గుంటూరులో మా వారు శ్రీ లక్ష్మణరావు గారు. పనిచేస్తున్న కాలంలో ఒకరోజు మా యింటికి ఒక చిన్నపిల్లవాడు అన్నం పెట్టమని వచ్చాడు. ‘సరే! బాబూ దేనిలో పెట్టించుకుంటావు ? ఏదైనా ఉందా?’ అని అడిగాను. తాను ఏం తెచ్చుకోలేదని అన్నాడు. సరే నేను ఏదైనా పాత్ర ఇస్తాను. ఇంకా వేరే ఇళ్ళకు కూడా వెళ్ళి ఇంకొంత పెట్టించుకొని తిను అని చెప్పాను. దానికి ఆ అబ్బాయి “నేను మూడు రోజుల నుండి అన్నం తినలేదు. ఎవరి ఇంటికి వెళ్ళను. నువ్వు నా అక్కలాంటిదానవు. నేను చాలా అభిమానవంతుడిని. నువ్వు ఎంతపెడితే, ఏది పెడితే అదే తింటాను” అని అన్నాడు. పిల్లవాడు చూడబోతే ముచ్చటగా ఉన్నాడు. అక్కా అని అంటున్నాడు. ఇంక ఎవరి ఇంటికి వెళ్ళనంటున్నాడు. ఇదేమిటి? అనుకొని నాకేదో మంచి బుద్ధి పుట్టి ఎసరు పడేసి అన్నం వండి విస్తరేసి అన్నం, పప్పు, పక్కవాళ్ళను అడిగి కూర, ఇంట్లో రవ్వలడ్డు ఒకటి ఉంటే అదీ వేసి పెట్టాను. ఆ పిల్లవాడు అన్నం తిని ఎటో వెళ్ళిపోయాడు. తర్వాత కొన్నాళ్ళకు జిల్లెళ్ళమూడి వెళ్ళాము నేనూ, మావారూ.
అమ్మ దగ్గర కూర్చున్నాను. హైమ ఆలయ ప్రవేశం చేసిన కొత్త. హైమను ఒక్కసారే చూచాను; ఎక్కువగా ఎరుగను. అమ్మకు నమస్కరించుకుని కూర్చున్నాను. “హైమ నీ దగ్గరకు వచ్చిందా?” అని అడిగింది అమ్మ. లేదమ్మా, మా యింటికిరాలేదు. అన్నాను. “కాదు, మీ ఇంటికి వచ్చానని చెప్పింది. అది తప్పు చెప్పదు. చాలా అభిమానవంతురాలు. నువ్వు రవ్వలడ్డు కూడా పెట్టావని చెప్పింది” అన్నది అమ్మ. ఇదేమిటి అమ్మ ఇలా అంటుంది? – అనుకుంటూ యింటికి వచ్చాను.
తర్వాత రాత్రి పడుకుని ఆలోచిస్తుంటే అంతకు ముందు కొన్ని రోజుల క్రితం ఒక పిల్లవాడు రావటం, వాడు అభిమానవంతుడిని అని చెప్పటం, రవ్వలడ్డు వేసి అన్నం పెట్టటం అన్నీ గుర్తుకు వచ్చాయి. ఆ పిల్లవాడు అన్నమాటలే – అచ్చంగా ఆ మాటలే అమ్మ పలికింది. అమ్మను అర్థం చేసుకోలేకపోయాను. “హైమ నన్ను అక్క లాగ ప్రేమించి నా దగ్గరకు వచ్చింది” అని తర్వాత అమ్మ దగ్గర అంగీకరించాను.
ఆ విధంగా హైమే నన్ను ఆదరించి అమ్మ దగ్గరకి చేర్చింది.