1. Home
  2. Articles
  3. Viswajanani
  4. వాగ్వాదినీ

వాగ్వాదినీ

Mallapragada Srivalli
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 22
Month : December
Issue Number : 5
Year : 2022

“వాక్కులను పలికేది, పలికించేది లలితాదేవి. తన భక్తుల నాలుకల చివర వాగ్రూపంగా ఉంటూ వారిచేత పలికింప చేస్తుంది. కాబట్టి లలితాదేవి ‘వాగ్వాదిని’ – సమస్త శబ్దజాలానికి జనని కనుక లలితాదేవి ‘వాగ్వాదిని’.

సర్వజీవుల వాక్కులకు మూలరూపిణి అయిన శ్రీమాత ‘వాగ్వాదిని” – భారతీవ్యాఖ్య.

మన మనస్సులోని భావాలను ఇతరులతో పంచుకోవడానికి మాటలు చాలా అవసరం. అయితే, మనం మాట్లాడుతున్నాం అంటే అది మన గొప్పతనం ఏ మాత్రం కాదు. అమ్మవారి అనుగ్రహం. అందుకే తెలుగుల పుణ్యపేటి బమ్మెర పోతనామాత్యులు “పలికెడిది భాగవతమట; పలికించెడు విభుండు రామభద్రుండట” అని స్పష్టంగా చెప్పారు. మన చేత పలికించే పలుకుల తల్లి శ్రీలలిత. అందుకే శ్రీమాత ‘వాగ్వాదిని’.

“అమ్మ” – ‘వాగ్వాదిని’ పలుకులను పలికేది, మన చేత పలికించేది “అమ్మే”. ఈ శక్తి “అమ్మ”కు అందరి అమ్మగా లోకానికి తెలిసిన తర్వాత వచ్చినది కాదు. మాటలు వచ్చిన నాటి నుంచి “అమ్మ” అక్షరాలతో ఆటలాడుకుంది. ‘జైలు కావాలా’ అని బెదిరించిన పోలీసుతో – “జై, జై”లు అనే అర్థంలో “జైలు కొడతావా? అప్పుడే వద్దులే” అని చమత్కరించిన “అమ్మ” ‘వాగ్వాదిని’.

పసిప్రాయంలోనే చిదంబరరావు తాతగారికి రామతత్త్వాన్నీ, కృష్ణతత్త్వాన్నీ తేటతెల్లబరచి, అన్నీ, అందరూ ఒకటే అనే అద్వైత సిద్ధాంతాన్ని విశదీకరించి, ఆయనను ఆనంద పరవశులను చేసింది. ఆ పారవశ్య స్థితిలోనే తాతగారు “అమ్మ”ను – ‘శబ్దమంజరివా’ అని ఆశ్చర్యంతో ప్రశంసించారు. అంతేకాదు. తాను మాటాడుతున్న ఆ మాటలు కూడా “అమ్మే” అని గ్రహించారు. ఆ రోజుల్లోనే ‘నాగులచవితి’ పర్వదినంలో పుట్టకు వెళ్ళి అందరికీ నాగేంద్రుని దర్శనం చేయించిన “అమ్మ” అందరూ ఇళ్ళకు మళ్ళాక, తాతగారితో నాగుపాము పడగ నీడలో తలదాచుకుందామా అని అడిగితే అందుకు వారు ‘నీకేమమ్మా? పాము పడగ నీడన కాపురమూ చేయగలవు’ అని పరిహాసమాడారు. అది హాస్యమా ? జోస్యమా? అని రెట్టించింది “అమ్మ”. అందుకాయన తనకు వాక్సిద్ది లేదు లెమ్మని కొట్టి పారేస్తే “అయితే మీరు పలికే పలుకులన్నీ మీవేనని మీ ఉద్దేశమా?” అని ప్రశ్నించింది. దీన్ని బట్టి మనం పలికే పలుకులు కూడా మనవి కావు అని అర్థమవుతున్నది – కదా! పలికేదీ, పలికించేదీ “అమ్మే” అని అంత చిన్న వయస్సులోనే ప్రకటించిన తల్లి – ‘వాగ్వాదిని’.

ఇంత తత్త్వాన్ని చిన్నతనంలోనే ఔపోసన పట్టిన తల్లి, కనీసం బడి తలుపు దాటి, లోపలికి వెళ్ళిన దాఖలాలు కనిపించవు. అంటే, ఇది “అమ్మ” నేర్చుకున్న (వి) జ్ఞానం కాదు; ప్రాక్తన జన్మవిద్య.

‘నువ్వు ఎప్పుడైనా బడికి వెళ్ళావా, అమ్మా?’ అని ప్రశ్నించిన ఒకరితో “చచ్చిపోతానని బడికి పంపలా మా నాన్న” అని తాను బడికి వెళ్ళకపోవటానికి కారణం కూడా చెప్పింది “అమ్మ”. అక్షర జ్ఞానం లేని ఆ తల్లిని ‘పుస్తకం మొత్తం చదివావా’ అని ఒకరు అడిగితే “మొదలు, మధ్య, చివర. పుస్తకం మొత్తం చదివే ఓపిక విశ్వజనని లేదు” అని “అమ్మ” సమాధానం. ఆ పుస్తకం లోని విషయమే తాను అయిన “అమ్మ” ఆ పుస్తకాన్ని ప్రత్యేకంగా చదువవలసిన పనిలేదు. అయితే, ఆ పుస్తకం ఇచ్చిన వారి తృప్తి కోసం ఒకసారి చూసి ఇచ్చేస్తుంది. అందువల్ల “అమ్మ” చేతిస్పర్శకు ఆ పుస్తకం మేమున్నది? పవిత్రమవుతుందే తప్ప, అందులోని విషయం “అమ్మ”కు తెలియదని కాదు. ‘వాగ్వాదిని’ అయిన “అమ్మ”కు తెలియనిది ఏముంటుంది? ఈ విషయం ఆ పుస్తకం రచయితకూ తెలిసినదే.

‘నీకు అరవం వచ్చా?’ అనే ప్రశ్నకు “ఏదీ రాదు; అన్నీ వచ్చు” అనేది “అమ్మ” జవాబు. నిజమే. ఎందరో రాష్టేతరులు, విదేశీయులు “అమ్మ”ను దర్శించి, అనేక విషయాలు “అమ్మ”తో ముచ్చటించేవారు. వారు వారి మాతృభాషలో మాట్లాడేవారు. “అమ్మ” అచ్చమైన తెలుగులో వారికి బదులిచ్చేది. వారు సంతృప్తులయ్యే వారు. ఇదెలా సాధ్యం? అంటే “హృదయం తెలుసుకోవటానికి వాక్కుతో పనిలేదు” అని “అమ్మే” చెప్పింది కదా? అందరి హృదయాంతర్వర్తిని అయిన “అమ్మ”కు భాషతో పనిలేదు. అమ్మది హృదయభాష.

ఒక పిల్లవాడికి అక్షరాభ్యాసం చేయిస్తూ “అమ్మ” – ఓం అని వ్రాసింది. ఆ అబ్బాయి ఆ అక్షర చూడకుండా “అమ్మ”నే చూస్తున్నాడు. అప్పుడు “అమ్మ” “చూడనీ, ఇద్దరూ ఒకటేలే” అని చెప్పి, ఓంకార స్వరూపిణిగా తన్ను తాను ప్రకటించుకుంది. ‘అమ్మా’ మీ మాటలు వింటుంటే వేదాల్లోనుంచి మహావాక్యాలు తీసి చేతికిస్తున్నట్లు ఉన్నాయి” అనే ఒక సోదరుని పలుకులు అక్షరసత్యాలు.

ఏదైనా వ్రాయమని ఒకసోదరి “అమ్మ”కు తన డైరీని అందించింది. “అంఅ, అంమ, అమ్మ” అని వ్రాసింది “అమ్మ”. వాటి అంతరార్థమేమిటి అని ప్రశ్నించిన ఆ సోదరితో “అక్షరాలను బట్టి ఉచ్చారణలో తేడా వస్తుంది కానీ, వాటి భావం ఒకటే. వాటి అన్నింటి అర్థం అంతులేనిదీ, అడ్డులేనిదీ, ఆధారమైనదీ” అని వివరించిన “వాగ్వాదిని” మన “అమ్మ”.

‘చదువుకోని దానివి ఎలా వ్రాశావమ్మా” అనే ఒకరి సందేహానికి “చదువుకోని చదువుతో వ్రాశాను” అని చెప్పింది అమ్మ. అవును నిజమే కదా! చదువే తాను అయిన తల్లికి చదువుకోవలసిన అవసర

ఒక సందర్భంలో ‘నీకు ఇంగ్లీషు మాటలు బాగా తెలుసే’ అని ఒక అన్నయ్య విస్తుపోయారు. మరొకసారి ఇంగ్లీషులో ఉన్న చీటీని “అమ్మ” చేతికి ఇస్తే, ‘ఇది ఇంగ్లీషులో ఉన్నది. నాకు ఇంగ్లీషు రాదుగా, అయినా ఇది నాకు కాదు” అంటూ ఆ చీటీని ప్రక్కనున్న వారికి ఇచ్చేసింది “అమ్మ”. ఇంగ్లీషు తెలియని “అమ్మ”కు అది ఇంగ్లీషు లిపిలో ఉన్నదని తెలిసింది. అంతేకాదు. అచీటీ తనకు కాదనీ తెలిసింది. ఇంతకీ “అమ్మ”కు ఇంగ్లీషు తెలిసినట్టా, తెలియనట్టా! అనేది మన మనసులో “అమ్మ” బిగించిన “నట్టు”.

భాషతో సంబంధం లేకుండా ఏ భాషా పదాలతో అయినా గిమిక్స్ చేసే “అమ్మ”కు అక్షరాలు ఆటవస్తువులు. పదాలను అటూ ఇటూ మార్చి పరమ ప్రయోజనాన్నీ, పరమార్థాన్నీ మనకు అందించే “అమ్మ” – వాగ్వాదిని. “డివైన్ మదరేమిటి? మదరే డివైన్”, “కమిటీలే కాని అక్కడ కమిట్మెంట్ లేకపోవడం వల్ల ఈ గొడవలన్నీ జరుగుతున్నాయి”, “ఆయన పేరే కోదండం; ఆయనకో దండం పెడితేసరి”, “సమస్యల తోరణం, సమస్యలతో రణం’ ఇలా పదాలతో ఆటలాడుకోవడం “అమ్మ”కు ‘వెన్నతో పెట్టిన విద్య’ కాదు; పుట్టుకతో వెంట వచ్చి, ఒంట బట్టిన విద్య.

ఇలా “అమ్మ” లోని వాగ్వైభవం, వాగ్వైచిత్రి, వాక్చాతుర్యం “అమ్మ” చిన్నతనం నుంచీ ఎందరెందరినో ఆకట్టుకుని, అబ్బురపరచి, ఆనందాంబుధిలో ఓలలాడించింది.

అర్కపురిలోని అందరింటిలో అనసూయేశ్వ రాలయంలో ‘వాగ్వాదిని’గా కొలువుతీరిన “అమ్మ”ను మనసారా స్మరించి, తనివిదీరా దర్శించి, తరించుదాం.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!