అమ్మకు అన్నానికి నిత్యసంబంధమని అమ్మను దర్శించిన వారికి, అన్నపూర్ణాలయ ప్రసాదం తిన్న వారికి అనుభవంలో ఉన్న సత్యం. లోకంలో అడగందే అమ్మైనా పెట్టదు- అని వాడుక. మనం అడక్కుండానే అన్నం తినమనే అమ్మ అపురూపం. అన్నం పెట్టడం ద్వారా అమ్మ యజ్ఞకర్తీ, యజ్ఞేశ్వరీ అయింది. యజ్ఞం అంటే నిష్కామకర్మరాశి. అమ్మ అన్నం పెట్టడంలో ప్రత్యేకమైన ప్రయోజనాన్ని, ప్రతిఫలాన్ని ఆశించడంలేదు. ‘నాతృప్తికోసమే’ అంటోంది. ఇది అన్నదానం కాదన్నది. నేను పెట్టడం లేదన్నది. ఎవడి అన్నం వాడు తింటున్నాడన్నది. ఇంతకంటె ఫలాభిలాషలేని కర్మ, కర్తృత్వ భావంలేని క్రియ ఉందవుకదా! అతిధి అంటే భారతంలో -ప్రాణులలో ఆకలి రూపంలో ఉన్న అగ్ని – అని అర్థమట. ఆ అగ్నిని ఆరాధించడం వినా గొప్ప యజ్ఞం ఏం ఉంటుంది?
అన్నపూర్ణాలయంలో భోజనం అన్నం మాతమే కాదనిపిస్తుంది. ఆ భావంతో చూస్తే ఆ అన్నం మన రుచిని తరచు తృప్తి పరచలేదు. మరి ఎన్నో ఏళ్ళుగా అన్నమే తింటూ జీవిస్తున్న వాళ్ళు అనేకులున్నారు. మామూలు భోజనానికి లేని పవిత్రత, తెలియకుండానే అమ్మ అవ్యాజానురాగం దాంట్లో చేరకపోతే ఇంతకాలం అన్నపూర్ణాలయం ఉండేది కాదు. పదులు, వందలు అయి క్రమంగా కోట్ల సంఖ్యలో అక్కడ భోజనం చేసి ఉంటారు. అన్నాన్ని మించిన దేదో ఉండడం వల్లనే అనిర్వచనీయ మైన తృప్తి కల్గడం ఎందరికో అనుభవం.
“ఇక్కడ పెట్టేది రుచికి కాదు అకలికి అన్నం” అని నిర్మొగమాటంగా అమ్మ తెలియచేసింది. అసలు ఆకలే రుచి అనే సత్యాన్ని, ఈ సందర్భంగా చెప్పింది. ఆకలి వేస్తే నాలుకకు రుచిమారుతుందట. అప్పుడప్పుడు మనకూ ఈ అనుభవం కలుగుతుంది.
అమ్మ ఆదేశాలివ్వదు. ఉపదేశాలు చెయ్యదు, అయినా ఎందరెందరో అమ్మను పదే పదే దర్శించడానికి కారణం అమ్మ బిడ్డలపై కురిపించే కారుణ్యమే. ఎక్కడకు వెళ్ళినా అమ్మ అనగానే అన్నదానాన్ని గురించి ప్రశంస వింటూంటాం. అక్కడ నిత్యాన్నదానం జరుగుతుందట కదా అంటారు.
అన్నం పెట్టడం అనేది అమ్మ స్వభావం. అది అమ్మ బాల్యం నుంచి ఉన్నది. అన్నం పెట్టద్దు అని ఇంట్లో పెద్దలు అంటే బాధ కలిగేది కాని అన్నం పెట్టింతరువాత స్నానం చెయ్యమన్నా, తిట్టినా, కొట్టినా బాధ కలిగేది కాదట. సందె కబళం అమ్మా అనే పిలుపు (కేక) అమ్మను కదిలించి వేసేదట. ఎలాగోలాగ వాళ్ళకు పెట్టేదట. ఇంట్లోవాళ్ళు కోప్పడినా, దొంగతనంగానైనా సరే, తనకోసం అని అబద్దమాడి అయినా సరే పెట్టేదట. తాను పెట్టిన అన్నం వాళ్ళు తింటుంటే అమ్మ పొందిన ఆనందం అంతులేనిదట. పెట్టడంలో, అందులోను అన్నం పెట్టడంలో, తాను మానుకుని పెట్టడంలో కలిగే ఆనందం అమ్మకు తెలిసినట్లు ఇతరులకు తెలియ దనిపిస్తుంది. అమ్మ దివ్యత్వం, అమ్మ దర్శనంవల్ల అనుభవించే ప్రశాంతి ఒక ఎత్తు – నిరంతరాయంగా ఎల్ల వేళలా అమ్మ సన్నిధిలో జరిగే అన్నదానం ఒక ఎత్తు. అమ్మ ఆవరణకు లోకోత్తరత్వాన్ని కల్గించింది. అన్నపూర్ణాలయమే. బిచ్చమెతైనా అన్నం పెట్టడం అమ్మ మతం. బాధాశబలితమైన లోకంలో ఆకలిబాధను నివారించడానికి అమ్మ ఏర్పరచిన ఈ పద్ధతి అసాధారణం. ఎంతటి వారికైనా ఇట్లాంటి కోరిక కలగడం, కలిగినా ఆచరించడం అసాధ్యం అనిపిస్తుంది. అన్నపూర్ణాలయం అమ్మ అఘటన ఘటనా సామర్థ్యానికి ఒక నిదర్శనం. అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పదంటారు. దానికి కారణం అది అంతులేని తృప్తిని దాతకు, గ్రహీతకు ఇద్దరకు వెంటనే కల్గిస్తుంది. మనం ఏమిచ్చినా తృప్తి కలగక పోవచ్చు. అన్నం పెట్టి తృప్తి పరచవచ్చు. కడుపు నిండాక ఎంత రుచికరమైనదైనా చాలు అంటారు. “నిత్యం అన్నం పెట్టడమే కాదు నిరంతరం అన్నం పెట్టా”లని అమ్మ కోరిక. విసు క్కోకుండా ఆదరంగా అన్నం పెట్టేవాళ్ళు కావాలంటుంది. “పది లక్షలు పెట్టి బిల్డింగులు కట్టినా పులిహోర పంచి పెట్టుకుంటూ వస్తే వచ్చే తృప్తి కలగదు” అంటుంది. “పంచి పెట్టనికాడికి ఉండడం దేనికి?” అనేది అమ్మ ప్రశ్న.
1958 సం॥ము ఆగష్టు 15 నుంచి లోకానికి తెలిసేలా అమ్మ అన్నపూర్ణాలయాన్ని ప్రారంభించింది. అప్పటినుండి “అది జగన్నాధ రధం – కదిలితే ఆగదు” అన్న అమ్మ మాట అక్షరాలా నిజం అని నిరూపించేలా నిరంతరాయంగా సాగిపోతూనే ఉన్నది. లక్షాధికారులు చేయలేని పని అమ్మ సన్నిధిలో జరుగుతోంది. “అమ్మా- మీరు యింతకాలంగా ఇంతమందికి అన్నం ఎలా పెడుతున్నారు? మేము లక్షలుండి కూడ సరిగా చేయలేక పోతున్నాం’ అన్నారట శ్రీశైలం నుండి వచ్చిన భక్తులు. “నాన్నా! అక్కడ మీరు పెడుతున్నాం అనుకుంటున్నారు. ఇక్కడ వాడి అన్నం వాడు తింటున్నాడు అనుకుంటున్నా. నేను పెడుతున్నాను అనుకోవటంలేదని అమ్మ. ఎంత అద్భుతావహమైన భావమో చూడండి. మానవులెవ్వరూ ఇది మా వల్ల జరుగుతోంది అనగలవారు లేరిక్కడ. అమ్మ నేను పెట్టడం లేదంటోంది. మరెలా జరుగుతున్నట్లు ? అదే మహిమలలో మహిమ! అకర్మను చూడటం అంటే ఇదేనేమో.
అమ్మ మనలా అన్నం తినదు, ‘అన్ని బాధలకంటే ఆకలి బాధ ఎక్కువ’ అని చెబుతూ బిడ్డల ఆకలి తీరడమే తనకు ముఖ్యం అన్నట్లుగా “మీరు తింటే నేను తిన్నట్లే” అని అపూర్వంగా పలికింది. మనం తింటే అమ్మ తిన్నట్లు ఎలా అవుతుందో, ఎందుకు అవుతుందో ఆశ్చర్యకరమైన విషయం. అన్నం కోసమే అందరూ అన్నివేళలా పాకులాడుతూ ఉంటే, “అన్నం తినడం విసుగు నాన్నా” అంటుంది. “ఈ కలిలో నాకాకలిలే”దన్నది. కాని మనం అన్నం తినకపోతే ఊరుకోదు. పరమాద్భుత చారిత్రకదా. తినేవాడు ఎవడైనా సరే పెట్టేటప్పుడు తల్లిలా పెట్టాలట. అంటే లాలించి బుజ్జగించి అన్నమాట. అమ్మకు మాతృత్వం తప్ప వేరే ఇంకేమీ తెలియదా? అన్పిస్తుంది ఇలాంటి మాటలు వింటోంటే. లోకంలో ఇంకెన్ని భావాలు, సంబంధాలు లేవు? వాటి గురించి కాకుండా ఎంతసేపు బిడ్డలు – తల్లి – అన్నం పెట్టడం, బట్టలివ్వడం ఇదే ధ్యాస. బొత్తిగా అమాయకురాలు అన్పిస్తుంది. వాడు అర్హుడో కాదో, తింటాడో తినడో, అసలు పెట్టవచ్చో పెట్టకూడదో ఇవేమీ చూడనక్కరలేదట. వీడు వాడు అనే విచక్షణ లేకుండా కడుపునిండా పెట్టడమే కర్తవ్య మంటుంది. ‘అమ్మా నీ గుఱించి పత్రికల ద్వారా అందరికీ తెలియచేస్తే బాగుంటుందన్నారట ఒకరు. “తెలియచేసేదే ముంది? పొట్టనిండా అన్నం పెట్టడమే” అన్నదట. అమ్మ అవతార ప్రయోజనం, సందేశం ఇదేనేమో!
మనకేమో వేళాపాళా, మంచీ చెడ్డా చూసు కోకుండా పెట్టడం సాధ్యం కాదు. ఇవేవీ ఆలోచించకూడ దంటుంది అమ్మ. ఒక్కొక్కడు నేను అన్నం కోసం రాలేదండీ- అంటాడు. “నీవు అన్నం తినడం నాకు ముఖ్యం నాన్నా” అంటుంది అమ్మ. “డ్రెస్సూ, ఎడ్రెస్సూ కాదు -ఆకలే అన్నపూర్ణాలయంలో భోజనానికి అర్హత” అన్నది. అంత ఎత్తు మనం ఎదగలేదనుకోండి. ఏమైనా అమ్మ మాట యథార్థం, శిరోధార్యం కదా! ఇష్టానిష్టాలు పట్టింపులు మనకి కాని అమ్మకేవీ ? అమ్మకు పరాయివాడు లేడు; కాని వాడెవ్వడూ లేదు. వాడు నాస్తికుడైనా, నక్సలైటైనా అమ్మకు సమానమే. ఎవడైనా బిడ్డే. అట్లాంటి సందర్భాల్లోనే అమ్మ పూర్ణత్వం, దివ్యత్వం, మన అల్పత్వం అజ్ఞానం కొట్టవచ్చినట్లు కనిపిస్తాయి. ‘నత్వహం కామయే రాజ్యం న స్వర్గం న పునర్భవమ్| కామయే దుఃఖతప్తానాం ప్రాణినాం అర్తినాశనమ్||’
నాకు సర్వ సుఖప్రదమైన రాజ్యంకాని, భోగపరసీమ అయిన స్వర్గం కాని, మోక్షం కాని వద్దు. దుఃఖ సంతప్తులైన ప్రాణుల ఆర్తినాశనమే నేను కోరుతున్నాను అంటాడు ధర్మరాజు-భారతంలో.
‘వట్టి మాటలు కట్టిపెట్టి గట్టిమేల్ తలపెట్ట’ మన్నాడు గురజాడ మహాకవి. అమ్మ బిడ్డలపై అపారమైన మమకారముతో గట్టి మేలు తలపెట్టడమే కాదు ఆచరిస్తున్నది. ఆచరింప జేస్తున్నది. ఈ అన్నపూర్ణాలయం తల్లికి ఇంకా ఎందరు పిల్లలు పుట్టనున్నారో ఎవరికి తెలుసు ? హైదరాబాద్లో ఒక పిల్ల పుట్టింది. విశాఖలో పుట్టవచ్చు. శుభస్య శీఘ్రం. మనమందరం ఉమ్మడిగా శ్రమించి, సొంతలాభం కొంతైనా మానుకొని అన్నపూర్ణాలయంలో భోజనం చేసేవారికి మరిన్ని సౌకర్యాలు కలగజేసి ఇంకా ఇంకా శుచిగా రుచిగా అమ్మ ప్రసాదాన్ని అందించే మహాయజ్ఞంలో పాలుపంచు కోవడానికి దీక్ష తీసికొనవలసిన పవిత్రమైన రోజు ఈ అన్నపూర్ణాలయ వార్షికోత్సవం. అమ్మ భావాలు ఆచరణలో ప్రతిఫలించ డానికి చేయవలసింది ఇంకా ఎంతో ఉన్నది. ఆ స్ఫూర్తిని, శక్తియుక్తుల్ని అమ్మ మనపై వర్షించాలని అమ్మ పాదములంటి ప్రార్థిస్తున్నాను.