అందరింటి సభ్యులందరికీ హైమ ప్రియ సహోదరియే. సత్యం. కాగా తంగిరాల వారి ఇంటి ఆడపడుచు కూడా. కారణం శ్రీ తంగిరాల సింహాద్రి శాస్త్రిగారి మాతృమూర్తి శ్రీమతి దమయంతి గారిని హైమ ఆప్యాయంగా ‘అమ్మా! అమ్మా!’ అని పిలిచేది, సంభావన చేసేది.
ఆ భక్తి తాత్పర్యాలతో శ్రీ టి.ఎస్. శాస్త్రిగారు హైదరాబాదులో హబ్సిగూడలోని తమ స్వగృహంలో గత 30 ఏళ్ళుగా నవంబరు 18వ తేదీన (ఇంగ్లీషు తేదీ ప్రకారము) హైమవతీదేవి జన్మదినోత్సవాన్ని వైభవంగా నిర్వహిస్తున్నారు; అందు ఏటా 150/200 మంది సోదరీసోదరులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు.
కాగా, కరోనాకారణంగా, రెండు సంవత్సరాలుగా ఆ ఉత్సవం వారి కుటుంబ సభ్యులకే పరిమితమైంది. ఆ ఆనవాయితీననుసరించి 18-11-2021 న తమ నివాసంలో శ్రీ శాస్త్రి అన్నయ్యగారు హైమ పుట్టినరోజు పండుగను నిర్వహించారు. శ్రీ శాస్త్రిగారి అమ్మాయి చి॥సౌ॥ అనసూయ, శ్రీ తంగిరాల వాత్సల్యమూర్తిల సంయుక్త కృషితో చేసిన అలంకరణ, ఆరాధన అత్యద్భుతం. నిజానికి హైమమ్మ వచ్చి పూజా మందిరంలో సింహాసనాసీనయై పూజాదికములను స్వీకరించి అనుగ్రహించినదని అందరూ పరవశించారు.
మూడుసార్లు శ్రీలలితా సహస్రనామస్తోత్ర పారాయణ అనంతరం శ్రీలలితా అష్టోత్తర శత, శ్రీ హైమవతీ అష్టోత్తర శతనామ పూర్వకంగా షోడశోపచార విధిని అర్చనచేశారు. విశేషమేమంటే – డా॥ శిష్టాశాంత, శ్రీ తంగిరాల కేశవశర్మ గారి అమ్మాయి చి||సౌ|॥ హైమ తమ కుమార్తెతో కలిసి, శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారి అమ్మాయి శ్రీమతి లక్ష్మీ శేషు, శ్రీ కవిరాయని రాజేంద్రప్రసాద్ గారి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి తమ కుమార్తెతో కలిసి శ్రీ అధరాపురపు రవీంద్రనాథరావు గారి సతీమణి శ్రీమతి రంగమణి తన కుమారుడు చి|| ప్రేమేష్ నూ వచ్చి ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు; అది హైమ కృపా విశేషం. అర్చనానంతరం అందరూ అమ్మ-హైమమ్మల తీర్థప్రసాదాల్ని స్వీకరించి పరమానంద భరితులయ్యారు.