మన కాలమానం ప్రకారం శ్రావణ భాద్రపదాలు వర్షర్తువు.
వానలు బాగా కురిసి, నదులు, కాలువలు, చెరువులు పుష్కలంగా నీటితో నిండి ఉండే కాలం. తాగునీటికీ సాగునీటికీ లోటు లేకుండా ప్రజలందరూ సుఖజీవనం సాగించటానికి దోహదంచేసే కాలం, భూమి సస్య శ్యామలమై ఆహార సమృద్ధిని అందించేందుకు అనువైన కాలం. ఇది సంవత్సర కాలపరిమితిలో జరిగే శుభ పరిణామం.
పంచాంగంలోనే కాక, మన జీవితంలో కూడ శ్రావణ భాద్రపదాలు వచ్చినప్పుడే మనకు అది శుభ పరిణామం. అందులోనూ ముందు శ్రావణం. ఆ తరువాత భాద్రపదం.
శ్రావణం అంటే శ్రవణం చేసే సమయం. పెద్దల మాటలు, అనుభవజ్ఞులైన వారి ఆలోచనలు, మన శ్రేయస్సు కోరేవారు చేసే హిత బోధలు మనం వినాలి. వినటం అంటే కేవలం చెవులతో వినటం కాదు. హృదయంతో స్వీకరించాలి. త్రికరణ శుద్ధిగా ఆచరించాలి.
మన పూర్వపుణ్యం పండి మనకు జిల్లెళ్ళమూడిలో అమ్మసన్నిధి లభించింది. ‘నేను ఏమి చెప్పినా నా అనుభవంలోనుంచే చెప్తున్నా’నని చెప్పిన అమ్మ మనకు ఎన్నో మంచిమాటలు (సూక్తులు) అనుగ్రహించింది.
మన జీవితం అన్ని విధాలా మెఱుగు దిద్దుకోవటానికి తగిన మార్గం ఆచరించి చూపించింది. ఆ మార్గాన్ని అనుసరించి, మనం మన జీవితాలను సార్థకం చేసుకోవటానికి అవసరమైన ఆణిముత్యాలవంటి ఎన్నో వాక్యాలు అమ్మ మనకు ప్రబోధించింది.
‘నీ కున్నది తృప్తిగా తిన’ మన్నది. ‘ఇతరులకు ఆదరంగా పెట్టుకో మన్నది. భగవంతుడు మన కిచ్చిన సంపదను తృప్తిగా అనుభవించాలి. తృప్తిలేనివాడు ఎవరితోనో పోల్చుకుని, ఇంకా ఇంకా సంపాదించాలనే ఆ(పో)రాటంలో అలసిపోతూ ఉంటాడు.
అందుకే, ‘ధనానికి నీ కంటే తక్కువ వారితోనూ గుణానికి నీ కంటె ఎక్కువవారితోనూ పోల్చుకోవాలి’ అని కూడా అమ్మ వివరించింది. తనకంటే పేదవారిని చూసి, వారికంటే మెరుగైన స్థితిలో నేనున్నానని గుర్తించి, సంతృప్తి చెందినవాడు హాయిగా సుఖంగా ఉంటాడు. అంతులేని శాంతి అతడి సొంత మవుతుంది. గుణగణాల విషయంలో తనకన్న మిన్న అయినవారిని ఆదర్శంగా ఎన్నుకొని తన ప్రవర్తనకు మెఱుగులు దిద్దుకోవటంవల్ల తనలో సౌజన్య సంస్కారాలు వికాసం పొంది, మనిషి అసలైన ఎదుగుదలను పొందుతాడు. అలా ఎదిగినవాడు ఇతరులకు ఆదరంగా పంచుతాడు. “పంచిపెట్టని కాడికి ఉండటం దేనికి?” అని మనను సూటిగా ప్రశ్నించింది. అమ్మ.
“నీ బిడ్డయందు ఏమి చూస్తున్నావో అందరియందూ దానినే చూడటం బ్రహ్మస్థితిని పొందటం” అని అమ్మ ఇచ్చిన వివరణ మన హృదయాలలో ప్రేమతో కూడిన ‘అద్వైత భావన’కు పునాది అవుతోంది.
‘కలిగిన వాడు నలిగినవాణ్ణి కనిపెట్టుకొని ఉండాల’న్న అమ్మసూక్తి సమాజంలో శాంతియుత సహజీవనానికి రాచబాట.
మనస్సు పరిపూర్ణతను పొందితే, ఆ మనస్సులో కూడని భావాలకు చోటుండదు. నిష్కల్మష ప్రేమకు ఆ హృదయం నిలయ మవుతుంది. వైకల్యం లేని ఆ మనస్సు కైవల్య దివ్యానుభూతిని పొందుతుంది. అందరికీ పంచటంలో కలిగే ఆనందానికీ సంతృప్తికీ ఏ సంపదలూ సాటి రావు.
“తృప్తే ముక్తి” అనీ, “వైకల్యం లేనిదే కైవల్య”మనీ అమ్మ ఇచ్చిన వివరణలు అంతరంగ శాంతి సూత్రాలు.
“కోరిక లేని స్థితే సన్యాసమ”నీ, “సంకల్పమే సంసార”మనీ అమ్మ ప్రబోధించిన సూక్తులు జీవన సార్ధక్యానికి సదుపాయాలు.
‘ఆశా అసంతృప్తుల కలయికే జీవితమనీ, ‘జీవితం అంటే సమస్యల తోరణం(సమస్యలతో రణం) అనీ జీవితంపట్ల స్పష్టమైన అవగాహనను కలిగిస్తోంది అమ్మ. ఈ మార్గంలో పయనించే వారిపై ద్వంద్వాలు ప్రభావం చూపించలేవు. అవి సహజమనీ అనివార్యమనీ వారు గుర్తిస్తారు. జీవనం ప్రశాంతంగా సాగటానికి దీనిని మించిన మార్గం లేదు కదా! అందుకే “ద్వంద్వాలు సహజం అని గుర్తించటమే మనశ్శాంతికి మార్గం” అని సూటిగా ప్రకటించింది అమ్మ.
గతాన్ని తవ్వుకుంటూ దుఃఖించటం కానీ భవితవ్యాన్ని ఊహించుకుంటూ కలలు కనటం కాని నిష్ప్రయోజనం. వర్తమానంలో మన కర్తవ్యాన్ని గుర్తించి, చిత్తశుద్ధితో ఆచరిస్తే, అంతా మంచే జరుగుతుంది. కదా! అందుకే “కర్తవ్యమే భగవంతుడు” అనీ “వర్తమానమే భగవంతుడు” అని చాటిచెప్తూ, మనను వర్తమానంలో కర్యవ్యంవైపు నడిపిస్తున్నాయి అమ్మమాటలు.
ఇలా మానవ జీవితం ప్రశాంతంగా సార్థకంగా సాగటానికి తగిన మార్గాన్ని ఎన్నో రీతులలో మనకు అనుగ్రహించింది అమ్మ. స్థాలీపులాక న్యాయంగా ముఖ్యమైన కొన్నింటిని మాత్రమే ఇక్కడ ప్రస్తావించు కుంటున్నాము. ఇలాంటి జీవన సత్యాలు అమ్మ ప్రబోధంలో కోకొల్లలు. వాటన్నింటినీ మనం శ్రవణం చేయాలి. అంటే అర్ధం చేసుకుని ఆచరించాలి- అన్నమాట.
ఇలా ‘శ్రవణం’ చేస్తే భద్రమైన అమ్మ పదాలు మనకు దర్శన మిస్తాయి. పదాలు అంటే పాదాలు కూడా. మనం ఒక పాదంపై ఆధారపడి, మరో పాదాన్ని ముందుకు సాగిస్తూ నడుస్తాం.
ధర్మమూ, ప్రేమ అమ్మ పాదాలు, ధర్మపూరితమైన ప్రేమ, ప్రేమతో కూడిన ధర్మాచరణ అమ్మ పాదాలు. అమ్మ మాటల ‘శ్రావణం’ (ఆచరణ) మనకు ‘భాద్రపదం’ ప్రసాదిస్తుంది. భద్రమైన అమ్మపాదాలను
అనుసరించమే అసలైన శరణాగతి. శ్రావణ భాద్రపదాలు మనతో ఉంటే మన జీవితం సస్య శ్యామలం, సార్థకం కదా! శ్రావణ భాద్రపదాలను అందుకుని మన బ్రతుకులు పండించుకుందాం.