచింతన చేయి – అని అర్ధం. ఇది అక్షరాలా శ్రీభాస్కరరావు అన్నయ్యకి సాధ్యమైంది. చాలామందికి అసాధ్యం. “ఎవరి సంసారాలూ, వ్యాపారాలూ వదులుకొని ఎవరుంటారు, నాన్నా! నా దగ్గర?” అని అమ్మ ఒకనాడు గోపాలన్నయ్యతో అన్నది. కొంతవరకు ఆ బాటలో జయ ప్రదంగా ఫలప్రదంగా నడిచిన అక్కయ్య ధన్యచరిత; 2-12-2021 తేదీన తుదిశ్వాస విడిచి అమ్మతో ఐక్యమైనది – జిల్లెళ్ళమూడి గడ్డమీద. ఆత్మీయ సోదరికిదే సాశ్రునివాళి.