అమ్మ దగ్గర ఏది జరిగినా విచిత్రంగానూ ప్రత్యేకంగానే జరుగుతుంది. అయితే అది సహజంగా ఏ అట్టహాసము ఆడంబరము లేకుండా జరుగుతుంది. లక్షమందికి ఒకే పంక్తిన భోజనం పెట్టినా అంతే లక్షమంది బిడ్డలకు లక్ష ఉయ్యాలలు వేసి, అందులో వారిని పడుకోబెట్టి, ఊపాలనుకున్నా అంతే. అక్కడ మహాద్భుతాలు అనితర సాధ్యాలు కూడా అతి సహజంగా జరుగతవి, కాకపోతే అమ్మ ఆలోచన అమలుకు కాస్తముందూ వెనుకా. అదీ మన చర్మచక్షువులతో చూడటానికి, కాలాతీత అయిన అమ్మకు మాత్రం అంతా వర్తమానమే, అమ్మ దానిని చూస్తున్నాననే అంటుంది.
లోకంలో దేవాలయంలో దేవతలకు దేవుళ్ళకు అభిషేకాలు చేస్తుంటారు. కుంభాభిషేకాలు చేస్తుంటారు, సహస్ర ఘటాభిషేకాలు చేస్తుంటారు. అమ్మను శివుడు పార్వతిగా భావించి ఇలా అభిషేకాలు ఎంతోమంది చేసుకున్నారు. ఒకసారి ఒక శివరాత్రినాడు విజయలక్ష్మి కార్తికేయప్రసాద్ దంపతులు అమ్మకు సహస్ర ఘటాభిషేకం చేసుకున్నారు. పేరు వారిదే కాని అమ్మ పాదాలపై అందరం అభిషేకం చేసుకున్నాం. ఆ రోజు ఎండలు మండుతున్నవి. వర్షాలు లేక జనం నానా బాధలు పడుతున్నారు. అభిషేకం పూర్తికావస్తుండగానే ఆకాశం మేఘావృతమై చినుకులు ప్రారంభమై కుండపోత వర్షం కురిసింది. మా ఆనందానికి అవధులు లేవు. అమ్మ కరుణారసవృష్టిలో తడిసిపోయాం అందరం.
అలాగే ఒక తొలి ఏకాదశినాడు అమ్మకు పాలతో అభిషేకం చేసుకుందామని సోదరుడు శిఖాకొల్లి వెంకటేశ్వర్లు భావించాడు. అలా చేసుకుంటున్నాడు కూడా, అందులోనూ అందరూ పాల్గొంటున్నారు. జిల్లెళ్ళమూడి నివాసి అయిన వెంకాయమ్మ కాగుతూ మరుగుతూ ఉన్న పాలు తెచ్చి అమ్మ పాదాలపై పోసి అభిషేకం చేసుకొన్నది. అమ్మ పాదాలు కమిలిపోయినా అమ్మలో ఏ వికారము లేదు. అమ్మకు పంచభూతాలపై ఉన్న అధికారము మమకారము అది.
దేవతలకు మామూలుగా పంచామృతాలతో స్నానం చేయించటం చూస్తుంటాం అభిషేకాలలో, అప్పుడు వాళ్ళు పంచామృతాలుగా భావించేవి నీరు, పాలు, పంచదార, నీళ్ళు, తేనె, ఫలోదకం (కొబ్బరికాయ నీరు). ఇవి సహజంగా మనచే చేయిస్తున్న పంచామృతాలు. కాని అమ్మ “పంచామృతాలు అంటే ఒకే అమృతం అయిదుగా పంచబడ్డది” అని చెప్పింది. అమ్మ చెప్పిన అయిదూ పాలు, పెరుగు, మీగడ, వెన్న, నెయ్యి, ఈ అయిదింటితో అభిషేకం చెయ్యాలి. మిగతావి మీరెన్నన్నా చెయ్యండి. పంచామృతాలంటే ఇవే. ఈ పైవాటికి అంటూ, మైలా లేవు. ఎవరింట్లోనైనా, ఎవరి చేతివైనా తాకవచ్చు, త్రాగవచ్చు. పూర్వం మన ఇళ్ళలో పాలనూ, మజ్జిగను అమృతం అని కూడా వాడుతుండేవారు.
జలాభిషేక, క్షీరాభిషేక, ఫలరసాభిషేకాలతో పాటు అన్నాభిషేకం కూడా కొన్ని దేవాలయాలలో జరుగుతున్నది, చూశాం. అమ్మ అన్నపూర్ణగా జగత్ప్రసిద్ధి చెందింది. మరి అమ్మకు అన్నం నివేదన ఇవ్వటం జరుగుతున్నది. గాని అన్నంతో అభిషేకం చేసినట్లు వినలేదు. జరుగుతుందేమో చూడాలి ముందు ముందు. అయితే అమ్మకు తన అభిషేకం చేయించుకోవటం కన్నా మన కదుపులు నింపటం ఇష్టం. తన నిరంతర తపన అదే.
ఇంతకూ ఎక్కడా ఏ దేవాలయాలలోనూ ధాన్యాభిషేకం జరిగినట్లు చూడలేదు వినలేదు. అదే జిల్లెళ్ళమూడి ప్రత్యేకత. కల్యాణ తలంబ్రాలకు కొన్ని బియ్యం అమ్మ పాదాలపై పోసి వాటికి పసుపు కలిపి వివాహంలో తలంబ్రాలుగా ఆ దంపతులకు పంపటం జిల్లెళ్ళమూడిలో కొంతకాలంగా ఆచారంగా ఉన్నది. అవి అమ్మ ఆశీరక్షతలుగా భావించి స్వీకరించి ఉపయోగించి తరిస్తున్నారు. జిల్లెళ్ళమూడికి వచ్చే సోదర సోదరీమణులంతా అన్నపూర్ణాలయంలో ప్రసాదం తీసుకోవటం మహద్భాగ్యంగా భావిస్తారు. అది అమ్మ గుండెగా లోకంలో ప్రతీతి. ఆ అన్నపూర్ణాలయం సర్వకాల సర్వావస్థలలోనూ నిర్వహింపబడాలని, జగన్నాధ రధచక్రాల్లాగా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల్లాగా ఆగకుండా జరగాలని అమ్మ ఆకాంక్షించింది. ఆరంభించింది. ఆశీర్వదించింది. ఆ రకంగా అమ్మ తనకు సేవచేసుకొనే అవకాశం మనకు కల్పించింది. అన్నపూర్ణాలయానికి సేవచేస్తే అమ్మకు సేవచేసినట్లే. అమ్మకు చాలా సంతోషాన్నీ మనకు తృప్తినీ కలిగించే పని అది.
అమ్మ అందుకే కొందరు సోదరులకు రెండు సంవత్సరాల క్రితం ఒక ఆలోచన ఇచ్చింది. అమ్మకు అత్యంత ప్రీతిపాత్రమైన ఈ అన్నపూర్ణాలయం (భోజనం) ప్రసాదం తీసుకున్న వారి రోగాలు నయమైనట్లు తార్కాణాలున్నాయి. అటువంటి అన్నపూర్ణాలయంలో ఉపయోగించే ధాన్యం అమ్మకు అభిషేకం చేసిన వైతే వాటికి పవిత్రత, తేజస్సు, శక్తి, అమృతత్వము ఇబ్బడి ముబ్బడిగా చేకూరుతుందని భావించారు. అది సర్వజనామోదమై ఆనందోత్సాహాలు వెల్లి విరిశాయి. మేము మేమంటూ ముందుకు వచ్చారు. ఒక్కొక్క కుటుంబం అమ్మను నాన్నగారిని బస్తా బియ్యంతో అభిషేకించుకున్నారు. ఆ బియ్యపు రాసి ధాన్యపు రాసులలో నుండి అమ్మ నాన్నగారు తొంగి తొంగి చూస్తుంటే ఆ కరుణామయ ఆనందరస ప్రపూర్ణ దృక్కులతో మనలను ఆశీర్వదిస్తుంటే నిజంగా ఆ అనుభూతి అనుభవించిన వారికే అవగతం. ఇది ప్రతి సంవత్సరం ఇలా జరిగితే బాగుంటుందని అందరూ తమ ఇష్టాన్ని, అభీష్టాన్ని పలికారు. ఆ రకంగా అమ్మ మనకు ధాన్యాభిషేకం చేసుకొనే అవకాశాన్ని, ఇంకా ఏ దేవాలయాలోనూ జరుగని విశిష్టమూ, వినూత్నమూ, విశ్వజనోపయోగకరము అయిన ఒక అవకాశాన్ని మనకు ప్రసాదించింది. మరి దానిలో పాల్గొనటానికి మనం ముందుకు దూకుదాం. అమ్మకు ఆనందం కలిగించే ఆ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములమవుదాం. అమ్మ ఆశీర్వాదాన్ని పొందుదాం. భగవంతుడి కిచ్చిందేదైనా పదింతలుగా మనకు తిరిగి భగవంతుడిస్తాడట. రండి, పాల్గొనండి, తరించండి.
- (డిసెంబరు 1989 ‘విశ్వజనని’ సంపాదకీయం)