ఒక వైపు ‘తెలియనిది తెలియ చెప్పే’ అమ్మ’, మరొక వైపు అద్వైత సిద్ధిప్రదాయిని శ్రీహైమవతీదేవి మన ‘నిధి- నిధానం’గా వెలిశారు.
సోదరీ సోదరులందరూ ముందుగా ఆ గురుమూర్తులకు సభక్తికంగా సాష్టాంగప్రణామాల నర్పించారు. ఉదయం 5 గంటలకి అమ్మకి బాల భోగం శ్రీ బ్రహ్మాండం శేషు అక్కయ్య నివేదన చేశారు.
కళాశాల విద్యార్థినులు, శ్రీకృపాకర్రెడ్డి గారు కలిసి ఉదయం 5.30 నుండి 6.30 వరకు జిల్లెళ్ళమూడి పురవీధులలో నగర సంకీర్తన చేశారు.
ఉదయం 7.30 నుండి వస్తున్న అమ్మ బిడ్డలందరూ ఆలయాలలో ఏకాదశ రుద్రాభిషేకాల్లో పాల్గొన్నారు.
అమ్మ దివ్య మంగళ విగ్రహానికి గురుపూర్ణిమ సందర్భంగా గం8.30 లకు ముత్యాల గజమాలతో అలంకరణ ఈమని రాజ, కృపాకర్ రెడ్డి చేశారు.
ఉదయం గం.8 లనుండి స్థానికులు, విద్యార్థినీ విద్యార్థులచే శ్రీ చుండి నాగసుందరి, మృదుల గారి పర్యవేక్షణ లో అమ్మ చరిత్ర ‘మాతృశ్రీ జీవిత మహోదధిలో తరంగాలు’ పారాయణ సాయంత్రం వరకు సాగింది.
విశేషమైన శ్రీసూక్త హెూమం యాగశాలలో 9 గంటలకి ప్రారంభం అయింది. అమ్మ బిడ్డలందరు కూడా హెూమంలో పాల్గొన్నారు.
దసరాను తలపించే విధంగా విశేషంగా జనాలు గురుపూర్ణిమ సందర్భంగా అమ్మను మధ్యాహ్నం వరకు కూడా దర్శించుకుంటూ ఉన్నారు.
సాయంత్రం అమ్మచరిత్ర పారాయణ అనంతరం శ్రీహైమవతీ దేవి దగ్గర మహామంగళహారతి సమర్పణ చేసి, అర్చకులు శ్రీబుర్రా పవన్ కళ్యాణశర్మ చద్ది నైవేద్యం సమర్పించారు. వాత్స్యల్యాలయాన్ని దేదీప్యమానంగా జ్యోతులతో అలంకరించి స్వయంప్రకాశమానమూర్తి అమ్మకు నమశ్శతములను సమర్పించారు. అనంతరం ‘గురుపూర్ణిమ’ సందర్భంగా గం. 7ల నుండి శ్రీమతి పిల్లలమర్రి పద్మావతి గారు, సోదరీ సోదరులు అమ్మ భజన, అమ్మనామసంకీర్తన చేసి అమ్మకు హృదయ నీరాజనాలను సమర్పించారు.
అనంతరం అమ్మ ప్రసాదం రవ్వకేసరి-పల్లీల ప్రసాదం అందరూ స్వీకరించారు.