ఒకరోజు ఉదయం పదకొండు గంటలకు అమ్మ దర్శనానికి ఒక సోదరుడు వచ్చి కొన్ని అరటిపండ్లు అమ్మకు సమర్పించి నమస్కరించి, కాస్సేపు మాటాడి వెళ్తుంటే, అమ్మ అతడికి బొట్టు పెట్టి, ప్రసాదం ఇచ్చి పంపించింది.
మరొక్క పదిహేను ఇరవై నిమిషాల తర్వాత మరో సోదరుడు వచ్చి అమ్మకు రెండు ఆపిల్ పండ్లని క్రింద ఉన్న పళ్ళెంలో పెట్టబోయాడు. అమ్మ తన చేతులు చాచి ఆప్యాయంగా అందుకున్నది. వాటిని తన ప్రక్కనే పెట్టుకున్నది. కాసేపు మాటాడి అతడు వెళ్తుంటే, అతడికీ బొట్టు పెట్టి, ప్రసాదం ఇచ్చి పంపించింది.
తరువాత తన ప్రక్కన పెట్టుకొన్న ఆపిల్ పండ్లను తన చేతుల్లోకి తీసుకొన్నది. కొంతసేపు అలా ఉంచుకొని వాటిని ఒక చేతిలోంచి ఇంకొక చేతిలోకి తారుమారు చేస్తూ అరచేతులతో అప్యాయంగా వాటిని నిమురుతూ కాస్సేపు గడిపింది.
ఇదంతా చూస్తున్న రామకృష్ణ అన్నయ్య. “ఏమిటమ్మా ! ఆ పండ్లు అంత బాగున్నాయా? వదల్లేకుండా ఉన్నావు” అని అడిగాడు.
కొన్ని క్షణాల మౌనం తరువాత, “నాన్నా! మొదట వచ్చినవాడు చాలా ధనవంతుడు. అయినా అరటి పళ్ళే తెచ్చాడు. రెండవసారి వచ్చినవాడు చాలా పేదవాడు. తన దగ్గర ఉన్నదాంట్లో తిరుగు ప్రయాణానికి మాత్రం డబ్బులు ఉంచుకొని మిగిలిన మొత్తంతో నేను తినాలని ఈ రెండు ఆపిల్ పండ్లు తెచ్చాడు” అని ముగించింది.
ఈ సంఘటన చూసిన తరువాత నాకు అర్థం అయినది ఏమిటంటే –
1) మన గురించి, మన స్థితిగతుల గురించి సర్వం అమ్మకు ఎల్లప్పుడూ తెలుస్తూనే ఉంటాయి.
2) అమ్మకు మనం ఏదైనా ఎంత ప్రేమతో ఎంత భక్తితో ఇచ్చామన్నదే ముఖ్యం కానీ ఏమి ఇచ్చామన్నది కాదు.
నేను జిల్లెళ్ళమూడిలో ఉన్నప్పుడు ఆవరణలో ఎవరైనా కొత్తవాళ్ళు కనపడితే వారిని పలకరించి వారు ఆసక్తి కనబరిస్తే అమ్మను గురించి, జిల్లెళ్ళమూడి గురించి చెప్పడం నాకు అలవాటు.
ఇలాగే ఒకసారి ఒక వ్యక్తితో పరిచయం చేసుకోగానే ఆయన అమ్మ ఎంత దయగలదో, ఎంత ప్రేమగలదో పొంగిపోతూ చెప్పారు. ‘మీకు ఇలా అనిపించడానికి కారణం ఏమిటి?’ అని అడగ్గా ఆయన ఇలా చెప్పారు-
“నేను అమ్మను గురించి విన్నాను కానీ జిల్లెళ్ళమూడికి రావడం ఇదే మొదటిసారి. ప్రయాణంలో కొన్ని అడ్డంకులు కారణంగా బాపట్ల మీదుగా ఏడవ మైలునుండి నడచుకుంటూ ఇక్కడికి చేరుకొనేసరికి రాత్రి పదిన్నర దాటింది. పొద్దున్నే అమ్మను చూసి వెంటనే వెనక్కి వెళ్ళి పోదామనే ఉద్దేశ్యంతో వెంట ఏ సామాను. తెచ్చుకోలేదు. అందరూ నిద్రపోతున్నట్టున్నారు ఆవరణలో ఎవరూ కనపడలేదు. మేడపై ఎవరైనా కనపడతారేమోనని పైదాకా వెళ్ళాను. అయినా ఎవరూ కనిపించలేదు. నాకు జ్వరంతో ఒళ్ళు కాలిపోతోంది. ఆరుబయట పడుకోవడం ఇష్టం లేక పైకప్పుతో ఉన్న ఒక వరండాలో పడుకున్నాను. (ఆయన చెప్పినదానినిబట్టి ఈ స్థలం అమ్మ గదికి ఎదురుగా ఉన్న వరండా అని నాకు అర్ధం అయింది).
జ్వరం ఎక్కువగా ఉండటం వల్ల చలిగా ఉంది. కప్పుకొనేందుకు నా దగ్గర ఏమీ లేదు. అలాగే కటికనేలమీద పడుకొని నాలో నేను “ఏమిటో! అమ్మ చాలా ప్రేమకలది, దయామయి అంటారు; ఆకలితో, జ్వరంతో పడుకొన్నాను. ఎవరినైనా పంపించి నాకు సహాయం చేయవచ్చు కదా, ఏమీ చేయలేదే!” అని అనుకుంటూ పడుకున్నాను. ఎప్పుడు నిద్రపట్టిందో తెలియదు. నడిరాత్రి మెలకువ వచ్చి చూద్దును కదా నా ఒంటిపై దుప్పటి కప్పబడి ఉంది. ఎవరైనా ఉన్నారేమో అని చుట్టూ చూశాను. ఎవరూ ఇంకా లేపలేదు. ఇంకా తెల్లవారలేదు.
నా ఒంటిని తడిమి చూసుకొంటే జ్వరం లేదు. ఇది తప్పకుండా అమ్మ పనే అని అర్ధం చేసుకొని అమ్మను ఎంత తప్పుగా భావించానో అని మనసులోనే నన్ను క్షమించమని కోరాను. ఇప్పుడే అమ్మ దర్శనం చేసుకుని వస్తున్నాను” అంటూ తాను కట్టుకున్న పంచె, వేసుకున్న కండువా చూపిస్తూ “ఇదిగో ఇవి అమ్మ నాకు ఇవాళ పొద్దున్నే ఇచ్చింది. ఏమని చెప్పను? అమ్మ ప్రేమను గురించి….” అని కన్నీళ్లతో చెప్పాడు.
ఇది విన్న నాకు కూడా కన్నులు చెమర్చాయి.
సర్వజ్ఞ, సాంద్ర కరుణ అయిన అమ్మకు సాగిలపడి మొక్కాను.
జయహో మాతా