Kondamudhi Bala Gopala Krishna Murthy

 

శ్రీ గోపాలన్నయ్య ( కె. బి. జి. కృష్ణమూర్తి )

 

వీరు 25-04-1932 తేదీన జన్మించారు. గుంటూరుజిల్లా, బాపట్ల తాలూకా అప్పికట్ల గ్రామం వీరి స్వస్థలం. తల్లిదండ్రులు శ్రీ కొండముది లక్ష్మీనారాయణ, శ్రీమతి వరలక్ష్మి, భార్య – శ్రీమతి వెంకాయమ్మ. సంతానం- ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. విద్య – S.S.L.C.

సేవాతత్పరత: మాతృశ్రీ పబ్లికేషన్స్, యస్.వి.జె.పి. కార్యకలాపాలు, అమ్మ, చలనచిత్ర నిర్మాణ బాధ్యతలతో పాటు, నేటికీ తమ 90వ పడిలో ప్రత్యక్షంగా, పరోక్షంగా అమ్మను త్రికరణశుద్ధిగా సేవిస్తున్నారు. ‘అమ్మ సన్నిధిలో నా అనుభవాలు – జ్ఞాపకాలు’, ‘అమ్మ తత్త్వదర్శనం’ వీరి రచనలు.

వీరు 21-10-2017న జిల్లెళ్ళమూడి పవిత్రక్షేత్రంలో అమ్మలో ఐక్యమైనారు.

శ్రీ రావూరి ప్రసాద్ 18-10-2011వ తేదీన జిల్లెళ్ళమూడిలో శ్రీ కె.బి.జి.కృష్ణమూర్తి గారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీ తొలి అమ్మదర్శనం – నాటి జ్ఞాపకాలు తెలియజేయండి?

మా ఊరు బాపట్ల సమీపాన అప్పికట్ల. అక్కడ జరిగే సప్తాహాలకి అమ్మ కూడా వస్తూండేది. వాటిని రఘువరదాసు గారు నిర్వహించేవారు. (అమ్మ మరిది) లోకనాధం బాబాయి అప్పికట్లలో టీచర్ పని చేస్తూండేవారు. అమ్మ వారింటికి వచ్చేది. 1950 లో మొదటిసారి అమ్మను నేను అక్కడే చూశాను. అమ్మ పెద్దకుమారుడు సుబ్బారావు అప్పికట్లలో చదువుతూండేవాడు. అప్పటికి అమ్మ లోకనాధంగారి వదినెగా, సుబ్బారావు తల్లిగా మాత్రమే నాకు తెలుసు. ఆ సందర్భంగా ఒకరోజు నేను, నా సోదరుడు రామకృష్ణ కలిసి వస్తుంటే ఒకచోట అమ్మ కనిపించింది. అమ్మని కొండముది రామకృష్ణ పలకరించాడు. వాడే నన్ను అమ్మకు పరిచయం చేశాడు. అదే అమ్మను తొలిసారి నేను దర్శించటం.

మొదటిసారి మీరెపుడు జిల్లెళ్ళమూడి వచ్చారు? ఆనాటి మీ దర్శనానుభూతు లేమిటి?

ది 15-8-1960న నేను, రామకృష్ణ ఇద్దరం మొదటి సారి జిల్లెళ్ళమూడి వెళ్ళాం. అక్కడేదో ఒక ఉత్సవం జరుగుతోంది. అమ్మ దర్శనానంతరం ప్రయాణమై 7వ మైలురాయి త్రోవలో మొదటి ఒరవ దాకా వచ్చాం. ఒక పిల్లవాడు మావెనుక పరుగెత్తుకుంటూ వస్తూ ‘అప్పికట్ల పిల్లలు అమ్మగారు పిలుస్తున్నారండీ. వెనక్కి రమ్మన్నారు.’ అని చెప్పాడు. తిరిగి వెనక్కి వెళ్ళాం. అమ్మ పర్ణశాల ప్రక్కనే ఒక వేదిక మీద కూర్చున్నది. అంథసోదరుడు శ్రీ సిరిగిరి సుబ్బారావు లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రాన్ని ఆర్ద్రతతో పాడుతున్నాడు. అమ్మకూర్చున్న బల్లకి చెరియొక వైపు మేం నిలబడ్డాం. తర్వాత అందరి భోజనాలు అయ్యాయి. అక్కడ పిల్లలు, పెద్దలు అందరూ ఏదో ఒక పనిచేస్తున్నారు. నేను రామకృష్ణతో ‘మనకు చేతనైన పనిని మనం కూడా చేస్తే బాగుంటుందేమో’ అన్నాను. ఆ రోజుల్లో మాకు బాపట్లలో పుస్తకాలషాపు ఉండేది. ‘అమ్మ మీద సాహిత్యం తెస్తే బాగుంటుందేమో’ అన్నాను. వాడు ‘సరే’ అన్నాడు. రాజుబావ పాటలు అప్పుడే కొత్తగా వింటున్న రోజులవి. వాటిని గ్రంధరూపంగా తీసుకుని రావాలనిపించింది నాకు.

అమ్మ సాహిత్య ప్రచురణ పరిణామ క్రమం ఏమిటి?

1962 సంవత్సరము అమ్మ జన్మదినోత్సవ సందర్భంగా ఒక ప్రత్యేక సంచిక సంవత్సర సంచిక- సావనీర్ ను తీసుకు వద్దామనుకున్నాము. బ్రహ్మాండం సుబ్బారావు, PSR ఆంజనేయప్రసాద్ సహకారంతో రచనలు సేకరించాం. మా ‘అత్రివాణి’ ప్రెస్లోనే ప్రత్యేక సంచిక ప్రచురించి అమ్మకు సమర్పించాం. అది మొదలు 1963 నుండి 1966 వరకు మేము ఏటా అమ్మ జన్మదినోత్సవ ప్రత్యేక సంచికను ప్రచురించి ‘అమ్మ’కు సమర్పించాం. 1966లో అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య ‘ఈ పత్రిక చాలా బాగుంది. దీనిని మాస పత్రికగా తీసుకువద్దాం. దాని ఖర్చు బాధ్యత నేను చూస్తాను. ప్రచురణ బాధ్యత మీరు తీసుకోండి’ అన్నారు. మేము అంగీకరించాం. అప్పటి నుంచి ‘మాతృశ్రీ’ మాసపత్రిక వెలువడింది. 1968 వరకు శేషగిరిరావు అన్నయ్య ప్రొప్రయిటర్‌గా, మాతృశ్రీ పబ్లికేషన్స్ పేర ఆ పత్రిక ప్రచురించాం. ఆ తర్వాత నన్ను మేనేజింగ్ ట్రస్టీగా, మాతృశ్రీ పబ్లికేషన్స్ ట్రస్ట్, మాతృశ్రీ ప్రింటర్స్ సంస్థలుగా రూపుదిద్దారు. శ్రీ కొండముది రామకృష్ణ, డా॥ శ్రీపాద గోపాలకృష్ణమూర్తి, శ్రీ ఎక్కిరాల భరద్వాజ, శ్రీ తంగిరాల కేశవశర్మ, ట్రస్టీలుగా ఉన్నారు. నాటి నుంచి రామకృష్ణ ఎడిటర్‌గా ‘మాతృశ్రీ’ తెలుగు, భరద్వాజ ఎడిటర్ Matrusri English మాసపత్రికలు నిరాటంకంగా వెలువడసాగాయి.

తర్వాత కారణాంతరాల వల్ల ఆ పత్రికలు ఆగిపోయాయి. 1999 నుంచి హైదరాబాద్ సోదరులు ‘Mother of All’ అనే త్రైమాసిక పత్రికను ప్రచురించసాగారు. 2000 నుంచి ‘మాతృశ్రీ’ స్థానే ‘విశ్వజనని’ అమ్మ మాసపత్రికను PSR ఆంజనేయప్రసాద్ ఎడిటర్‌గా, నేను Managing Editor గా మళ్ళీ ప్రారంభించాం. నేటివరకు అవిచ్ఛిన్నంగా ప్రచురితమౌతోంది. మాతృశ్రీ పబ్లికేషన్స్ తరఫున ‘అమ్మ’పై సాహిత్యపరంగా ఎన్నో గ్రంధాలను ప్రచురించాం. అలా సాహిత్యసేవలో పాల్గొనటం నా అదృష్టం.

అమ్మతో సన్నిహితంగా మెసిలే అవకాశం ఎలా కలిగింది ?

అమ్మ ఒకసారి “నువ్వు రామకృష్ణతో పాటే రావాల్సిన అవసరం లేదు. ఇవాళ రాత్రికి ఒక్కడివేరా” అని నాకు బాపట్లకి కబురు చేసింది. రాత్రి 9.00లకి మా Book shop కట్టేసిన తర్వాత నేను బయలుదేరాను. 7 వ మైలు వద్ద దిగాను. అపుడు రోడ్డు లేదు; డొంకే- అన్నీ పొదలు, గుట్టలు. చీకటి. ఏం చేయాలో తెలియక నిలబడ్డాను. ఆ డొంకలో సన్నటి తెల్లటిదారి కనిపించింది. క్రమంగా ఆ వెలుగులో నడచి అమ్మ వద్దకు వచ్చా. అమ్మ అన్నం కలిపి తినిపించింది; “రామకృష్ణని- నీకు ప్రాణస్నేహితుడు ఎవరైనా ఉన్నారా? అని అడిగితే నీ పేరు చెప్పాడు. అందుకు పిలిపించాను. మొన్న ఎక్కిరాల వేదవ్యాస్ ఇక్కడికి వచ్చాడు. రామకృష్ణని చూసి – ఈ అబ్బాయి ఎవరో కానీ ఎక్కువకాలం బ్రతకడమ్మా! వాని ముఖం చూస్తే నాకు అనిపించింది – అన్నారు. నువ్వు వెళ్ళి వాళ్ళ అమ్మకీ విషయం తెలియచెయ్యి ” అని చెప్పింది. ఈ విషయాన్ని నా శ్రేయోభిలాషి చుండూరి రాఘవయ్యగారికి చెబితే ‘రుద్రాభిషేకాలు చేస్తే ఆ ప్రభావాన్ని తగ్గించవచ్చు’ అన్నారు. అప్పికట్ల వెళ్ళి రామకృష్ణ వాళ్ళ అమ్మతో విషయం చెప్పా. ఈ కుటుంబాన్ని దురదృష్టం ఇంకా పట్టిపీడిస్తోందే – అంటూ ఆమె వలవలా ఏడ్చింది. అందుకు కారణం రామకృష్ణ వాళ్ళ తాత, నాన్న అందరూ 30 ఏళ్ళ వయస్సులోనే పోయారు. రామకృష్ణతో విషయం చెప్పి ‘అప్పికట్ల లేక బాపట్ల శివాలయాల్లో అభిషేకం చేద్దాం’ అన్నాను. ‘చేస్తే అమ్మ పాదాలకే చేస్తాను నేను మరి ఎక్కడకూ రాను’ అన్నాడు రామకృష్ణ.

తర్వాత కుమారస్వామి మందిరంలో వేదికపై అమ్మకి అభిషేకాలు ప్రారంభించాం. 11 వారాలు చేశాం. మొదటిసారి అమ్మకి రుద్రాభిషేకం. జరుగుతుంటే చూస్తూ నేను ప్రక్కనే నిలబడి ఉన్నాను. ఆ అభిషేకం నాకే జరిగినట్లు అనుభవమైంది. కేవలం భావావేశం కాదు. బుంగ నీళ్ళు నెత్తిన కుమ్మరిస్తే ఎట్లా ఉంటుందో అలాంటి అనుభవం అయింది నాకు. క్రతువు అయిన తర్వాత ఋత్విజుడు శ్రీరామలింగసోమయాజి అమ్మతో ‘నేను కాశీ రామేశ్వరాల్లో ఎన్నో శివాలయాల్లో అభిషేకాలు చేయించాను. కానీ ఇవాళ ఇక్కడ నేను ఎక్కడా పొందని ఆనందానుభూతి పొందానమ్మా’ అన్నారు. అభిషేకం నిమిత్తం కన్యాకుమారి వెళ్ళి మూడు సముద్రాలు కలిసే చోట నుంచి జలం తెచ్చాను.

అలా 11 వారాలు వరుసగా అమ్మ దగ్గరికి వచ్చాను. పగలు బాపట్ల మా shop లో ఉండి రాత్రి పూట వచ్చేవాడిని. ఆ సమయంలో అమ్మ ‘స్వీయచరిత్ర’ విశేషాలు చెప్పింది. అప్పటికింకా అమ్మ జీవిత చరిత్ర గ్రంధరూపంలో రాలేదు.

జిల్లెళ్లమూడిలోనే వుండాలనే నాటి మీ తలంపుకు కారణం ?

నిత్యం అమ్మ వద్దనే ఉండాలనే స్థిర సంకల్పానికి కారణం ఒక సంఘటన ఉంది. అమ్మ స్వీయచరిత్రను చెప్పే సందర్భంలో కొన్ని వ్యక్తిగతమైన విషయాలు, సంఘటనలకి నేను సాక్షిని. అవి నన్ను బాధించాయి. కావున వాటిని ప్రతిఘటించాలనిపించింది. అందుకు అహర్నిశలు ఒక వ్యక్తి అమ్మను అంటిపెట్టుకుని ఉండాలి. కనుకనే అమ్మతో అన్నాను ‘అమ్మా! నీ దగ్గర ఎవరైనా అహోరాత్రములు ఉంటే ఈ సంఘటనలను నివారించవచ్చు’ అన్నాను. “నాన్నా! ఎవరి ఉద్యోగాలు, వ్యాపారాలు, కుటుంబాలు, జీవితాలు మానుకుని వచ్చి నా దగ్గర అహర్నిశలు ఉంటారు?” అన్నది అమ్మ. ఈ సంభాషణ రాత్రిపూట జరుగుతున్నది. అమ్మ తన మంచంపై పడుకున్నది. నేను కూర్చొని మాట్లాడుతున్నాను. ‘నేనుంటానమ్మా’ అన్నాను. అమ్మ రామకృష్ణ పడుకుని ఉన్నాడు. “మరి వాడో!” అన్నది అమ్మ. ‘వాడూ ఉంటాడు’ అన్నాను. అయితే చేతిలో చేయి వేయండి” అన్నది. అమ్మ చేతిలో నేను చేయి వేశాను. దానిమీద రామకృష్ణ చేతిని కూడా తీసుకొని వేశాను. నాకు బాపట్లలో Book shop కనుక రోజూ రాత్రిళ్ళు వస్తూండేవాడిని. రామకృష్ణ అప్పికటకరణం; వాడు పగలు వచ్చి అమ్మ పూజా కార్యక్రమాలు నిర్వహించేవాడు. నేను రాత్రిళ్ళు తెల్లవార్లూ అమ్మను కనిపెట్టుకొని ఉండేవాడిని. అప్పటికింకా కరెంటు రాలేదు. ఒక చేత్తో విసనకర్రతో విసురుతూ, రెండవ చేత్తో అమ్మ రాస్తూండేవాడిని. ఏ పని ఆగిపోయినా అమ్మ నిద్ర నుంచి లేస్తూండేది. ఆ విధంగా అమ్మ సేవలో పాల్గొనే అవకాశం, అదృష్టం అమ్మ నాకనుగ్రహించింది.

అమ్మపై మీకు విశ్వాసం కలగటానికి గల కారణాలేంటి?

నాకు విశ్వాసం కలగటానికి ఒక అనుభవం ఉంది. 1963లో ఒకామె అమ్మకు పూజ చేస్తోంది. అమ్మ హాలులో దర్శనం ఇస్తోంది. లోపల ఖాళీ లేదు.. హాలు నిండా జనం. నేను ఎట్లాగో లోపలకు వెళ్ళి అమ్మకి ఎదురుగా గోడ ప్రక్కన చోటు చేసుకు కూర్చున్నా. అమ్మను తదేకంగా చూస్తున్నా. దేవతలు అనిమేషులు; రెప్పపాటులేకుండా పరమాత్మని చూస్తూంటారు. అలానే అమ్మ నుదుట ఉన్న కుంకుమ బొట్టుపై నా దృష్టి కేంద్రీకరించాను. క్రమంగా అమ్మరూపం వికసించటం ప్రారంభించింది. ఇంతితై అన్నట్టుగా చివరకు విశ్వంలో కలిసిపోయింది. నాకంటికి కనిపించనంత దూరం చూస్తున్నాను తర్వాత ఏం జరిగిందో తెలియదు. అలా వికసించి విశ్వవ్యాప్తమైన అమ్మరూపం సంకోచించి మరల పరిమితరూపంలోకి వచ్చింది. ఈ క్రమంలో నేను శూన్యంలోకి పోతున్నట్లు తెలిసింది..

ఆ తర్వాత తెలిసింది. నాడు అమ్మకు పూజ చేసుకున్న ఆమె దేవీ ఉపాసకురాలట. కాగా నాకు కలిగిన ఈ అనుభవం ఏమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస నాలో బాగా పెరిగింది. నేను వెళ్ళి అమ్మ ఒడిలో తలపెట్టి అటు ఇటూ తిప్పుతున్నాను. అమ్మ నా తలమీద చెయ్యి పెట్టి “ఏమిటి, నాన్నా! మహదానందంగా ఉన్నావు?” అని అడిగింది. ‘అమ్మా! నాకు కలిగిన ఈ అనుభవానికి ఆధ్యాత్మిక నేపధ్యం ఉన్నదా?’ అన్నాను. “ఏముంది, నాన్నా పరిమితంగా ఉన్న అమ్మను నువ్వు అపరిమితంగా చూశావు. విశ్వరూప సందర్శనం అంటే అదే” అన్నది. “శ్రీకృష్ణపరమాత్మ అర్జునునికి ఆ భాగ్యాన్ని ప్రసాదించాడు. అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి. మరి నువ్వు నాకు అలా అనుగ్రహించటానికి కారణం ఏమిటి?’ అన్నాను. “నేను నీకు ఇద్దామనుకున్నాను, ఇచ్చాను. అంతే. అకారణమే కారణం” అన్నది.

మరొక ఉదాహరణ. నేను సంస్థాగతమైన పనులమీద ఎక్కువగా హైదరాబాద్ వెడుతూండేవాడిని. ఎవరైనా జిల్లెళ్ళమూడి నుంచి వచ్చారంటే అమ్మ వచ్చినట్లుగా ఆదరించేవాళ్ళు ఆరోజుల్లో అంతగా ఆనందపడేవాళ్ళు. అక్కడినుంచి తిరిగి వస్తున్నప్పుడు నన్ను సాగనంపటానికి 15/20 మంది సోదరులు బస్టాండ్‌కు వచ్చారు. నేను బస్సు ఎక్కాను, బయలుదేరింది. ‘అన్నయ్యా! అమ్మకి మా నమస్కారాలు చెప్పు, మా నమస్కారాలు చెప్పు – అన్నారు అంతా. మర్నాడు నేను జిల్లెళ్ళమూడి వచ్చాను. ‘అమ్మా! నీకు వెంకటరత్నంగారు, వెంకటకృష్ణగారు, T.S. శాస్త్రిగారు, రాధ….. నమస్కారాలు చెప్పమన్నారు’ అన్నాను. పేరు పేరున అందరి నమస్కారాలు అమ్మకి విన్నవించాను. “నాన్నా! అవన్నీ ఎప్పుడో చేరినాయ్. నువ్వే ఆలశ్యంగా వచ్చావురా!” అన్నది అమ్మ. నాకు చాల ఆశ్చర్యం, ఆనందం కలిగాయి.

మరొకసారి హైదరాబాద్ నుంచి వస్తున్నాను. రాత్రి 12 గంటలైంది. విజయవాడ వెళ్ళే టాక్సీలో ముందు సీట్లో కూర్చున్నాను. హైదరాబాద్ పొలిమేర దాటిన తర్వాత మా టాక్సీకి యాక్సిడెంట్ అయింది. వడ్లబస్తాలు వేసుకుని మా ముందు 20/30 ఎడ్లబళ్ళు పోతున్నాయి. హారన్ వేశాడు డ్రైవర్. కానీ ఆ బండివాడు తప్పుకోలేదు. మా టాక్సీ ఆ బండిని ఢీకొట్టింది. హాహా కారాలు తాళ్ళు త్రెంపుకుని ఎడ్లుపరుగెత్తినయ్. బస్తాలు తెగి వడ్లు రోడ్డుమీద గుట్టలుగా పడ్డాయి. అది చూసి బండ్లవాళ్ళు అంతా ఆవేశంతో ‘వసికర్రలు’ (బండిపై వస్తువులు కదలకుండా అమర్చే కర్రలు) తీసికొని మమ్మల్ని కొట్టటానికి వచ్చారు. మా టాక్సీ నుగ్గునుగ్గు అయింది. అందులో తక్కినవాళ్ళు ఏమైనారో తెలీదు. యాక్సిడెంట్ అయిన సమయంలోనే కాళ్ళు నెప్పి అనిపించి ‘అమ్మా!’ అంటూ పైకెత్తాను. అమ్మ అలా రక్షించింది. లేకుంటే నా రెండు కాళ్ళు నుజ్జునుజ్జు అయ్యేవి. కిటికీ అద్దాలు పగులగొట్టి నన్ను బయటికి లాగారు. బండి వాళ్ళంతా చుట్టుముట్టి నన్నుకొట్టబోయారు. ఈ లోగా రోడ్డుమీద అటూ ఇటూ కార్లు, లారీలు స్తంభించిపోయాయి. వాటి డ్రైవర్లంతా వచ్చారు. ‘టాక్సీ వాడి తప్పేమీలేదు. హారన్ కొడుతూనే ఉన్నాడు. బండివాడే తప్పుకోలేదు. వాడిదే తప్పు’ అన్నారంతా. దాంతో బండివాళ్ళు డ్రైవర్లు తన్నుకోవటం మొదలుపెట్టారు.

ఈ హడావిడిలో ఎవరో ఒక డ్రైవరు వచ్చి నన్ను జబ్బపట్టుకొని అమాంతం బరబర ఈడ్చుకుంటూ ముందున్న ఒక లారీలో ఎక్కించి అక్కడ నుంచి నన్ను తీసికెళ్ళమన్నాడు. ఆ డ్రైవర్ నన్ను సూర్యాపేట రోడ్డుప్రక్కన పోస్టాఫీసు దగ్గర బెంచీ మీద కూర్చోబెట్టి వెళ్ళిపోయాడు. నా మోకాలుకి తలకీ దెబ్బలు తగిలాయి. ఒళ్ళంతా కారి ఎండిన నెత్తురు మరకల్ని తుడుచుకున్నాను. గాయాల్ని అలాగే అదిమిపట్టి మరొక లారీ ఎక్కి విజయవాడ వచ్చి క్రమేణా జిల్లెళ్ళమూడికి చేరుకున్నాను. ఏడవమైలు వద్ద దిగి అలాగే నడుచుకుంటూ వెళ్ళి కాళ్ళు కడుగుకొని అమ్మ గది సమీపానికి చేరుకున్నాను. ఈ లోగా లోపలి గదిలో నుంచి రెండు చేతులూ చాచి వేగంగా పరుగెత్తుకుంటూ వచ్చి అమ్మ “నాన్నా! నువ్వు బ్రతికి వచ్చావా?” అని నన్ను అమాంతం వాటేసుకుని తనగది లోపలికి తీసికెళ్ళింది. ప్రక్కనున్న వాళ్ళంతా అమ్మను ‘బ్రతికివచ్చావా అని అడిగావేమిటి?” అని అడిగారు. “వాడినే అడగండి” అన్నది అమ్మ. అపుడు నేను యాక్సిడెంటు వివరాలు చెప్పాను. ఎప్పుడైతే అమ్మ నాకు ఎదురు వచ్చి “నాన్నా! బ్రతికివచ్చావా?” అన్నదో వెంటనే నాకు అర్థమైంది ఎక్కడో హైదరాబాద్ దగ్గరలో జరిగే ప్రమాద సంఘటనని అమ్మ ఇక్కడ నుంచి చూసి, నాకు ప్రాణదానం చేసింది- అని. మా అమ్మ నా చిన్నప్పుడే పోయింది. ఈ అమ్మ నిరంతరం నన్ను వెన్నంటే వుంది.

ఈ అమ్మే – మీ అమ్మ అనుకొన్న సందర్భం ఎలాంటిది?

1960 నుంచి 1968 వరకు అమ్మ పూరింట్లో ఉండేది. నా అనుభవాలన్నీ దాదాపు అక్కడ జరిగినవే. శేషగిరిరావు అన్నయ్య ఆ ఇంటిని కట్టించాడు. అందులో అమ్మ స్నానం చేసే చిన్న గది ఉంది. అందులో ఒక నీటి తొట్టి ఉండేది. ఒకనాడు దానికి ఒకవైపు ‘అమ్మ’; రెండవవైపు నేనూ వున్నాము. ఏదో సరదాగా మాట్లాడుకుంటున్నాం. ఆ సందర్భంగా నేను కొంటెగా నాన్నగారిని ఒక మాట అన్నాను. అమ్మ ఆ తొట్టెలో ఉన్న చెంబు తీసికొని నామీదికి విసిరేసింది. అది నా తలకి తగలటంతో నెత్తురు కారసాగింది. వెంటనే అమ్మ తన చీరె చించి గట్టిగా కట్టు కట్టి, నన్ను పట్టుకుని ఏడవటం ప్రారంభించింది. ఆ సంఘటన నా బాల్యంలోని ఒక సంఘటనను గుర్తుకు తెచ్చింది. అప్పుడు అమ్మ నేను ఓదార్చాల్సి వచ్చింది.

‘అమ్మా! ఇది నువ్వు నన్ను కొట్టడం కాదు. నువ్వు నా తల్లివని ఎరుకపరుస్తున్నావు’ అన్నాను. నా బాల్యంలోనే మా అమ్మ చనిపోయింది. ఆమె రూపం కూడా నాకు గుర్తులేదు. అప్పటి చేష్టలు గుర్తున్నాయి. ఒకరోజు నాకు తలంటిపోయాలని నన్ను పట్టుకోబోతే నేను చిక్కలేదు. మా గ్రామం ‘మునిపల్లె’. మా ఇంటికెదురుగా ఒక బావి ఉండేది. ఆ బావి చుట్టూ గిరగిరా | తిరగడం మొదలుపెట్టా. ఆమె తిరిగి తిరిగి విసిగిపోయి అక్కడున్న ఒక చెంబుని నా మీదికి విసిరేసింది. అది నాకు తగిలి నెత్తురుకారడం, ఆమె చీరెను చింపి నాకు కట్టుకట్టి నన్ను పట్టుకుని ఏడవటం – సరిగా మా ‘అమ్మలాగే’ – ఈ సంఘటన. కావున ఈ అమ్మ నా తల్లే అనిపించింది.

మీరెరిగిన అమ్మ విశ్వజనీనతత్వాన్ని తెలియపర్చండి?

ఒకనాడు వాత్సల్యాలయంలో అమ్మ దర్శనం ఇస్తోంది. ఒక సోదరుడు వచ్చాడు. ‘అమ్మా! నేను మిమ్మల్ని విజయవాడలో చూశా; మరలా ఇవాళ చూస్తున్నా’- అన్నాడు. “విజయవాడలో ఎక్కడ చూశావు నాన్నా!” అన్నది. “మీరు విజయవాడ PWD గ్రౌండ్స్‌లో దర్శనం ఇస్తున్నారు. దాదాపు లక్షమంది వచ్చారు. అపుడు మిమ్మల్ని చూశాను’ అన్నాడు. “నిన్నూనేను చూశాను” అన్నది అమ్మ. ‘లక్షమంది జనంలో ఎక్కడో చివరలో ఉన్నాను. నన్ను చూడటమేమిటమ్మా!’ అన్నాడు. “నువ్వు ఎఱ్ఱచొక్కా తొడుక్కుని, నీ స్నేహితుని భుజాల మీద చేతులు వేసుకుని నన్ను చూస్తుండగా నేను నిన్ను చూశాను” అన్నది అమ్మ. ఆతడు ఆ సంగతి జ్ఞాపకం చేసుకుని ‘నిజమే – లక్షమందిలో నన్ను ఎలా గుర్తుపట్టారు?’ అని అడిగాడు. “నాన్నా! గొట్టెల కాపరికి వాడి గొట్టె జ్ఞాపకం ఉండదా? ఇదీ అంతే. తల్లి బిడ్డని గుర్తుపట్టలేదా?” అన్నది అమ్మ.

ఒకనాడు అమ్మ మంచం మీద కూర్చున్నది. మేమంతా మంచం చుట్టూ కూర్చొని ఉన్నాం. అడవులదీవి సో॥ మధు వారి పొలంలో పండిన వేరుసెనగ కాయలు తెచ్చి అమ్మకి నివేదన చేశారు. అమ్మ తన మంచం మీద ఒక వార్తాపత్రిక పరచి వాటిని దాని మీద పోసింది. వాటిని మంచం పట్టికి కొట్టి ఆ పప్పుల్ని చుట్టూ కూర్చున్న మా అందరికీ నోట్లో పెడుతూ, అప్పుడప్పుడు తాను తింటున్నది. కొంత సేపటికి ఆ వార్తాపత్రిక పైనున్న ఒక ఫోటోవైపు నిశితంగా చూసింది. ఆ చిత్రాన్ని చూస్తూ “నాన్నా! నువ్వు ఇక్కడున్నావా!” అని ఎంతో ప్రేమతో కాగితంలోని ఫోటోకి వేరుసెనగ పప్పు నోటికి అందించింది. మా అందరికీ ఎంత వాత్సల్యంతో పెట్టిందో అలాగే ఆ ఫోటో నోటిదగ్గర పెట్టింది. తీరా చూస్తే ఆ ఫోటో ‘భగవాన్ శ్రీ రమణమహర్షులవారిది’. అంటే రమణమహర్షులను కూడా తన బిడ్డగా భావించింది ‘అమ్మ’. ఆ సన్నివేశం నా మనస్సు మీద గాఢమైన ముద్రవేసింది.

ఆశ్చర్యకర వాత్సల్యం: ఆ రోజుల్లో జిల్లెళ్ళమూడి గ్రామంలో పార్టీలుండేవి. పార్టీలతో ద్వేషాలు, కక్షలు సహజమే. అమ్మ పూరింట్లో ఉండేది. నాన్నగారు గ్రామాంతరము వెళ్ళినపుడు రెడ్డి సుబ్బయ్యని ఇంటికి కాపలా ఉంచేవారు. అమ్మ ఆరుబయట మంచం మీద పడుకున్నది. రెడ్డిసుబ్బయ్య మంచం ప్రక్కన నేలమీద పడుకున్నాడు. నిశిరాత్రి గం 12.00ల ప్రాంతంలో నాన్నగారి వ్యతిరేక పార్టీలోని ఒకడు వచ్చి అమ్మపై అత్యాచార యత్నం చేశాడు. నేరుగా వచ్చి మంచం మీద ఉన్న అమ్మమీద పడ్డాడు. అమ్మ వాణ్ని చూసింది. కాలు నెమ్మదిగా పైకి మడిచి వాడి పొట్టలో కాలు పెట్టి ఒక్క తన్ను తన్నింది. ‘అమ్మోయ్!!’ అని కేకవేసి వాడు వెళ్ళి అంతదూరంలో పడ్డాడు. నిద్రపోతున్న రెడ్డిసుబ్బయ్యను అమ్మ తట్టిలేపింది. “చూడు. ఎట్లా జరిగిందో!” అన్నది. సుబ్బయ్య వాడిని చూశాడు; కర్ర తీసికొని వెంటపడ్డాడు. వచ్చినవాడు చీకట్లో పారిపోయాడు.

ఆ విషయం నాకు అమ్మ ఒకనాడు వివరించింది. అమ్మ ఇంట్లో వంట ఇల్లు చిన్నది. ఆ గదిలో చిన్న కిటికీ ఉంది. కొన్ని రోజుల తర్వాత ఆ కిటికీ ప్రక్కన అమ్మ కూర్చుని అన్నం కలిపి నాకు ముద్దులు పెడుతోంది. ఆ కిటికీ వంక చూసింది. “నాన్నా! ఆ బజారున అటుపోతున్నాడే వాడిని చూడరా ” అన్నది. నేను కిటికీలోంచి చూసి ‘ఆ’ అన్నాను. “మొన్న నీకు ఒక సంఘటన చెప్పాను చూడు. అది వాడేరా” అన్నది. వెంటనే నేను కోపోద్రేకంలో అప్రయత్నంగా ‘ఓరి లంజకొడకా!’ అన్నాను. వెంటనే అమ్మ “మరి నువ్వో!” అన్నది. అమ్మ బిడ్డగా నాకు గోరుముద్దలు తినిపిస్తూ నాతో “మరి నీవో!” అనేటప్పటికి నా కళ్ళు తిరిగినంతపనైంది. ‘అమ్మ’ తనను చెరచడానికి వచ్చిన దుర్మార్గుని కూడా తన బిడ్డగా భావన చేయటం మన ఊహలకందని అద్భుతం అనిపించింది.

అమ్మ చలన చిత్ర నిర్మాణ పరిణామక్రమం వివరించండి?

1971లో అమ్మ జన్మదినోత్సవాల్ని నిర్వహించుకోబోతున్నాం. జిల్లెళ్ళమూడిలో అన్ని ఉత్సవాల్నీ, పండగల్నీ, 8m.m లోనో, 16 mmలోనో Cover చేస్తూండేవాళ్ళం. అట్లాగే ఆ ఏడాదీ చేద్దాం అనుకున్నాం. పని మీద నేను మద్రాసు వెళ్ళాను. శ్రీచుండూరి సీతారామయ్య (ఇంజనీర్ తాతయ్య) గారింట్లో దిగాను. వాళ్ళబ్బాయి అచ్యుత్ అక్కడ ప్రముఖ Architect. ‘ఈసారి 35 mmలో అమ్మ జన్మదినోత్సవం Cover చేస్తే ఎట్లా ఉంటుంది?” అన్నారు. తాతగారు. ‘చేస్తే దానిని సినిమాహాలులో ప్రదర్శించాలి. చాలా ఖర్చు అవుతుందేమో!’ అన్నాను. ‘మా కోడలు అన్నయ్య చంద్రమోహన్ Cine Camera man. ఆతన్ని కనుక్కుందాం’ అన్నారు. రెండు రీళ్ళడాక్యుమెంటరీగా ఒకరోజు సన్నివేశాన్ని Cover చేయడానికి రు. 15,000 లు అవుతుందని వివరించాడు చంద్రమోహన్. తాతగారు ‘ఆ 15 వేలు నేను ఇస్తాను’ అన్నారు. నేను జిల్లెళ్ళమూడి వచ్చి అమ్మతో మిగతా వాళ్ళతో చెప్పాను. అంతా సంతోషించారు. సుమారు 6 కాపీలు తీశాం. తదుపరి ‘feature film తీయటమా, documentary తీయటమా?’ అనే సమస్య వచ్చింది. అమ్మని liveగా ఉంచాలి. actorగా కాదు. తరతరాల వాళ్ళకి అమ్మని చూపించాలంటే ఇది ఒకటే మార్గం. ఒక సంవత్సర కాలంలోని పండుగలు, ఉత్సవాలు, పూజలు అన్నీ Cover చేద్దాం- అని నిర్ణయించాం. 8 కాపీలు తీసి 8 Theatre లకి ఇచ్చి విడుదల చేశాం. కానీ Distributors సరియైన advertisement లేకుండా release చేసినందున, ప్రదర్శన లోపాల వలన ఆర్థికంగా, film flop అయింది. తర్వాత ఆ సినిమాను ఆయా ధియేటర్లలో వేసి సంస్థకి విరాళాలు సేకరించడానికి ఉపయోగించుకున్నాం. Film ని English లో కనుక తీసేట్టయితే విదేశాలకి కూడా పంపడానికి వీలవుతుంది అనే ఉద్దేశంతో 15 రీళ్ళ సినిమా negativeని 7 రీళ్ళకు cut చేశాం. అలా English version లో కూడా ఒక Pictureని produce చేశాం. దానికి Script ఇంగ్లీషులో M. Dinakar వ్రాశారు. London సోదరులు James campion ఇంగ్లీషులో Voice ఇచ్చారు. కానీ కొన్ని కారణాలు వలన ఆ picture వెలుగులోకి రాలేదు. తర్వాత మేము ఆ Picture ని Preserve చేసిన Office మద్రాసు నుంచి బొంబాయి తరలించారు; వాళ్ళ వద్దా negative కనబడలేదు. తెలుగులో 15 రీళ్ళ సినిమాను, 2 రీళ్ళ డాక్యుమెంటరీని తమిళంలో Produce చేశాం; తమిళనాడులో కూడా ప్రదర్శించాం.

అమ్మ స్వర్ణోత్సవ నేపథ్యం తెల్పండి?

స్వర్ణోత్సవాల్లో అమ్మ లక్షమందికి ఒకే పంక్తిలో భోజనం పెట్టింది. జిల్లెళ్ళమూడి గ్రామ జనాభా 1000 మంది. భోజనం పెడతాం అన్నా లక్షమంది. వస్తారా అనే అనుమానం అందరికీ, అమ్మ చెప్పింది కాబట్టి ఎవరూ మాట్లాడటానికి వీలులేదు. ‘జరుగుతుందేమో అనే ఆశ. రామకృష్ణ, అన్నంరాజు శ్రీరామకృష్ణారావుగారు, DSP సత్యనారాయణగారు, నేను మేమంతా విరాళాలు సేకరణకి బయలుదేరాం. సంస్థలో ఆర్థిక నిల్వఏమీలేదు- ఏరోజు కారోజు. వెతుక్కుండే పరిస్థితే. ఆ సమయంలో రామకృష్ణకి, నాకూ అమ్మ గుడ్డలు పెట్టింది. రామకృష్ణ తీసుకున్నాడు. నేను ఉత్తరీయాన్ని తీసి అమ్మ మంచం మీద పెట్టా. “ఏమిటీ? ఇక్కడ పెట్టావు?” అన్నది. ‘ఉత్తరీయం వేసుకునే అలవాటు లేదమ్మా నాకు, నాకెందుకు? ఇంకెవరికన్నా పెట్టవచ్చు అని’ అన్నాను.

“నీకు ఈ ఉత్తరీయం ఇవ్వటంలో ఉద్దేశం – నువ్వు ఈ వేసుకుని కులుకుతూ తిరగమని కాదు. నువ్వు ఒక పనిమీద బయటికి పోతున్నావు. నువ్వు ఒడి పట్టడానికి వెడుతున్నావు. వేసేవాళ్ళు ఏం వేస్తారో ! 1116లు ఇస్తారో, 10 వేలు ఇస్తారో, 1 రూపాయి ఇస్తారో, చద్ది అన్నం పెడతారో, గుప్పెడు బియ్యమే పెడతారో – వాళ్ళు ఏం పెట్టినా నువ్వు ఒడిపట్టాలి. వేసుకో” అన్నది. అది నాకు మహత్తర సందేశం. తర్వాత మా అనుభవాల్లో అలాంటివి అనేకం జరిగినయ్. ముందుగానే అమ్మ మాకు శిక్షణ ఇచ్చింది కాబట్టి మేము బాధపడలేదు.

గుంటూరు జిల్లా కలెక్టర్ జయభారతరెడ్డి గారిని కలిశాం. ‘లక్షమంది ఒకే పంక్తిలో భోజనం చెయ్యడం అంటే నాకు అర్థం కావటం లేదు. మీకు ఏం కావాలో చెప్పండి. అది చేస్తాం’- అన్నారు. ఇంజనీర్ తాతగారి Planning ప్రకారం-60 ఎకరాల పొలంలో ఆకులు వేసి భోజనం పెట్టడానికి అనువుగా పొలాన్ని చదును చేసి షామియానాలు, తాటాకు పందిళ్ళు వేశారు. 13 వంటశాలలు. ఆంధ్రప్రదేశ్ Supplies departments అన్నిటి నుంచీ వంట సామాగ్రి తెచ్చాం. లక్షమంది భోజనాలు చేస్తుంటే అమ్మ జీపులో వెళ్ళి పంక్తుల మధ్యలో సాగిపోతూ ఆ దృశ్యాన్ని చూసి ఆనంద పరవశురాలైంది. లక్షా 50 వేల మంది వచ్చారు.

డోలోత్సవాన్ని కూడా అమ్మ చేయాలన్నారని విన్నాము. అవి చేశారా?

“లక్షమంది పసిపాపల్ని ఉయ్యాలల్లో పడుకోబెట్టి వాళ్ళ వాళ్ళ తల్లులు ఆ పిల్లల్ని ఊపుతూండగా వాళ్ళను చూడాలి” అనే గొప్ప కోరిక కోరింది. అమ్మ. దీనినే డోలోత్సవం అని పిలుస్తాం. లక్షమంది పసివాళ్ళకి ఊయ్యాలలు వేయాలంటే 120 ఎకరాల పొలం కావాలి. అది సాధ్యం కాదనిపించింది. మాకు. లక్షమంది పిల్లలకి పాలు, తల్లులకు భోజనాలు, ఉయ్యాలలకు లక్షచీరెలు… ఆచరణ సాధ్యం కాదనిపించింది.

కానీ అమ్మ ఆనాడు చెప్పింది కదా అని ఇటీవల కాలంలో అన్నపూర్ణాలయం షెడ్లో 108 మంది పిల్లలకి ఉయ్యాలలు ఏర్పాటు చేశాం. 136 మంది తల్లులు వారి పిల్లలతో వచ్చారు. పిల్లలను చూసి తల్లులు, తల్లుల్ని చూసి పిల్లలు, ఆ దృశ్యాన్ని చూసి సర్వాంతర్యామి అయిన “అమ్మ”, అది చూసి మేము ఎంతో ఆనందించాము. ఆనాటి డోలోత్సవ నిర్వహణలో కీ.శే. తంగిరాల కేశవశర్మ ప్రముఖపాత్ర వహించారు.

సకల జీవరాశిపై అమ్మ మాతృప్రేమను వెల్లడించే సన్నివేశాలు ఏవైనా చెప్పండి?

మనుష్యులనే కాదు. క్రిమికీటకాదుల్ని, పశుపక్ష్యాదుల్నీ అమ్మ సంతానంగా ప్రేమిస్తోంది. లక్షా ఏభైవేల మంది భోజనాలు చేయగా ఇంకా ఆహార పదార్థాలు మిగిలినాయి. వాటిని తీసుకువెళ్ళి పొలాల్లో నీళ్ళల్లో చెరువుల్లో వెదజల్లమన్నది. “ఈ ప్రసాదం, పండుగ వాటికి కూడా” అన్నది. అలాగే చేశాము. అమ్మ వద్దకు పక్షులు, కాకులు వస్తూండేవి. అమ్మ చేటలో బియ్యం వేసుకుని వెదజల్లేది. గాలిలోనే ఉన్న ఆ గింజలు క్రిందపడకుండానే పక్షులు ఎగిరి పట్టుకుని తినేవి. కుక్కలూ, కోతులూ వచ్చేవి. అమ్మ ప్రేమతో వాటికీ ఆహారాన్ని అందించేది; అలా అవీ ఆనందించేవి. ఆ దృశ్యం మనోహరం అద్భుతం.

అందరింటిపై నక్సలైట్ల దాడి ఎలా జరిగింది?

అమ్మ సంస్థ మీద దాడి జరిగిన భయానక దృశ్యం. 1975 సంవత్సరము, డిసెంబర్ 30, రాత్రి గం. 12.00 సమయం. ఎక్కడి నుంచో కొందరు వచ్చి ‘నక్సలిజం జిందాబాద్, నక్సలైట్స్ జిందాబాద్: అమ్మలూ – బాబాలూ నశించాలి’ అంటూ slogans ఇచ్చుకుంటూ అందరింటి ఆవరణలోకి ప్రవేశించారు. అప్పటివరకు ఎవరో అమ్మకు ‘అనసూయావ్రతం’ చేసుకున్నారు. అమ్మ లోపలికి వెళ్ళి స్నానం చేసి వచ్చే సమయంలో ఈ సంఘటన జరిగింది. ఆ సమయంలో అమ్మ గది ముందు నేనూ, పి.యస్.ఆర్. ఉన్నాం. ఏదో attack జరిగేట్టుగా ఉంది – అనిపించింది. వాళ్ళు అమ్మ ఉన్న ఇంటిమీద attack చేశారు. వస్తూనే గొడ్డళ్ళతో తలుపుల్ని ధనాధనా బ్రద్దలు కొట్టడం మొదలు పెట్టారు. నేను, పి.యస్.ఆర్. భుజాలు ఆనించి అవి బ్రద్దలు కాకుండా ఉండటానికి పెనుగులాడాం. కానీ బ్రద్దలు కొట్టేశారు. ‘అన్నయ్యా! ఇక మనం వాళ్ళని ఆపలేము. మనం వెళ్ళిపోదాం’ అన్నాడు పి.యస్.ఆర్. ‘నువ్వు వెళ్ళిపో. నేను ఇక్కడనే ఉంటాను’ అన్నాను. వెంటనే వెనుక తలుపుతీసి తను వెళ్ళిపోయాడు. నేను మాత్రమే ఉన్నా ఆ గదిలో. వాళ్ళు లోపలికి ప్రవేశించారు. ’15 ని.ల నుంచీ మేము బద్దలు కొడుతున్నా; నువ్వు లోపల ఉండే తలుపు తీయకుండా ఉంటావా?’ అంటూ నన్ను అమాంతం కాలర్ పట్టుకుని బరబరా ఈడ్చుకొని వరండాలోకి తీసుకొచ్చారు. అప్పటికే ఆవరణంతా బాంబులు వేస్తున్నారు. ఐదారుగురు బాంబులు వేసుకుంటూ తిరుగుతున్నారు. దాంతో ఆవరణంతా బాగా పొగ కమ్మింది. ఊళ్ళోవాళ్ళకీ- ఇక్కడి వాళ్ళకీ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది తెలియటం లేదు. ‘ఎవరూ మమ్మల్ని పట్టుకోవటానికి కాని లోపలికి రావటానికి కాని ప్రయత్నం చెయ్యొద్దు. మేము మిమ్మల్ని ఏమీ చెయ్యం. మీరు కనుక లోపలికి రావడానికి ప్రయత్నిస్తే మాత్రం మిమ్మల్ని చంపేస్తాం. మేము పనిమీద వచ్చాము. ఆ పని పూర్తి చేసుకుని వెడతాం’ అని వాళ్ళు అందరినీ హెచ్చరిస్తున్నారు.

వాళ్లు నా చుట్టూ నిలబడి గొడ్డళ్ళూ, గునపాలూ, బరిసెలూ ఎత్తి ‘వెయ్యి పోట్లు పొడవాలి” అని కేకలేశారు. వాళ్ళు సుమారు 20 మంది వచ్చారు. 12 మంది ఈ operationలో ఉన్నారు లోపల. వెంటనే నేను అనుకున్నాను ‘అయిపోయింది నాపని; పొడిచేశారు’ అని. వాళ్ళు చంపేపోతారు; అందుకు సిద్ధమయ్యే ఉన్నాను. వాళ్ళంతా ఒక్కసారి బరిసెలు ఎత్తారు. ‘అమ్మా!’ అని ఒక్కకేక పెట్టాను. చెయ్యి పైకి ఎత్తాను. బరిసెకి అడ్డంగా నా అరచేయి ఉంది. ‘మీ అమ్మా, గిమ్మా నిన్ను రక్షించేవారెవరూ లేరు. నువ్వు నా చేతిలో చస్తున్నావురా’ అంటూ ఒక్కడే ఆ బరిసె వేశాడు. నా వేలుకి ఉంగరం ఉంది. అది ఆ ఉంగరాన్ని చీల్చుకుంటూ అరచేతిని చీల్చుకుంటూ నా చొక్కా చీల్చుకుంటూ నేలని తాకింది. ఆ ఉంగర ప్రభావం అంతటిది. వెంటనే ‘ఒరేయ్ ! ఆ ఉంగరం ఇచ్చేయ్యరా’ అన్నాడు. వాడి మనస్సు ఆ ఉంగరం మీదికి పోయింది. ఈ చేత్తో ఉంగరం తీయబోతే, గడియారం కనిపించింది. ‘ఆ గడియారం కూడా ”ఇచ్చెయ్యరా’ అన్నాడు. రెండూ తీసి ఇచ్చాను. ఇంతలో ఒకడు అందరింటి ముందు రోడ్డుపై నుండి ’15 minutes over, 20 minutes over’ అంటూ హెచ్చరికలు చేస్తున్నాడు. వాళ్ళు నన్ను మళ్ళీ బరబరామని లోపలికి ఈడ్చుకొచ్చారు. బీరువా తాళం చెవులు ఇమ్మన్నారు. అవి నా దగ్గరలేవన్నాను. మళ్ళీ ‘పొడవండి’ అన్నారు. బరిసెలు ఎత్తారు. అందులో ఒకడు ‘వాడిని పొడిచే దేముంది ? బీరువా ఎదురుగా ఉన్నది కదా! దానిని బద్దలు కొట్టండి’ అన్నాడు. బీరువాను పగులగొట్టి లాకర్లో ఉన్న, పూజాసామాగ్రి, బంగారం, వెండి తీసి రెండు సంచుల నిండా వేసుకున్నారు. ఇంతలో 25 minutes over caution మళ్ళీ వినిపించింది. వాళ్ళు వెళ్ళిపోయారు. దీనికి నేనే సాక్షి కదా! వీళ్ళు సంచులు జాగ్రత్త పెట్టుకుని వచ్చి నన్ను చంపేపోతారు అని నేను ఆ గదిలోనే కూర్చున్నాను – నేను లేచిపోతే అమ్మ గది మీద దాడి చేస్తారేమోనని.. కానీ వాళ్ళు ‘one – two – three – March’ అంటూ వెళ్ళిపోయారు.

నేను గదినుంచి బయటికి వచ్చా. ఆవరణ అంతా నిర్మానుష్యంగా ఉంది. మేడ మీది వాళ్ళు క్రిందికి దిగిరాకుండా తలుపుల్నీ బయట గడియలు వేశారు. వాళ్ళు. నాన్నగారు వాళ్ళంతా మేడ పైనున్నారు. క్రింద ఏం జరుగుతోందో వాళ్ళకి తెలియదు. అమ్మ ఎక్కడ ఉందో ఏమిటో అని వరండాలోంచి చూస్తున్నా. ఇంతలో ఒక తలుపు తెరచుకుంది. డాక్టర్ సత్యం వచ్చాడు. నన్ను అమ్మదగ్గరికి తీసికెళ్ళాడు. నన్ను చూసి అమ్మ అంది “నాన్నా! నువ్వు వేసిన కేక నాకు వినబడ్డదిరా. నేను వద్దామనుకున్నాను. కానీ ఈ ఆడవాళ్ళంతా నా రెండు కాళ్ళూ పట్టుకుని వదల లేదు నాన్నా” అన్నది. నేనన్నాను ‘అమ్మా! నువ్వు రాకపోతే నేమి? నేను రక్షించబడ్డాను కదా! చూస్తుండగానే దొరికినంత దోచుకుపోయారు. నేనేం చేయలేకపోయాను’ అన్నా బాధగా. “పోతే పోయింది. నువ్వు వున్నావు. డబ్బు పోతే మళ్ళీ వస్తుంది నాన్నా! బిడ్డపోతే తేగలమా?” అన్నది అమ్మ.

సంస్థ ‘Logo’ రూపకల్పనకి మీ ప్రేరణ ఎలాంటిది?

అమ్మ తత్త్వం “నేను నేనైన నేను”. దీనిని వివరించమని అమ్మను అడిగా. “ప్రతివాడూ ‘నేను ఫలానా’ అని చెప్తాడు. ఆ ‘నేను’ అందరిలో ఉన్నటువంటి నేనైన ‘నేను’ – ఆ ‘నేను’ నేనే. అందరిలో ఉన్నటువంటి ‘నేను’ ఏదైతే ఉన్నదో ఆ ‘నేను’ ‘నేనే’ అన్నది అమ్మ.

అమ్మ నాకు విశ్వరూపసందర్శన భాగ్యాన్ని ప్రసాదించిన సందర్భంగా ఒక crestను రూపొందించాను. ఒక చెరువులో ఒక రాయి వేశామనుకోండి; వరుసగా తరంగాలు విస్తరిస్తాయి. ఆ చెరువుకి కట్టలు ఉన్నాయి కాబట్టి అంతటితో ఆగిపోతాయి. లేకుంటే ఎంతవరకు నీరు ఉంటే అంతవరకూ అనంతంగా సాగిపోతూనే ఉంటాయి ఆ తరంగాలు. అమ్మ విశ్వవ్యాప్తమైనది. ఆ భావాన్ని సంస్థకి crestగా పెట్టాలనిపించింది. మద్రాసులో ఒక artist చేత ఒక logo వేయించాను. దాని చుట్టూ వృత్తములు వస్తాయి. దీని significance ఏమిటంటే – పైన ‘నేను నేనైన నేను’ అని పెట్టాము. ‘మాతృశ్రీ’ అని క్రింద పెట్టాము. అటూ ఇటూ నక్షత్రాలు, సర్పాలు ఏర్పరచాము. ఆ తర్వాత సంస్థకి ఒక జెండాను కూడా రూపొందించారు; దాంట్లో ఇదే Logoను పెట్టారు. అమ్మ మాసపత్రిక ‘విశ్వజనని’ మీద కూడా అదే symbol ఉంటుంది. సర్వం తానైన ||బ్రహ్మస్వరూపిణిగ అమ్మ నాకు దర్శనం ఇచ్చింది.

“నీ బిడ్డలో నువ్వు ఏం చూస్తావో దానిని అందరిలో చూడగలిగితే అదే బ్రహ్మస్థితి” అన్నది. ఆత్మావైపుత్రనామాసి. మన సంతానంలో మనల్నే చూసుకుంటాం. అందరిలో దానినే చూడమన్నది అమ్మ. అదే బ్రహ్మస్థితి. కేవలం చెప్పటమే కాకుండా తాను ఆచరించింది.

“మీరు కానిది నేనేదీ కాదు” అన్నది. ‘నీ ఆరాధ్యమూర్తులు ఎవరమ్మా?’ అంటే “మీరే” అన్నది. అమ్మకు సర్వం బ్రహ్మ. సర్వాన్నీ ఆత్మస్వరూపంగా చూస్తుంది. అమ్మ యొక్క బ్రహ్మస్థితిని నేను కళ్ళారా చూశాను.

మీరు ఎప్పుడూ అమ్మ సేవలో సంస్థ పనిలో తలమునకలై ఉండేవారు. ఇది కుటుంబ బాధ్యతల నిర్వహణకు ఆటంకం కాలేదా?

నా 30వ ఏట నుంచి ఇక్కడ అమ్మ సేవలో ఉంటున్నాను. ఒకనాడు అమ్మ అన్నది “నువ్వు నిరంతరం నా సేవలో ఇక్కడే ఉంటున్నావు కాబట్టి నీ కుటుంబాన్ని నేను చూసుకుంటాను” – అని ఒక హామీ ఇచ్చింది. ఆ హామీయే నన్ను నా కుటుంబాన్ని ఇప్పటికీ కాపాడుతోంది.

నాకు ఐదుగురు మగపిల్లలు, ఇద్దరు ఆడపిల్లలు. వీళ్ళంతా అమ్మ దయవలన వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు, సంసారాలు సుఖంగా చేసుకుంటున్నారు; స్వయంగా హాయిగా తృప్తిగా జీవిస్తున్నారు. ఇదంతా అమ్మ కరుణే. ఇదే అనేక సందర్భాల్లో అమ్మ నన్ను ఆదుకోవటం ద్వారా ఋజువైంది.

Dr Pothuri Venkateswara Rao

 

డా|| పొత్తూరి వెంకటేశ్వర రావు

 

వీరు గుంటూరు జిల్లా పొత్తూరు గ్రామంలో 8-2-1934 న జన్మించారు. వీరిని కన్న తల్లిదండ్రులు శ్రీ వెంకటసుబ్బయ్య, శ్రీమతి పన్నగేంద్రమ్మ. వీరి దత్తత తల్లిదండ్రులు శ్రీ గోపాలకృష్ణయ్య, శ్రీమతి సంపూర్ణమ్మ. వీరి సతీమణి శ్రీమతి సత్యవాణి. సంతానం ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. వృత్తి-జర్నలిజం. ఈనాడు, ఆంధప్రభ మొదలగు దినపత్రికలకు సంపాదకులుగాను, ఆం.ప్ర. ప్రెస్ అకాడమీ ఛైర్మన్‌గానూ ఎన్నో పదవులను నిర్వహించారు. ‘ఆధ్యాత్మిక పదకోశం’, ‘యతికులపతి’ మొదలగు అనేక గ్రంధాన్ని రచించారు.

సేవానిరతి: అమ్మకు అత్యంత సన్నిహితులుగా మెలిగారు. అమ్మతో గంటల తరబడి రోజుల తరబడి అనేక సంభాషణలు చేశారు. అమ్మ దివ్యశక్తిని, అనిర్వచనీయమైన ఆశీస్సుల్ని కళ్ళారా చూశారు, పొందారు. విలక్షణమైన, విశిష్టమైన అమ్మ తత్త్వానికి వారి గ్రంథం ‘అంతా ఆమె దయే’ దర్పణం.

శ్రీ విశ్వజననీపరిషత్ అధ్యక్షులుగా సంస్థకు మార్గదర్శనం చేశారు; గౌరవ సంపాదకులుగా ‘విశ్వజనని’ మాసపత్రికకు, సలహాదారుగా ‘Mother of All” త్రైమాసిక పత్రికకు దిశానిర్దేశం చేస్తున్నారు. జిల్లెళ్ళమూడిలో మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల, హోమియో వైద్యశాల వంటి సేవాసంస్థల తమ వంతు కృషిచేశారు. వారు సర్వదా అందరింటి సోదరీ సోదరులకు పెద్ద దిక్కు, దిక్సూచి.

సెల్ నెం: 9848140095

శ్రీ పి.యస్.ఆర్.ఆంజనేయప్రసాద్ గారు 14-12-2011న పొత్తూరు లో శ్రీ పొత్తూరి వెంకటేశ్వరరావుగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం. 

****************


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

మీకు అమ్మను గురించి ఎట్లా తెలిసింది. తొలి దర్శన అనుభవాలు ఏమిటి?

ప్రస్తుతం కుర్తాళం పీఠాధిపతులు అప్పటి డా॥ప్రసాదరాయకులపతిగారు. తొలిసారిగా అమ్మ దర్శనం చేయించారు. మేము బాల్య స్నేహితులం. వారు ఆశ్రమ స్వీకారం చేయకముందు చాలా తరచుగా కలుసుకునేవాళ్ళం. వారు 1958 ప్రాంతంలో మనం ‘జిల్లెళ్ళమూడి అమ్మను చూద్దాం’ అన్నారు. ఆ సమయంలో నా బిడ్డపోయిన దుఃఖంలో నా భార్య ఉంది. స్వతహాగా నేను నాస్తికుడ్ని. అయినప్పటికీ కులపతిగారు ఏం చెపితే అది శిరోధార్యంగా ఉండేది. వెళ్ళాం. మాతోపాటు రమణాశ్రమంలో రమణులకి అత్యంత సన్నిహితంగా ఉండి, కావ్యకంఠ గణపతిమునిని చూసిన కృష్ణభిక్షువుగారు, మహనీయుడు. వైయాకరణుడు మిన్నికంటి గురునాథశర్మగారు, పోతరాజు పురుషోత్తమరావు గారు, పియస్‌ఆర్ ఆంజనేయప్రసాద్ గారు, మా ప్రాణస్నేహితులు విద్యాసాగర్ శర్మ గారు వచ్చారు. బాపట్ల – పెదనందిపాడు మార్గంలో 7వ మైలు వద్ద మలుపు తిరిగిన తర్వాత రెండు ఒరవలుండేవి. 7వ మైలు అమ్మ వలననే ప్రసిద్ధి చెందినది. అక్కడి నుంచి రెండు కిలోమీటర్లు గ్రామంలోకి వెళ్ళాలి. ఒరవల్లో నీళ్ళుంటే దిగి వెళ్ళాల్సొచ్చేది. నడుముదాక నీరు వచ్చినా దిగి నడిచిన సందర్భాలున్నాయి. అమ్మ దర్శనం కోసం వెళ్ళేవాళ్ళం.

అప్పుడు అమ్మే స్వయంగా అన్నం పెట్టేది. ఆ దృశ్యాన్ని తలుచుకుంటే ఇప్పటికీ ఒళ్ళు గగుర్పొడుస్తుంది. అప్పటి ఒక సంఘటన చెపుతాను. నాకు దేవుడంటే నమ్మకం లేదు. అద్భుతాలు (miracles) ని ఎప్పుడూ నేను నమ్మేవాడిని కాదు. అమ్మ తను ఉంటున్న ఇంట్లో రెండు వరుసలుగా మాకు భోజనాలు పెట్టింది. నాకెదురు పంక్తిలో ఎదురుగా కులపతిగారున్నారు. అమ్మ కులపతిగారి దగ్గరకు వచ్చి అన్నం కలిపి ముద్దవారి నోటికి అందించింది. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఒక తల్లి కన్నబిడ్డని తన కన్నబిడ్డగా చూస్తూ నోటికి అన్నం ముద్దలు అందివ్వటం అనూహ్యం. మేమా ఎదిగినవాళ్ళం – వ్యాయామం చేసినవాళ్ళం ఆరోజుల్లో. కానీ ఇక్కడొక స్త్రీమూర్తి తన బిడ్డగా, కొడుకుగా భావించి అన్నం తినిపిస్తోంది – ఎంత గొప్ప విషయం. అద్భుతాలు (miracles) ప్రక్కన పెట్టేదాం. ఇంకొక స్త్రీ కన్నబిడ్డని తన బిడ్డగా చూస్తూ నోట్లో అన్నం పెట్టడం మహాద్భుత దృశ్యంగా నాకు అనిపించింది. అప్పుడు నాకు కళ్ళవెంట నీళ్ళు తిరిగినాయి. కారుణ్యదృష్టి, కరుణతో కూడిన ఏ సన్నివేశాన్ని చూసినా కళ్ళ వెంట నీళ్ళు వస్తాయి.

అమ్మ నావైపు చూడటం లేదు, కులపతిగారివైపు చూస్తోంది. నేను అమ్మ వెనుక ఉన్నాను. గిరుక్కున వెనక్కి తిరిగి “నాన్నా! పొగవల్ల కళ్ళ వెంట నీళ్ళు వస్తున్నాయా?” అని అడిగింది. ఆమె ఎట్లా చూసిందో! ‘ఓహో! నాకు తెలియని విషయాలు చాలా ఉంటాయి’ అనిపించింది. నేను ఎంత నాస్తికుడనైనా సత్యాన్ని నమ్ముతా, తార్కికంగా చెబితే నమ్ముతా. కొప్పరపు వెంకటరత్నకవిగారు, గురునాథశర్మగారు, కృష్ణభిక్షువుగారు అందరూ పెద్దవాళ్ళే. వాళ్ళందరినీ అమ్మ బిడ్డలు గానే చూసింది. ఇది మన ఊహకి అందనటువంటి విషయం. ఇది తెలుసుకోదగిన విషయం అనే భావన కలిగింది.

మొదటిసారి వచ్చినపుడు నేను ఇంకెవరినీ పట్టించుకోలేదు. రెండవసారి వచ్చినపుడు హైమ, రవి సుబ్బారావు – ఈ ముగ్గురిలోనూ హైమ పట్ల నాకు కొంత వాత్సల్యం కలిగింది. చిన్నపిల్ల – ‘అన్నయ్యా ! అన్నయ్యా!’ అని దగ్గరకు వచ్చేది. రవి మరీ చిన్నపిల్లవాడు. ఒళ్ళో కూర్చోబెట్టుకునే వాడ్ని. ఇప్పుడు రవికి మనుమలూ, మనుమరాళ్ళూ పుట్టినా నా దృష్టిలో ఇంకా చిన్నపిల్లవాడిలా అనిపిస్తాడు. అప్పటి అనుబంధం అటువంటిది. ఇంకా ఇంకా తెలుసుకోవాలనే ఇచ్ఛ కలిగి గుంటూరు వచ్చి మారుటూరు పాండురంగారావుగారు, కులపతిగారు, నేనూ కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళటానికి ప్రయత్నం చేసేవాళ్ళం. అట్లా మూడు నాలుగు సార్లు జరిగింది.

అమ్మతో సాన్నిహిత్యం ఏర్పడ్డ క్రమాన్ని వివరించండి?

తర్వాత ఒకసారి అమ్మ “నువ్వు హైదరాబాద్ నుంచి అలా వస్తున్నావు. ప్రతీసారీ వాళ్ళకి అవకాశం ఉంటుంది, ఉండదు. నువ్వే ఎందుకు రాకూడదు, సరాసరి?” అన్నది. సరిగా ఈ మాటలే కాదు. అమ్మ చాలా అందంగా మాట్లాడుతుంది కదా! నాకు తట్టలేదు. ‘అవునమ్మా రావచ్చు’ అన్నాను. తర్వాత ఒంటరిగా వచ్చేవాడిని. అప్పటికింకా పూర్తి విశ్వాసం ఏర్పడలేదు. తెలుసుకోవాలనే తపన ఉండేది. ‘ఏమిటి? నేను అమ్మను అంటుందీమె. ఏరకమైన Psychology? నిజం చెప్పాలంటే అనుక్షణం నేను అమ్మను గమనించాలని ప్రయత్నం చేశాను – అమ్మకు చెప్పే. ఇందులో రహస్యంగా చేసేదేమీ లేదు. అమ్మ తన మంచం దగ్గరే పడుకోమనేది నన్ను. ఒక చాప ఇచ్చి “పడుకోరా, ఇక్కడే” అంది. అక్కడే పడుకునేవాడిని. నాకు అక్కడ ఇంకొకచోట పడుకోవటం కానీ, ఇంకొక చోటికి వెళ్ళటం కానీ, ఒకళ్ళతో మాట్లాడటం కానీ ఇష్టం ఉండేది కాదు – ఒక్క క్షణం కూడా అమ్మ దగ్గర నుంచి ఇవతలకి రావటం ఇష్టం ఉండేది కాదు. అమ్మ స్నానం చెయ్యాలి కదా! నేను కూడా అవతలకి వెళ్ళాల్సి వస్తుంది కదా – అప్పుడప్పుడు – సిగరెట్లు అలవాటు మూలాన ఇట్లా గంటల తరబడి, పూటల తరబడి, రోజుల తరబడి అమ్మ దగ్గర కూర్చునే అదృష్టం నాకు కలిగింది. ఉద్యోగం గురించి లెక్కచేసేవాడిని కాదు. పోతే పోతుంది అనుకునే వాడ్ని. వాళ్ళేమో కబురు చేస్తూండేవారు; ఇంటికిపోయి అక్కడ అడుగుతూండే వాళ్ళు – ఎప్పుడు వస్తాడు ఈయన, ఎప్పుడు వస్తాడు – అని. జర్నలిజం కదా! అట్లా అమ్మని గమనించడానికి చాలా ప్రయత్నాలు చేశాను. ఈ లోపల హైమ తోటి, రవితోటి అనుబంధం పెరిగింది – చాలామందిని రెడ్డి సుబ్బయ్య ఇంకా ఇతరులని అడిగేవాడ్ని ‘ఏమిటి? మీరేం చూశారు? ఏమిటి విశేషం?’ అని. సుబ్బయ్య నాతో అన్నాడు ‘ఒకసారి తలుపు తెరిచేటప్పటికి అమ్మ చేతిలో పాము ఉన్నది’ అని. హైమ చెప్పిన ఒక సందర్భం ఉంది- ‘అన్నయ్యా! అమ్మ పచ్చడి రుబ్బుతోంది. అక్కడ ఇంకో రుబ్బురోలు ఉంది. నేను ఆడుకుంటూ వెళ్ళి ‘అమ్మా! నాకు కూడా వాసన చేసిపెట్టవా?’ అన్నాను. అమ్మ చేత్తో రుబ్బురోలు పత్రంను తాకి “ఫో-తీసుకెళ్ళు” అన్నది. అప్పటి నుంచి చాలా రోజులు ఆ రుబ్బుడు పత్రం సువాసన వచ్చేది’ అని.

మీరు స్వతహాగా నాస్తిక భావాలు కలవారు. వృత్తిరీత్యా జర్నలిస్టులు. ఇలాంటి మీకు అమ్మ యందు విశ్వాసం ఎలా కలిగింది?

నా కన్నతల్లి దగ్గర కానీ, నన్ను పెంచిన తల్లి దగ్గర కానీ నేను అనుభవించనటువంటి ఆప్యాయత, ప్రేమ, వాత్సల్యం అమ్మ దగ్గర చూశాను. నా కన్నతల్లి ఎంతో ఈమె అంతే. అంతకన్న మిన్న కూడా. దగ్గరకు తీసింది. నన్ను, కొడుకుని ఎంత దగ్గరగా రానివ్వటానికి వీలుంటుందో అంత దగ్గరగా రానిచ్చింది. కనుక అమ్మతో నాకు అనుబంధం చాలా ఉంది; అప్పట్లో బహుశః చాల కొద్దిమందికి ఈ అదృష్టం అమ్మ కలిగించి ఉంటుందని నమ్ముతాను.

అమ్మ ఇచ్చిన అదృష్టమే. నాలో ఏదో విశేషం ఉందని నేను అనుకోను. ఆమె కరుణ ఎవరిపై ఎప్పుడు ఎలా ప్రసరిస్తుందో తెలియదు. నామీద ఆ కరుణ ప్రసరించింది. నాలోని తపనేమిటంటే సత్యాన్ని తెలుసుకోవాలని. వృత్తి journalism లో కూడా అంతే నేను శోధించాలి. అట్లాంటి దృష్టి అమ్మ దగ్గర కూడా. ఎవరో చెప్పినంత మాత్రాన నేనేమీ అంగీకరించను, చెయ్యను. నేను కూడా verify చేసుకుంటాను. చాలా సేపు అమ్మతో మాట్లాడేవాడిని. కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పింది అమ్మ. అవన్నీ సాధ్యమా? అనిపించింది. అమ్మ చెపుతున్న కొద్దీ మానసికంగా చాలా బాధ కలిగే విషయాలు కొన్ని విన్నాను. అట్లా బాధ ఎక్కువగా కలిగిన కొద్దీ నేను అమ్మకి మరింత దగ్గరగా వెళ్ళటానికి ప్రయత్నం చేశాను. ఎప్పుడైనా నాన్నగారు అమ్మతోటి మాట్లాడటానికి వస్తే – మర్యాద ఏమంటే- వారు భార్యభర్తలు, ఏకాంతంగా మాట్లాడుకుంటారు నేను వారి మధ్య నుంచి వెళ్ళాలి అని. అమ్మ మంచం మీద నా చెయ్యి ఎప్పుడూ ఉండేది. వీలైతే అమ్మని తాకేవాడిని – పాదాలో ఎక్కడో – ఆ ఆనందం కలిగేది. నాన్నగారు వచ్చినపుడు రెండు మూడుసార్లు నేను లేచి స్పర్శలో నాకు గొప్ప వెళ్ళాను; అమ్మ ఊరుకుంది. తర్వాత అమ్మ తన చేత్తోటి నా చెయ్యి నొక్కింది – వెళ్ళక్కరలేదని దాని భావం. చెయ్యి తీసేసేది కాదు; కనుక నేను ఎట్లా వెడతాను? ఉండిపోయేవాడిని.

నాన్నగారు అవీ ఇవీ ఏవో మాట్లాడేవారు. నేను ఆయనతో ఏం మాట్లాడుతాను? ఆయన నాతో ఏమి మాట్లాడతారు? మా మధ్య తత్త్వచర్చకి తావు లేదు. నేను జర్నలిస్టుని కనుక ఆయన నన్ను రాజకీయాలు అడిగేవారు. ఆయనకి కాంగ్రెస్ అంటే అభిమానం. కోన ప్రభాకరరావుగారు ఆయన స్నేహితులు. నేను కావాలని కాంగ్రెసుని కొంచెం విమర్శించేవాడిని. ఆయన చాలా ఆవేశంతో మాట్లాడేవారు – సరదాకి అనుకోండి.

అమ్మ దగ్గర మాత్రం కేవలం అలౌకిక విషయాలు మాట్లాడేవాడ్ని. లౌకికమైన అంశాలతోటి సంబంధం కలిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. శాస్త్రవిజ్ఞానం గురించి కూడా అమ్మ దగ్గర ప్రస్తావించాను. ఉదా: Big Bang Theory. నాకు Science అంటే ఆసక్తి- పెద్దగా విశ్వవిద్యాలయ స్థాయి చదువుకోలేదు కానీ పుస్తకాలు చదివాను; చిన్నప్పటి నుండీ అలవాటు. నేను ఈ విషయాలు మాట్లాడితే అమ్మ వినేది; కొన్ని విషయాల్లో స్పందించింది, కొన్ని విని ఊరుకుండేది. ఫలానా విషయం చెప్పి అమ్మ అభిప్రాయం తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడిని. అంతే కానీ చర్చకాదది.

అమ్మను కేవలం ఒక మాతృమూర్తిగానే కాక ఒక అలౌకికశక్తిగా ఎప్పుడైనా దర్శించారా?

నాకున్న ఒక బలహీనత సిగరెట్ కాల్చటం. ‘అమ్మా! ఇప్పుడే వస్తాను’ అని గంటకో రెండు గంటలకో బయటికి వెళ్ళి సిగరెట్ కాల్చుకుని మళ్ళీ వచ్చేవాడిని. మళ్ళీ నేను వచ్చేదాకా లోపల అమ్మ ఒక్కతే కూర్చుని ఉండేది. అప్పుడు China war వచ్చింది. War నిధికి అందరూ విరాళాలు ఇచ్చేవారు. నేనేమీ ఇవ్వలేదు. డబ్బులు లేవు. ఆస్తులేమీ లేవు. వచ్చిన జీతం సిగరెట్లకి సరిపోయే పరిస్థితి. ఏం ఇవ్వలేక పోతున్నాననే బాధ వచ్చి అమ్మతో చెప్పాను. ‘సిగరెట్లు మానుకోవాల్సి వస్తుందమ్మా’ అని. నాలుగైదు సార్లు ప్రయత్నం చేశాను, మానలేకపోయాను. అమ్మతో మాట్లాడుతున్నపుడు నేను సిగరెట్ కోసం బయటికి వెళ్ళటం అనేది తప్పు అనే జ్ఞానం అప్పుడు కలిగింది. సిగరెట్ కాల్చి నేను వాసనతో వచ్చినా అమ్మ ముక్కుకి గుడ్డ అడ్డం పెట్టుకునేది కాదు; సరిపెట్టుకున్నది.

ఒకసారి ఎలాగైనా మానాలనుకున్నాను. ఆ సంఘటన చాలా ఆసక్తికరంగా ఉంటుంది. మువ్వల సత్యం కాఫీకొట్టు ఉంది. అక్కడ సిగరెట్లు అవీ పెట్టేవాడిని. అమ్మతో చెబితే మాట తప్పలేను, పూర్తిగా మానుకోవాల్సి ఉంది. అందుకని చెప్పలేదు. తిరుగు ప్రయాణమై ‘అమ్మా! వస్తాను. సెలవు’ అని చెప్పి బయటికి వచ్చాను. నాన్నగారు కనిపించి ‘ఏమండీ వెడుతున్నారా?

కాసేపు ఉండండి – వర్జ్యం’ అన్నారు. నాకు వర్ణ్యాలు ఇట్లాంటి వాటి మీద నమ్మకాలు లేవు. అయినా నాన్నగారు చెప్పారు – గౌరవించాలి కదా! అదొక వంక పెట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళాను అమ్మ దగ్గరికి – కాసేపు మాట్లాడుదామని. ఈ లోపల సత్యం కొట్టుకు వెళ్ళి ఉన్న ఒకే ఒక Gold Flake సిగరెట్ అక్కడ పెట్టి మళ్ళీ వచ్చి తీసుకుంటానని చెప్పివచ్చా. అట్లాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మళ్ళీ అమ్మ దగ్గరకి వస్తే ఈసారి అమ్మ దురభ్యాసాల గురించి మాట్లాడటం మొదలు పెట్టింది – త్రాగుడు… ఇతర వ్యసనాల గురించి. ‘నాకు కూడా ఈ సిగరెట్‌తో పెద్ద బాధ అయిందమ్మా. నీతో చెప్పి మానేద్దామనుకుంటున్నాను. మానేస్తానమ్మా’ అన్నాను. తలఊపింది. ఏమంటుంది? మళ్ళీ సబ్జెక్ట్ మారిపోయింది. కొంచెం సేపు అయిన తర్వాత బయటికి వచ్చా. కాఫీ కొట్టుకు వెళ్ళా. ఇప్పుడా సిగరెట్ కాల్చాలా, వద్దా? అమ్మతోటేమో మానేశానని చెప్పా. కానీ ‘సిగరెట్ ఇక్కడే పెట్టు. మళ్ళీ వచ్చి తీసుకుంటాను’ అని సత్యానికి చెప్పి అమ్మవద్దకి వెళ్ళాను. కాబట్టి ఆ సిగరెట్‌కి అమ్మకి ఇచ్చిన మాట వర్తించదు – అది ఒక logic. మళ్ళీ నేను సిగరెట్ త్రాగటానికి, మరొకవైపు ఏ క్షణంలో అమ్మకి మాట ఇచ్చానో ఆ క్షణం నుంచే మానేసినట్టు కదా! ఎట్లా కాలుస్తాను – అని. ఈ మీమాంసలో ఏం చేయాలా అనుకొని వెళ్ళి కాఫీ త్రాగా. సిగరెట్ పెట్టి తీసుకు తెరిచాను – దాంట్లో సిగరెట్ లేదు! ‘సత్యం ! దీంట్లో సిగరెట్ ఏదీ?’ అన్నా. ‘చూడలేదన్నయ్యా. ఎవరూ రాలేదే ఇక్కడికి, నీ సిగరెట్ ఎవరు కాలుస్తారు?’ అని తనూ వచ్చి చూశాడు. లేదు దాంట్లో, ఓహో ! సమస్య పరిష్కారమైంది. నేను కాల్చడం మానేసినట్లే. అప్పటి నుంచి 1962 తర్వాత మళ్ళీ సిగిరెట్ కాల్చలేదు. 2002లో నాకు Bypass Surgery జరిగింది. అపుడు వైద్యులు పరీక్షించి, ‘ఎప్పుడైనా మీరు సిగరెట్ కాలా?’ అని అడిగారు. దాని ప్రభావం వలన ఊపిరితిత్తుల్లో గుండె మీద ఒక మచ్చ ఉండిపోయింది. 1954-62 మధ్య ఒక జీవితానికి సరిపడేటటువంటి సిగరెట్లు కాల్చానన్నమాట. ఎంత దూరం చూపుతో అమ్మ నా ఈ దురలవాటు. అమ్మకి ఎంతో సన్నిహితంగా మెలిగాను. ఎక్కువసార్లు అమ్మ దగ్గర కూర్చున్నాను; ఎక్కువసార్లు అమ్మతో మాట్లాడాను. ఆ అవకాశాలు అమ్మ. ఇచ్చినవే. అవి ఏ కొద్దిమందికో వచ్చినవి అనుకుంటాను. ఆ అదృష్టాన్ని నాకు కలిగించినందుకు – జన్మలంటూ ఉంటే ఎన్ని జన్మల పుణ్యఫలమో అనిపిస్తుంది నాకు. సకల చరాచర జంతుజాలాన్నీ సమానంగా అమ్మే ప్రేమించింది. ప్రతిబిడ్డా తల్లికి ముద్దువస్తుంది. అందరినీ అన్నట్లే నన్నూ ముద్దుమాటలేవో అంది. పంది అంటే మనం అసహ్యించుకుంటాం. – “పంది ఎంత అందమైన జంతువో, దాని ముట్టె – దాని చూపు ఎంత అందమైనవి” అన్నది అమ్మ: ఏ జంతువైనా కుక్కలు, పిల్లులు అ మేము వ్యాయామం చేసిన వాళ్ళం కదా ! మీరెంత ? మీ బలం ఎంత? అని అమ్మ మాకు ఋజువు చేసిన రెండు సంఘటనలున్నాయి. ఒకసారి ఎవరో అమ్మకి పూజ చేసుకుంటున్నారు. వందలకొద్దీ మిడతలు వచ్చి పడుతున్నాయి. అమ్మ మీద కూడా వాలుతున్నాయి. వాళ్ళు చాలా శ్రద్ధగా పూజ చేసుకుంటూనే ఉన్నారు. మిడతలు వాళ్ళ మీద పడుతున్నాయి, క్రిందపడుతున్నాయి. అమ్మ మీద పడుతున్నై. అమ్మ మీద పడకూడదని ఒక విసనకర్ర తీసుకుని బాగా విసురుతున్నా. నిజానికి ఆ విసురు గాలికి ఒక మిడత కూడా రావటానికి వీలులేదు. కానీ వస్తూనే ఉన్నాయి. ఈ గాలి ఏమైపోతున్నదో తెలియదు; విసురుతున్న ఈ శక్తి ఏమైపోయిందో తెలియదు. వస్తూనే ఉన్నాయి. అమ్మ చూస్తోంది. నాకు పట్టుదల పెరిగింది – ఒక్క మిడత కూడా రాకుండా చేయాలని. అవి చిన్న కీటకాలు, వాటి ముందర మన బలం సరిపోవట్లేదా? ఇంకా గట్టిగా విసురుతున్నా. అవి తగ్గలేదు. నా చెయ్యి నొప్పిపుట్టింది, అలసట వచ్చింది. కానీ అవి మాత్రం వస్తూనే ఉన్నాయి. ‘ఓడిపోయానమ్మా’ అనుకున్నాను.

ఒకసారి ఓడరేవు దగ్గరకి వెళ్ళాం. అమ్మ కార్లో ఎక్కి సముద్రతీరం వెంబడి ప్రయాణం చేస్తోంది. చాలా సేపు బాగానే ఉంది. ఉన్నట్టుండి ఇసుకలో అది కూరుకుపోయింది. మాకెట్లా ఉండేదంటే ఎత్తి అవతలపడేద్దాం కారుని; ఏముంది దాంట్లో ? బాగా కండలు తిరిగిన శరీరాలు కనుక ఎత్తడానికి ప్రయత్నించాము. ఒక్క అంగుళము కూడా కదలలేదు. “మీకు కుదరదు కానీ అక్కడ బెస్తవాళ్ళుంటారురా, వాళ్ళని పిలవండి” అన్నది అమ్మ. మేము చెయ్యలేనిది బెస్తవాళ్ళు చెయ్యటమేమిటి? – అని అనుకున్నా. కానీ అమ్మ చెప్పింది కదా! మనవాళ్ళు వెళ్ళి పిలుచుకువచ్చారు. వచ్చి అవలీలగా దాన్ని అవతలకి నెట్టేశారు. ఈ సంఘటన ద్వారా మనశక్తి శక్తి కాదు అని తెలుస్తోంది.

మీమీద అమ్మ ప్రభావం ఉన్నదా?

అమ్మ మాట్లాడే ప్రతి మాటకి అర్థం ఉంది. ఆచితూచి బంగారం కంటె ఎక్కువగా వేసిన పదాలు. మనం మాట్లాడే మాటల మీద కూడా అమ్మ ప్రభావం ఉంది. మనకి తెలియకుండా మనచేత మాట్లాడిస్తుంది అమ్మ..

ఒక వేసవి కాలం – వెన్నెలరాత్రి. ప్రస్తుతం హైమాలయం ఉన్న ప్రదేశం. అమ్మ మంచం మీద కూర్చుని ఉంది. చాలా నిశ్శబ్దంగా ఉంది. రాత్రి గం. 10ల సమయం. ఎక్కడన్నా దూరంగా ఎవరన్నా మాట్లాడితే మాటలు వినవస్తాయి. పల్లెటూరు కదా! ప్రశాంతంగా ఉంటుంది. అమ్మ, నేను సంతోషంగా ఏవో మాట్లాడుకుంటున్నాము. ఇంతలో సన్నటి గజ్జెల చప్పుడు వినిపించింది. అమ్మ నివాసం పూరింటి దగ్గర నుంచి మేము ఉన్న మంచం దగ్గరికి హైమ నడచి వస్తోంది. హైమ పట్టాలకున్న చిరుగజ్జెల చప్పుడు ఆ వినిపిస్తోంది. అమ్మ వంక నేను, నా వంక అమ్మ చూస్తూ మాట్లాడుకుంటున్నాము. ‘దేవత నడచి వస్తున్నట్లున్నదమ్మా!’ అన్నాను. అమ్మ చూసింది. చిరునవ్వు నవ్వింది. హైమ మంచం దగ్గరకి రాగానే హైమతో అమ్మ “అన్నయ్య నిన్ను దేవత అంటున్నాడు” అన్నది.

హైమని ‘ఏమ్మా ! ఏమైనా తిన్నావా?’ అని అడిగేవాడ్ని. ‘ఇప్పుడే తొట్టి స్నానం చేశానన్న’ అనేది. లోపల అమ్మ దగ్గరకి పోయేది. కాసేపు అమ్మతో మాట్లాడేది. రవి హైమని అంటూండేవాడు ‘చిన్మాత’ అని. రవి ఎందుకు ‘చిన్మాత’ అన్నాడు. నేను ‘దేవత’ అని ఎందుకు అన్నాను? అన్నది హైమదేవతగా పూజలందుకున్న తర్వాత అర్థమైంది. ఇప్పుడు హైమ ఎక్కడ సమాధి అయిందో సరిగా అదే స్థలంలో ‘దేవత నడచి వస్తున్నట్లున్నదమ్మా!’ అన్నాను అప్పుడు. నేను దేవతలని చూశాను కనుకనా! మా ఇద్దరి నోటివెంట వచ్చిన ఆ మాటలు ‘అమ్మ మా నోట పలికించిందా!’ అనిపించింది.

అమ్మని ఆధ్యాత్మిక రంగంలో సామ్యవాది అని కొందరంటారు. దానిని గురించి మీ అభిప్రాయం ఏమిటి?

మార్క్సిజం గురించి చదివాను. సోషలిస్టు సిద్ధాంతాల పట్ల అభిమానం కలవాడ్ని. మనవైదిక విజ్ఞానంలో –

‘అయంపరః నిజోవేతి గణనా లఘుచేతసా ||

ఉదార చరితానాం తు వసుధైక కుటుంబకమ్ ||’

అనేది చాలా గొప్ప భావన. అమ్మ వద్దకు వచ్చేవారి కులం, అంతస్తుతో సంబంధం లేదు. మంత్రాయి అస్పృశ్యుడని లేదు, మనందరి లాగా బిడ్డే. అలాగే రెడ్డి సుబ్బయ్యనీ, అందరినీ అమ్మ దగ్గరకి తీసింది. అయితే ఇదీ మనం చెప్పుకోవాలి. సనాతన ఆచారాల పట్ల ప్రాచీన సంప్రదాయాల పట్ల విశ్వాసం ఉన్నవాళ్ళు ‘అందరితో వచ్చి కూర్చోలేము. మేము విడిగా భోజనం చేస్తామమ్మా’ అని అంటే “మంచిది, నాన్నా! మీకు వేరే పెడతారు” అన్నది. అమ్మకి అందరూ అన్నం తినటం ముఖ్యం. గదిలోపల కూర్చుని తింటే ఏం? గది బయట కూర్చుని తింటే ఏం? నేనే కాదు, నాలాంటి నాస్తిక భావాలు కలిగినటువంటి శ్రీ జొన్నలగడ్డ రామలింగయ్యగారు వస్తే “రండి!” అన్నది. నమ్మకం లేదు’ అన్నాడు. “అక్కరలేదు, నాయనా! అన్నం తిని వెళ్ళు” అన్నది. ఆశ్చర్యకరంగా ఆయనకి ఇష్టమైన నూకల అన్నం వండించి పెట్టింది అమ్మ ఆరోజు. ‘నాకు నూకల అన్నం ఇష్టమని ఆమె కెట్లా తెలుసు?” అనుకున్నాడు. అట్లా అందరినీ దగ్గరకి తీసింది. సమభావన. అందరితో కలిసి పంక్తి భోజనాలు చేసేటప్పుడు – కటిక నీళ్ళ మజ్జిగ. కానీ ఆ అన్నం చాలా రుచిగా ఉండేది. ఆ అన్నంలో మజ్జిగ వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని తింటే అద్భుతంగా ఉండేది. ఒక పంక్తిలో వందమంది కూర్చున్నపుడు ఒకరికి పెరుగువేసి, ఒకరికి మజ్జిగవేసి, ఒకరికి నీళ్ళ మజ్జిగ వేసి అలా కదా! అందరినీ సమంగా చూసేది అమ్మ చెయ పెద్దవాళ్ళు వచ్చినపుడు మంత్రులు వచ్చినా సరే వాళ్ళ డ్రైవర్ని కూడా పిలవమనేది; వాళ్ళ పనివాడ్ని పిలవమనేది – వాళ్ళని కూడా గౌరవంగా చూసేది. మంత్రిని ఎట్లా అన్నం తినమని చెప్పేదో వాళ్ళనీ అలాగే తినమనీ చెప్పేది. ఇంతకన్నా సమత్వం ఎక్కడ ఉంటుంది? జిల్లెళ్ళమూడి వచ్చిన మొదటి విదేశీయుడు ఒక Peace -Core-Volunteer. వాళ్ళందరినీ సమానంగానే చూసింది అమ్మ. వసుధైక కుటుంబం అంటే ఇంతకంటే ఇంకొకటి ఉంటుందా? బామ్మగారు, పాపత్తయ్య గారు, సీతాపతి తాతగారిని జిల్లెళ్ళమూడిలో చూశాను. అక్కడ భోజనాలు చెయ్యటం చూశాను. వాళ్ళంతా అమ్మ దగ్గరకి వచ్చేవాళ్ళు. మేమంతా అమ్మ దగ్గర కూర్చుని కబుర్లు చెప్పుకుంటూంటే చూసి సంతోషించేవాళ్ళు. కానీ అంతకు ముందు పరిస్థితి అట్లాంటిది కాదు. వివరాల జోలికి మనం పోనక్కరలేదు. నాన్నగారు మా అందరితో చెప్పేవారు, record purpose కి చెపుతున్నాను, ‘ఆమె నాకు భార్య. మీకు అమ్మ అంటున్నారు.

నాకు భార్య. భార్యగా ఆమె నుంచి నేను కోరేవి ఉంటాయి. అవి నేను తీసుకుంటాను’ అన్నారు; ఆమె చేత పరిచర్యలు చేయించుకున్నారు. అమ్మ కూడా ఆయనకేమి కావాలో అవన్నీ సమకూర్చేది- భర్తగా ఆశించినవన్నీ. అట్లా అని తన సంతానంగా చూసే మిగతావాళ్ళెవరికీ లోపం చేయలేదు. సీతాపతి తాతగారికీ చేసింది. వాళ్ళందరూ అమ్మ పట్ల ఆరాధన భావం అని అననుకానీ, ఒకప్పుడు వాళ్ళకుండేటటువంటి అభిప్రాయాలు తొలగిపోయి ఏదో అందరూ అమ్మని ఆరాధిస్తున్నారు, మంచిదే – అనే భావంలోకి వచ్చినట్లు అనిపించింది నాకు. కోన సుబ్బారావు గారి భార్య మా పినతండ్రి కుమార్తె వెంకాయమ్మగారు; వాళ్ళ పిల్లలు వసుంధర, సత్యం, వెంకటేశ్వరరావు, అమ్మాజీ. వీళ్ళంతా అమ్మ దగ్గరకి రావటం, అమ్మతో అనుబంధం కలగటం, నాకూ అనుబంధం కలగటం… ఇవన్నీ యాదృచ్ఛికం. అంతే. అమ్మ ఎప్పుడు ఎవరిని ఎలా పిలిపిస్తుందో తెలియదు. ఎవరిని ఎప్పుడు గమనిస్తుందో దగ్గరకి తీసుకుంటుందో అది మనకు తెలియదు. ఎందుకో ఎందువలననో కూడా ఆమెకే తెలుసు.

ఉదాహరణకి నేను మాజేటి గురవయ్య పాఠశాలలో చదువుతున్న రోజుల్లో చడ్డీ వేసుకుని ఎక్కడికో వెళ్ళాను. అపుడు అమ్మంటే తెలియదు. ఆ ప్రాంతంలో చూసిందట మొదటిసారిగా అమ్మ నన్ను! జిల్లెళ్ళమూడిలో కాలేజి రావటానికి, ఆస్పత్రి రావటానికి నాకూ చిన్న పాత్ర ఉంది. నేను నిమిత్తమాత్రుడ్ని. సత్యం (డా.కె.యస్.యన్.మూర్తి) డాక్టర్ పరీక్షలో ఉత్తీర్ణుడైన తర్వాత అమ్మ చాలా అమాయకంగా “ఇక్కడే ఉద్యోగం చేయకూడదా, నాన్నా?” అంది. మేమంతా నవ్వే వాళ్ళం. ఈ కుగ్రామంలో hospital ఏమిటి? అని. అట్లాగే పన్నాల రాధాకృష్ణశర్మగారిని చాలా అమాయకంగా “ఇక్కడ పనిచేయకూడదా?” అంది తమాషాగా. ‘జిల్లెళ్ళమూడిలో కాలేజి ఏమిటి? నేను ప్రిన్సిపాల్ ఏమిటి?’ అనుకున్నారాయన. ఎవరూ నమ్మరు. కానీ అమ్మ చెప్పిన వాటిని చాలా seriousగా తీసుకుని మనం ప్రయత్నం చేయాలని చెప్పినటువంటి వాడు అధరాపురపు శేషగిరిరావు అన్నయ్య గారు. ఆయన కాప్రేరణ కల్పించింది అమ్మ. ఆయన దగ్గర మేము స్వచ్ఛంద సేవకులం. నాకూ నా వృత్తిని బట్టి ఎవరో తెలిసి ఉంటారు. ఏదన్నా ఒక మాట చెప్పి ఉంటాను. ఆయన ప్రధానమైన ఉపకరణం. వారి పట్ల మనం కృతజ్ఞతాభావం కలిగి ఉండాలి.

ఆ రోజుల్లో సోదరుడు తంగిరాల కేశవశర్మ, టి.యస్. శాస్త్రిగారు, అన్నపర్తి కృష్ణశర్మ, నేను – మేము నలుగురం కలిసి అప్పటి మా ఆఫీసు (గాంధీభవన్) ప్రాంగణంలో ఉన్న lawn మీద కూర్చుని పైన చంద్రుని చూస్తూ ‘ఈ క్షణంలో అమ్మ కూడా చంద్రుని చూస్తూ ఉందా? ఈ నేలమీదే కదా అమ్మ అక్కడ ఉంది, మనం ఇక్కడ ఉన్నాం. ఇక్కడ నుంచి అక్కడికి ఎంత దూరం ఉంటుంది?” అని ఊహించుకునే వాళ్ళం. ఆ రోజుల్లో అటువంటి అనుబంధాలు ఉండేవి.

1973లో అమ్మ హైదరాబాద్ పర్యటించింది. ఆనాటి మీ అనుభవాలు చెప్పండి.

1973 ప్రాంతంలో ‘అమ్మ హైదరాబాద్ వస్తోంది. మనందరం కలిసి పని చేయాలి’ అనుకున్నాం. శ్రీ టి. రాజగోపాలచారిగారు ప్రధానమైనవారు; ఇంకా ఎమ్. దినకర్, శిష్ట్లా శాంత మేము చాలా మంది ఉన్నాము. అమ్మ జరు కాలనీలో రాజగోపాలాచారి గారింట్లో ఉండేది. అంతవరకు ఉన్న ఒకప్పటి మా ఇల్లు చూపించి అమ్మ “ఇది వాడి ఇల్లురా. వాడు నిలుపుకోలేదు” అని అనేకసార్లు అనేకమందితో అంది. అమ్మ దయ లేకుంటే ఎలా ఉంటుంది? ఆ ఇల్లు కట్టేటప్పుడు పోతుందని ముందే సంకేతం ఇచ్చింది. అమ్మ కుంకుమ పొట్లం తీసుకుని శంకుస్థాపనకి వెళ్ళాం. తీరా శంకుస్థాపన సమయంలో చూస్తే కుంకుమ పొట్లం లేదు. ఎందుకు లేదంటే కొన్ని సంవత్సరాల తర్వాత తెలిసింది. అప్పులున్నాయి. – ఎట్లా గోట్లా తీరిస్తే బాగుండునని అమ్మేశా.. ఇవాళ దాని ఖరీదు కనీసం నాలుగు కోట్లు ఉంటుంది.

పర్యటనల్లో అమ్మతోపాటు వెళ్ళేవాళ్ళం. సేవా కార్యక్రమాలు ఎక్కడ జరుగుతున్నా ఎవరు చేసినా అమ్మ ఆనందించేది. గుడిసెల దగ్గరకు వెళ్ళింది. వాళ్ళు కూడా అమ్మని ఎంతో ప్రేమగా చూశారు. అమ్మ వారి పట్ల అపారమైన కరుణ చూపించింది, కౌగలించుకుంది, ఆనందించింది. ఒక చోట గుడిసెల దగ్గర అమ్మ ప్రసాదం, పులిహోర పంచుతున్నా. గంగాళంలో కొంత మాత్రమే ఉంది. జనం వందల ” మంది ఉన్నారు. అందుకని గుప్పెడో రెండు గుప్పెళ్ళో పెడుతున్నా. “ఎట్లా పెడుతున్నారు. నాన్నా?” అమ్మ నన్ను పిలిపించి అడిగింది. * ఇంత పెడుతున్నాము’ అన్నాను. “బాగా హైదరాబాద్ పర్యటనలో అమ్మతో శ్రీపొత్తూరి పెట్టరా” అన్నది అమ్మ. ‘చాలామంది జనం ఉన్నారమ్మా. సరిపోవద్దా?’ అన్నాను. “పెట్టరా” అంది అమ్మ. అమ్మ ఇట్లా చెప్పిందేమిటి అని పట్టుదలతో చేతిలోని పళ్ళెంతో అంతకు ముందు దానికంటే మూడు నాలుగు రెట్లు పెడుతున్నాను. తీసుకుంటున్నారు. జన అయిపోయారు. గంగాళంలో పులిహోర ఇంచుమించు అలాగే ఉంది. అంటే సినిమాల్లో చూపించినట్లు ఉబ్బటం అలా ఏమీ ఉండదు. పెడుతూనే ఉంటాం. దానిలో ఉంటూనే ఉంటుంది. ఎలా మిగిలి ఉన్నదీ తెలియదు. పోనీ సృష్టించబడుతోందా? అదీ కనిపించదు. అది చాలా ఆశ్చర్యకరం.

నాటి అందరింటి సోదరీ సోదరుల అనుబంధాన్ని చెప్పండి.

అమ్మ దగ్గరకి వెళ్ళివచ్చిన మనవాళ్ళు ‘Battery charge చేసుకుని వస్తున్నాం’ అనేవారు. ‘మీరు అమ్మ దగ్గరకి వెళ్ళి వచ్చారు. అమ్మను తాకారు. ఏదీ shake hand ఇవ్వండి’ అంటూ కరచాలనం చేస్తే మనకీ ఎంతో ఆనందంగా ఉండేది. ఉదాహరణ – ఒకసారి నాకు జ్వరం వచ్చి, తగ్గింది. మర్నాడు . ఉదయం తంగిరాల రాధ వచ్చాడు మాఇంటికి. జిల్లెళ్ళమూడి నుంచి సరాసరి అన్నం తీసుకువచ్చాడు. చద్ది అన్నం కదా! కారప్పొడి అన్నం. ‘అమ్మ ఇమ్మంది. నీకు’ అని ఇచ్చాడు. పథ్యం పెట్టటం అన్న మాట అది. జ్వరం వచ్చిందని ఆమె కెవరూ చెప్పలేదు.

అమ్మ మీకు చెప్పిన లేక మీరు ఆచరిస్తున్న సాధనలు ఉన్నాయా?

అమ్మ నాకు రెండు మూడు ఉత్తరాలు వ్రాసింది. ఒక ఉత్తరంలో “నాన్నా! వెంకన్నా, రా ! అమ్మ” అంతే. ఇంకో ఉత్తరంలో “అంఆ”. ఈ అక్షరాల ప్రభావం నా మీద ఉంది. ‘పారమార్థిక పదకోశం’ గ్రంథం వ్రాస్తున్నపుడు శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారిని ‘స్వామీ! ‘అంత’ అనే అక్షరాలు బీజాక్షరాలేనా?’ అని అడిగాను. ‘సందేహమేముంది? బీజాక్షరాలే’ అన్నారాయన. అమ్మ ఆ బీజాక్షరాల్ని చాలా మందికి వ్రాసి ఇచ్చింది. ‘అవి బీజాక్షరాలు, జపం చెయ్యండి’ అని అమ్మ ఎప్పుడూ చెప్పలేదు. కానీ నా అనుభవంలో అవి అమ్మ ఉపదేశించిన బీజాక్షరాలు. అది ఉపదేశం. ‘ఎవరైనా చేసుకుంటే మేలుకలుగుతుంది’ అనే విశ్వాసం నాలో కలిగింది. దానిని నేను జపం చేస్తా. సాధనగా నేనేమీ చేయలేదు. అమ్మ దగ్గర కూర్చోవటం, అమ్మతో మాట్లాడటం, అమ్మను తలచుకోవటం – ఇవే నా సాధన. అమ్మ ఎప్పుడూ మనస్సులో ఉంటుంది. ‘ఈ లోపల ఉండిపో’ అని కోరుకుంటా. అంతకంటే కోరవలసిన పెద్ద కోరికేమీ లేదు. నాకు అనేక విషమ పరిస్థితుల్లో, నా మనస్సుకి ఏమీ తోచని సమయంలో అమ్మని జ్ఞాపకం చేసుకుంటే అమ్మ స్ఫురణకి రాగానే ఏదోరకంగా నాకు పరిష్కారం లభించేది.

ఇటీవల జిల్లెళ్ళమూడిలో మనం నిర్వహించుకున్న తత్త్వ చింతన సదస్సుపై మీ అభిప్రాయమేమిటి?

ఇటీవల ‘తత్త్వచింతన సదస్సు’ని జిల్లెళ్ళమూడిలో నిర్వహించుకున్నాం. మన ఆలోచనలను కలబోసుకున్నాం, అనుభవాలు చెప్పుకున్నాం. అమ్మకి ఒక తత్త్వం ఉన్నది. అమ్మ మాటలు Aphorisms; సూత్రాలు – బ్రహ్మసూత్రాలు లాంటివి. పెద్ద పెద్ద విషయాల్ని రెండో మూడో పదాలలో చెపుతుంది. సంస్కృతంలో కంటే Latin వంటి ఇతర భాషల కంటే తెలుగులో ఇంకా ఎక్కువ సౌలభ్యం ఉందని చెప్పినట్లుగా అనేక వ్యాకాలున్నాయి. “ఇష్టం లేనిదే కష్టం”. “అంతా అదే” ఈ రెండు పదాల్లో మొత్తం సిద్ధాంతసారం ఉంది. అంతా అదే; అది కానిది ఇంకొకటి లేదు – అంతా ఒకటే అన్నపుడు అద్వైతము. ఇట్లాంటి సదస్సులు ఇంకా జరిగితే మంచిది అని నాకు అనిపిస్తుంది. సదస్సు చాలా మందిని ఒకచోట చేర్చింది. అందరం కలిసి ఆలోచనలు కలబోసుకున్నాం. నా మనస్సుకి చాలా తృప్తి కలిగించింది.

నా వృత్తిలో నేను విజయం పొందాను కదా ! ఆ విజయానికి అమ్మయే కారణం. చెప్పకుండా అమ్మ ఇచ్చిన మంత్రం ‘అఆ’. అది ఎప్పుడు చెయ్యాలో ప్రేరణ ఆమె కల్పిస్తుంది. మౌఖికంగా చెప్పదు. ఈ మంత్రాన్ని చాలామందికి ఇచ్చింది. పుస్తకాల మీద ‘అంఆ’ అని వ్రాసేది. అంటే అవి బీజాక్షరాలు. ‘అంఆ’ అనే బీజాక్షరాలు ఎవరికైనా వర్తిస్తుంది. మహామంత్రం అది. ఇది అవతారమూర్తి అమ్మ ఇచ్చిన మంత్రం; తరతరాలకు ఉపయోగపడుతుంది. మంచి జరుగుతుంది. ఆ మంత్రం చేసేటప్పుడు అమ్మని జ్ఞాపకం పెట్టుకోవచ్చు; హైమనీ జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇంతకంటే మనకు కావాల్సిందేముంది!

Sri Sri Sri Siddheswarananda Bharathi Swamy

 

శ్రీ శ్రీ శ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామి – (కుర్తాళ పీఠాధిపతులు)

 

వీరు 23.1.1937వ తేదీన జన్మించారు. స్వగ్రామం సంతమాగులూరు మండలం, ఏల్చూరు గ్రామం. తండ్రి శ్రీ పోతరాజు పురుషోత్తమరావు, తల్లి శ్రీమతి స్వరాజ్యలక్ష్మి, భార్య శ్రీమతి దుర్గాత్రిపుర సుందరీదేవి. ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె గలరు. తోబుట్టువులు – నలుగురు సోదరులు, ఒక సోదరి. విద్య M.A.Ph.D. వృత్తి – Retd. Principal, Hindu College, Guntur. ప్రస్తుతం కుర్తాళం, సిద్ధేశ్వరీ పీఠాధిపతులు. ఆశ్రమనామం పరమహంస పరివ్రాజకాచార్య జగద్గురు శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానందభారతీస్వామి.

ప్రవృత్తి: అవధాని కులావతంసునిగ, ఆశుకవి చక్రవర్తిగా, సాహిత్యరూపక సమ్రాట్‌గా దేశవిదేశాల్లో విఖ్యాతి పొందారు. కఠోర తపస్సు చేసి లలిత, కాళీ, కాలభైరవ, బృందావనేశ్వరి రాధాదేవి వంటి ఎందరో దేవతలను ప్రసన్నము ప్రత్యక్షము చేసుకున్నారు. అంతర్నేత్రంతో భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగిన మహామహిమాన్విత యోగులు.

జగద్గురువులుగా, పరమహంసలుగా, పరివ్రాజకాచార్యులుగా ఎందరికో సన్యాసదీక్షను ప్రసాదించారు. స్త్రీలకు యోగినీదీక్ష నిచ్చారు.
జిల్లెళ్ళమూడి అమ్మను దర్శించి 1960 నాటికే ‘అంబికాసాహప్రి’ అనే వేయి పద్యాలు, శ్లోకాలు రచించారు. అమ్మ ఆలయ ప్రవేశం చేసిన అనంతరకాలంలో అమ్మను ఆవాహనచేసి మాట్లాడిన మహిమాన్వితులు..

సెల్ నెం: 9490369800

ప్రముఖ పాత్రికేయులు శ్రీ పొత్తూరి వేంకటేశ్వరరావు గారు 08-12-2011న కుర్తాళంలో శ్రీ స్వామివారితో చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

శ్రీ స్వామివారి మొదటి అమ్మ దర్శనాన్ని ప్రస్తావించగా….

మొదటిసారి కృష్ణభిక్షువుగారు, పొత్తూరి వేంకటేశ్వరరావుగారు, మిన్నికంటి గురునాధశర్మ గారు, నేను ఇంకా మరికొంతమంది కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళాము. మాకంటే ముందు కృష్ణభిక్షువుగారు జిల్లెళ్ళమూడి వెళ్ళారు. వారు రమణాశ్రమంలో చాలాకాలం ఉన్నారు; కంచి పరమాచార్య దగ్గర కొంతకాలం ఉన్నారు, కావ్యకంఠ వాసిష్ఠ గణపతి ముని దగ్గర కొంతకాలం ఉన్నారు. వాళ్ళందరి సేవ చేశారు. ప్రధానంగా రమణాశ్రమంలో ఎక్కువ కాలం ఉండటం రమణుల యొక్క చరిత్ర తెలుగులో వ్రాసిన మొదటి వ్యక్తి ఆయన.

గుంటూరులో ఉన్నవ లక్ష్మీనారాయణపంతులుగారు స్థాపించిన శారదానికేతన్ ఉండేది. దానికి ఆయన Executive Officer గా ఉద్యోగరీత్యా వచ్చారు. ముగ్గురు సిద్ధవ్యక్తులు రమణమహర్షి, కంచి పరమాచార్య, జిల్లెళ్ళమూడి అమ్మతో అనుబంధం ఉన్న వ్యక్తి. ఆ రోజుల్లో రామాల్ ప్రభు ధ్యానసంపద్రాయం ఒకటి ఉంది. గుంటూరులో మోతడక సత్యనారాయణ గారనే ఒక Town Planning Officer ఉండేవారు. ఆ సంప్రదాయంలో ఆయన మాస్టర్‌గా ఉండేవారు. ఆయన దగ్గర శిష్యుడుగా చేరాడు ఈయన. దాంట్లో ధ్యానం చేస్తుండగా కృష్ణభిక్షువుకు Third Eye Open అయింది. ఏవైనా ఆధ్యాత్మిక విషయాలు, ఎవరి గురించైనా తెలుసుకోవాలంటే కృష్ణభిక్షువుగారినే చూడమనే వారు గురువు గారు. వారు చూడమంటే ఈయనకు కనిపించేది. ఆ గురుశిష్యు సంబంధం అట్లా ఉండేది. తర్వాత వ్యక్తిగతంగా అభివృద్ధి చెందారు.

జిల్లెళ్ళమూడి అమ్మను గురించి విని, వీరిద్దరూ శిష్యులతో కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సత్యనారాయణగారు కృష్ణభిక్షువును ‘అమ్మ యొక్క జన్మ పరంపరను చూడవలసింది’ అని కోరారు. ఈయన చూశారు. ధ్యానంలో వారికి కనిపించినవి చెప్పారు. ఏదో దివ్యలోకాలలో హ్రీదేవి అని, అట్లా కొన్ని జన్మ పరంపరలు చెపుతూ వచ్చారు. ఆ తర్వాత కూడా దానిని గురించి అప్పుడప్పుడు ప్రస్తావిస్తూనే ఉన్నాం. తర్వాత అమ్మను కొందరు అడిగారు. ‘కృష్ణభిక్షువు చెప్పినది సత్యమేనా?’ అని. “ఆయన కనిపించినవి చెప్పాడు” అన్నది అమ్మ. కృష్ణభిక్షువుకు అమ్మను గురించి ప్రబలమైనటువంటి విశ్వాసం కలిగింది. ఆయన చూసినటువంటి ధ్యానం వలన ఆమెను అవతారమూర్తిగా, పరమేశ్వరిగా, అనేక జన్మపరంపరలు లోకకల్యాణం కోసం ఎత్తినటువంటి ఒక మహావ్యక్తిగా ఆయన భావించారు. ఆ రోజుల్లో అంతా కలిసి ధ్యానం చేస్తూండే వాళ్ళం.

మొదట అంతా కలసి జిల్లెళ్ళమూడి వెళ్ళాం. భోజనాలకు రెండు పంక్తులలో కూర్చున్నాము. ఇంతమంది ఉండగా నా వద్దకే అమ్మ వచ్చి, నాకు ఎదురుగా కూర్చొని, అన్నం కలిపి ముద్దలు పెట్టింది. ఆ సంఘటన వల్ల ఆమె ప్రేమ, వాత్సల్యం మనస్సుకి బాగా హత్తుకున్నది. అంతకు ముందు అంతా అక్కడ కూర్చున్నాము. అప్పటి ఒకటి రెండు సంఘటనలు ఉన్నాయి. మిన్నికంటి గురునాధ శర్మగారు గొప్ప పండితులు, శాస్త్రవేత్త. ఆయన వేదాంతానికి సంబంధించిన ఒక ప్రశ్న అమ్మను వేశారు. ఆమె చూస్తూ ఉన్నది. ఇంతలో ఎవరో పెద్ద లావాటి వేదాంత గ్రంథాన్ని తీసికొచ్చి అమ్మకు ఇచ్చారు. ‘అమ్మా! ఈ వేదాంత గ్రంథం అచ్చయింది. మీకు సమర్పిద్దామని తెచ్చాను’ అన్నారు. మాతో మాట్లాడుతున్నది, ఆ గ్రంథం తిరగేస్తున్నది. తిరగేస్తూ ఒక చోట ఆగి “నాన్నా! ఇది చదువు” అన్నది నన్ను. నేను ఆ పేజీ చదివాను. ఆయన ప్రశ్నకి సమాధానం దాంట్లో ఉంది. ఆ పుస్తకం అమ్మ అంతకు ముందు చూడలేదు. ఏ పేజీలో ఏముందో చూడలేదు – లౌకికంగా చెప్పేటట్టయితే, అప్పుడే పుస్తకం మా ఎదురుగానే వచ్చింది. ఈయన ప్రశ్న అడిగారు. దానికి సమాధానం అదే పేజీలో ఉండటం ఆశ్చర్యం. గురునాధశర్మగారు చాల దిగ్భ్రాంతి చెందారు ‘ఏమిటి ? ఇది ఎట్లా సాధ్యం’ అని. సాధ్యమా అసాధ్యమా అంటే అతీతమైన విషయాల్లో ఎవరూ చెప్పగలిగింది లేదు. జరిగింది. అంతే. అది ఒక మహిమాన్వితమైన విశేషంగా ఆ పూట అందరూ భావించాం.

తర్వాత కూడా మరొకసారి మేము అందరం కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళాం. అలా వెళ్ళినపుడు వేదాంత సంబంధమైన కొన్ని ప్రశ్నలకి అమ్మ చాల simpleగా, అత్యంత క్లిష్టమైన ప్రశ్నలు అని మనం అనుకున్నటువంటి వాటికి ఆమె చాలా సులభంగా, సుబోధకంగా, సరళంగా చెప్పింది; పండు వలిచి పెట్టినట్టుగా ఉండేవి ఆ సమాధానాలు.

అప్పటికి నాకు వివాహం కాలేదు. నాటి సిద్ధేశ్వరీపీఠాధిపతులు శ్రీ త్రివిక్రమానందభారతీస్వామివారు ‘కులపతిగారు ఆశ్రమస్వీకారం చేయొచ్చు కదా! ఈ పీఠానికి రావచ్చు కదా’ అని అడిగారు. ఆ సంగతి పొత్తూరి వేంకటేశ్వరరావు గారు నాకు చెప్పారు. వారు చెప్పిన మీదట నేను ఆలోచించి సన్యాసం తీసుకుందామనే నిర్ణయానికి వచ్చాను. అన్ని ఏర్పాట్లు కూడా అనుకున్నాము. శాస్త్రం తల్లిదండ్రుల అనుజ్ఞ కావాలని చెపుతున్నది. కాబట్టి వాళ్ళని అడిగితే ‘పెద్దకొడుకువు. నువ్వువెడితే ఎట్లా?’ అని వారు అంగీకరించలేదు. ఒక వేళ నేనేదైనా తొందరపాటు చర్య తీసుకుంటానేమోనని వాళ్ళు జిల్లెళ్ళమూడి వెళ్ళి అమ్మను ప్రార్థించారు. అపుడు అమ్మ “మీరెందుకు దిగులు పడతారు? దిగులు పడాల్సిన అవసరం లేదు. ఎప్పుడేది జరగాలో అప్పుడు అది జరుగుతుంది” అని చెప్పింది. వారు నిశ్చింతగా ఉన్నారు. అప్పటికి అది వాయిదా పడింది. కుర్తాళం మౌనస్వామిపీఠానికి నేను భవిష్యత్‌లో వస్తాననే అవగాహన అమ్మకి ఉందేమోననే భావన ఇప్పుడు అనిపిస్తున్నది. జరగవలసిననాడు జరుగుతుంది, అనటంలో అనుబంధం ఏదో ఉంది; నిర్ణయం ఏదో ఉన్నదన్న సంగతి ఆమెకి తెలుసునని అనిపిస్తున్నది.

అమ్మ మీద ‘అంబికాసాహస్ర’, 1000 పద్యాలు, శ్లోకాలు వ్రాశాను. సాధన యొక్క ప్రారంభదశలో ఉన్నవాడిని. అంటే అప్పటికి నిరంతరం ధ్యాన మంత్ర జపదీక్షలు చేస్తూండేవాడిని. రోజూ 15 గంటలు, 16 గంటలు జపం చేయటం, ధ్యానం చేయటం అభ్యాసం చేస్తున్నపుడు – అల్పాహారంతోనో, నిరాహారంగానో చాలకాలం మండలదీక్షలు అవీ చేస్తూండేవాడిని. ఆ సమయాలలో ఈ మంత్రజపం వల్ల నిరంతరం ధ్యానం వల్ల ఏవేవో కొన్ని అనుభూతులు కలుగుతూండేవి. ఇలా చేస్తున్న మంత్రదేవత యొక్క కరుణకు సంబంధించిన దర్శనాలు కొన్ని జరుగుతూ ఉండేవి. ఆ పరంపరలో అప్పుడు కలిగినటువంటి ధ్యానానుభవ పరంపరలలో ఇట్లా అనిపించింది. అమ్మ కూడా అపుడు ధ్యానంలో స్వప్నంలో కనబడటం; స్వప్నంలో కనబడి ఆ రోజుల్లో నాకు ఒక మంత్రం కూడా ఉపదేశించింది. అది శాక్తేయమనిపించింది. సంప్రదాయ ప్రకారంగా వచ్చినదే. నేనెవరికీ చెప్పలేదు. వీటన్నింటిని బట్టి, నాకు కలిగిన అనుభవాలను బట్టి, తర్వాత అక్కడ జరుగుతున్న సంఘటనలను చూసిన మీదట ఒక ప్రబలమైన విశ్వాసం ఏర్పడటాన్ని బట్టి, పెద్దలు చెప్పిన దానిని బట్టి – మొత్తం మీద ఏమిటి అంటే ఆమె ఒక దివ్యశక్తి, అసామాన్యురాలు, మహనీయవ్యక్తి అనే విశ్వాసం కలిగి ఆ రోజుల్లో ‘అంబికాసాహస్రి’ వ్రాశాను.

అమ్మ సామాన్యంగా ‘అం ఆ’ అనే రెండు అక్షరాల్ని వ్రాసి ఇచ్చేది. అవి బీజాక్షరాలేనా అని అడిగిన సందర్భంగా …..

అవి బీజాక్షరాలే – అనేకమైనటువంటి జన్మపరంపరలలో ఒక అనంతశక్తి ప్రయాణం చేస్తూన్నప్పుడు అందులో ఏది మనకి ఇవ్వాలని అనుకున్నదో ఏది వికసించాలనుకున్నదో దానికి సంబంధించి నటువంటి ఒక అంశాన్ని మనకి అందించి ఉండవచ్చు.

అమ్మ కుమార్తె హైమతో మీ అనుబంధం ఏమిటి?

అమ్మ కుమార్తె హైమతో కేవలం పరిచయం మాత్రమే ఉంది. అమ్మ దగ్గరకి వెళ్ళినపుడు ఆ అమ్మాయిని చూడటం, పలకరిస్తే మాట్లాడటం, ‘బాగున్నావా అమ్మా!’ అనటం అమ్మ మీద వ్రాసిన పద్యాలు చదవమని అడిగితే చదవటం అంతవరకే తప్ప హైమతో ప్రత్యేక అనుబంధం నాకు లేదు.

హైమాలయాన్ని స్థాపించి, హైమ ద్వారా అమ్మ కొన్ని లౌకికమైన ప్రయోజనాల్ని కలిగించిందా? అన్నపుడు

దైవకార్యములలో ఏది దేని ద్వారా జరగాలో, ఏ మాధ్యమం ద్వారా జరగాలో అనేది వాళ్ళు నిర్ణయిస్తారు. వాళ్ళు అలా నిర్ణయించినపుడు ఈ మాధ్యమంగా ఉండేటటువంటి వ్యక్తి శక్తిమంతుడు కావచ్చు కాకపోవచ్చు. వాళ్ళ శక్తి పనిచేస్తూ ఉంటుంది. ఈ వ్యక్తి కూడా కొంతశక్తి కలిగేట్టయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. లేనిపక్షంలోనైనా వాళ్ళ ఇచ్ఛ ప్రధానమైనది. కదా! వాళ్ళ ఇఛ్ఛ అపరిమితమైనటువంటిది. ఆ అపరిమితమైన ఇచ్ఛాశక్తి ఈ జీవిద్వారా పనిచేయడం జరుగుతుంది.

నేను అమ్మతో చర్చించేవాడిని కాదు. చర్చలు చేయడం అలవాటు ఉండేది కాదు. ఏవైనా కొన్ని సందేహాలు లాగ కొన్ని ప్రశ్నలు అడగటం, ఆమె simple గా సమాధానం చెప్పటం. ఏవో ఆధ్యాత్మిక విషయాలు, సాధనల గురించి అడిగేవాణ్ణి. “నాయనా! మంచిదే” అంటూ అలా ఒక అడుగు ముందుకు వేయడానికి తోడుగా సమాధానాలు చెపుతూండేది. ఆమె శరీరంతో ఉన్నప్పటి కంటే తర్వా నేను సాధనల గురించి అడిగింది ఎక్కువ. నేను ఏదో ఈ రంగంలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒకసారి అమ్మను ఆవాహనం చేశాను. దివ్యలోకాలలో ఉండే మహనీయమైన వ్యక్తులను పిలవటం అనేది. ఎప్పుడైనా పిలవవచ్చు. మనకా తపశ్శక్తి ఉండేట్టయితే వాళ్ళు వస్తారు.. గుంటూరులో నా ధ్యానమందిరంలో కూర్చొని ఆమె చిత్రం పెట్టి, దానికేదో ప్రక్రియ ఉంది, ఆ ప్రక్రియ చేసి ఆమెను ఆవాహన చేశాను. ఆమె వచ్చి నా ఎదురుగా ఉంది. నేనడుగుతూ ఉన్నాను. ‘నా సాధన ముందుకు వెళ్ళాలా, ఎలా వెళ్తుందీ? ఇంకా తపస్సు ఎట్లా చెయ్యాలి?’ అని. ఆమె అన్నది “నాయనా! రోజూ బాగా పదిమందికి అన్నం పెట్టు” అని. ‘అన్నం పెట్టటానికీ తపస్సుకి సంబంధం ఏమిటి? తపస్సంటే – ధ్యానం చేయాలి. ఆహారాది కఠోర నియమాలు, క్షేత్రవాసాలు ఇవన్నీ చేసుకుంటూ పంచాగ్ని మధ్యంలో శీతల జలాలలో… ఎండాకాలంలో అగ్నిమధ్యంలో ఉండి, వానాకాలంలో తడుస్తూ గొంతు లోతు నీళ్ళల్లో నుంచొని – ఇలా చెయ్యాలి కఠోర తపస్సు. మరి అన్నం పెట్టమంటావేమిటమ్మా?’ అన్నాను. “అలా చెయ్యి నాయనా! దానివల్ల కూడా తప్పకుండా వస్తుంది” – అన్నది.

కానీ ఆ సందర్భంలో జరిగిన మరొక సంఘటన మాత్రం చాలా విచిత్రమైనది. మా తమ్ముడు పి.యస్.ఆర్. మనుమరాలు (వాడి కుమారుని కూతురు) మా ఇంట్లో మేడమీద పడుకొని నిద్రపోతున్నది వాళ్ళ అమ్మదగ్గర. సంవత్సరం పిల్ల. నేను ఇక్కడ అమ్మను పిలిచి ఉన్నాను. అమ్మ నా ఎదురుగా ఉన్నది. నేను మాట్లాడుతున్నాను. ఇంతలో మేడమీది నుంచి ఆ అమ్మాయి మెట్లు దిగి నడిచి వస్తున్నట్లుగా కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్న నా కంటికి కనిపిస్తున్నది. మెట్లు దిగివచ్చింది. వచ్చి అమ్మకు నమస్కారం చేసింది. నేను ఒక ప్రక్క అమ్మతో మాట్లాడుతూనే ‘నువ్వెందుకొచ్చావు? ఎట్లా వచ్చావు?’ అన్నాను. ‘నేను పూర్వజన్మలో అమ్మ భక్తురాలిని. ఆయువు తీరి మరణించాను. ఇప్పుడు ఇక్కడ పుట్టాను. అమ్మ వచ్చిన సంగతి నాకు ఎందుకో తెలిసింది. నేను వచ్చాను. నమస్కారం చేశాను’ అంది. ఆశ్చర్యం కలిగింది. ఒక క్షణం ఉండి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది. అమ్మతో సంభాషణ అయింది. ఆమె అదృశ్యమై పోయింది. అపుడు నాకు కలిగిన సందేహం ఏమిటంటే – చిన్నపిల్ల సంవత్సరము పిల్లకు శాస్త్రరీత్యా మనస్సు వికసించి ఉండదు. మాట్లాడేశక్తి లేదు. కాని ఎలా వచ్చింది? అంటే ధ్యానంలో చూశాను. కాబట్టి అది physical గా భౌతికంగా మెట్లు దిగి రావటం కాదు. ఆమె యొక్క astral body (సూక్ష్మశరీరం) దిగి వచ్చింది – అంటే చిన్నపిల్లలకు కూడా భౌతికమైన మనస్సు వికసించకపోయినా ఆ జీవికి ఒక astral body and astral mind ఉంటుంది. అది ఆలోచించగలదు, మాట్లాడగలదు, చూడగలదు. ఏమైనా చెయ్యగలదు – అన్న యోగశాస్త్ర విషయం అప్పుడు ప్రత్యక్షంగా నాకు నిరూపితమైంది. అమ్మ యొక్క దర్శనం వల్ల వచ్చిన పరిణామం ఇది.

“పదిమందికి బాగా అన్నం పెట్టు” అని అమ్మ చెప్పిన దానిని కూడా అమలు చేస్తున్నాను…. మా పీఠంలో, విభాగాలలో, ఆశ్రమాలలో వీలైనంత ఎక్కువ అన్నదానం చేయించడం జరుగుతోంది. అమ్మ చెప్పిన దానిని తప్పకుండా పాటిస్తున్నాను.

అమ్మకి కపాలం లోంచి వెలుగు వచ్చింది. ఆ అమ్మను ‘ఛిన్నమస్తక’ అని అంటారు. అమ్మకి భృకుటీభేదనం అయి రక్తం స్రవించింది. ఆ రక్తం భస్మంగా మారింది. అని అంటారు కదా! అనగా …..

వీటిని హఠయోగ ప్రక్రియలుగా కొందరు చెపుతుంటారు. కానీ హఠయోగులెవరూ వీటిని సాధించలేదు. దైవానుగ్రహం కలిగినటువంటి ‘మంత్రశక్తివల్ల సిద్ధశక్తి వల్ల మాత్రమే ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. ఆ సిద్ధశక్తి యొక్క వికాసమునకు ఇవన్నీ కూడా చిహ్నాలు. నేను ఛిన్నమస్తక ఉపాసన చేశాను. గణపతి మునీంద్రులకు జీవించి యుండగా కపాలభేదనం జరిగింది.

అమ్మ కపాలం మెత్తగా ఉన్నది. అందరూ చూశారు. దాంట్లోంచి నెత్తురు రావటం కూడా చాలమంది చూశారు. ఎలా వస్తుంది? కపాలానికి ఏదైనా దెబ్బతగిలితే వస్తుంది మాములుగా. దెబ్బ ఏమీ తగలలేదు. ‘ఊరికే తలమీద ఇలా అంటే నెత్తురు తగిలేది’ అని ఆమె చెప్పటం నేను విన్నాను. అక్కడేం గాయాలు లేవు. ‘పట్టుకుంటే మెత్తగా ఉండేది’ అని అంటారు. ఎముక మెత్తగా ఉంటుందా? ఎముక మెత్తబడుతుందా? అంటే ఇది మామూలు విజ్ఞానశాస్త్రానికి, వైద్యశాస్త్రానికి అతీతమైనటువంటి కొన్ని అంశాలేవో ఉన్నవి అనే సంగతి మనకి కనిపిస్తోంది. యోగప్రక్రియలలో కపాల భేదనయోగం, ఖండయోగం ఇలాంటివి కొన్ని ప్రక్రియలు ఉన్నాయి. ఈ ప్రక్రియలు కొంతమంది సిద్ధగురువుల యొక్క అనుగ్రహం వలన పొందుతుంటారు. కొంతమందికి దైవశక్తి యొక్క ప్రభావం వలన, ఆ శక్తి వాళ్ళలోకి దిగటం. వలన, ఏ సాధనా లేకుండానే ఇట్లా జరుగుతుంటుంది. అమ్మ ప్రత్యేకంగా ఎవరి వద్ద నేర్చుకోవటమో, ఏదో ఏ సిద్ధగురువు వద్ద ఉపదేశం పొందటమో లేకుండా తనంత తానుగా వచ్చింది.

భ్రూమధ్యంలో ఆజ్ఞాచక్రము ఇవన్నీ కూడా మామూలుగా హఠయోగులు అందరూ చెప్పేవే. కాని అక్కడి నుంచి అలా రక్తం రావటం అనేటు వంటిది మాత్రం అసామాన్యమైనటువంటి ఒక యోగరహస్యము, మహత్వానికి చిహ్నము. మనం ఒక లోబ్సాంగ్ రాంపా చరిత్రలో చూస్తాం. ఆయన సిద్ధగురువులు ఏం చేశారంటే – ఆయనకు దివ్యజ్ఞానం వికసించలేదు, astral vision develop కాలేదు – అని చెప్పి, ఏదో ఒక వస్తువు తీసికొని ఆయన నొసటలో చిల్లి పెడతారు. దాంట్లో ఏదో వస్తువు పెడతారు. ఆ పెట్టిన క్షణం నుంచీ అతనికి దివ్యజ్ఞానం (Third Eye) వికసించింది. ఇది మామూలుగా సాధ్యమా? అక్కడ చిల్లిపెడితే ఏమౌతుంది? దెబ్బతగులుతుంది. గాయమౌతుంది. ప్రమాదమౌతుంది. కానీ యోగంలో అట్లాంటి ప్రక్రియలు కొన్ని ఉన్నాయి.

మౌనస్వామి ఉన్నారు. ఆయన ఖండయోగసిద్ధుడు. గుంటూరులో దర్గాలో మస్తాన్ ఉండేవారు – నల్లమస్తాన్. శరీరఖండాలు పడి ఉండేవి. కుర్తాళంలో మౌనస్వామి సన్నిధిలో అట్లాంటి సంఘటనలు జరిగాయి. ఆయన జీవితచరిత్రలో ఉంది. ఏమిటి అంటే – ఆయన హిమాలయాల నుండి వస్తూ మహనీయులైన అచ్యుతానందస్వామో ఎవరో వారి వద్ద ఆ విద్య పొందారు. పొంది వస్తూ వస్తూ మహారాష్ట్రలో వాసుదేవానంద సరస్వతి మహాయోగి; దత్తాత్రేయుని భక్తుడాయన. మన మండలానికి చెందినవాడు షిర్డీలో సాయిబాబా ఉన్నాడు; వెళ్ళి చూడు’ అన్నారు. అక్కడ కొంతమంది చెప్పేదేమిటంటే షిర్డీ సాయిబాబా, ఈయన ఏవో విద్యలు ఇచ్చి పుచ్చుకున్నారని. ఈయనకు తెలిసిన ఖండయోగాన్ని సాయిబాబాకు నేర్పాడని ఒక సిద్ధసాంప్రదాయంలో చెపుతూండగా నేను స్పష్టంగా విన్నాను. సాయిబాబా దగ్గర ఈయన ఏమి తీసుకున్నాదో ఈయన జీవితచరిత్రలో ఎక్కడాలేదు; తెలియదు మనకు.

నేను అమ్మ మీద ‘ఐంద్రీమహావిద్య అనుపేర’ అనే పద్యం వ్రాశాను. దేవతలందరూ ఏ మహాశక్తి యొక్క విలాసం పొందుతారో ఆ మహాశక్తి యొక్క ఒక రూపము ఒక మహావికాసము ఆమెలో ఉన్నది. ఇపుడు కాశీభక్తులు కాళీ’ అనవచ్చు. ఇంద్రాణీ భక్తులు ‘ఇంద్రాణి’ అనవచ్చు – ఏదైనా అనవచ్చు. ఎందుకంటే ఒక మహాశక్తి ఉన్నప్పుడు, ఆ శక్తి ఎన్ని రూపాంతరాలైనా చెందగలదు. ఎవరికి వారికి తన శక్తి అక్కడ కనిపిస్తుంది. ఇది భక్తి యొక్క లక్షణం. ఆ కేంద్రంలో ఉన్న మహాశక్తి అన్ని రకాలుగానూ కనిపిస్తుంది.

అమ్మ సూక్తులలో ఏదన్నా అంతస్సూత్రం, తాత్త్విక సూత్రం ఉన్నదా?

అనంతమైనటువంటి బ్రహ్మపదార్థం యొక్క విశేషాలను ఆమె సులభంగా మానవజాతికి అందించటానికి ప్రయత్నించింది. దానికి సర్వసమానభావమైనటు వంటి ఆ వాక్కులు సులభం, సుబోధకములైనటువంటి వాక్కుల ద్వారా ఆమె చేసినటువంటి ప్రయత్నం చాలామంది మనస్సులను ఆకర్షించింది. వేదాంతం చదువుకోలేని వాళ్ళు, శాస్త్రజ్ఞానం లేని వాళ్ళకు కూడా దాని సారభూతమైనటువంటి వాక్కులు కాబట్టి వాళ్ళకి తెలియకుండానే ఆ వేదాంతభావన అందేటట్టుగా పట్టుబడేటట్టుగా చేయడం, అది అమ్మ చేసిన చాల విజయవంతమైన ప్రక్రియ.

సమాధి అయిన అమ్మ ఏ రూపంలో ఉండవచ్చు ? సమస్తం వ్యాపించి ఉండిన మహాశక్తిగా ఉన్నదా? సర్వత్రా వ్యాపించిన శక్తిగా ఉన్నదని భావన చేయవచ్చునా?

శాస్త్రం అంగీకరించదు. ఎందుకంటే ఒక వ్యక్తి ముక్తికి వెళ్ళిపోతే, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వం లేదు, జీవలక్షణం లేదు, నామం లేదు, రూపం లేదు, ఏమీ లేదు. కాని ఆ వ్యక్తి నామంతో పూజిస్తే, అనంతమైన శక్తిగల పరమేశ్వరుడు. ఆ రూపంతో వస్తాడు. ఇపుడు ఈ శక్తి దానితో ఒకటి అయిపోయింది కాబట్టి కలిసి పోయింది కనుక. ఇవాళ ఒక జిల్లెళ్ళమూడి అమ్మ భక్తుడు జిల్లెళ్ళమూడి అమ్మను గురించి అన్నాడనుకోండి. ఆమె ముక్తికి వెళ్ళింది అనుకోండి. ఏమౌతుంది? ఆమె నామాన్నో, మంత్రాన్నో చేసేటటువంటి వాడు ఏమౌతాడు. ఆమె లేదు. శాస్త్ర ప్రకారం ఆమె లేదు అనుకుందాం. ఆమె బ్రహ్మమయురాలై పోయింది – శుకుడు వెళ్ళిపోయినట్లుగా. అంటే ముక్తిలో చాలారకాలున్నాయి. అద్వైతులు, ద్వైతులు, విశిష్టాద్వైతులు చెప్పేటువంటి వాటిల్లో. భగవంతుడున్నాడు. ఏదో శివుడున్నాడు, విష్ణువు ఉన్నాడు; భక్తులు ఆ లోకానికి వెళ్ళగలరు; ఆ రూపాన్ని ధరించగలరు, ఆయన సన్నిధిలో ఉండగలరు, ఆయనలో
కలసిపోగలరు. కలిసిపోయిన తర్వాత వ్యక్తిత్వం లేదింక – శివుడే. సాలోక్యము, సామీప్యము, సారూప్యము, సాయుజ్యము. శివుడైనా విష్ణువైనా అమ్మవారైనా ఏ దేవతైనా.

అద్వైతులు చెప్పే ముక్తి వేరు. అదేమిటంటే ఈ జీవుడు ప్రకృతిలో కలిసిపోయినాడు –

సముడై ఎవ్వడు ముక్తకర్మచయుడై సన్యాసియై ఒంటివో
వ మహాభీతి నొహో కుమార యనుచున్ వ్యాసుండు జీరంగ వృ
క్షములున్ తన్మయతన్ ప్రతిధ్వనులు చక్కం జేసెమున్నట్టి భూ
తమయున్ కొల్చెద బాదరాయని తపోధన్యాగ్రణిన్ ధీమణిన్.

వ్యాసుడు భాగవతంలో కూడా ఇదే చెబుతాడు –

యం ప్రవ్రజంత మనుపేత మపేత కృత్యం
ద్వైపాయనో విరహకాతర ఆజుహావ
పుత్రేతి తన్మయతయా తరవో భినేదుః
తం సర్వభూత హృదయంమునిమానతోస్మి – అని

అంటే శుకుని యొక్క వ్యక్తిత్వం లేదు. శుకుడనే వాడు లేడు, ఆ జీవుడు లేడు. భూతమయుడై పోయినాడు. కనుక ఇపుడెవరైనా శుకుడిని పిలిచేరనుకోండి. అది అంగీకరిస్తే శుకుడురాడు. శుకుడు లేడుగా, చేసింది. వ్యర్థమౌతుందా? ‘జిల్లెళ్ళమూడి అమ్మ అనంత చైతన్యమై పోయింది’ అన్నారు. అనంత చైతన్యమంటే పరమేశ్వరుడు. ఇపుడామెను పిలిస్తే ఎవరొస్తారు? ఆమె లేదుగా? అన్ని నామాలూ అన్నిరూపాలూ అన్నీ తానే అయినటువంటి పరమేశ్వరమూర్తి అయిపోయిందిగా! కనుక ఏం జరుగుతుంది అక్కడ? ఆ అనంత చైతన్యం ఈ రూపంతో ఈ ఆకారంతో వస్తుంది భక్తుల దగ్గరికి. అట్లా కాక రెండోదశ ఏమిటంటే ఆ వ్యక్తి మహాశక్తి సంపన్నమై తన వ్యక్తిత్వాన్ని కోల్పోకుండా తన పేరును తన ఆకృతిని ఆకృతి అనేది వారు సిద్ధశక్తి వచ్చిన తర్వాత ఏ ఆకారాన్నైనా ధరించగలరు; లేకపోతే భక్తులు గుర్తుపట్టడం కోసం వాళ్ళకి తెలిసిన ఆకారంతో కనిపిస్తూంటారు. ఆమె మనకిష్టమైన ఆకారంతో వస్తుంది. ఇంకో రకంగా వస్తే మనం గుర్తుపట్టలేకపోవచ్చు; అందుకని.

సర్వభూతమయమైనటువంటి స్థితి ఒకటి; అప్పుడు ఏమౌతుంది ? అప్పుడు వ్యక్తులను – తపస్సు చేసేటటువంటి వాళ్ళను చాల ఎక్కువ తపస్సు చేస్తే కానీ ఆ అనంత చైతన్యము ఒక ఆకారాన్ని ధరించి రాదు మన దగ్గరకి. కాని ఆ వ్యక్తి కనుక సిద్ధమండలంలో సిద్ధరూపంలో దేవతాలోకంలో ఎక్కడో ఒక చోట ఉండి తన వ్యక్తిత్వం తన జీవలక్షణం ‘నేను’, ‘నేను’, ‘నేను’ అనేటటువంటిది కనుక ఉండేటట్లయితే సులభంగా వస్తారు. ఎందుకంటే ఈ పిలుపు వెంటనే వాళ్ళకి అందుతుంది; పరుగెత్తుకుని వస్తారు.

“నేను నేనైన నేను” – అనే అమ్మ సూక్తిలో శంకరులు చెప్పిన అద్వైత వేదాంతమే ఉన్నది. అన్నీ నేనే: అహం బ్రహ్మాస్మి. నేనే – అన్నీ నేనే. దీంట్లో రెండు వాదాలున్నాయి – బ్రహ్మతత్త్వాన్ని తెలుసుకోవడంలో అన్నీ నేనే అనుకుంటూ పోయే వాదం ఒకటి. ఏదీ నేను కాదు అనుకుంటూ పోయేది. ఒకటి; నేతి మార్గం. నేను ఇది కాదు, అది కాదు.

‘నాహందేహో నేంద్రియాణ్యంతరంగః నాహం ప్రాణో నాస్తి కర్మా న బుద్ధిః |
దారాపత్యక్షేత్ర విత్తాదిదూరః సాక్షినిత్య ప్రత్యగాత్మా శివోహం ||’

అది కాదు, ఇది కాదు. నేను ఆ ఒక్కటే పరబ్రహ్మ పదార్థం. రెండవది
ఏమిటి? అన్నీ నేనే.

నాకు తపోమార్గము నందు, మంత్ర మార్గము నందు, జప హోమాదులు యందు తీవ్రసాధనల యందు ఉన్నంత ఆసక్తి మిగిలిన వాటి మీద లేదు. ఆమెలో ఏ అనంత చైతన్యమున్నదో… ఆమెలో ఒక మహాశక్తి వచ్చింది. ఆ శక్తి ఒక ఆరాధ్యయైన శక్తి. అంతవరకే. ఆమె చెప్పిన మాటలు, బోధలు అర్థం చేసుకుని ఆనందించాను.

సమాజంపై అమ్మతత్త్వ ప్రభావం ఎటువంటిది ?

ఒక వ్యక్తిలో అనంతమైనటువంటి దైవచైతన్యము ఉన్నది అనేటువంటి విశ్వాసము కలిగినప్పుడు మానవ జీవితాలను మార్చేస్తుంది. ఎట్లా మారుస్తుందని అంటే – మనిషిలో ఉండేటటువంటి కాలుష్యము, దుర్మార్గభావనలు, చెడుభావనలు అవన్నీ కూడాను ఆ మహాశక్తి ప్రక్షాళితం చేసేస్తుంది; తొలగిస్తుంది. మనం పురాణాల్లో చదువుతాము. పతివ్రతల కథలు చదువుతాము. మహాశక్తి సంపన్నులై సూర్యుణ్ణి కూడా ఆపగలిగినటువంటి శక్తి కలిగిన పతివ్రతలను చూశాము. భర్తను దేవుడు అని అనుకొని ఉండటం వలన వాళ్ళకశక్తి వచ్చింది. ఆ భర్త నిజంగా దేవుడు కాదు. అయినాసరే. వీళ్ళ భావ తీవ్రతవల్ల వీళ్ళకాశక్తి వచ్చింది.

అమ్మ ప్రభావం వలన ఎంతో మంది మారిపోయినారు. ఎంతోమంది మానవులలో అంతకుముందు లేనిదో లేక నిద్రపోతున్నదో మానవత్వం. వికసించింది. వాళ్ళలో సుప్తమైన చైతన్యాన్ని జాగృతం చేసింది – ఆమె తన చూపు ద్వారా, మాట ద్వారా, తన వ్యక్తిత్వం ద్వారా, తన మహత్వం ద్వారా. అందువల్ల వేలమంది, లక్షల మంది ప్రభావితులైనారు అమ్మ వల్ల. ఆ ప్రభావం ఎట్లాంటి అని అంటే ఉదాహరణకి ఒకడున్నాడు – కఠినుడు; చిన్నప్పుడేదో తల్లి వాత్సల్యానికో తండ్రి ప్రేమకో నోచుకోలేదు. అమ్మ దగ్గర ఆ వాత్సల్యాన్ని చూశాడు. వాడు పాదాక్రాంతుడైపోతాడు. వాడు ఎవడిదగ్గర కాలేదు. ఇంకొకడు అన్నం పెడితే తింటానంటాడా ? నా నోట్లో నువ్వెవడివిరా ముద్ద పెట్టడానికి అంటాడు. కానీ ఆమె పెడితే తింటున్నాడు. ప్రేమతో తింటున్నాడు. ఎందువల్ల? ఆమెలో ఆ దేవతను, మాతృత్వాన్ని, అనంతమైన మానవాతీతమైన ఒక శక్తిని చూసిన విశ్వాసం. ఆ జీవుడితో ఉండేటువంటి అంతకు ముందున్న ఆ తీవ్రభావనలు అసంతృప్తులు తొలగిపోయి సంతృప్తుజీవనుడై శాంతమార్గంలోకి వెళ్ళిపోతున్నాడు. అట్లా ఎంతోమంది పరిణామం చెందారు. ఆమె వల్ల. అహంకార పూరితులు, దుష్టులు, దుర్జనులు, చెడు భావాలు గల వాళ్ళు అనేకులు మారటానికి ఆమె మహత్తర వ్యక్తిత్వం దోహదం చేసింది. ఆ మార్పు తీసుకు వచ్చింది. మానవులను శిక్షించటం కాదు, మహనీయులైన ఆధ్యాత్మిక వేత్తలు అందులో ఒక బుద్ధుడు గానీ, హరివంశమహారాజ్ గానీ, శంకరాచార్యులు గానీ, రామానుజులు గానీ, మానవులను మార్చడానికి ప్రయత్నించారు. ఆ మార్చడానికి చేసిన ప్రయత్నాలలో ఈ శతాబ్దంలో జిల్లెళ్ళమూడి అమ్మ చేసినటువంటి ఆ మహత్తరమైనటువంటి కృషి అది అనన్య సామాన్య మైనటువంటిది. కొన్ని వేలమందిని ప్రభావితం చేసింది.

నేను కూడా నా సాహిత్యమార్గంలో అంతో ఇంతో తెలిసిన వాడినని అహంకారంతో తిరిగిన వాడినే; పద్యాలు చెప్పి ఆ రంగంలో తిరిగినవాడినే. కాని అమ్మదగ్గరకి వచ్చేసరికి –

లోకమ్ములో నెట్టులుండినగాని నీకడ బాలుడి నిష్ణాయుతుండు.
ఏ చోట ఏ రీతి నెసిగిన గాని నీ చెంత వినయాన నిలుచు నీతండు
బహుజన్మముల నుండి బడలినవాడు, విహితధర్మమ్మున వెలసినవాడు…

అప్పటికేదో జన్మపరంపర కొన్ని విశేషాలు తెలియటం, ఆ తెలియటం కూడా ఆమె పూర్వకాలం నుంచీ ఉన్నది దివ్యలోకాల నుంచి దిగి వస్తున్నదీ ఆమెతో ఎన్నో జన్మల అనుబంధాలు ఉన్నవీ అన్న ఆ దర్శనాలు, అనుబంధాలు, విశ్వాసాలు వాటి అన్నిటి వల్ల

‘బహుజన్మముల నుండి బడలినవాడు, విహిత ధర్మమ్మున వెలసినవాడు, నిను గుండెలో నేడు నిలుపుకున్నాడు, తన నిత్యమాతగా తలుచుచున్నాడు’-

కనుక ‘అమ్మా! నన్ను దయతో చూడవలసినది’ అని అంటూ

‘పల్లవారుణమైన బంగారు బొమ్మ!
జిల్లెళ్ళమూడిలో చెలువొందు అమ్మ!’

అంటూ ఎన్నో వందల వేల సంవత్సరముల స్మృతులు, అనుబంధాలు కాస్త కాస్త ఆ రోజుల్లో గుర్తుకు వస్తుంటే, ఆ భావ తీవ్రత వల్ల నేను వ్రాసినది – అనుకుంటున్నాను. (అంబికా సాహసి) భావావేశంతో వచ్చిన కవిత్వం. అట్లాంటి విశ్వాసాన్ని కలిగించింది. అమ్మ. ఇంత విశ్వాసం ఎందుకు కలిగింది – అని అంటే – నాకు వ్యకితగతమైనటువంటి అనుభవాలు, ధ్యానానుభవాలు. వాటన్నింటితో పాటుగా మహత్తరమైన ఆమె యొక్క వ్యక్తిత్వం, ప్రేమ, వాత్సల్యం- ఇవీ జీవితం మీద ప్రభావాన్ని చూపించినవి.

మీరు కుర్తాళం పీఠాధిపతి కావటంలో అమ్మ, మౌనస్వాముల నిర్ణయం ఉందా?

మౌనస్వామి – అమ్మ ఒకే భూమికకు చెందిన వాళ్ళు. వాళ్ళ మధ్య అనుబంధాలు ఎప్పుడూ ఉంటయ్. ‘సంవాదిన్యోమేధావినాం బుద్ధయః’ అంటారు. అట్లా దివ్యభూమికల నుండి వచ్చినటువంటి వాళ్ళు, ఋషిపరంపరకు చెందిన వాళ్ళు, సిద్ధమండల సిద్ధాశ్రమాలకు చెందినటువంటి వాళ్ళు – అలాంటి వాళ్ళు. వయస్సులో తేడా ఉండవచ్చు- ఇపుడు – ఆయన తర్వాత తరానికి చెందిన వాడిని; నేను ఆయనను చూడలేదు భౌతికంగా, కానీ ఆయన నాతో చెప్పాడు – మనం 4 వేల సంవత్సరముల క్రితం మొదటిసారి కుర్తాళం వచ్చాము అని. పాత అనుబంధాలు నెమ్మది నెమ్మదిగ గుర్తుచేశాడు ఆయన. అట్లనే అమ్మతో ఆయనకున్న అనుబంధం ఏదో – నాకు ఇద్దరితో ఏర్పడ్డ అనుబంధం – ఎన్ని సంవత్సరముల తేడాతో వచ్చిందో ఇదంతా. ఏవో వాటికి సంబంధించినటువంటి అనుబంధాలు, లింకులు ఏవో ఉంటాయి. కొన్ని తెలుస్తున్నాయి. తెలిసినప్పుడు ‘ఓహో ఇది కదా’ అనుకుంటున్నాము. అట్లనే అమ్మని గురించి గాని, మరి మౌనస్వామిని గురించి గాని, వారిద్దరి మధ్య ఉన్నటువంటి అనుబంధాన్ని గురించి గాని. ‘ఎవరితో మాట్లాడని మౌనస్వామి అమ్మతో మాట్లాడాడు’ అని అంటేనే దాని ప్రత్యేకత కనిపిస్తున్నది. కనుక మహనీయ వ్యక్తులు వాళ్ళు – మన ఊహకు శక్తికి అతీతమైనటు వంటి వ్యక్తిత్వం వాళ్ళది. అమ్మదీ అట్లాంటిది.

మౌనస్వామి అమ్మతో మాట్లాడటం, నేను అమ్మ దగ్గరకి వెళ్ళటం, తర్వాత నేను సన్యసించి మౌనస్వామి స్థాపించిన కుర్తాళం పీఠాధిపతి కావటం – వీటి మధ్య ఏదో Equation తప్పనిసరిగా ఉంటుంది. ఏమీ సందేహం లేదు దాంట్లో. ఏదో వాళ్ళ మహనీయుల యొక్క ఇచ్ఛ, సంకల్పం – జరుగవలసి యున్నది. అంతే.

నారాయణ – నారాయణ – నారాయణ

Yarlagadda Bhaskara Rao

 

శ్రీ భాస్కరన్నయ్య (యార్లగడ్డ భాస్కరరావు)

 

వీరి వయస్సు 90 సం॥లు పైబడింది. స్వగ్రామం రేపల్లె తాలూకా సింగుపాలెం. తల్లిదండ్రులు శ్రీ యార్లగడ్డ వెంకటరత్నం, శ్రీమతి మాణిక్యమ్మ, భార్య – శ్రీమతి రాజ్యలక్ష్మి, సంతానం ఆరుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు. 4వ తరగతి వరకు చదువుకున్నారు. వృత్తి – వ్యవసాయం.

సేవాతత్పరత: జనక మహారాజు లాగా తాను సంసారంలో వున్నా, తనలో సంసారం లేకుండా 1960 నుండి ఇప్పటివరకు నిరంతరం అమ్మ సేవలో తమ జీవితాన్ని పునీతం చేసుకుంటున్న కర్మయోగి.

“నా చరిత్ర పండితుడైన పామరుడు వ్రాయడు, పామరుడైన పండితుడు వ్రాస్తాడు” అని ప్రకటించిన “అమ్మ” తన చరిత్రను వీరికి చెప్పి రాయించింది. అందుకే వీరు ‘పామరులయిన పండితులు, అమ్మ ఎంచుకొని తను దరి చేర్చుకొన్న అదృష్టవంతులు.

వీరు 12 ఏప్రియల్, 2018న తన 95వ ఏట జిల్లెళ్ళమూడి పవిత్రక్షేత్రంలో అమ్మలో ఐక్యమయినారు.

శ్రీ రావూరి ప్రసాద్ 11-10-2011వ తేదీన జిల్లెళ్ళమూడిలో శ్రీ యార్లగడ్డ భాస్కరరావుగారిని చేసిన ఇంటర్వ్యూ సారాంశం.

*********


గమనిక: ఈ ఇంటర్వ్యూని పుస్తకానువాదం చేసే క్రమంలో  కొంతమేర భాషను సరిచేయటమైనది.

జిల్లెళ్ళమూడికి రాకముందు మీ ఆధ్యాత్మిక జీవన విధానాన్ని తెలపండి.

నాకు బాల్యం నుంచీ కృష్ణుడంటే ఇష్టం. ఆ ఫోటో పెట్టుకుని ఒక పువ్వు పెట్టుకుని స్మరించుకునేవాణ్ణి. ఆ రోజులలో సత్యానందస్వామి అని ఒకరు మా ఊరు వచ్చేవారు. ఆయనది దాచేపల్లి దగ్గర కేసానిపల్లి. మా ఊళ్ళో వారి శిష్యులుండేవాళ్ళు. వారు వచ్చినపుడు నేను కూడా వెళ్ళి కూర్చునేవాణ్ణి. ఒకసారి వారు అమరావతిలో చాతుర్మాస్యదీక్ష చేస్తూ మమ్మల్ని రమ్మన్నారు. అక్కడ నాకు వారు పంచాక్షరీ మంత్రం ఉపదేశించారు. రోజూ అమరేశ్వరుని ఆలయం దగ్గర కృష్ణానదీ తీరాన తెల్లవారుఝామున జపం చేసుకుని, తెల్లవారిన తర్వాత స్వామిని దర్శించి సత్రంలోకి వచ్చేవాళ్ళం. ఆయన బోధలు వింటే – శివుడు గానీ, రాముడు గానీ, కృష్ణుడు గానీ రూపాలు వేరుగానీ ఉన్నది ఒక తేజస్సే. పరమాత్మ ఇన్ని రూపాలుగా వచ్చాడు. – అని అనిపించేది.

ఒకసారి వారి ఆశ్రమానికి వెళ్ళి కొన్నాళ్ళున్నాం. ఆయనలో నాకు శివుని దర్శనం అయింది. తిరిగి ఇంటికి రాబోయే ముందు ఆయన మమ్మల్ని సాగనంపడానికి వాకిట్లోకి వచ్చి చూస్తున్నారు. నేను వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ శివుడుగా ఆయన ప్రత్యక్షమైనారు. కాసేపు అట్లా చూసి వచ్చేశా.

మొదటిసారి అమ్మను దర్శించిన జ్ఞాపకాలు మాతో పంచుకోండి.

ఒకసారి స్వామివారు చేబ్రోలు సత్రంలో చాతుర్మాస్య దీక్షలో ఉండి, అక్కడికి మమ్మల్ని రమ్మనమని కబురుచేశారు. మా ఊరు నుంచి కొంతమంది కలిసి వెళ్ళాం. మా ఊరి సత్యవతి అక్కయ్య, చంద్రమ్మ అక్కయ్య అక్కడ ఉన్నారు. వాళ్ళు నాకంటే ముందే జిల్లెళ్ళమూడిలో అమ్మను దర్శించారు. ‘ఇక్కడ నుంచి అమ్మ దగ్గరకి వెళ్లాం. చాలా మంచిది. మాకు బాగా తెలుసు” అన్నారు. వాళ్ళు. అక్కడ నించి మేము నలుగురం కలిసి అమ్మ దగ్గరకి వచ్చాం. జిల్లెళ్ళమూడిలో ఒకటి రెండు రోజులున్నాం. అమ్మకి పూజ చేసుకున్నాం. తిరిగి వచ్చేరోజున అమ్మకి పాదనమస్కారం చేసుకున్నాం. తిరుగు ప్రయాణంలో వాళ్ళ సంచులు కూడా ఒక పంచెలో మూట కట్టుకుని నెత్తిన పెట్టుకున్నా. పొలాలగట్లపై ‘పూళ్ళ’ మీదుగా నడిచిరావడం. వాళ్ళు చాలా వెనుక ఉంటే ఒక చెట్టు క్రింద ఆ మూట దింపుకుని నుంచున్నాను. మళ్ళీ మూట ఎత్తుకోబోయేటప్పుడు, మూటకట్టిన పంచెకి బాగా పసుపు ఉంది. ఏమిటీ పసుపు అయిందని నా తల తడుముకుంటే, తల మీద కూడా పసుపు. నేనేమీ పసుపు పూసుకోలేదు, వచ్చేటప్పుడు అమ్మ తలమీద చెయ్యి పెట్టి ఆశీర్వదించింది. అంతే. ఇది అమ్మ మహత్యం – అని అనుకున్నాను. ఆ తర్వాత మేమందరం అప్పుడప్పుడు అమ్మ దగ్గరకి వెళ్ళి వస్తూండేవాళ్ళం.

మొదట అమ్మను చూసినపుడు ‘ఆమెలో గొప్ప తేజస్సు ఉంది – ఆమె చాలా గొప్పది’ అనుకున్నాను. దైవం అని అప్పటికి అనిపించలేదు. ఇంటికి వచ్చాక తెల్లవారు ఝామున నిద్రలేవబోయే ముందు అప్రయత్నంగా అమ్మ. అక్కడ మేము పూజ చేసుకున్నపుడు ఎలా ఉందో అలా కనిపించింది. అది నిద్రకాదు, పూర్తి మెలకువ కాదు. నమస్కారం చేసుకున్నాను. వరుసగా మూడు రోజులు అట్లా నాకు ‘అమ్మ’ దర్శనం ఇచ్చింది. కలకాదు, ప్రత్యక్షం కాదు, ప్రత్యక్షం కాకపోవడం కాదు. అమ్మ స్పర్శ తెలుస్తోంది. అమ్మరూపం కనబడుతోంది. 3 రోజుల తర్వాత మళ్ళీ అమ్మ అట్లా కనిపించలేదు. కానీ అమ్మ మీదే ఎప్పుడూ నా ధ్యాస ఉండేది. అమ్మ దగ్గరకి మళ్ళీ ఎప్పుడు వెళామా? ఎప్పుడు చూద్దామా? అని తపన ఉండేది. రోమాంచము అయ్యేది. ఏ పనిచేస్తున్నా అమ్మే జ్ఞాపకం వచ్చేది. ఆ తర్వాత అప్పుడప్పుడు అమ్మ దగ్గరకి వచ్చివెళ్ళేవాడిని.

మా గురువుగారు సత్యానందస్వామి వారు కూడా నా కంటే ముందే అమ్మ దగ్గరకి వచ్చేవారు. వారి ఆశ్రమానికీ అప్పుడప్పుడు వెళ్ళి వస్తూండేవాళ్ళం. ఎప్పుడెప్పుడు అమ్మను చూద్దామా అని అమ్మ దగ్గరకి రావటమే కానీ క్రమంగా వారి ఆశ్రమానికి వెళ్ళటం తగ్గించేశాం. ‘మీరు మహిమలు చూసి వెళుతున్నారు. అమ్మ దగ్గరకి. నా దగ్గరకి రావటం లేదు’ అని ఆయనకి కొంచెం బాధ కలిగింది. కానీ ఆయన కూడా అప్పుడప్పుడు అమ్మ వద్దకు వస్తూండేవారు.

ఆనాటి అమ్మ సన్నిధి – అక్కడి వాతావరణం ఎలా ఉండేది?

ఆ రోజుల్లో అమ్మ పూరింట్లో ఉండేది. అక్కడకి దగ్గరలోనే పెద్ద పాక ఉండేది. వచ్చినవాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు. పూజా సమయంలో అమ్మ అక్కడికి వచ్చి కూర్చునేది. చుట్టూ ఫోటోలుండేవి. పూజ జరిగినపుడు అమ్మ అనేకరకాల కళలతో కనిపించేది. పూజ అయిన తర్వాత అమ్మే అందరికీ అన్నం వండి పెట్టేది. శుక్రవారం స్త్రీలు ఎక్కువగా వచ్చి పూజ చేసుకునేవారు. ఆదివారం పురుషులు ఎక్కువగా చీరాల నుంచి వచ్చేవాళ్ళు.

అమ్మ దగ్గర కూర్చుంటే “ఎవరో అన్నయ్య వచ్చాడు, చూడు. ఎవరో అక్కయ్య వచ్చింది చూడు. వాళ్ళకేం కావాలో చూడు” అని అనేది. మొదటి నుంచీ అమ్మ అట్లా చెప్పటం ద్వారా, మాకూ అదే అలవాటు అయిపోయింది. అప్పట్లో అమ్మకి చెరువు నుంచి కావిడితో నీళ్ళు తేవటం, అమ్మ దగ్గర కూర్చోవటం, ఎవరన్నా పాడుతుంటే వినటం. కాలువకి పోయి స్నానం చేసివచ్చేవాళ్ళం.

అమ్మ జీవితచరిత్రలోని ‘రహి’ అనే వ్యక్తిని మీరు చూచారా?

అమ్మ అప్పుడప్పుడు మాటల సందర్భంలో నాతో తన జీవిత సంఘటనల గురించి చెప్పేది. ఈ చరిత్ర వ్రాస్తే బాగుంటుందని నాకు అనిపించింది. తర్వాత ఒకసారి అమ్మకు పూజ జరుగుతుండగా ఒకాయన వచ్చి ఒక పుస్తకం తెచ్చి అక్కడ బల్లమీద పెట్టి కూర్చున్నాడు మాతో పాటే చాలాసేపు. పూజ అయిపోయిన తర్వాత అమ్మ తీర్థప్రసాదాలు ఇచ్చింది. తర్వాత అందరూ వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను మళ్ళీ వచ్చి అమ్మ దగ్గర కూర్చున్నాను. “ఇందాక పుస్తకం పెట్టి వెళ్ళాడే వాడే – రహి” అన్నది అమ్మ. ఆ పుస్తకం చూడమని అమ్మ నాకిచ్చింది. నేను కొంత చదివాను. దాంట్లో అమ్మ పడిన కష్టాలు, అవి పెట్టిన వాళ్ళ పేర్లూ అన్నీ వ్రాశాడు. కాస్త చదివి మళ్ళీ అమ్మకే ఇచ్చేశాను. కారణాంతరాల వలన ఆ పుస్తకం ఆ తర్వాత కనుమరుగైంది.

స్వయంగా ‘అమ్మే’ చెప్పగా అమ్మచరిత్రని మీరు రాసిన నేపధ్యం ఎలాంటిది?

అమ్మ జీవితంలోని సంఘటనలు అవీ చాలా బాగున్నాయి. రాముడూ, కృష్ణుడూ రామాయణ భాగవతాలూ వచ్చాయి. అవన్నీ చూసి మనం ఆనందపడుతున్నాం. అమ్మ చరిత్ర వ్రాసి ఉంటే ముందు తరాల వాళ్ళకి ఉపయోగపడతాయి కదా! వ్రాస్తే బాగుండునని నాకనిపించింది. ఈ మాట నేను అమ్మతో అంటే “చాలా మంది అంటున్నారు నాన్నా! వ్రాస్తే బాగుంటుందని. కనక వ్రాద్దువులే” అన్నది అమ్మ. కొన్నాళ్ళ తర్వాత అమ్మే తన చరిత్ర చెప్పటం మొదలు పెట్టింది. నేను కొన్నాళ్ళు వ్రాసి మా ఇంటికి వెళ్ళి – మళ్ళీ అమ్మ. వద్దకు వచ్చి వ్రాసి వెడుతూండేవాడిని. ఇంటికెళ్ళాక నేను వ్యవసాయం చేసుకునే వాడిని. జనం కాస్త తక్కువగా వచ్చేటప్పుడు అమ్మ “భాస్కర్ వస్తే బాగుండును” అనుకునేదిట. ఆ సమయంలోనే నాకు అమ్మవద్దకు రావాలనిపించేది. నేను వచ్చేవాడిని. వచ్చాక ‘ఇంతకుముందే అమ్మ అనుకుంటోంది – నువ్వు వస్తే బాగుండును’ అని; నువ్వు వచ్చావు’ అనేవాళ్ళు ప్రక్కనున్న సోదరీ సోదరులు. అట్లా జరిగేది. అమ్మ స్వయంగా చెప్పేది; నేను వ్రాసేవాడిని. ఒకోసారి నేను రావటం ఆలశ్యం అయితే అక్కడ ఉండే కొంతమంది అక్కయ్యలు ‘మేము వ్రాస్తాములే అమ్మా, అతను ఎప్పుడొస్తాడో’ – అని పుస్తకం రాయటానికి తీసుకునే వారట. “నాలుగు మాటలు చెప్పిన తర్వాత నాకు చెప్పటానికి వచ్చేది కాదు. నాన్నా!” అన్నది అమ్మ నాతో. “ఒకళ్ళ చేతిమీదుగా జరగాలి. ఇంతమంది ఎందుకు?” అని కూడా అనిపించింది అని అమ్మ అన్నది.

అమ్మ దగ్గరకి వచ్చే తొలిరోజుల్లో ఒక అక్కయ్య అమ్మతో ‘అమ్మా! భాస్కర్ అన్నయ్యకి కూడా ఏదైనా మంత్రం ఇవ్వు’ అన్నదిట. “వాడికి మంత్రం ఎందుకులే. ‘అమ్మ’, ‘అమ్మ’ అనుకుంటాడులే” అని అన్నదట అమ్మ. తర్వాత ఆ అక్కయ్య ఆ చెబితే నే విన్నాను. ఆ తర్వాత ఎప్పుడూ ‘అమ్మ”అమ్మ’ అనుకుంటూ ఉండే వాడిని. ఆపై పంచాక్షరీ మంత్రం అన్నీ వదిలేశాను.

నేను అమ్మ దగ్గరకి వచ్చిన తర్వాత సింగుపాలెం నుంచి చాలామంది వచ్చి వెళ్ళేవారు. మేము సింగుపాలెంలో అంతా కలిసి ప్రతి శుక్రవారం అమ్మపూజ చేసుకునేవాళ్ళం; ప్రతీరోజూ నలుగురం కలిసి అమ్మ మాటలు చెప్పుకునేవాళ్ళం. అలా పూజ చేసేటప్పుడు, మాటలు చెప్పుకునేటప్పుడు సువాసనలు వచ్చేవి. అమ్మ! అమ్మ! అనుకునేవాళ్ళం! అలా కాసేపు ఉండేవి. అప్పుడు అమ్మ వచ్చింది. అనుకునేవాళ్ళం.

ఎంతో మంది ఉన్నా తన చరిత్ర వ్రాయటానికి అమ్మ నన్ను ఎంపిక చేసుకుంది. ఆ విషయమై నాకేమనిపించిందంటే – సృష్టి అంతా అమ్మదే. అందరూ అమ్మ బిడ్డలే. అయినా ‘వీడు ఎప్పుడూ అమ్మ! అమ్మ! అనుకుంటూ నన్ను వదిలిపెట్టడం లేదే’ అని దయతో ఏదో పని చెప్పి నాచే చేయించింది. అంతేకానీ నేనేదో గొప్పవాడినని అనుకోవటం లేదు.

అమ్మ జీవితచరిత్ర వ్రాయటానికి కొన్ని ఏళ్ళు పట్టింది. అప్పుడప్పుడు వచ్చి వ్రాసి వెడుతూండేవాడిని. ఇక్కడికే వచ్చి ఉంటే బాగుంటుందని అనుకున్నాను. నేను అమ్మచరిత్ర వ్రాస్తున్నట్టు ఆనాడు ఎవరికీ తెలియదు. మరి ఏ కారణంగా రావాలి? ఇక్కడ ఎందుకు ఉండాలి? అని ప్రశ్నించుకున్నాను. ఇక్కడ వ్యవసాయం చేయటానికి వచ్చినట్టుగా వచ్చి వ్యవసాయం చేసేవాడిని; భవనాలు కట్టినపుడు ఆ పనులు చేస్తూండేవాడిని – ఇటు అమ్మ చెబితే చరిత్ర వాస్తూండేవాడిని – కేవలం వ్రాసేందుకే వచ్చినట్టు కాకుండా.

వ్యవసాయం చేయడం పనిమీద కుటుంబంతో వచ్చి ఇక్కడ ఉన్నాను. కొన్నాళ్ళ తర్వాత భార్య, పిల్లలు తిరిగి మా ఊరు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళినా కూడా అమ్మచరిత్ర వ్రాయటం గురించి నేనిక్కడే ఉండిపోయాను. నన్ను వాళ్ళు రమ్మన్నా వెళ్ళలేదు. ఎప్పుడైనా అవసరమైతే తప్ప ఇంటికి వెళ్ళేవాడిని కాదు. చరిత్ర వ్రాయటం పూర్తి అయింది. వయోభారంతో వ్యవసాయం చేయటానికి నాకు ఓపిక తగ్గింది. ‘అమ్మా! ఇక నేను వెళతానమ్మా’ అని చెప్పాను. “ఒద్దు నాన్నా, ఇక్కడే ఉండు నువ్వు” అన్నది అమ్మ. అయినా నేను ఇక్కడ ఊరికే ఎందుకుండాలనే ఉద్దేశంతో మా ఇంటికి వెళ్ళాను. వెళ్ళినా ఎప్పుడూ అమ్మ మీదే ధ్యాస ఉండేది. తర్వాత తిరిగి మళ్ళీ వచ్చి ఇక్కడే ఉంటున్నాను.

కవి – అంధ సోదరులు శ్రీ యార్లగడ్డ రాఘవయ్యగారు అమ్మ దర్శనం చేయటం, మీరంతా ‘అమ్మ’ని సింగుపాలెం తీసుకొని వెళ్ళిన వైనం ఎలాంటిది?

మొదట్లో నేను అమ్మ దగ్గరకి వచ్చి వెళ్ళిన తర్వాత యార్లగడ్డ రాఘవయ్య అన్నయ్యతో ‘అన్నయ్యా! నువ్వు కవిత్వం వ్రాస్తావు కదా! అమ్మ మీద ఏవైనా పద్యాలు కానీ పాటలు గానీ వ్రాయి’ అని అడిగాను. ‘ఒరేయ్! నేను అమ్మను చూసి, అనుభవం పొందితే ఏమైనా వ్రాయగలను కానీ లేకపోతే ఎట్లా వ్రాయగలను?’ అన్నారాయన. ఆ తర్వాత ఇద్దరం కలిసి అమ్మ దగ్గరకు వచ్చాం. ఆయనకీ అమ్మ దగ్గర చాలా అనుభూతులు కలిగినాయి. అమ్మ మీద చాలా పద్యాలు, కీర్తనలు వ్రాశారు. కొన్ని ఇవాళ లేవు. వారి రచనలు చాలా ప్రఖ్యాతి పొందాయి.

నేను, రాఘవయ్య అన్నయ్య, సత్యవతి అక్కయ్య, చంద్రమ్మ అక్కయ్య ‘అమ్మను సింగుపాలెం తీసికెడితే అందరూ చూస్తారు కదా!’ అని అమ్మను ఆహ్వానించాం. “నాన్నగారిని అడగండి నాన్నా! ఆయన పంపిస్తే వస్తాను” అన్నది అమ్మ. తర్వాత ఆయన్ని అడగటం, ఆయన ‘సరే’ అనటం, 1962లో అమ్మను మా ఊరు తీసికెళ్ళటం జరిగింది. అమ్మ సింగుపాలెం వచ్చి రెండు రోజులుంది. మా ఊళ్ళో ప్రతి ఇంటికీ వచ్చి అందరినీ ఆశీర్వదించింది. అందరూ పూజలు చేసుకున్నారు. అందరికి అమ్మను దర్శించుకోవటానికి చుట్టుప్రక్కల గ్రామాల నుంచి చాలామంది వచ్చారు. పందిళ్ళు వేసి, అందరికి అమ్మ దర్శనం భోజనాలు ఏర్పాట్లు చేశాం. అంతమంది జనం, భోజనాలు – ఏర్పాట్లకి ఖర్చు ఎలాగ? అని అడిగినప్పుడు అమ్మ రావాలే కానీ; అమ్మ వస్తే లోపం ఏముంటుంది? అమ్మ వచ్చి ఉండటానికి, ఏర్పాట్లు అన్నీ చేయగలమనీ రాఘవయ్య అన్నయ్య, నేను అమ్మను తీసుకెళ్ళాము.

అమ్మ చరిత్ర వ్రాసే క్రమంలో మీ అనుభవాలేమిటి?

రామాయణం, భాగవతం వింటున్నాము. ఈ దేవతల్లో ఎవరు గొప్ప? ఎవరు ఎక్కువ? అంటే అమ్మచరిత్ర, సంఘటనలు విన్న తర్వాత అమ్మే గొప్ప అవతారం అనిపించి వ్రాశాను. అమ్మ చరిత్ర వ్రాసేటప్పుడు అమ్మ చెపుతూంటే ఆయా పాత్రల కంఠస్వరాలు నాకు వినిపించేవి. ఎవరి గురించి చెపుతూంటే ఆ కంఠధ్వనులు వారివే అన్నట్టుగా ఉండేవి. మనుషులు కనబడలేదు, కంఠధ్వనుల వైవిధ్యం వినిపించేది.

అమ్మ తన శరీర త్యాగం గురించి ముందుగానే మీకేదైనా సూచనలు చేసిందా?

అమ్మ శరీరత్యాగం చేయటానికి 25 ఏళ్ళ ముందే నాతో “నేను ఆఖరికి వెళ్ళేటప్పుడు నాకోసం ‘విమానం’ వస్తుంది, నాన్నా!” అని చెప్పింది. 12.6.1985 తేదీన అమ్మకి ఆరోగ్యం సరిగా లేదు. అప్పుడు నేను ఇక్కడే ఉన్నాను.. అన్నపూర్ణాలయం షెడ్లో భోజనాలు చేస్తున్నాము. ఉన్నట్టుండి విమానం మోత వినిపించి, అది షెడ్ మీద వాలిందా అన్నంత పెద్ద శబ్దం నాకు వినిపించింది. అమ్మకి ఆరోగ్యం సరిగా లేదని అందరూ వెళ్ళి చూస్తున్నారు. నేనూ వెళ్ళి చూశా. తర్వాత నేను నామంచేసే సమయం వస్తే అఖండనామం వద్ద కూర్చున్నాము. ఇంతలో జేగంట బాగా పెద్దగా మ్రోగి ధ్వని వినిపించింది. వాత్సల్యాలయం నుంచి. అందరం గబగబా అక్కడికి చేరాము. చుట్టుప్రక్కల నుంచీ అందరూ వచ్చారు. కొంతసేపు తర్వాత ‘అమ్మ లేదు’ అన్నారు. ఒకప్పుడు అమ్మ చెప్పింది కదా- “నేను ఆఖరికి వెళ్ళేటప్పుడు నాకోసం ‘విమానం’ వస్తుంది” అని; ఇందాక విన్న మోత అదే అయి ఉంటుంది అని నేను అనుకున్నాను. 25 ఏళ్ళ క్రితం అమ్మ మాట అప్పుడు గుర్తొచ్చింది.

అమ్మ మీకు ప్రసాదించిన దివ్యానుభూతులేమిటి?

అమ్మ పూరింట్లో ఉన్నపుడు నేను అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉండేవాడిని. ఒకరోజు నేను వచ్చి కూర్చున్నాను. కొంతసేపటికి అమ్మ వచ్చి నా ఒళ్ళో కూర్చున్నది. తర్వాత లేచి వెళ్ళి అమ్మ విడిగా కూర్చున్నది. ఆ తర్వాత నేను వెళ్ళి అమ్మ ఒళ్ళో కూర్చున్నాను. నాకు పరిస్థితి తెలిసీ తెలియనట్టుగానే ఉంది. గానీ ఎందుకు జరిగింది అని తెలియకుండా ఉంది. చాలా ఆనందదాయకమైన స్థితి అది.

అమ్మ ఆలయ ప్రవేశం చేసిన తర్వాత మేము వాత్సల్యాలయం ప్రక్కన వరండాలో పడుకునే వాళ్ళం. ఒకసారి వానజల్లు వస్తే లోపలికి వచ్చి ఉత్తరపు వైపు వాకిలి దగ్గరగా పడుకున్నాం. నిద్ర లేచే ముందు తెల్లవారకట్ల అమ్మ అక్కడ నిలబడి ఉన్నట్లు, నేను నమస్కారం చేసుకున్నట్లు జరిగింది. అమ్మ. స్పర్శ తెలుస్తోంది; ఎదురుగా అమ్మ కనిపిస్తోంది. ఆ రోజల్లా నేను ఏవో పనులు చేస్తూనే ఉన్నా. ఏం చేస్తున్నానో తెలియకుండా ఉంది. అమ్మ లేని లోటు నాకు లేనే లేదు. అమ్మ ప్రత్యక్షంగా అంతటా ఉన్నది అని నా నమ్మకం.

కొన్నాళ్ళ తర్వాత తూర్పు ప్రక్క వరండాలోనే అమ్మ వాత్సల్యాలయం ప్రక్కనే పడుకున్నాం. తెల్లవారగట్ల లోగడ అమ్మ శరీరంతో ఉన్నప్పుడు జరిగినట్లే అనుభవం – నా ఒళ్ళో అమ్మ కూర్చోవటం, అమ్మ ఒళ్లో నేను కూర్చోవటం – మళ్ళీ అట్లాగే అనుభూతమైంది.

నేను అమ్మ దగ్గరకి వచ్చి ఉన్న తర్వాత మా ఇంటి దగ్గర పెళ్ళిళ్ళు అవీ జరుగుతున్నా ఏవో ముఖ్యమైన వాటికి వెళ్ళేవాడిని కాని మిగిలిన వాటికి వెళ్ళేవాడిని కాదనలు; ఇక్కడే ఉండేవాడిని.

కొంతకాలం హైమాలయంలో రంగారావు అన్నయ్యగారు, వారి భార్య సరోజినమ్మ గారు అర్చన చేసేవాళ్ళు. ఊళ్ళో నుంచి ఒక అమ్మాయి వచ్చి గుళ్ళో శుభ్రం చేస్తూండేది. ఆమె సరిగా చేయకపోతే ఆయన ‘ఇక్కడ ఇది ఉంది. అది అక్కడ అది ఉంది. శుభ్రం చెయ్యి’ అని చెప్పేవారు. ఆమె అవతల కెళ్ళి ఈయన్ని దూషణ చేస్తూండేది. అది విన్నాను రెండు మూడుసార్లు. ‘మంచి చెప్పినా శుభ్రం చెయ్యమన్నా కూడా ఈమె దూషిస్తోంది. ఇదిఏం పద్దతి?’ – అని నాకు బాధేసింది. ఆమె వంకచూశాను. ఎదురుగా ఆ అమ్మాయిలో సాక్షాత్తు అమ్మే కనిపించింది. తర్వాత ‘అమ్మే ఈ రూపంలో ఇట్లా ఉన్నది’ అనిపించింది. అందరిలోనూ ఉన్నది అమ్మే అని అనిపించింది.

కొమరవోలు సరోజిని అక్కయ్య నామం బాగా చేసేది. కానీ కొంచెం సేపే చేసి వెళ్తుండేది. ‘ఈమె బాగా నామం చేస్తుంది కదా! మరి కాసేపు చెయ్యొచ్చు. ఎందుకు కొద్దిసేపు చేసి వెళ్ళిపోతుంది?” – అని ఆమె మీద నాకు బాధేసింది. అప్పుడూ సరోజిని అక్కయ్య అమ్మగా కనిపించింది. ఇన్ని రూపాలుగా ఉన్నదీ అమ్మే. కనుక ఎవరినీ ఏమీ అనకూడదు. అంతటా అమ్మే ఉంది. ‘ముందు నువ్వు సరిగా నడుచుకుంటున్నావో లేదో నిన్ను నువ్వు విచారించుకో” అని నాకు అనిపించింది.

అమ్మ శరీరత్యాగం చేసి ఆలయ ప్రవేశం చేసింది. అపుడు అమ్మ నడయాడిన వాత్సల్యాలయంలోనే అమ్మ ఉన్నదని కొందరు, అమ్మ పార్థివ శరీరం ఆలయంలో ఉన్నది కనుక అనసూయేశ్వరాలయంలోనే అమ్మ ఉన్నదని కొందరు భావించసాగారు. ‘అమ్మ ఆలయ ప్రవేశం చేసింది ఇక్కడ కదా! ఇక్కడ లేకపోవడమేమిటి? అక్కడ ఉండటమేమిటి? అమ్మ ఇక్కడా ఉంటుంది, అక్కడ ఉంటుంది. అంతటా ఉంటుంది. ఇక్కడ ఎందుకులేదు?” – అని నా కనిపించింది. అమ్మనే ధ్యానిస్తూ ఆలయంలో కూర్చున్నాను. అప్పుడు గర్భగుడిలో అమ్మ పార్థివ శరీరం ఉంచిన చోట పువ్వుల్లోంచి ‘అమ్మ’ కదిలి పైకి వచ్చి కనిపించింది నాకు. అలా 10 ని.లు కనిపించింది. ‘అన్నిచోట్లా ఉన్న ‘అమ్మ’ ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నది. నాకు దర్శనం ఇచ్చింది కదా ! ఇక్కడా ఉన్నది’ అనుకున్నాను.

ఒకసారి అమ్మ నాతో అన్నది – నాన్నా! “ఏడవ మైలు దాకా ఇళ్ళు పడతాయి. ఇది మహాక్షేత్రం అవుతుంది” అని.

అమ్మను చూడాలనుకునే వారికి మీరిచ్చే సూచన లేక సందేశం ఏవైనా వుందా?

ప్రతి ఒక్కరూ కూడా ‘అమ్మా!’ ‘అమ్మా!’ – ‘తల్లీ!’ అనుకోవాలి.

అమ్మకి మీ ప్రార్థన ఏమిటి?

90 సంవత్సరములు దాటిన నేను కడవరకు అమ్మ ప్రసాదం తింటూ అమ్మ నామాన్ని చేస్తూ కడతేరాలని నా కోరిక. ‘అమ్మా! ఎన్ని కష్టాలు వచ్చినా, ఏది జరిగినా, నీ మీదే మనస్సు ఎప్పుడూ ఉండేటట్టు – నిన్నే ధ్యానం చేసుకునేటట్టు, నిన్ను తలచుకునేటట్టు చెయ్యి’ అని అమ్మనే ప్రార్థిస్తాను – అమ్మతోనే చెప్పుకుంటాను……

error: Content is protected !!