‘సంభవామి యుగే యుగే’ అని పరమాత్మ వేరు వేరు రూపాలతో వేరు వేరు ప్రదేశాలలో వేరు వేరు కాలాలలో అవతరిస్తానని చెప్పడం జరిగింది.
‘పుట్టువు లేని నీకభవ! పుట్టుట క్రీడయకాక’ అన్నట్లుగా నామరూపాదులతో నిమిత్తం లేని ఆ పరమాత్మ నామరూపాలు ధరించి మానవుల మధ్య సంచరించడం ఒక లీల.
“సరసింబాసిన వేయి కాలువల యోజన్ విష్ణునందైన శ్రీకర నానా ప్రకటావతారము లసంఖ్యాకములు’ అని భాగవత ప్రవచనం. పుట్టుకే లేని పరమాత్మ పరిమిత రూపాన్ని ధరించి పుట్టినట్లుగా కనిపించడమే అవకారం.
మరి అవతారమూర్తిగా అందరిచే ఆరాధింపబడుతున్న అమ్మ నేను అవతారాన్ని కాదు అని చెప్తోంది. అమ్మ బాల్యంలో అమ్మ చినతాతగారు చిదంబరరావుగారు ‘నీవెందుకు వచ్చావో, నీ అవతారమేమిటో చెప్పమ్మా!’ అని అంటే “నాది అవతారమని ఎవరు చెప్పారు. నేనేదీ పెట్టుకుని రాలేదు. సృష్టి ఏ ఉద్దేశంతో జరుగుతున్నదో….?” అని అర్ధోక్తిలో అపి వేసింది.
‘అమ్మా! మీరు సాక్షాత్తూ రాజరాజేశ్వరి కదా! అని ఒకరు అడిగితే ‘ఇన్ని పేర్లెందుకు నాన్నా! అమ్మను అనుకుంటే చాలదూ! అంటూ తాను ఏ అవతారమూ కాదనీ, భక్తులు ఎవరూ లేరని, నేను గురువును కాను మీరు శిష్యులు కారు’, ‘నేను అమ్మను, మీరు బిడ్డలు’ అని చెప్పింది. ఈ వాక్యాలు వినగానే అమ్మ తాను దైవాన్ని కాననీ, గురువును కాననీ, ఏ అవతారాన్నీ కాననీ చెప్పినట్లుగా అనిపిస్తుంది. అమ్మవాక్యాలు కొన్ని వినగానే నిషేధంలాగా అనిపిస్తాయి. అంతర్యాన్ని పరిశీలిస్తే నిషేధంకాదని ప్రధానాంశాన్ని ప్రస్తుతించడానికి నిషేధ వాక్యం భూమికగా ఉపకరిస్తుందని తెలుస్తుంది.
ఇక్కడ ‘మరుగే నా విధానం’ అన్న అమ్మ నేను అవతారాన్ని కాదనడంలో ఒక రహస్యం దాగి ఉంది. ఇంతకు మునుపు యుగాలలో పరమాత్మ అవతరించడంలో ఒక కారణం కనిపిస్తుంది. దేవతలు, మహర్షులు భూలోకంలో ఉన్న బాధలన్నీ ఆ పరమాత్మతో మొరపెట్టుకుంటే ఆ వైకుంఠవాసుడు భూమిపైకి రావాలని సంకల్పించటం జరిగింది. కానీ ‘అడగకుండా పెట్టేదే అమ్మ’ కాబట్టి ఎవరూ ప్రార్థించకుండానే లోకంతీరును అవసరాన్ని గమనించి లుప్తమై పోతున్న ప్రేమతత్త్వాన్ని, మానవత్వాన్ని పునరుద్దరించడం కోసం తనకు తానుగా నిర్ణయించుకుని మాతృప్రేమకు మానవాకృతిగా అవతరించింది అమ్మ. తల్లి మనసు అడిగేదాక అగలేదు. బిడ్డ అడగకుండానే ఆకలి గమనించి అన్నం పెడుతుంది. అన్ని అవసరాలను తీరుస్తుంది. అలాగే ఎవరూ కోరకుండానే ‘ఈ సృష్టి అనాది, నాది, ఎవరిదో కాదు నాదే’ అని ప్రకటించి సృష్టి ధర్మం నెరవేర్చడం కోసం సృష్టే తానైన అమ్మ స్వయంగా అవిర్భవించింది.
అమ్మ దగ్గరకు ఎందరో భక్తులు వస్తూ ఉండేవారు, సోదరులు గోవిదరాజు దత్తాత్రేయులు గారు వచ్చినపుడు ‘నిన్ను మంగళగిరిలో బాలాంబగారి సత్రంలో వడ్డన చేస్తుంటే చూశాను నాన్నా!’ అన్నది అమ్మ. ఆయన ఆశ్చర్య పోయారు. ఆయన మంగళగిరి వెళ్ళిన కాలానికి అమ్మ జన్మించలేదు. మరి అమ్మకు ఎలా తెలిసింది అంటే అమ్మ ఎపుడూ ఉన్నది. అందుకే ‘అనంతమ్మను నేను అనీ’, ‘అమ్మ అంటే అంతులేనిదీ, అడ్డులేనిదీ, అన్నింటికీ అధారమయినదీ అది అంతము లేనిదే అమ్మ’ అని నిర్వచించింది. అంతటా ఎపుడూ ఉన్న ఆశక్తే రుధిరోద్గారి చైత్ర శుద్ధ ఏకాదశినాడు 1923 మార్చి 28వ తేది మన్నవ సీతాపతిశర్మ రంగమ్మగార్ల పుణ్యగర్భాన ఈ రూపంగా వ్యక్తమయింది.
‘నేను ఏదీ పెట్టుకుని రాలేదు. తల్లి ధర్మం నెరవేర్చడం కోసం వచ్చాను. ఈ రూపం అలాంటిది. ఈ స్థానం అలాంటిది. కనుక నాకు ఎవరిని చూసినా బిడ్డే అనిపిస్తోంది’ అని తన అవతార పరమార్థాన్ని తెలియజేసింది.
ఇది కలియుగం. మనిషితో మనిషి కలిసి ఉండడం గురించి కాక విడిపోవడం ఎలా అని అలోచిస్తున్న కాలం, ‘సమాజంలోనే కాదు. ఒకే ఇంటిలో కూడ మనిషికీ మనిషికీ మధ్య ఎన్నో అంతరాలు, అడ్డుగోడలు. మానవ సంబంధాలు అదృశ్యమై స్వార్థమే పరమార్థంగా నడుస్తున్న నేటి పరిస్థితులలో మార్పురావాలంటే ప్రతి వ్యక్తీ మానవత్వం పరిమళించిన మంచి మనిషిగా రూపుదిద్దుకోవాలి. మానవత్వం ఆచరణలోకి రావాలంటే దానికి నేపథ్యంగా ప్రేమ ఉండాలి. కల్తీయుగమైన ఈ కలియుగంలో కల్తీలేనిది ఒక తల్లిప్రేమ మాత్రమే. అందుకే అమ్మ ఆ మాతృప్రేమనే దివ్యోపకరణంగా ఎంచుకున్నది. సాటి మనిషిని బిడ్డగా భావించి ప్రేమించి అదరించడం మాతృతత్త్వం. మాతృతత్త్వానికి స్త్రీ పురుష భేదం లేదు. ఈ తత్త్వాన్ని అలవరచుకుని సర్వజీవులను బిడ్డలుగా చూడమనీ, ప్రేమించమనీ అమ్మ ప్రబోధం. అందుకే అమ్మ ఏం చెప్పినా మాతృప్రేమను మిళితం చేసి చెప్పింది. అమ్మగా అవతరించడంలోని అంతర్యం ఇదే.
అంతేకాదు ‘తరింప చేసేది తల్లి’ అన్న అమ్మ మనలను తరింపచేయడానికే మన మధ్యకు వచ్చింది. అ మాతృప్రేమతోనే ‘అందరికీ సుగతే’ అంటూ ‘ఈనాడు అందరికీ సుగతి’ అంటున్నాను అంటే మీదేం లేదు కనుక ఎపుడూ మీదేం లేదు, మీరు బురద పూసుకున్నా దాన్ని కడిగి శుభ్రపరచవలసిన బాధ్యతనాది. దానికి మాతృత్వం కావలసి వచ్చింది” అని ప్రకటించింది.
దుష్ట సంస్కారమున్న వాళ్ల తరింపు ఎలా అమ్మా! అంటే “అ బాధ్యత తల్లిదేగా! వాడు ఎలా ప్రవర్తించినా ఆ బాధ్యత తనది అనుకుంటున్నపుడు వాడిదేమీ లేదు. ఎవరినైనా తరింప చేస్తుంది” అంటూ బిడ్డలందరికీ అమ్మ ఎంత హామీ ఇచ్చిందో కదా! అందుకే అమ్మది కనీ వినీ ఎరుగని విశేష అవతారం,
అమ్మకు గురువుల వద్ద శిక్షణ లేదు. తపస్సు లేదు. సాధన లేదు, జీవితమే తపస్సుగా కల్గిన అమ్మ ఆధ్యాత్మిక శిఖరాగ్రాన జ్ఞానమే తానుగా స్వయం వ్యక్త అయింది. జ్ఞానానికి మరో రూపం ప్రేమే కదా! ‘నా జీవితమే సందేశం’ అని చెప్పిన అమ్మ తన మహత్తర ప్రబోధాన్ని ప్రేమ స్వరూపంగా మలచి సకల సృష్టికీ పంచి పెట్టింది.
అమ్మను దర్శించడం అంటే అమ్మతత్త్వాన్ని అర్ధం చేసుకోవడం. అమ్మ ప్రబోధాన్ని ఆవరణలోకి తెచ్చుకోవడం. అమ్మను ఆరాధించడం అంటే అమ్మ గుణాలను అలవరచుకుని అనుసరించడమే. సమస్త పూజలకు వరమార్ధం ఇదే. మన ప్రవర్తనలో పరిణామం కోసమే ‘నా జీవితమే సందేశం’ అన్నది అమ్మ “పరిపూర్ణ మానవత్వమే దైవత్వం” అంటూ మనం పరిపూర్ణ మానవులుగా రూపొందడానికి అవసరమైన విషయాలెన్నో అమ్మ మనకు అందించింది. జీవితాన్ని సార్ధకం చేసుకోవడానికి మనం తరించడానికి అనేక మార్గాలను ప్రబోధించింది. ఏ మార్గంలో ప్రయాణించినా మనం చేరుకోవలసిన గమ్యం విశ్వమానవ ప్రేమయ్. అమ్మ ఆవిర్భవించడంలోని అంతర్యం ఇదే అనిపిస్తుంది.