1. Home
  2. Articles
  3. Viswajanani
  4. నవయుగానికి నాంది పలికిన అమ్మ

నవయుగానికి నాంది పలికిన అమ్మ

Prasad Varma Kamarushi
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 21
Month : October
Issue Number : 3
Year : 2021

20వ శతాబ్దంలో ఆంధ్రదేశంలో ఒక అద్భుతం జరిగింది. ఆంధ్ర దేశం భూమికగా జగతికొక అదృష్టం పట్టింది. ఆంధ్ర దేశపు ఆధ్యాత్మిక జ్యోతి దేదీప్యమానంగా వెలిగింది. ఆ వెలుగులో ఎందరెందరో మహామహులు సేదతీరేరు, ఆత్మావలోకనం చేసుకున్నారు.

ఆ విశ్వజనీనత, తాత్త్వికత, విప్లవాత్మక, అత్యంత ఆచరణాత్మక డౌన్ టు ఎర్త్ ఆలోచనా సరళి, మూఢాచార నిరసనలలో విలక్షణత చూపి నవయుగానికి నాంది పలికింది జిల్లెళ్ళమూడి అమ్మ. జగతికే జాగృతి కలిగించిన దివ్యశక్తి, జనతనే మార్చిన చైతన్యమూర్తి అమ్మ.

అరణ్యాలకు ఆశ్రమాలకు పరిమితమైన వేదాంతాన్ని మట్టి మనుషుల నిత్య జీవితంలో ప్రవేశ పెట్టింది. జన్మ ధన్యత కోసం బ్రహ్మ సాక్షాత్కార ప్రయాస వృధా అన్నది. కాయమున్నంత వరకు సాయం చెయ్యమన్నది. దేహమున్నంత వరకు దానం చెయ్యమన్నది. చరాచరాత్మకమైన సృష్టి మొత్తాన్ని బ్రహ్మ మయంగా దర్శించి, “అంతా ఆత్మగా కనిపించటమే ఆత్మ సాక్షాత్కారమని చెప్పింది. తన తనువే ప్రమిద గా చేసుకొని మానవాళిపై వెలుగులు ప్రసరించిన ప్రమద! మతంపై ఆధారపడకుండా మతాతీతంగా ఆధ్యాత్మిక వివేకం కలిగించటానికి కృషి చేసింది.

అమ్మ అనుసరించిన విధానంలో మత ఛాందసమూ, మతాలలోని కాఠిన్యమూ orthodoxy కానరాదు. భౌతికతకు ఆధ్యాత్మికతకు మధ్య గోడ ఏనాడూ కట్టలేదు. పైగా తేడా లేదన్నది. కుక్కల వంటి జీవులూ సాధకులే, ఎక్కడో దూరంగా అవసాన దశలో ఉంటే వాటి అవసానదశ గ్రహించి అవీ తరించాలని వాటికి తీర్థం పొయ్యండి అని పంపేది. జనన మరణాలు అమ్మ అధీనం కాబోలు. అద్వేష్టా సర్వభూతానాం మైత్ర : కరుణ ఏవచ అన్న ఆర్షవాక్కును సాకారం చేసింది అమ్మ. ఋషులంటే మనుషులే అయిఉండాలని మీ భావం, నేను అలా అనుకోను అని అంటూ ఉండేది. భూత భవిష్యద్వర్త మానాలు అనేవి లేవు అమ్మకు. ఆవి సమసిపోయి వర్తమానంగా పరివర్తన చెందటం జరుగుతుంది. నాకు ఇన్ని కాలాలు లేవు, అంతా వర్త మానమే అంటుంది అమ్మ. అయితే ఒక విషయం అమ్మ లీలా విలాసాల్ని భౌతిక పరిధుల్లో అవగాహన – చేసుకోలేం.

అతీంద్రియ శక్తులు : పరమ నాస్తికుడు జొన్నలగడ్డ రామలింగయ్యగారు వచ్చి నాకు నమ్మకం లేదమ్మా అన్నాడు. అక్కర లేదు నాయనా అన్నం తిని వెళ్ళు అన్నది. ఆయనకు నూకలతో చేసిన అన్నం వడ్డించింది. నాకు నూకలతో చేసిన అన్నం ఇష్టమని అమ్మకెలా తెలుసు అని ఆశ్చర్యచకితుడయ్యాడు. అమ్మ ఎందరెందరికో అవలీలగా ఆధ్యాత్మిక శక్తులు, దివ్యానుభూతులు, అనుభవాలిచ్చింది. మానసికంగా మార్పు తెచ్చింది. ఎన్నెన్నో రూపాలలో దివ్య దర్శనాలు ప్రసాదించటం, ఆహారం అక్షయమవటం, వంటి మహత్తులెన్నో చేసింది. పంచభూతాలు, ప్రకృతి, దేశ, కాల, దూరాలు అమ్మ సంకల్పానికి లోబడే ప్రవర్తించాయి. సమాధ్యవస్థలో రకరకాల భాషల్లో దేశవిదేశీయులతో మాట్లాడేది. ఒక్క చూపుతో, మౌనంతో జిజ్ఞాసువుల సందేహాలు తీర్చింది. కొందరికి మరణం ద్వారా విముక్తి కల్పించింది. కొందరి మరణసమయాన్ని వాయిదా వేసిన సందర్భాలూ ఉన్నాయి. అమ్మవల్ల ఎన్నో అతిమానుష చర్యలు జరిగాయి. ఇన్ని జరిగినా అందరికీ అమ్మనే అనే మాటమీదే నిలబడింది. సాధనంటూ లేని యోగిని, భక్తులు లేని దేవత, శిష్యులులేని గురువు.

అమ్మ అన్న రెండక్షరాల్లో సర్వమూ నిక్షిప్తం చేసింది. ప్రపంచాన్ని పరిత్యజించలేదు, సంసారాన్ని వద్దనుకో లేదు, కాషాయం కట్టలేదు, కర్తృత్వం అంగీకరించ లేదు. అమ్మ ఏనాడూ తన శక్తులను పనికట్టుకుని ప్రదర్శించ లేదు. కాని అవి జరుగుతూ వచ్చాయి. ఏమిటమ్మా యిది అని అడిగితే జరగవలసి ఉన్నది కనక జరిగింది నాదేమీ లేదు అని చెప్పేది నిర్లిప్తంగా. చెప్ప వలసిందేదో నిరాడంబరంగా చెప్పింది, చెయ్యవలసిందేదో నిశ్శబ్దంగా నిగూఢంగా చేసుకుంటూ పోయింది. ప్రచార విముఖత లాగే ప్రసంగ విముఖతా ఎక్కువే.

అసలైన కమ్యూనిస్ట్ : సమ సమాజ స్థాపనకి అతి నిరాడంబరంగా నిశ్శబ్దంగా సోపానాలు వేసింది. ఒక సామాన్య గృహిణి ఆచరణలో పెట్టి చూపిన సామ్యవాదం అచ్చెరువు గొలుపుతుంది. ఆమె ఆచరణాత్మకత ముందు మార్క్స్లూ, లెనిన్ లూ మరుగుజ్జులుగా కనిపించే సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. ఒకసారి అనంతపురంలో కమ్యూనిస్ట్ యాజమాన్యం వారు నడుపుతున్న ప్రెస్ కి వెళ్ళారు గోపాలన్నయ్య. అక్కడ లెనిన్ స్టాలిన్ల ఫొటోలు మధ్య అమ్మ ఫొటో పెట్టి ఉంది. అమ్మ ఫొటో వీరి మధ్య పెట్టారేమిటి అని ఆశ్చర్యంతో అడిగితే, అంతకన్న ఆశ్చర్యకరమైన సమాధానం వచ్చింది. అమ్మ కంటే కమ్యూనిస్ట్ ఎవరూ లేరు, అమ్మే అసలైన ప్రాక్టికల్ కమ్యూనిస్ట్. మేమంతా కమ్యూనిష్టులమని చెప్పుకుంటాం. అంతే అన్నాడాయన.

మంత్రాయి, రహి, మౌలాలి, చాకలి బుచ్చమ్మ, అంకదాసు మస్తాను వంటి వారి కుల మత జాతి ప్రసక్తి అణుమాత్రమైనా తలంచ లేదు. వారంతా తమ్ము తాము సంస్కరించుకొని అమ్మకు ఆత్మీయులై అమ్మ సేవలో తరించే అవకాశం అమ్మే కల్పించింది.

వినాశాయచ దుష్కృతాం అన్న గీతా వాక్యానికి అపవాదు అమ్మ. అమ్మ దృష్టిలో శిక్షణే గాని శిక్ష లేదు. నరకాసురుణ్ణి, నక్స లైట్స్ని సాదరంగా సానుభూతితోనే చూసింది. అందుకే కాబోలు గీతకంటే అమ్మ వాక్యాలు విశిష్టంగా విలక్షణంగా ఉన్నాయి అన్నారు శ్రీభాష్యం అప్పలాచార్య మహోదయులు.

దేవుళ్ళూ బిడ్డలే : నెల్లూరు రంగనాయకస్వామి ఆలయంలోకి పాదుకలతో వెళ్ళింది. తరువాత కొందరు విలేకరులు పాదుకలు విడవకుండా ఎందుకు వెళ్ళారు అని అడిగితే బిడ్డను చూడాలన్న తొందరలో ఆ సంగతి మరిచి పోయాను అన్నది. మరొకరు తిరుపతి వెళ్ళే ముందు అమ్మ దగ్గరకొచ్చి అమ్మా తలనీలాలు ఇక్కడే ఇచ్చుకోవాలనుంది అంటే, ‘నా బిడ్డ’ దగ్గర యిచ్చినా నా దగ్గర యిచ్చినా ఒకటే అన్నది. అమ్మ దృష్టిలో జడ చేతన భేదం లేదు. సృష్టి అంతా తన సంతానమే . అమ్మ ప్రధానంగా మానవతా వాది. ప్రేమ ఆదరణ తప్ప మరొకటి తెలియదేమో అన్నంత ఆచరణాత్మక వేదాంతి అనిపిస్తుంది. రిక్షా ఎక్కినవాడే కాదు రిక్షా తొక్కినవాడూ సమాన ప్రేమాస్పదుడే ఆమెకు. 

కట్టుబాట్ల చట్టాన్ని ఛేదించింది: స్త్రీలు ఆలయ పూజారులుగా సేవలందించమని ప్రోత్సహించింది. శేషప్రభావతి రుద్రాభిషేకాలు చేసింది. వేదాధ్యయన పరుడు, బహుగ్రంథకర్త అయిన శ్రీ భద్రాద్రి రామశాస్త్రి గారు స్త్రీలకు వేదవిద్యాధ్యయనాధికారం ఉన్నదా? అని సందేహంలో పడ్డారని, ఉన్నదన్న అమ్మ విశ్లేషణతో ఏకీభవించారని చెపుతారు. ఎందరో స్త్రీలు శ్రీ సూక్తం, పురుష సూక్తం, నమకం చమకం వంటివి నేర్చుకుని అర్చనలు ఆరాధనలు చెయ్యటాన్ని పోత్సహించింది అమ్మ.

పూజలు వ్రతాలు, శుభకార్యాలు ఏం జరిగినా కుల మత స్త్రీ పురుష వివక్ష లేక అందరినీ పాల్గొనమని ప్రోత్సహించింది. ఒకసారి రాజుబావ అనే ఆత్మీయుడు ఎప్పటిలాగే దర్శనానికొచ్చి దూరంగా నిలబడ్డాడు. ఆయన రాగానే అమ్మ పాదాలకు నమస్కరించటం అలవాటు. ఏం దూరంగా ఉండిపోయావు అని అడిగితే, నీవు బయట చేరేవు కదా తాకటమెందుకు అనుకున్నాను అన్నాయన. ఒక గంట క్రితం వరకు నన్ను తాకుతున్నావనుకో, అప్పటికి బహిష్టు కాలేదు. అంటే మైల రక్తం నాలో ఉన్నది. ఆది ఉన్నంతకాలం తాకేవు, అది బయటకు పోయాక తాకేందుకు ఎందుకు సందేహిస్తున్నావు ? అంటే ఏమోనమ్మా ఆచారం కదూ అంటే “ఆచారమే తప్పు, ఆ సమయంలో స్త్రీకి అసౌకర్యంగా ఉంటుంది. ఏదో ప్రమాదమని కాదు” అన్నది. ఇదీ అమ్మ హేతువాదం. శ్రీపాద గోపాలకృష్ణమూర్తిగారు చనిపోతే, పుత్ర సంతానం లేని ఆయనకు, కూతురు గాయత్రిని అంతిమ సంస్కారాలు  చెయ్యి ఫరావాలేదు అని చెప్పింది అమ్మ.

తర్క శాస్త్ర ప్రవీణ : సర్వదేవ నమస్కారః అంటే సర్వమూ అయిన దేవతకని అమ్మ నిర్వచనం. నా దృష్టిలో దేవతలంటే మీరంతా అని చెప్పింది. పునర్జన్మ గురించి మాట్లాడుతూ 84 లక్షల జీవరాసులే మిగిలి ఉండాలి. ఇంత పెరగటానికి వీల్లేదు. ఆ 84 లక్షల జీవరాసులే మళ్ళీ మళ్ళీ వస్తుంటే ఈ జనాభా పెరగటానికి వీల్లేదు కదా? అందరికీ ఒకే గతి. మీ చేతలు మీ చేతుల్లో లేవు. ప్రేరణ యివ్వ వలసింది నేనే. ఏదైనా చేయించేది దైవమే అయినప్పుడు ఎవరి గొప్పా లేదు ఎవరి తక్కువా లేదు. అంచేత పాప పుణ్యాలు నీవి కావు. జన్మలు లేవని చెపుతుంటే ఎందుకో నమ్మలేక పోతున్నారు, భయపడుతున్నారు అందొక సందర్భంలో, రాజమ్మ గారి దగ్గర కెళ్ళినపుడు నమస్కారం చెయ్యబోతే తాక వద్దు తాకితే నీలో ఉన్న పాపం నాకంటుకుంటుంది అన్నదామె. నాలో ఉన్న పాపమేనా, పుణ్యం కూడా అంటు కుంటుందా? అని ప్రశ్నించింది అమ్మ. అలాగే వైద్యో నారాయణో హరిః అన్న ఆర్యోక్తిని అది అర్థ సత్యమని అంగీకరించలేదు. రోగికి వైద్యుడు నారాయణ స్వరూపుడైతే, వైద్యుడికి రోగి కూడా నారాయణ స్వరూపుడే అని అమ్మ మాట. 

సామాజిక స్పృహ నిండుగా ఉన్న వాస్తవికతా వాది. అమ్మ ఏం చెప్పింది, ఏం చెయ్యటానికి వచ్చింది, తాను ఉన్నన్నాళ్ళు ఏం చేసింది అని ఆలోచన చేస్తే గాని అమ్మ అర్థం కాదు. అమ్మ ఏం చెప్పిందో అదే చేసింది. చెప్పినవన్నీ అనుభవంలోంచే చెప్పింది.

పైన ఉదాహరించిన అమ్మత్వ విశేషాలు, సంఘటనల గురించి లోతుగా పరిశీలిస్తే వర్తమాన సమాజంలో అమ్మ స్థానం ఏమిటి, అమ్మ రిలవెన్స్ ఏమిటన్నది తెలుస్తుంది. అమ్మ సనాతనము, ఆధునికత కలబోసుకున్న అర్థనారీశ్వరి. అమ్మ కన్న హేతువాది ఎవరు ? – అని ప్రశ్నించుకుంటే జవాబు దొరకటం కష్టమే. అమ్మ మన మధ్య ఎటువంటి మానవ సంబంధా లుండాలని ఆశించిందో, ఎటువంటి సమ సమాజాన్ని సంకల్పించిందో అర్థం చేసుకోవటం ఎంత ముఖ్యమో, అందులో మన పాత్ర ఏమిటన్నది అంతే ముఖ్యం. భక్తి, కర్మ, జ్ఞాన యోగాలను అమ్మ విడి విడిగా చూడలేదు, ఒక త్రివేణీ సంగమం గానే సంభావించింది.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!