సేవకు… ప్రేమకు ప్రతిరూపం అమ్మ అని డిప్యూటీ స్పీకర్ శ్రీ కోన రఘుపతి తెలిపారు. మండలంలోని జిల్లెళ్ళమూడి గ్రామంలో బుధవారం జిల్లెళ్ళమూడి అమ్మకు 34వ ధాన్యాభిషేకం కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. అమ్మవారికి ధాన్యాభిషేకంతో పాటు ప్రత్యేక పూజలు నిర్వహిస్తే అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయనే నమ్మకంతో భక్తులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బుధవారం ఉదయాన్నే అమ్మవారి ఆలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన ధాన్యాభిషేకం మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగింది. ధాన్యాభిషేకంతో పాటు నాన్నగారి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ సభ్యులు నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఓరియంటల్ కళాశాల విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్య క్రమాలు చూపరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ శ్రీ కోసరమువతి మాట్లాడుతూ అమ్మతత్త్వానికి ప్రతీకే జిల్లెళ్ళమూడి అమ్మవారన్నారు. డ్రస్సు…..అడ్రస్తోతో సంబంధం లేకుండా ఆకలిగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరికీ ఆహారం పెట్టడమే అమ్మ ఏకైక లక్ష్యమని, ఎప్పుడైతే ఎదుటి వ్యక్తుల పట్ల ప్రేమ, జాలి, దయ కలిగి ఉంటారో అప్పుడే అమ్మ ఆశయాన్ని నిలబెట్టిన వాళ్ళవుతారన్నారు. అందరినీ బిడ్డలుగా ప్రేమించే అమ్మతత్వాన్ని ప్రతి ఒక్కరూ అలవర్చు కోవాలన్నారు. ప్రతి గ్రామానికి అమ్మలాంటి ఒకరు ఉన్నప్పుడే ఆ గ్రామం అభివృద్ధి పథంలో నడుస్తుం దన్నారు. విశ్వజననీ పరిషత్ పాట్రన్ బ్రహ్మాండం రవీంద్రరావు మాట్లాడుతూ జిల్లాల్లోని ఓ మారుమూల గ్రామంలో విద్యాలయం, ఆదరణాలయం, చికిత్సా లయం, భోజనాలయం, దేవాలయం అనే పంచ ఆలయాలను స్థాపించి జిల్లెళ్ళమూడి గ్రామానికి రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత విశ్వజననీ పరిషత్కే దక్కుతుందన్నారు. అధ్యాత్మికతకు, మానవత్వాన్ని రెండు కళ్ళుగా మానవీయ విలువలను పెంచి పోషిస్తున్న అమ్మ తత్త్వాన్ని దేశ వ్యాప్తంగా చాటాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అమ్మ చెప్పిన విధంగా ప్రతి ఒక్కరూ సేవాగుణాన్ని కలిగి ఉండాలన్నారు. అమ్మ చూపించే నూక్తులను పాఠ్యపుస్తకాల రూపంలో ప్రవేశపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. విశ్వంలో ఏ ఒక్కరు భోజనం చేయకపోయినా బాధపడే ఏకైక వ్యక్తి అమ్మ అన్నారు. 1973లో అమ్మకు 50 ఏళ్ళు నిండిన సందర్భంగా అమ్మ కోరిక మేరకు ఇదే జిల్లెళ్ళమూడిలో ఒకే పంక్తిలో ఒక లక్ష మందికి భోజన సౌకర్యం కల్పించడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేశారు. కార్యక్రమంలో విశ్వజననీపరిషత్ అధ్యక్షులు ఎం. దినకర్, కార్యదర్శులు డి.వి.ఎన్. కామరాజు, లక్కరాజు సత్యనారాయణ, భట్టిప్రోలు రామచంద్ర, గ్రామస్థులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
(18-2-2021 ‘సాక్షి’ వార్తాపత్రిక సౌజన్యంతో)