భారతదేశంలో ఆధ్యాత్మిక సంపన్నులకు, అవతార పురుషులకు కొదువలేదు. మహర్షులు జాతిని జాగృతం చేసి మానవ మనుగడలోని రహస్యాన్ని గుర్తించి పద్ధతులకు, చైతన్యవంతమైన జీవనానికి _మార్గదర్శనం చేసి ఆదర్శంగా నిలచారు. శ్రీరామ శ్రీకృష్ణాది అవతార పురుషులు, శంకర్, రామానుజ, మధ్వాది ప్రవక్తలు ధర్మోద్ధరణకు కంకణం ధరించి జాతీయ జీవనాడిని గ్రహించి ప్రజల హృదయాలలో  నిలచారు.

ఇప్పటి దాక వచ్చిన ఏ అవతారమైనా దుష్టశిక్షణ శిష్టరక్షణ తమ ఆదర్శంగా తలచినవారే. ఒక్క గోలోక నాయక బృందావనేశ్వరి రాధాదేవి తప్ప. అయితే రాధా ప్రేమతత్వాన్ని గ్రహించిన వారు చాల తక్కువ. అందునా ఆంధ్ర దేశం లో మరీ తక్కువ.

జిళ్ళెళ్ళమూడి అమ్మగా లోకంలో ప్రసిద్ధి వహించిన మాతృశ్రీ అనసూయదేవీ మాత్రం విశ్వజననియై విశ్వజనీనమైన ప్రేమను లోకానికి పంచిపెట్టింది. నీకు, మీకు, సర్వశృష్టికి అమ్మనని ప్రకటించింది. అమ్మ అంటే అంతులేనిది అడ్డులేనిది. అంతటికి ఆధారమైనది అన్నది. అందరమ్మ కనుక తన యింటికి అందరిల్లు అని నామకరణం చేసింది.

అలాంటి అమ్మ ఉపన్యాసాలివ్వదు. గ్రంధాలు వ్రాయదు. ఐనా ఆమె అనురాగాన్ని వాత్సల్యాన్ని చూరగొన్న వాళ్ళు వేలు, లక్షలు, కోట్లు దాటారు. అమ్మను గూర్చి తెలుసు కుందామనే తపన చాలా మందిలో కలగటం సహజం. అలా తమ ఆనందానుభవంతో అమ్మ దగ్గరకు తరుచు వచ్చి ప్రసంగవశాన తెలుసుకున్న విషయాలు, సంభాషణలలో అమ్మ పలికిన పసిడి పలుకులు కొన్ని తమ డైరీలలో పదిలం చేసుకున్నారు. కొందరు అమ్మ సంభాషణలు వ్రాసుకున్నారు. కొందరు తమ యొక్క ఇతరుల యొక్క అనుభవాలను గ్రహించి కావ్యాలు గ్రంధాలు వ్రాశారు.

అలా వ్రాసిన వారిలో సుప్రసిద్ధులు సర్వ శ్రీ మిన్నికంటి గురునాధశర్మ, డాక్టర్ ప్రసాదరాయ కులపతి, మన్నవ బుచ్చి రాజుశర్మ, బృందావనం రంగాచార్యులు, యార్లగడ్డ రాఘవయ్య, డాక్టర్ శ్రీపాద గోపాలకృష్ణ మూర్తి, డాక్టర్ పన్నాల రాధాకృష్ణశర్మ వంటి వారున్నారు.

1960 లో అమ్మను దర్శించిన శ్రీ కోటంరాజు రామారావు గారు. అమ్మను గూర్చి పత్రికలో వ్యాసం వ్రాస్తామన్నారు తన అనుభూతిని పంచుకొని అందరూ అమ్మవద్దకు వచ్చి తరించాలని వారి ఊహ. ఎందుకురా ? నీవు ఏ పత్రిక చదివి వచ్చావిక్కడికి ? ఎవరికి తరుణం వస్తే వాళ్ళు వస్తారు అన్నది అమ్మ.

అమ్మ అన్న తరుణం వచ్చే సూచనలు 1962 లో కనిపించాయి. అమ్మ జన్మదినోత్సవానికి వివిధ కవులు రచయితలు వ్రాసిన రచనలు మొదటిసారి. జన్మదినోత్సవ కానుకగా మాతృశ్రీ పేర అమ్మకు ఒక సంచిక సమర్పింపబడింది. అలా నాలుగు సంవత్సరాలు జన్మదిన ప్రత్యేక సంచికలు 1966 దాకా వెలువడ్డాయి.

శ్రీ అధరాపురపు శేషగిరిరావు గారు అందరింటి రూపశిల్పి అమ్మ అనంగు బిడ్డ మాతృశ్రీ ప్రింటర్స్ పేర ప్రెస్ పెట్టి దాని నుండి మాతృశ్రీ మాసపత్రిక సంపాదకులుగా అంకురార్పణ చేశారు.

కొండముది రామకృష్ణ. కొండముది గోపాల కృష్ణమూర్తి ఆ కార్యభారాన్ని వహించారు. ఆ సందర్భంగానే నాన్నగారు (బ్రహ్మాండం నాగేశ్వరరావు గారు) ప్రతి నెల ఏంవ్రాస్తారురా ? అన్ని విషయాలు ఏముంటవి ? అని ప్రశ్నిస్తే రామకృష్ణన్నయ్య చూసే కన్ను వ్రాసే పెన్ను ఉండాలి కాని ఎన్నైనా వ్రాయవచ్చు. అయినా వ్రాసేది మనం కాదు కదా! వ్రాయించే శక్తి అత్తయిచ్చి వ్రాయిస్తుంది. అన్నారు. అలా 1966 జూన్లో ఆరంభింప బడిన మాతృశ్రీ మాసపత్రిక నిరాఘటంగా విజయ పథంలో రెండు పుష్కరాల కాలం 1991 దాకా తెలుగు, ఇంగ్లీషులలో వెలువరింప బడింది.

అమ్మ తాత్విక దృక్పథాన్ని, అనంత వాత్సల్యాన్ని, జీవిత చరిత్రను, అమ్మ ప్రసంగవశాన పలికిన ఆణి ముత్యాల వంటి అమ్మ వాక్యాలను, జిల్లెళ్ళమూడిలో జరిగే విశేషాలను వివిధ ప్రదేశాలలో గల మాతృశ్రీ అధ్యయన పరిపత్తులు నిర్వహించే కార్యక్రమాలను సోదరీ, సోదరుల అనుభూతులను దేశదేశాలలోని భక్తులకు సోదరీ . సోదరులకు తెలియ చేసే సాధనంగా వారధిగా మతృశ్రీ పత్రిక నిలిచింది 

1992 లో జరిగిన కొన్ని పరిణామాల వల్ల పత్రిక ప్రచురణ నిలచిపోయింది. శ్రీ విశ్వజననీ పరిషత్ ఛత్రం క్రిందకు అమ్మచే  ఏర్పాటు చేయబడిన అన్ని సంస్థలు, విభాగాలు ఈ మధ్య ఒకే త్రాటిపై నడువటానికి నిర్ణయించు కోవటం శుభపరిణామం.

ఆ సందరర్బంగా మళ్ళీ మాతృశ్రీ పత్రిక ప్రచురించాలని శ్రీ విశ్వజననీ పరిషత్ అధ్వర్యంలోని మాతృశ్రీ పబ్లికేషన్స్ నిర్ణయించి ప్రభుత్వ అనుమతిని కోరింది. మన అభ్యర్థనను మన్నించిన ప్రభుత్వం పత్రికను విశ్వజనని పేర ప్రచురించు కోవటానికి అనుమతి మంజూరు చేసింది. ఇదిగో మళ్ళీ మీ కరకమలాలలో విశ్వజనని పేరుతో మాతృశ్రీ  మాసపత్రిక నిలిచింది. దేనికైనా పరిణామమే తప్ప మరణం లేదన్నది. అమ్మ, అలాగే మాతృశ్రీ మాస పత్రిక కూడా విశ్వజనని పేర పరిణామం చెంది మనముందున్నది.

దీనిని ఆదరించే భాద్యత మన అందరిదీ. దీన్ని నిరాఘాంటగా నిత్యనూతనంగా నడిపించే శక్తి అమ్మది. ఆ శక్తిని ఇమ్మని అమ్మను ప్రార్ధిస్తున్నాము.

– పి యస్ ఆర్