(బుద్ధిమంతుడిగారి అనుభవం)
“హైమాలయంలో 11 రోజులు అభిషేకం కానీ, 40 రోజులు (లలితా) పారాయణ కానీ చేస్తే ప్రతిఫలం ఉంది, నాన్నా!” అని స్వయంగా అమ్మ శ్రీరాచర్ల లక్ష్మీనారాయణ గారికి చెప్పింది, చేయించింది, ఫలితం చూపించింది. అమ్మ మాట బంగారుబాట కదా!
హైమాలయంలో ప్రదక్షిణలు చెయ్యమని తద్వారా ఆరోగ్యసమస్యలు – ఇతర బాధల నివారణ, ఐహిక ఆముష్మిక వాంఛాఫలసిద్ధి కలుగునని అనేకమందికి అమ్మ మార్గదర్శనం చేసింది.
ఒకసారి బుద్ధిమంతుడు (శ్రీ వై.వి.సుబ్రహ్మణ్యం, చీరాల) గారికి తీవ్రమైన అనారోగ్యంచేసింది. అప్పుడు అమ్మ “ఒక్కసారి హైమకు ప్రదక్షిణం చేసిరారా!”అని సూచించింది. “నేను అడుగుతీసి అడుగు వేయలేని స్థితిలో ఉన్నాను. నన్ను ప్రదక్షిణం చెయ్యమంటా వేమిటమ్మా” అని మనస్సులో అనుకున్నా ఆయనకి అమ్మ మాట శిరోధార్యం కనుక వెళ్ళి హైమాలయంలో ఒక్క ప్రదక్షిణం చేశారు. అనంతరం శ్రీ భద్రాద్రి తాతయ్య తీర్థం ఇచ్చారు. మర్నాటినుండి ఉదయం ఒకసారి సాయంకాల ఒకసారి, అటుపిమ్మట ఉదయం 5 సార్లు సాయంత్రం 5 సార్లు చేస్తున్నారు. అందుకు అమ్మ 108 సార్లు చెయ్యమ్నది. అమ్మ చెప్పినట్లు తు.చ. తప్పకుండా చేయగలిగారు.
కరుణాంతరంగ తరంగ హైమ వారి ధ్యాన సమయంలో దర్శనం ఇచ్చి ఒక పండు ఇవ్వబోతుండగా ఒక సోదరి ప్రదక్షిణలు చేస్తూ ‘అమ్మా!’ అని పెద్దగా అరిచింది. వెంటనే హైమ అదృశ్యమైంది. ఇక ఫలితం గురించి వేరే చెప్పాలా? హైమ అనుగ్రహం కలిగిన తర్వాత అనారోగ్యానికి తావేది? అమ్మ- హైమమ్మల కృపతో పూర్తిగ స్వస్థత చేకూరింది. హైమాలయంలోనూ, అమ్మాలయంలోనూ నిశ్శబ్దంగా ఉండాలి. శ్రద్ధగా అభిషేకాలూ, ప్రదక్షిణలూ, లలితా పారాయణలూ చేసుకోవాలి. హైమాలయం కల్పవృక్షం, కామధేనువు. ఓం హైమ నమో హైమ శ్రీహైమ జై హైమ. ***