1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అమ్మలీలలు అద్భుతములు

అమ్మలీలలు అద్భుతములు

Indhumuki Ramakrishna Rao
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : January
Issue Number : 1
Year : 2021

“అవగతము కావు తల్లీ, నీ లీల లద్భుతంబులు చూడగా…” అని అమ్మను స్తుతిస్తున్నాము. ఎంత నిజం. అమ్మ మాటలు, చేతలు మనకు అర్థం కావు కాలం గడిస్తే కాని. ఇలాంటిదే నా అనుభవం మీ ముందు ఉంచుతాను. –

శ్రీ శరభలింగం గారు విశాఖపట్నం వాస్తవ్యులు, వచ్చేశాను. నేను, ఆయన హిందుస్థాన్ జింక్స్ విశాఖపట్నంలో కలిసి పనిచేశాము. ఆయన సివిల్ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్కి హెడ్ అయితే, నేను మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి హెడ్గా ఉండేవాళ్ళం. కొన్నాళ్ళతరువాత నాకు విశాఖపట్నం నుంచి హైదరాబాద్ ట్రాన్సఫర్ అయింది.

ఒకసారి నేను ఆఫీసు పనిమీద వైజాగ్ వెళ్ళి మా గెస్ట్ హౌస్ లో ఉన్నాను. ఆ ట్రిప్లో ఒక రోజు శరభలింగం నన్ను వాళ్ళింటికి భోజనానికి ఆహ్వానించారు. నాకు ఆ రోజులలో పరిసరాలతో ఏ మాత్రం సంబంధం లేకుండా, ఎక్కడపడితే అక్కడ, గట్టిగా అమ్మమీద ఉన్న పాటలు, పద్యాలు నిస్సంకోచంగా పాడేవాడిని. ఆ రోజు వాళ్ళింట్లోకూడా అలాగే “యయా శక్త్యా బ్రహ్మా ….” శ్లోకం పాడాను. శరభలింగం వెంటనే ఈ పద్యం చాలా బాగుందే, ఎవరి గురించి అని అడిగారు. నేను అమ్మ గురించి చాలా విపులంగా ఆయనకు చెప్పాను. అమ్మ ఎలా ఉంటుంది అని ఆయన అడిగిన వెంటనే మీరు గెస్ట్హౌసి వస్తే, నేను అమ్మ ఫొటో చూపిస్తాను అని అన్నాను. భోజనాలు అయిన తరువాత ఆయన నాతో నా రూముకి వచ్చారు. నేను ఆయనకి అమ్మ ఫొటో ఇచ్చాను. ఆ ఫొటో తన చేతిలోకి తీసుకొని తదేకంగా చూస్తూ ఎంతో భావోద్వేగానికి లోనై “నేను అమ్మని చూడాలి, అమ్మ దగ్గరకు వెళ్ళాలి, అమ్మని చూడాలి” అని పదేపదే అంటూ మనలోకంలో లేని వ్యక్తిలా కనిపించారు. కొంతసేపటికి తేరుకొని “రామకృష్ణా, మనం ఇద్దరం కలిసి జిల్లెళ్ళమూడి వెళ్లాము. ఎంత త్వరగా వీలయితే అంత త్వరగా”అని అన్నారు. నేను సరే అలాగే ప్రోగ్రాం వేద్దాం అని అన్నాను. నా పని ముగించుకొని విశాఖ నుంచి హైదరాబాద్ తిరిగి వచ్చేసాను. 

ఆ తరువాత మేమిద్దరం ఎన్నోసార్లు జిల్లెళ్ళమూడి వెళ్లామని ప్లాన్ చేసినా ప్రయాణం మాత్రం కుదరలేదు. మనం ఇద్దరం కలిసి జిల్లెళ్ళమూడి వెళ్ళే అదృష్టం ఉన్నట్లు లేదు కదా అని శరభలింగం అన్నారు. ఆయన తన నిరాశను, నిస్పృహను కన్నీటితో ” వ్యక్తపరిచినప్పుడు ఆయన బాధ చూడలేక కేవలం ఆయనను సాంత్వన పరిచే ఉద్దేశ్యంతో “అదేమిటి శరభలింగం. అమ్మ ‘అనుకుంటే నువ్వు జిల్లెళ్ళమూడి వెళ్ళినప్పుడే నేను అక్కడకి రావచ్చును కదా బాధపడకండి” అని అన్నాను.

చాలా నెలలు గడచిపోయాయి. మా ఇద్దరి మధ్య ఈ టాపిక్ మళ్ళీ రాలేదు. మా ప్రయాణం విషయం పూర్తిగా మరుగున పడిపోయింది.

ఒకరోజు నేను జిల్లెళ్ళమూడి చేరి అమ్మ దర్శనానికి అమ్మ గదిలోకి వెళ్ళాను. పాదాభివందనం చేసిన వెంటనే అమ్మ “నీ స్నేహితుడు చాగంటి వచ్చారు రా!”అని అంది. చాగంటి ఎవరా అని నేను తెల్లమొహం వేస్తూంటే “అదే నాన్నా, నువ్వు శరభలింగం అంటావే వాడు వచ్చాడు. హైమాలయం దగ్గర ఉన్నాడు. వెళ్ళి చూడు” అని అంది. (అన్ని రోజుల పరిచయం ఉన్నప్పటికీ ఆయన ఇంటిపేరు ‘చాగంటి’ అని నాకు తెలియదు – నవ్వకండి మరి).

వెంటనే పరిగెత్తుకొని వెళ్ళి ఆయనను హైమా లయం దగ్గర కలిశాను. నన్ను హఠాత్తుగా చూసిన ఆనందంతో ఆయన నన్ను కౌగలించుకొని “భలే తమాషాగా ఉన్నదే, నేను వస్తున్నట్లు నీకు తెలియదు – నువ్వు వస్తున్నట్లు నాకు తెలియదు – నువ్వు చాలా కాలం క్రితం చెప్పినట్లే జరిగిందే”అంటూ ఎంతో సంతోషపడ్డాడు. జవాబుగా అది నా ప్రతిభ కాదు. అమ్మ తన ప్లాన్ నా నోటిద్వారా చెప్పించిందన్నమాట. ఆ రోజు నేను ఏదో నిన్ను సముదాయించడానికి అన్నమాటలు అవి అని అన్నాను.

అమ్మ ప్రధమదర్శనం, జిల్లెళ్ళమూడి వాతా వరణం ఆయనకు చాలా బాగా నచ్చింది. తిరుగు ప్రయా ణానికి ముందుగా అమ్మ దర్శనం, బొట్టు పెట్టించుకొని అమ్మ అనుమతిపై అమ్మ దగ్గరకు వెడుతూ నన్ను కూడా తనతో రమ్మన్నారు. ఇద్దరం అమ్మ సన్నిధికి చేరాము. అమ్మ ఆయనకు బొట్టు పెట్టి, కుంకుమ పొట్లాలు చేతిలో పెట్టి “నాన్నా హైమాలయం దగ్గర బావి చూశావా?” అని అడిగింది. “లేదమ్మా చూడలేదు” అని ఆయన బదులు చెప్పారు. వెంటనే అమ్మ “వెళ్ళేముందు బావిని చూసి వెళ్ళు నాన్నా”అని అంది.

మేము క్రిందకి వచ్చేసి అదేమిటి అమ్మ బావిని చూడమంటోంది అని ఒక ప్రక్క ఆశ్చర్యపోతూ మరోవైపు హాస్యధోరణిలో ఇదేమైనా సెవెన్ వండర్స్ ఆఫ్ ది వరల్డ్ (SEVEN WONDERS OF THE WORLD) లోదా ఏమిటి అని నవ్వుకొన్నాము. అమ్మ ఆజ్ఞ శిరసావహిస్తూ శరభలింగం ఆ బావిని సునిశితంగా చూశారు.

ఈ సంఘటన జరిగిన దాదాపు 1 – 1 1/2 సంవత్సరాల తరువాత మన విశాఖపట్నం సోదర లందరూ కలసి జిల్లెళ్ళమూడిలో ఒక గెస్ట్ హౌస్ (GUEST HOUSE) కట్టాలని నిర్ణయించారు. సివిల్ ఇంజనీరింగ్ విషయంలో శరభలింగం గారు, కామేశ్వరరావు గారు ఆ బాధ్యతలను తీసుకొన్నారు. ఈ సందర్భంగా శరభలింగం గారు తన అనుభవాన్ని నాకు ఇలా చెప్పారు: “నాకు మొట్ట మొదట ఫౌండేషన్ వేసే పని వచ్చింది. ఫౌండేషన్ ఎలా వేయాలి, ఎంత వేయాలి, ఏమేమి ఎంత పాళ్ళలో వాడాలి, అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయి అన్న విషయాలు నిర్ణయించాలి కదా, అందుకని ఆలోచనగా కళ్ళుమూసుకొన్న వెంటనే నా కళ్ళముందు ఆ బావి కనపడింది. మొదటి దాని 3 ఒరలు, వాటి తరువాత అడుగుదాకా ఉన్న మట్టి కైవారం అంతా కళ్ళలో స్పష్టంగా కనిపించింది. పై నుంచి బావి అడుగుభాగం దాకా మట్టిలో ఎటువంటి మార్పులు ఉన్నాయో గమనించాను. ఇలా దృశ్యమానం అవడంవల్ల ఆ మట్టి యొక్క లక్షణం (SOIL STRUCTURE) వగైరాలన్నీ తెలిసి ఫౌండేషన్ ఎట్లా వెయ్యాలి, ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలని ఒక అభిప్రాయానికి రాగలిగాను. దాని ప్రకారం ఒక ప్రణాళిక వేయగలిగాను. అప్పుడు అమ్మ నన్ను బావి చూడమని ఎందుకు చెప్పిందో అర్ధం చేసుకొని నా ఆశ్చర్యానికి, ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మ ఎప్పుడు ఏమి చెబుతుందో, దాని అంతరార్ధం ఏమిటో మనకు అప్పుడు తెలియదు కదా! అలాగే ఎవరిని, ఎప్పుడు, ఏ పనికి వినియోగించు కుంటుందో కూడా మనకి తెలియదు. అమ్మ నాకు ఈ అవకాశం ఇవ్వడం నా అదృష్టం” అని ముగించారు.

విశాఖపట్నం వసతి గృహం నిర్మాణం పూర్తి అయ్యేవరకూ ఆయన తన వంతు బాధ్యత ఎంతో శ్రద్ధతో నిర్వహించారు. అప్పటినుంచి ఆయన మన సంస్థకి తన వంతు సేవలు అందించారు. అలాగే మాతృశ్రీ అధ్యయన పరిషత్, విశాఖపట్నం శాఖలో సభ్యుడిగా ఉండి కేశవశర్మ, నరసింహారావు అన్నయ్యలతో కలసి సేవలు అందించారు.

ఇక నా వరకు వస్తే మా ఇద్దరి బంధం, మా కుటుంబాల అనుబంధం ఎంతో గట్టిపడి స్వంత అన్నదమ్ములలాగ కష్టసుఖాలు పంచుకొన్నాము.

ఈ అనుభవంతో నాకు అర్థం అయినది ఏమిటంటే “అన్యధా శరణం నాస్తి” అని శరణాగతి పొంది అమ్మ ఏవైనా మనకి డైరెక్ట్ గా చెబితే అది తు.చ. తప్పకుండా పాటించడమే మన కర్తవ్యం. 

జయహో మాతా.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!