శ్రీ జన్నాభట్ల వీరభద్రశాస్త్రి గారు దైవజ్ఞులు, కారణజన్ములు, సరస్వతీ పుత్రులు, జ్ఞాన సంపన్నులు, అనుష్ఠానపరులు మరియు అమ్మకు ప్రియ భక్తులు.
శాస్త్రి గారు ఆజన్మాంతం ఆచరించిన సూత్రం ‘శరీరం ఆద్యం ఖలు ధర్మసాధనమ్’ (ధర్మాన్ని ఆచరించడానికి మొదటిసాధనం శరీరమే గదా.)
1948లో కృష్ణా జిల్లా విజయవాడలో మాతామహుల ఇంట్లో సీతారావమ్మ వెంకట రామయ్య గారి ప్రథమ సంతానమై జన్మించారు. శ్రీ వీరభద్ర శాస్త్రి గారికి ముగ్గురు సోదరులు నలుగురు సోదరీమణులు.
మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన వీరభద్ర శాస్త్రి గారికి కుటుంబం పట్ల అపారమైన ప్రేమ కలిగి ఉండడం వల్ల, చిన్న వయసు నుండి కుటుంబ శ్రేయస్సు గురించి అహర్నిశలు కష్టపడి, కుటుంబ ఉన్నతికి తోడ్పడి, తల్లిదండ్రులకు సేవాసహాయ మూర్తులైనారు.
తల్లిదండ్రుల సేవతో పాటు, సోదర సోదరీమణులకు, ఉపనయన, రజస్వల, వివాహాది శుభకార్యములు ఘనంగా నిర్వహించి వారి కుటుంబ సంతాన అభివృద్ధికి, తనవంతు బాధ్యత నిర్వహించి, సోదర సోదరీమణులకు సుఖదుఃఖాలలో అండగా నిలిచి, వారి ఆనందంలోనే తన సంతోషాన్ని సమన్వయ పరుచుకునేవారు.
శాస్త్రి గారు తన సోదరులకు, తన తల్లి తండ్రులకు గౌరవ మర్యాదలను పంచి, వారిని తన శరీర భాగంగా మనసులో పొందుపరచుకొని, వారికి వారి కుటుంబానికి ప్రథమపీఠం వేసేవారు. శాస్త్రిగారు తన సోదరీమణులకు కూడా, అమ్మకు ఇచ్చిన సమాన స్థానాన్ని ఇచ్చి, వివాహానంతరము వారి కుటుంబాల ఉన్నతినే తన అభున్నతిగా భావించి ఆనందించేవారు.
శాస్త్రి గారు తన ధర్మపత్ని కుటుంబసభ్యులకు కూడా తన కుటుంబ సభ్యులకు ఇచ్చిన గౌరవ మర్యాదలు ఇచ్చి అన్ని కుటుంబకార్యక్రమాలలో, శుభకార్యాలలో వారికి అగ్రతాంబూలం ఇచ్చి సత్కరించేవారు.
శాస్త్రిగారు తన మిత్రులను ఆత్మీయులుగా భావించి వారి కష్టాలకు దయార్ద్రహృదయులై తన వంతు సహకారమునందించి, వారి సంతోషమును చూసి ఆత్మానందమును అనుభవించేవారు.
17-05-1970లో జయలక్ష్మి గారిని వివాహ మాడిన శాస్త్రి గారు, ధర్మపత్ని సేవా స్వభావానికి, దైవతత్వానికి, కుటుంబం పట్ల అంకితభావానికి, మంత్ర ముగ్ధులై తన జీవిత గమ్యాన్ని ధర్మపత్నితో సహాయ సహకారాలతో పరోపకారార్ధం ఇదం శరీరమ్ (ఇతరులకు ఉపకారం చేయడానికి ఈ శరీరం) అను సూక్తులను అక్షరాల పాటించి మానవ సేవకి, దైవ పూజకి అంకితం చేశారు.
జయలక్ష్మి, శాస్త్రిగారికి పుత్రికా సంతానమైన నలుగురు ఆడ పిల్లలను, అమ్మ ప్రసాదంగా భావించి, అమ్మచే నామకరణం చేయించి, పెంచి, చదివించి వివాహాది శుభకార్యములను వైభవంగా నిర్వహించి, అత్తవారింటికి సాగనంపి, జీవితాన్ని అమ్మ సేవకై అంకితం చేశారు. శాస్త్రి గారు, తన సహధర్మచారిణిని, నలుగురు కుమార్తెలను, ఆయన పంచ ప్రాణాలుగా చూసుకుని, వారి మనసును తెలుసుకుని, వారి కష్టాలకు తాను కారణం కాకూడదు, అని శ్రమించి, ఆయన కష్టాన్ని వారికి ఆనందంగా మలచి, తన కుటుంబాన్ని సమర్ధవంతంగా నడిపి, అందరినీ వారి వారి గౌరవ స్థానాలకు చేర్చారు. మనవలు మనవరాళ్లతో తాను ఒక పిల్లాడిగా ఉంటూ, ఆడుతూ, వాళ్లకి అమ్మ బోధనలను, దైవభక్తిని, వేద వేదాంగాల సారాంశాన్ని, లోకజ్ఞానాన్ని నేర్పించేవారు. శాస్త్రి గారు ఆయన ధర్మపత్నితో నిడదవోలులో, మూడు దశాబ్దాలుగా, అమ్మ కార్య క్రమాలు అయిన అన్న వితరణ 2015లో గోదావరి పుష్కరాలలో మరియు 2016లో కృష్ణా పుష్కరాలలో అమ్మ సంస్థ తరుపున యాత్రికులకు అన్న వితరణ కార్యక్రమము శ్రీ విశ్వజననీ పరిషత్, జిల్లెళ్ళమూడి తరుపున దిగ్వి జయముగా నిర్వహించినారు. గత 30 సంవత్సరములుగా నిడదవోలు పట్టణములో ప్రముఖుల సహాయసహకారములతో గణపతి నవరాత్రి ఉత్సవములు దిగ్విజయముగా నిర్వహించినారు. 2019లో వచ్చిన కరోనా మహమ్మారి వలన ఇబ్బందులు పడుతున్న పేదవారికి నిత్యావసర వస్తువులను శ్రీ విశ్వజననీ పరిషత్, జిల్లెళ్ళమూడి తరుపున పంపిణీ చేసినారు. అందరి హృదయాలలో గౌరవ పీఠాన్ని అధిరోహించారు. దైవ కార్యాలతో పాటు అన్ని సామాజిక, సహాయ, అన్నదాన కార్యకలాపాలలోనూ ముందుండి సమర్థ వంతంగా నిర్వహించి నిడదవోలులో చిరస్మరణీయు లయ్యారు.
చిన్నతనం నుంచి అమ్మ పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు ఉన్న శాస్త్రి గారు అన్ని దైవాలలోను అమ్మను చూసుకుని, మురిసిపోయి, సేవా భావంతో తపించి, అహర్నిశలు శ్రమించి, జీవిత పరమార్థం అమ్మే అని, అమ్మకు సేవ చేయాలని, అమ్మకే జీవితం అంకితం చేయాలని, తపించి, తన జీవితాన్ని సార్ధకం చేసుకున్న మహావ్యక్తి.
శాస్త్రి గారు ఆయన కుటుంబ సభ్యులు, అందరితో పాటు, తన నలుగురు అల్లుళ్లకు, కూతుళ్లకు, మనవళ్లకు, మనవరాళ్లకు, అమ్మ దైవత్వాన్ని వివరించి, అమ్మ ప్రాముఖ్యతను చాటి చెప్పి, తనకు అమ్మే మార్గదర్శి అని, అమ్మ సేవే పరమావధి అని చెప్పి, 2023లో వచ్చే అమ్మ శత జన్మదిన వేడుకలను అమ్మ భక్తుల సహాయ సహకారాలతో, అంగరంగ వైభవంగా నిర్వహించి, ఆపై అమ్మ సేవకై తనువును అమ్మ చల్లని వడిలో వీడాలని తన అంతరంగాన్ని వ్యక్తపరిచేవారు.
జిల్లెళ్ళమూడి అమ్మ, తన భక్తుడైన శాస్త్రి గారి నిరంతర సేవాభావానికి తరించో, అమ్మ ఆమె పట్ల ఉన్న భక్తికి చలించో, ఆయన అపారమైన దీక్షాదక్షతకి మోక్షంగానో, ఆయన కష్టాన్ని అమ్మ మనసు తట్టుకోలేక వరంగానో లేక అమ్మకు తన భక్తుడైన బిడ్డపై ఉన్న ప్రేమకు ఇంక దూరం ఉండలేకో, ఆ మహావ్యక్తికి సాయుజ్యాన్ని ప్రసాదించింది.
అమ్మ – బిడ్డల ప్రేమ చిరస్మరణీయం.
జన్నాభట్ల వీరభద్ర శాస్త్రిగారు చిరస్మరణీయులు.