“నాకు అడ్డుగోడలు లేవు” – అమ్మ
అమ్మ అవతారమూర్తి అని మనందరి ప్రగాఢ విశ్వాసం. అవతార లక్షణం ప్రకారం అమ్మలో లలితా తత్త్వమూ ఉంటుంది, మానవ రూపాన్ని ధరించి దిగివచ్చిన కారణంగా మానవ (ఉపాధి) లక్షణమూ కనిపిస్తుంది. మనపట్ల అమ్మ కురిపించే వాత్సల్యవర్షంలో తడిసి, తన్మయులమై అమ్మను దేవతామూర్తిగా గుర్తించే విషయంలో మనం ఏమరుపాటు చెందుతాం. అమ్మే కదా! మన అమ్మే కదా! ప్రేమించటం, కరుణించటం, క్షమించటం తప్ప మరేమీ తెలియని ప్రేమమూర్తికదా! అనుకుంటాము మనం. “తల్లికి తప్పే కనిపించదు” అనే అమ్మ వాక్యాన్ని ఆసరాగా తీసుకొని, అమ్మప్రేమను భరోసాగా చేసుకొని, నిశ్చింతగా గడిపేస్తూ ఉంటాము.
అంతవరకూ బాగానే ఉన్నది. కాని, ఆ భరోసా మన కర్తవ్యం పట్ల నిర్లక్ష్యంగా, మన ప్రవర్తనపట్ల అశ్రద్ధగా మారి, మనం ఏవో తప్పులు చేస్తూ ఉంటాము. తెలియక కొన్ని, తెలిసి ఎన్నో తప్పులు చేసేస్తూ ఉంటాము. ఇది తప్పు అనికాని, దిద్దుకుండామని కానీ ఆలోచనే మనకు రాదు. ఈ తప్పుచేసి, సాటివారిని బాధిస్తే, అమ్మ ఆమోదిస్తుందా? అన్న స్పృహే మన మనస్సులోకి రాదు. అమ్మకు నిజమైన వారసులమై, అమ్మ ప్రేమకు ప్రతినిధులమై మెలగవలసిన మనం ఆ సత్యాన్ని విస్మరిస్తూ ఉంటాము.
అమ్మ దేవతామూర్తి అనే స్ఫురణ కలిగితే, తరచుగా పూజలూ వ్రతాలూ అభిషేకాలూ హోమాలూ పారాయణలూ వంటివి చేసి, ముచ్చటపడుతూ ఉంటాము. అయితే, అంతటితో అమ్మకు సంతృప్తి కలుగుతుందా?
ప్రేమపూర్వకమైన ధర్మాచరణ వల్ల మాత్రమే మన పూజలు అమ్మకు చేరుతాయని, మనం ఎక్కడ ఉన్నా ఏమి చేస్తున్నా, అమ్మకు తెలిసి తీరుతుందనీ మనం మరువరాదు.
భక్తిని ప్రవర్తనగా మలచుకొని, సమాజంలో శాంతియుత సహజీవన వైభవం సిద్దించటానికి అమ్మబిడ్డలుగా మనవంతు సమర్పణం మన సత్ప్రవర్తనమే కదా!
అందుకు ప్రేరణ కలిగించే అమ్మవాక్యం “నాకు అడ్డుగోడలు లేవు”.
ఎంతో ప్రేమతో మనను సంస్కరించటానికి అమ్మ మనకు ప్రసాదించిన ఒక దివ్యవరం ఈ “హెచ్చరిక”.