బృందావనంలో మీరాబాయి ఒకనాడు రూపగోస్వామితో ఆధ్యాత్మిక అంశంపై చర్చించాలని కోరింది. కానీ గోస్వామి ఒక స్త్రీని కలవడానికి నిరా కరించారు. ఆ సందర్భంగా మీరాబాయి “నిజమైన పురుషుడు శ్రీకృష్ణుడు మాత్రమే. “ఆయనే మన పతి, గతి” అన్నది.
ఇదే తాత్పర్యంతో రఘువంశ కావ్యంలో కాళిదాస మహాకవి సముద్రుని భర్తగాను, నదులను సముద్ర పత్నులు గాను అభివర్ణించారు. నదులన్నీ సాగర జలాలే. నదీనాం సాగరోగతిః.
అదేవిధంగా జగన్మాత ‘అమ్మ’యే జగత్కర్త, జగద్భర్త. అమ్మ స్త్రీరూపధారిణి, అనంతశక్తి, మహాచైతన్య మహోదధి. సముద్రంలో అలలు లేచి మళ్ళీ అందే కలిసి పోయినట్లు అందరి జన్మలూ. ‘అమ్మ’ సంకల్పంతోనే అందరూ అన్నీ జన్మించి ‘అమ్మ’లోనే లయమౌతున్నారు. మీరాబాయి ప్రవచించినట్లు “అమ్మ” యే తల్లి, తండ్రి, గురువు, దైవం, పతి, గతి, సర్వస్వం సర్వదా సర్వథా.
అమ్మ అవతారకాలంలో అమ్మకు సన్నిహితంగా ఉంటూ, అమ్మ దర్శన స్పర్శన సంభాషణ అలౌకిక అనుభూతులతో పునీతులై పరవశించి తరించిన సోదరత్రయం ఇటీవల ‘అమ్మ’లో లీనమైనారు. శాశ్వతంగా కనుమరుగైనారు. ఒక్కొక్క భాగవతుని ఆచరణ ద్వారా ఒక్కొక్క భగవదారాధనా రీతి స్పష్టమౌతుంది.
– సో.శ్రీజన్నాభట్ల వీరభద్రశాస్త్రి గారు ఆలయాల్లో ఆగమ శాస్త్రానుసారం ‘అమ్మ’ సన్నిధిలో జరిగే అర్చనలు – అభిషేకాలు, ఉత్సవాలు ఉపచారాలు, దీక్షలలో పాల్గొంటూ ఉపాసకునిగా నిలిచారు. ఉపాసన అంటే ఆరాధ్యదైవ ప్రత్యక్ష సన్నిధిలో ఉండి ఆరాధించటం.
సో. శ్రీ బులుసు లక్ష్మీ ప్రసన్న సత్యనారాయణ శాస్త్రిగారు అమ్మను ‘సర్వంతానైన అద్వైతమూర్తి’గా గుర్తెరిగి, అమ్మ స్థాపించిన సేవాసంస్థల సేవే అమ్మ సేవ అని నమ్మి, కళాశాల, ఆలయాలు, వేదపాఠశాల, గ్రంథాలయం వంటి విశ్వమానవ కళ్యాణ సేవా కార్యాలయాల సేవే పరమావధిగా అమ్మను ఉపవాస దీక్షతో అర్చించారు. మానవసేవే పరమావధిగా అమ్మను తన హృదయ సీమను నిల్పి ఆరాధించారు.
సో॥ డా|| యస్.వి. సుబ్బారావు గారు అమ్మ అభిమతం మేరకు సంస్థకు అవసరమైన సదుపాయాలు కలుగజేస్తూ, సాక్షాత్తూ అమ్మకు వైద్యం చేస్తూ మరొక ప్రక్క తన ఆస్పత్రిలో రోగులను నారాయణ స్వరూపులుగా ఎంచి సేవలనందిస్తూ కర్తవ్య పరాయణతతో స్వధర్మాను రక్తితో అమ్మను ‘ధర్మదేవత’గా ఆరాధించారు.
ఆ మూర్తిత్రయం గంగ, యమున, సరస్వతులుగా మూడు మార్గాల్లో పయనించినా కట్టకడపట ‘అమ్మ” అనే మహోదధిలోనే కలిశారు.
డాక్టర్ సుబ్బారావుగారిది కర్మయోగం, వీరభద్రశాస్త్రి గారిది భక్తియోగం, బులుసు శాస్త్రిగారిది జ్ఞానయోగం.
భగవత్తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే భాగవతుల చరిత్రలే ఆధారం. వారి ఆచరణలోనే జగజ్జనని ‘అమ్మ’ అనంతకళ్యాణ గుణవైభవం సహస్ర కోణాల దర్శనం ఇస్తుంది.
ఆదర్శప్రాయులైన అగ్రజత్రయానికిదే సాశ్రు నయనాంజలి.