“దైవం పంపిన మనిషి దైవం యిష్టం ప్రకారం దైవంలోకి పోతే మధ్యలో మనకు ఏడుపెందుకు?” అన్న అమ్మ తాత్త్విక చింతనలతోనూ, “నేను ముందు పడ్డాను. మీరు వెనుక పడ్డారు. ముందు నేను పడ్డాను, నా వెనుక మీరు పడ్డారు. నేను చిన్నమ్మాయిని ముందు పడ్డాను. పెద్దవారంతా నా వెంట పడ్డారు” అన్న అమ్మ వాగ్విలాసాలతోనూ; అనుక్షణమూ అణువణువూ పులకించిపోయిన చిదంబరరావుగారు అమ్మలోని అతిమానవత్వాన్నే సంభావించ గలిగారు, అప్పటి నుండీ పండితులూ, పామరులూ అమ్మ వాగ్వైభవానికీ అందులోని అర్థ గాంభీర్యానికీ, జ్ఞానరోచిస్సులకూ నమోవాకాలర్పిస్తూనే ఉన్నారు.
ఒకసారి పాలకొల్లు గవర్నమెంటు కాలేజీ ప్రాచార్యులయిన శ్రీ శివశంకర నారాయణగారు అమ్మను దర్శించి అనేక తాత్త్వికాంశాలపై అమ్మతో ప్రసంగిస్తూ “దేవుడికీ మానవుడికీ గల భేదం ఏమిటీ?” అని ప్రశ్నించారు. అమ్మ వెంటనే “భావం” అన్నది. ఆ సమాధానంలోని అమ్మ అసమానప్రజ్ఞ వారిని ఎంతగా ఆకర్షించిందో, ఎంతగా ఆనందపరిచిందో!
అమ్మసన్నిధిలో గడిపే ప్రతిక్షణంలోనూ సోదరులు శ్రీపాద గోపాలకృష్ణమూర్తి గారు అమ్మనోటినుండి. వెలువడే ప్రతి అక్షరానికీ ఎంతగానో పరవశించిపోతారు! కనుకనే ఆ వాక్యాల సేకరణమూ, సంకలనమూ, ప్రచురణమూ ప్రచారమూ వారి జీవితధ్యేయమూ, తపస్సూ అయింది.
అందుకనే ఒక మాతృశ్రీ అధ్యయన పరిషత్ సమావేశంలో మేథా సంపన్నులు శ్రీ వీరమాచనేని. ప్రసాదరావుగారు “అమ్మను సందర్శించడమే భక్తి. అమ్మతో సంభాషించడమే జ్ఞానం” అని అతిరమణీయంగా అభివర్ణించారు.
అమ్మే స్వయంగా అమ్మమ్మతో “తోలునోరు కాదు కదా తాలుమాట రావటానికి” అని తనను గురించి తాను ప్రకటించుకున్నప్పుడు, అమ్మమ్మ తన పసిబిడ్డ జిలిబిలిమాటలలోని తియ్యదనానికి మాత్రమే మురిసిపోయింది.