1. Home
  2. Articles
  3. Viswajanani
  4. మాతృశ్రీ ప్రాచ్యకళాశాల వార్తలు

మాతృశ్రీ ప్రాచ్యకళాశాల వార్తలు

V Pavani
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : September
Issue Number : 2
Year : 2022

మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల ఆవిర్భావ దినోత్సవం

జిల్లెళ్ళమూడి అందరి ఇంటి వాత్సల్యాలయ ప్రాంగణంలో కళాశాల ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఉదయం 9 గంటలకు బ్రహ్మాండం వసుంధర అక్కయ్య జ్యోతి ప్రజ్వలన చేసిన అనంతరం సభా కార్యక్రమం ప్రారంభం అయింది. కళాశాల కరస్పాండెంట్ శ్రీమతి బి.ఎల్ సుగుణ గారి అధ్యక్షతన జరిగిన ఈ సభలో శ్రీ ఎం. దినకర్ గారు, టి.టి. అప్పారావు గారు, బొడ్డుపల్లి నారాయణ గారు, మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తి గారు, రాఘవేంద్ర గారు తదితరులు పాల్గొన్నారు. కళాశాల ఇంచార్జ్ ప్రిన్సిపల్ డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారు ఆహూతులను సగౌరవంగా వేదిక పైకి ఆహ్వానించారు. శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణమూర్తిగారు సభను ఆద్యంతం రసవత్తరంగా నడిపించారు. శ్రీమతి బి.ఎల్ సుగుణ గారు అధ్యక్ష భాషణం చేస్తూ కళాశాల ఆవిర్భావం నుండి ఐదు దశాబ్దాలుగా సాధించిన విజయాలు విశ్వజననీ ట్రస్ట్ యొక్క సంపూర్ణ సహకారం మరియు అమ్మయొక్క కృపాదృష్టి ఎటువంటిదో సవివరంగా తెలియజేశారు. అనంతరం శ్రీ ఎం.దినకర్ గారు సంస్కారం సనాతన ధర్మం అనేవి ప్రాచ్యవిద్యలో ఉంటాయి. కనుకనే అమ్మ ప్రాచ్య కళాశాలను పెట్టడానికి నిర్ణయించుకున్నదని, అది ఈరోజు అంచ లంచెలుగా ఎదిగి మహావృక్షమై వ్యాపిస్తున్నదని చెప్పారు. అనంతరం కళాశాల వ్యవస్థాపక కుటుంబ సభ్యులు శ్రీ బొడ్డుపల్లి నారాయణ గారికి విశిష్ట అతిథి సత్కారం కార్యక్రమం జరిగింది. నారాయణ గారు మాట్లాడుతూ తనకు జరిగిన ఈ సత్కారం తన తండ్రికి ఇచ్చిన గౌరవ మర్యాదలుగా తాను భావిస్తున్నాను అన్నారు. ఆత్మీయ అతిథిగా శ్రీ టి.టి. అప్పారావు గారిని సత్కరించగా వారు స్పందించి అమ్మ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన సేవ అని చెప్పారు. తదుపరి పూర్వవిద్యార్థి సమితి అధ్యక్షులు శ్రీ జి రాఘవేంద్ర మాట్లాడుతూ తాను అమ్మ అనుగ్రహంతోనే ఒక ఉ త్తమ పాఠశాలను నిర్వహించ గలుగుతున్నానని వివరించారు. ఇదే వేదికపై ఆటలలోను, వక్తృత్వ వ్యాసరచనలలోనూ, భగవద్గీత, భాగవతం, వేమన శతకం కంఠస్థ పోటీలలోనూ గెలుపొందిన విద్యార్థినీ విద్యార్థులకు సంస్థ పెద్దలు బహుమతులను అందజేశారు. ఈ విశేషమైన కార్యక్రమానికి ప్రత్యేక అహూతులుగా శ్రీ బ్రహ్మాండం రవీంద్రరావు అన్నయ్యగారు విచ్చేసి విద్యార్థులను ఆశీర్వదించారు. పూర్వ విద్యార్థులలో గురు సత్కార గ్రహీతలుగా ఇరుకు విద్యాసాగర్ గారు, ఋగ్వేద పురుష శ్రీ శేషసాయి గారు మరియు పోలూరి శ్రీకాంత్ గారు లకు అమ్మ ఆశీ: పూర్వక సత్కారాన్ని అందించారు. సంస్థ పెద్దలు బొప్పూడి రామబ్రహ్మంగారు, శ్రీ గిరిధర్ కుమార్ గారు, శ్రీ చక్కా శ్రీమన్నారాయణ గారు, శ్రీ రావూరి ప్రసాద్ గారు, గిద్దలూరు నుండి శ్రీ రామభూపాలరెడ్డి గారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. శాంతిమంత్రంతో కార్యక్రమం ముగిసింది.

08-08-2022 – 12-9-2022 సంస్కృత భాషా దినోత్సవం

జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 12-08-2022 శుక్రవారం రోజున సంస్కృత భాషా దినోత్సవం జరిగింది. కళాశాల ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ డా. అన్నదానం హనుమత్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ఆత్మీయ అతిథిగా చరిత్ర ఉపన్యాసకులు శ్రీ ఓంకారానందగిరి స్వామి మరియు మన కళాశాల పూర్వ విద్యార్థి డా. పోలూరి శ్రీకాంత్ సంస్కృత అధ్యాపకులు కోటప్పకొండ పాల్గొన్నారు. సంస్కృత భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని పోలూరి శ్రీకాంత్ గారిచే మన కళాశాలలో 08-08- 2022 నుంచి 12-08-2022 వరకు సంస్కృత సంభాషణ శిబిరం నిర్వహించబడింది. చివరి రోజున అనగా 12-08-2022 తేదీన శిబిర సమారోపన కార్యక్రమం జరిగింది. ఈ సభలో హనుమత్ ప్రసాద్ గారు అధ్యక్ష భాషణ చేస్తూ మన భారతదేశం యొక్క జ్ఞాన సంపద ఎన్నో తాళపత్ర గ్రంథాలలో నిక్షిప్తమై ఉన్నదని అవి అమర భాష అయిన సంస్కృతం లోనే ఎక్కువగా వ్రాయబడ్డాయని చెప్పారు. కనుక మనమంతా సంస్కృత భాషా నైపుణ్యాన్ని సంపాదించుకొని వాటిని భావితరాలకు అందించాలని సూచించారు. అనంతరం ఓంకారానందగిరి గారు మాట్లాడుతూ సంస్కృత భాష ప్రాశస్త్యాన్ని వివరించి మన కళాశాలలో సంస్కృత వ్యాప్తికి కృషి చేస్తున్న వారందరికీ అభినందనలు తెలిపారు. పోలూరి శ్రీకాంత్ మాట్లాడుతూ సంస్కృత సంభాషణ శిబిరాన్ని మన కళాశాలలో నిర్వహించడం అమ్మసేవగా భావిస్తున్నానని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ, విద్యార్థులు ” అన్నపూర్ణాలయం”, “ వరలక్ష్మీ వ్రతం” అను లఘు నాటికలు సంస్కృతంలో ప్రదర్శించారు. భారవి మహాకవి వైశిష్ట్యం గురించి సంస్కృతంలో విద్యార్థిని కె. వసంత వివరించింది. సంస్కృత వార్తలు – అర్కపురి విశేషాలు కె. లక్ష్మయ్య, గీతాశ్రావికా అమ్మ గీతాలు, సింహా రెడ్డి, సంస్కృత గీతాలతో విద్యార్థుల హర్షధ్వానాల మధ్య కార్యక్రమం ముగిసింది.

ఆజాదీ కా అమృత మహోత్సవం

ఈ ఉత్సవాల్లో భాగంగా జిల్లెళ్ళమూడి మాతృశ్రీ ఓరియంటల్ కళాశాలలో 13, 14 తేదీల్లో పలు దేశభక్తి కార్యక్రమాలు జరిగాయి. విద్యార్థులకు 13 వ తేదీ ఉ దయం చిత్రలేఖనం మధ్యాహ్నం వ్యాసరచన పోటీలు నిర్వహించారు. కళాశాల భవనంపై మువ్వన్నెల జండా ఎగురవేశారు. అనంతరం విశ్వజననీ టెంపుల్స్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ యమ్. దినకర్ గారి చేతులమీదగా గుంటూరు జిల్లా స్వాతంత్ర్యోద్యమకారుల చరిత్ర ప్రదర్శన ప్రారంభించబడింది. అదేరోజు మధ్యాహ్నం విద్యార్థుల్లో దేశభక్తి స్ఫూర్తిని కలిగించేలా గీతాలాపన కార్యక్రమం జరిగింది. 14వ తేదీ ఉదయం అమృతోత్సవ నినాదాలతో కళాశాల నుండి ర్యాలీ ప్రారంభమై జిల్లెళ్ళమూడి గ్రామంలో కొనసాగింది. దేశభక్తి గీతాలు ఆలపిస్తూ ‘హర్ ఘర్ తిరంగా’ అని గ్రామస్థులలో స్ఫూర్తి కలిగేలా విద్యార్థులు అధ్యాపకులు ఈ ర్యాలీని నిర్వహించారు. 

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు

భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకలు మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల జిల్లెళ్ళమూడిలో ఆగస్టు 15వ తేదీన ఘనంగా జరిగాయి. అమ్మ చిత్రపటానికి శ్రీయం. దినకర్ పూలమాలను అలంకరించి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శ్రీమతి బి.ఎల్.సుగుణ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ డా. అన్నదానం హనుమత్ప్రసాద్ సభా నిర్వహణ చేశారు. అనంతరం కళాశాల సెమినార్ హాల్లో జరిగిన సభలో కరస్పాండెంట్ శ్రీమతి బి ఎల్ సుగుణ గారు ప్రసంగిస్తూ ధార్మిక, ఆధ్యాత్మిక నైతిక విలువలు కలిగిన మన భారతదేశం నేడు అందరికీ స్ఫూర్తిగా నిలిచిందని చెప్పారు. అంతేకాక 1958 అగస్టు 15న జిల్లెళ్ళమూడిలో అన్నపూర్ణాలయాన్ని స్థాపించి స్వయంగా అమ్మే ప్రపంచానికి స్వాతంత్రం వచ్చిన రోజు అని ప్రకటించిందని చెప్పారు. శ్రీయం దినకర్ గారు మాట్లాడుతూ స్వాతంత్య్ర అనంతరం లాల్ బహుదూర్ శాస్త్రి, శివరామన్ వంటి వారు మనదేశంలో ఆహార కొరత తీర్చడానికి ఎంతో కృషి చేశారని తెలియజేశారు. అనంతరం శ్రీ మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తి గారు ప్రసంగిస్తూ గత వైభవాన్ని తలచుకొని భారతీయ భావన, జాతీయ భావనలకు ప్రతినిధులు కావాలని అందరి ఇంటి హక్కులు అందరూ వినియోగించుకుని బాధ్యతలు నిర్వర్తించాలని విద్యార్థులకు దిశా నిర్దేశం చేశారు.

ఇదే వేదికపై పూర్వ విద్యార్థి సమితి తరపున విశ్వజననీ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర్ కుమార్ గారికి ప్రత్యేక సమ్మాన కార్యక్రమం జరిగింది. గిరిధర్ గారు మాట్లాడుతూ విద్యార్థులు దేనిలోనూ వెనుకడుగు వేయొద్దని తమ భావాలను చక్కగా వినియోగించుకునే సరైన వేదిక మన కళాశాల అనీ కావున అందరూ ముందుకు రావాలని ఉత్సాహపరిచారు. అనంతరం కళాశాలల విద్యార్థులకు పూర్వ విద్యార్థి సమితి తరుపున యమరా బత్తుని శివరామకృష్ణ, గుంటూరు వారి సహకారంతో నోటు పుస్తకముల పంపిణీ జరిగింది. విద్యార్థినీ విద్యార్థులు దేశభక్తి గీతాలతో చక్కని ప్రసంగాలతో సభను అలరించి పెద్దలందరి ఆశీస్సులు పొందారు. విద్యార్థుల బృందం ప్రత్యేక పిరమిడ్ విన్యాసాన్ని ప్రదర్శించారు. కళాశాల తెలుగు శాఖ అధ్యాపకులు డాక్టర్ ఎల్ మృదుల వందన సమర్పణ చేశారు. మిఠాయి పంపిణీతో నాటి కార్యక్రమం ముగిసింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!