శ్రావణమాసం అంటే మంగళప్రదమైన మాసం అంటారు. నోములు, వ్రతాలు, పూజలకు ప్రాధాన్యం. శ్రావణ పంచమి నాగపంచమిగా ప్రసిద్ధి. అలాంటి పవిత్రమైన శ్రావణ శుద్ధ పంచమి రోజు నుంచి పూర్ణిమ వరకు ఒక ప్రత్యేకతను సంతరింపచేసింది. అదే పవిత్రోత్సవాలకు 1964 ఆగస్టు 12న శ్రీకారం చుట్టింది. నాటి నుంచి నేటి వరకు సాంప్రదాయబద్ధంగా, నిర్విఘ్నంగా కడు వైభవంగా జరిపించుకుంటున్నది(అమ్మ).
ఇప్పటికి 57 సంవత్సరాలు నిండి 58వ సంవత్సరం ఇది. ఈ సంవత్సరం కూడా ఆగస్టు 12వ తేదీ – శ్రావణ శుద్ధ పంచమి కలిసి వచ్చాయి. తొలిగా అమ్మ ఎంతో సరదాగా జరిపించిన వేడుకలు మదిలో మెదుల్తుంటాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలా జరుపుకుంటుందో అన్న ఆవేదనకు సమాధానంగా అమ్మ శుభాశీస్సులతో వరుణుని కూడా ఈ ఉత్సవానికి స్వాగతించిందా? అన్నట్లు వర్షపు జల్లులతో ప్రారంభమైన ఈ పండుగను వైభవంగా జరిపించింది (అమ్మ). –
తొలిరోజు పుట్టింటి వారైన మన్నవ శేషు, మొవ్వా శేషు, రెండవ రోజు సోదరుడు శాయి ప్రదీప్, మూడవరోజు సంస్థలోని సోదరీసోదరులు నాల్గవరోజు 55 సంవత్సరాల నుండి ఇందులో పాల్గొంటున్న బుద్ధిమంతుడన్నయ్య, ఐదవ రోజు వర్ష అరుణ కుటుంబసభ్యులు, 11వ రోజు సోదరుడు చక్కా శ్రీమన్నారాయణ ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మ(కృపకు పాత్రులైనారు.
ఈ ఉత్సవంలో 11వ రోజు ఉదయం విందు భోజనం ఏర్పాటులో సోదరుడు బాలాజీ పాల్గొని ధన్యులైనారు. ఈ ఉత్సవం ప్రారంభించిన సంవత్సరం కీర్తిశేషులు భాస్కరరావు అన్నయ్య 11వ రోజు అరిసెల కావడి తెచ్చాడు. ఆ స్మృతులతో సోదరి బోళ్ళ వరలక్ష్మికి అరిసెలు బంతి భోజనంలో వేసే అదృష్టాన్నిచ్చి ఆమె ననుగ్రహిస్తోంది అమ్మ.
11వ రోజు సాయంత్రం ఉత్సవంలో గుంటూరు వాస్తవ్యులైన విజయేంద్ర సూరత్ గార్ల చిన్నారులు ధాత్రి, భరద్వాజలు కూచిపూడి నృత్యం గణపతి కీర్తన, అన్నమాచార్యుల కీర్తన… అదివో అల్లదివో…, భజగోవిందం ప్రదర్శించి అమ్మను, అందరినీ ఆనందింపచేసి అమ్మ ఆశీస్సులు అందుకున్నారు.
అమ్మా! మా ఆనందాన్ని మురిపెంగా చూచి మాపై కృపావృష్టిని సారించి పరవశింపచేసిన నీ కరుణకు జోహార్లమ్మా! నీ మృదు పదాలకు సుమనస్సులమ్మా!!