భోగాలూ అనుభవిస్తున్న దేవతల కోరికలు మాత్రమే తీరుస్తాయి. కానీ, నీ పాదాలు దరిద్రులకూ, దీనులకూ కూడా సకల సంపదలూ శుభాలూ ప్రసాదిస్తాయి.
అమ్మ పాద స్మరణ చేస్తే చాలు భక్తుల మనస్సు అంటారు. పున్నమినాటి సంద్రంలా ఉప్పొంగుతుంది. కవితా విహంగం రెక్కలు విప్పుకుని గగన విహారం చేస్తుంది. పూర్వ కవుల దగ్గర్నించి వర్తమాన కవుల వరకూ అమ్మ పాదాల వర్ణన లేకుండా ఏ స్తోత్రం సంపూర్ణం కాదు. మూకకవి అయితే ఏకంగా వంద శ్లోకాలతో పాదారవింద శతకాన్నే రచించారు.
“శ్రుతిసీమంత సిందూరీకృత పాదాబ్జ ధూళికా” అని వాగ్దేవతలు అమ్మను స్తోత్రం చేశారని వ్యాసదేవుడు మనకు లలితా సహస్రం ద్వారా తెలియచేశారు. వేదాలనే సీమంతినులకు అమ్మ పాద ధూళియే సిందూరమట. అంటే సకల వేదాలూ అమ్మ పాదాలనే ఆశ్రయించుకుని వున్నాయన్నమాట.
“అమ్మా! అభయముద్రలు, వరదముద్రల దాకా ఎందుకమ్మా? భయం నుండి కాపాడటానికీ, కోరిన దానికన్నా ఎక్కువగా ప్రసాదించటానికీ నీ పాదాలే చాలు” అంటూనే “అమ్మా! నీ పాదాలు కల్పవృక్షాలనే పరిహసిస్తాయి కదా!” అని కూడా అంటారు ఆది శంకరులు.
“తరూణాం, దివ్యానాం హసత ఇవ తే చణ్ణి చరణా, ఫలాని స్వస్తేభ్యః కిసలయ కరాగ్రేణ దదతాం, దరిద్రేభ్యో భద్రాం, శ్రియ మనిశ మహ్నాయ దధతౌ”
కల్పవృక్షాలు స్వర్గలోకంలో అప్పటికే సకల కాళిదాసు గారు తక్కువ తిన్నారా? “దేవ, దేవేశ, దైత్యేశ, యక్షేశ, భూతేశ, వాగీశ, కోణేశ, వాయ్వగ్ని కోటీర మాణిక్య సంఘృష్ట బాలాతపోద్దామ లాక్షా రసారుణ్య తారుణ్య లక్ష్మీగృహీతాంఘ్ర పద్మద్వయే” అని ఒక సుదీర్ఘ సమాసంతో శ్యామలా దండకంలో వర్ణించారు.
“దేవతలు, దేవేంద్రుడు, రాక్షసులు, యక్షులు, సకల భూతాది దేవతలు, వాగ్దేవతలు, దిక్పాలకులు, వాయువు, అగ్ని మొదలైన దేవతల కిరీటాల సమూహాల కాంతి కిరణాల చేత ప్రకాశిస్తున్న పాదపద్మద్వయం అమ్మా నీది” అని వర్ణించారు.
ఇలా, అమ్మ పాదపద్మాల వర్ణన లేకుండా ఏ కావ్యము, స్తోత్రమూ లేదు. ఎంత వర్ణించినా తనివి తీరదు.
అంతటి మహత్తరమూర్తి, ఆదిదేవి, మన అమ్మగా, ఒక సాధారణ గృహిణిగా, మాతృమూర్తిగా మన మధ్య అవతరించింది వంద సంవత్సరాల క్రిందట.
అమ్మ పాదాలను నిత్యం సకల దేవతలు ఆశ్రయించి వుంటారనటానికి చిహ్నంగా, అమ్మ పాదాలు ఆయా దేవతల రూపుగల అంగుళీయకాలతో ప్రకాశిస్తూ వుంటాయి. ఆ అనురాగవల్లి, వాత్సల్యమూర్తి పాదాలను వర్ణిస్తారు రామకృష్ణ అన్నయ్య.
ఆ పాదాలు,
“సుందర మందార కుసుమ మంజులాలు సర్వదేవతలకూ నివాస మందిరాలు సువర్ణ రాగ రంజితాలు – సర్వజన పూజితాలు”
అంటారు.
“అడుగడుగు గండాలు గడియలో తొలగించు
సుడులు గల సంసార జలధినే దాటించు
సురపారిజాతాలు, నీపాద కమలాలు” అంటారు
రాజు బావ.
అంతవరకే వ్రాసి ఊరుకుంటే అందులో ప్రత్యేకత ఏమీ లేదు. అందరూ వ్రాసేదే. ఆ తరువాతి వాక్యాలలోనే వుంది కవి గడసరితనం. ” మరపులో కూడ మా మనసంత నిండంగ ……. .. దీవించుమమ్మా మము” అని ముగిస్తారు. మనం మర్చిపోవచ్చుట, కాని
అమ్మ మన మనసులో మాత్రం నిండి వుండాలట. అమ్మ, అభయప్రదాత. అనసూయ మాత.
ఎంతటి సాధకులైనా, ఉపాసకులైనా, తపస్వు లైనా పాంచభౌతిక దేహాలతో కూడిన మానవులం. సంసారమంటే కాపురాలని కాదు అర్థం. ఈ ప్రపంచం. ఈ భౌతిక బంధాలు, మమకారాలు, అహంకారాలు ఇవన్నీ సుడులే. అటువంటి సాగరం ఈదటంలో అప్పుడప్పుడు అమ్మను మర్చిపోతాం. కానీ అమ్మా! నీవు మమ్మల్ని మర్చిపోవద్దు. “మా మరపులో కూడా మా మనసంతా నిండి వుండి మమ్మల్ని దీవించు మమ్మా!” అంటారు రాజుబావ. ఎంతటి మహత్తర భావం!! అదే మనం కోరుకోవలసింది.