“పలు గుడులను సందర్శించితిని, ప్రతి గుడిలో నిను దర్శించితిని,
నీ ఆకృతులను లెక్క పెడితిని, నా ఈ కృతులను మొదలు పెడితిని. “అమ్మా నే నిన్ను వీడ…..”.
నదీరా రచించిన ఈ గీతం అమ్మ భక్తులలో చాలా మందికి పరిచయమే. అయితే అమ్మ చెప్పినట్లు ఏ విషయమైనా మన అనుభవంలోకి వస్తే గాని దాని ప్రామాణికత మనకు సంపూర్ణంగా అర్ధం కాదు. ముందుగా నా అనుభవాలని మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను.
నేనూ మా శ్రీమతి ఒకసారి కంచి కామాక్షి గుడికి వెళ్ళాము. అక్కడ మాకెవరితోనూ పరిచయం లేదు. అమ్మ సన్నిధిలో చాలా మంది ఉన్నారు. ఒక కుటుంబం VIPs అనుకుంటా, వారిని మాత్రం మర్యాదగా తీసుకుని వెళ్లి గర్భగుడికి దగ్గరగా కూర్చోబెట్టారు. కొంత సమయం గడిచాక ప్రధాన అర్చకుడు ఈ కుటుంబంవారు ఇప్పుడు ప్రత్యేకంగా అమ్మ వారికి మహాభిషేకం, విశేష పూజ చేసుకొంటారు. అందుకు ఇప్పుడు తలుపులు వేసేస్తాము. మిగతా వారందరూ దయచేసి బయటకు వెళ్ళండి. కార్యక్రమం అయిన తర్వాత దర్శనాలు చేయిస్తాము అని announce చేశారు. మా దర్శనం అయిపోయింది కాబట్టి మేము కూడా బయటకు వెళ్ళడం మొదలుపెట్టాము. పది అడుగులు వేసామో లేదో ఆ అర్చకులు నా వెనుకనే వచ్చి “మీరు ఎందుకు వెళ్తున్నారు ? మీరు ఉండండి” అని అన్నారు. నేను “మేము ఆ కుటుంబలోని వారము కాము, అందుకే వెళ్తున్నాము” అని చెప్పాను. ఆయన ‘ఫరవాలేదు మీరు ఉండండి’ అని అన్నారు. ‘లేదండి వారెవరూ మమ్మల్ని పిలవలేదు, వద్దండి, నాకు చాలా ఇబ్బందికరంగా (embarrassing) ఉంటుంది’ అని చెప్పినా, ‘నేను చెబుతున్నాను కదా’ అంటూ నా భుజం మీద చేతిని వేసి లాగుతూ తీసుకుని వెళ్లి ఆ కుటుంబ సభ్యుల పక్కనే మా ఇద్దరిని కూర్చోపెట్టారు. ఇది అంతా గమనించిన వారు కూడా మమ్మల్ని సాదరంగా ఆహ్వానించారు. గంటన్నర సేపు అమ్మ వారికి అతి దగ్గరగా కూర్చొని ఆ విశేష కార్యక్రమం అంతా చూశాము. వారికి ఆ ప్రేరణ కలిగించిందెవరో ?
చాలా సంవత్సరాల క్రితం ఉదయపూర్ (రాజస్థాన్) కి దాదాపు 30 కి.మీ దూరంలో ఉన్న “ఏక్ లింగ్ జీ” అనే శివాలయం చూడటానికి వెళ్ళాను. ఈ దేవాలయం 8వ శతాబ్దంలో మేవాడ్ రాజ్య ప్రభువులు నిర్మించారు. వారికి ఇక్కడ నెలకొన్న ఈశ్వరుడు కులదైవం. పైగా ఆయనే తమ రాజ్యానికి అధిపతి అనే భావనతో ప్రతి రోజూ ప్రతి విషయాన్నీ స్వామికి విన్నవించేవారట. ముఖ్యమైన నిర్ణయాలకు స్వామి వారిని అర్చించి ఆయన అనుమతి, ఆశీర్వాదం తీసుకున్నట్లుగా భావించి ముందుకు వెళ్ళేవారట. ఇంకొక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామి వారి ప్రతిరూపమైన (replica) శివలింగాన్ని తమ తలపై (తలపాగా కింద కానీ, కిరీటం కింద కానీ పెట్టుకుని రాజుగారు సింహాసనంపై కూర్చొని రాజ్యకలాపాలు నిర్వహించేవారుట.
నేను అక్కడకు చేరేసరికి మధ్యాహ్నం దాదాపు ఒంటి గంట అయింది. పొద్దున్న అతి తక్కువ breakfast తీసుకున్నందువల్ల చాలా ఆకలి వేస్తున్నది. ఏదైనా తిని తరువాత దర్శనం చేసుకొందామని చుట్టుప్రక్కల చూస్తే అక్కడ ఏమీ లేవు. అది చాలా కుగ్రామం (ఆ రోజున ఆ ఊరిని జిల్లెళ్ళమూడితో పోలిస్తే మనదే మహా పట్టణం!) ఎక్కడా హోటల్స్ లాంటివి ఏమీ లేవు. ఒక పాకలో పెద్దాయన మాత్రం టీ అమ్ముతున్నాడు. అప్పుడు అదే నా పాలిట అమృతం అయింది.
నా దర్శనం పూర్తి అయి బయలుదేరే సమయానికి వెనుక నుంచి ఎవరో పిలుస్తున్నట్లు అనిపించి వెనక్కి తిరిగి చూశాను. పూజారి గారు ఒక చేతిలో పెద్ద పళ్ళెం (దానిపై ఇత్తడి మూత) పట్టుకుని నన్ను ఉద్దేశించి “ఆగండి, ఆగండి” అన్నారు. నేను నిలబడి పోగా, ‘ఇటు నా దగ్గరకు రండి’ అని పిలిచారు. దగ్గరకు వెళ్ళగానే “మీరు ఇక్కడే (అది గర్భాలయం చుట్టూరా ఉన్న వరాండా) కింద కూర్చోండి” అన్నారు. నేను సంశయిస్తుంటే కూర్చోమని బలవంతం చేశారు. నేను అలా చేయగానే ఆయన ముందుకు ఒంగి ఆ పళ్ళెం మూత తీసి దానిలో ఉన్న విస్తరాకుని నా ముందు పరచి అందులో ఉన్న భోజన పదార్థాలు వడ్డించడం మొదలుపెట్టారు. నా ఆశ్చర్యానికి అంతులేదు. నేను మొహమాటంగా “ఎందుకండీ నాకు ఇవన్నీ, ఇంకెవరికైనా పంచండి” అన్నాను. ఆయన “యే షిప్ జీ కా భోగ్ హై. ఇస్కో ఆప్ కో దేనా ఉన్ కీ ఇచ్ఛా హై. ఆప్ నిస్సంకోచ్ సే ఖాయియే” (ఇది. శివుని మహానివేదన, ఇది మీకు ఇవ్వాలని ఆయన కోరిక, మీరు నిస్సందేహంగా తినండి) అని ఎంతో ఆప్యాయంగా తినిపించారు. నా అదృష్టానికి మురిసిపోతూ ఆ దేవదేవునికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ బయటకు నడిచాను. నా ఆకలి తీర్చే ఈ ప్రేరణ ఎవరిది ?
జనవరి 2023 నెలలో నేను శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్ళాను. మీకు తెలుసు కదా! లోపలకు వెళ్ళిన తర్వాత చెక్కతో చేసిన కొంచం ఎత్తైన ప్రదేశం వస్తుంది. అక్కడ నుంచి స్వామిని చూడడం మొదలు పెడతాం. నాకు కాటెరాక్ట్ ఉన్నందువల్ల స్వామి సరిగ్గా కనపడలేదు. నేను నా మనసులో “స్వామీ, మీ దర్శనానికి ఎంతో ఆశతో వచ్చాను. మీరు నాకు సరిగ్గా కనపడటం లేదు. మిమ్మల్ని దగ్గరగా చూడాలని ఉంది. నేను మీ దగ్గరగా రాలేను, నా పై దయ ఉంచి మీరే నా దగ్గరకు రండి. ఇలా అంటున్నందుకు నన్ను మన్నించండి.” అని మనసారా ప్రార్థించాను. క్యూ లో నడుస్తూ ఈ విషయాన్ని పూర్తిగా మరచిపోయాను. మెల్లిగా జయ విజయుల దగ్గరకు వచ్చేసరికి స్వామివారు చాలా చాలా స్పష్టంగా కనిపించారు. ఎలా జరిగింది అంటే మనం కంప్యూటర్ లో ఏదైనా picture ని zoom చేస్తే ఎలా ఒక్క సారిగా మన ముందుకి వస్తుందో అలా స్వామి వారి విగ్రహం నా ముందుకు వచ్చింది. అప్పటి నా ఆనందం వర్ణించడానికి నా దగ్గర భాషలేదు. స్వామి నా ఆర్తిని గ్రహించి ఇంత అద్భుత దర్శనం ప్రసాదించటానికి కారణం ఏమిటి?
కామాక్షి దేవి అద్భుతమైన దర్శనానికి కానీ, ఏక్ లింగ్ జీ నా ఆకలిని తీర్చడం కానీ, వెంకటేశ్వరులు నా దగ్గరగా వచ్చి దర్శనం ఇవ్వడం కానీ “ప్రేరణే దైవం” అన్న అమ్మ చేతలే కానీ మరొక్కటి కానేకాదని ఢంకా బజాయించి చెప్పగలను.
ఈ విషయాలు మీకు తెలియజేయడంలో ముఖ్య ఉద్దేశ్యం అమ్మని కొలిచేవారికి ఏ గుడికి వెళ్లినా ఆ యా దేవీదేవతల పరిపూర్ణ కటాక్షం అమ్మవల్లనే. అన్నమయ్య అన్నట్లు “హరి అవతారములే అఖిల దేవతలు….” మనకు హరి అన్నా అమ్మ అన్నా ఒకరే గదా!
అందువలన ఎవరిని కొలిచినా అమ్మను కొలిచినట్టే.
+++