“అమ్మ” సంకల్పంతో, మనము వివిధ కేంద్రాలలో వివిధ నామాలతో సంస్థలను ఏర్పాటు చేసుకున్నాము. ఆయా కేంద్రాలలో, వార్షిక కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. కొన్ని కేంద్రాలలో కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహింప బడుచున్నవి. ఉదాహరణకు విశాఖపట్నంలో “అమ్మ” దేవాలయ నిర్వహణ కూడ నెలకొల్పుకోగలిగినారు. అదే దిశలో, మద్రాసు గుంటూరు కేంద్రాలు కూడ. “అమ్మ” మాతో ఒక సందర్భంలో, ప్రతి పండుగకు జిల్లెళ్ళమూడికి వచ్చే అవకాశం లేకపోతే, మీరు ఉన్న ప్రదేశాన్నే జిల్లెళ్ళమూడిగా మలుచుకోమన్నది.
జంటనగరాలలో కూడ “జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి” పేరున సంస్థను ఏర్పరచుకొని, కొన్ని కార్యక్రమాలను నిర్వర్తించుకుంటున్నాము. ముఖ్యంగా “అమ్మ కల్యాణోత్సవం” సమితి నిర్వర్తిస్తున్నది. కొంత మంది భక్తుల గృహాలలో కొన్ని కొన్ని కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. అందులో ముఖ్యంగా “హైమ జయంతి” శ్రీ తంగిరాల శాస్త్రి అన్నయ్య, “అమ్మ ఆరాధనోత్సవం” శ్రీమతి దుర్గ పిన్ని ఇళ్లలో నిర్వహింపబడుచున్నవి.
“అమ్మ చెప్పి, ఆచరించిన సిద్ధాంతాలు చెప్పుకునేందుకు చాలా తేలికగా కనిపిస్తాయి కాని, ఆచరణలోనికి వచ్చేసరికి, ఎంతో దృఢదీక్ష, ఆత్మ స్థైర్యం అవసరమనిపిస్తుంది. పరిసరాల ధ్యాస కూడ లేకుండా ఆచరించగలిగే ధైర్యం ఉండాలి.
“అమ్మ” అనుయాయులమంటే, కొన్ని సిద్ధాంతాలనైనా, మనం జీవితంలో జీవనంలో ఆచరించ గలిగితేనే ఆ ఆనందం మనకు అవగతమై మనకు కరతలామకం అవుతుంది.
ఉదా : సర్వత్రా అనురాగమే విరాగమని.
పరిమితమైన మమకారం మానవత్వమని
ఆ హద్దులు లేకపోవడమే దైవత్వమని, నీ బిడ్డ యందు ఏమి చూస్తున్నావో – వేరొకరి బిడ్డయందు కూడా అది చూచినప్పుడే అది అద్వైతమని, వర్గం లేనిదే స్వర్గమని – అటువంటి అమ్మ ప్రవచనాలు కోకొల్లలు.
ఒక సోదరుడు చెప్పినట్లు, పంచదార చిలుకను ఎక్కడ కొరికినా తీయదనమే అన్నట్లు, “అమ్మ” నోటి వెంట జాలువారిన ప్రతిమాట అద్వైత గుళికలే. ఈ సిద్ధాంతాలను మనం ఎంత వరకు ఆచరించగలుగుతున్నాము! మరొకరి సంగతి అటుంచి, మన సోదరులందరిలో ఈ సుహృద్భావము, అందరింటి వారమని భావము, ఎంత దృఢంగా ఉందో ఆత్మ పరిశీలన చేసుకుంటే అది మన పురోగతికి, సంస్థ పురోగతికి దోహదపడుతుంది.
ఈ పై సిద్ధాంతాల వంటివి, కొద్దిపాటి మనస్థైర్యం ఉంటే, కొంత వరకు, కొన్నిటిని మనం ఆచరించ గలమని నా విశ్వాసము. “అమ్మ” సిద్ధాంతాలలో తలమానిక మేమంటే, ఏ పని అయినా, చిన్నదైనా, పెద్దదైనా దానికి కర్తలము మనము కామని, దాని వెనుక “అమ్మ” హస్తం ఉందని దృఢంగానమ్మ గలగడమే. అదే అసలైన కర్మ సన్యాసయోగము.
“అమ్మ” ఆచరించి, చూపిన, మరొక ముఖ్య సిద్ధాంతము పాతివ్రత్య ధర్మము.
భర్త అంటే భావనేకాని శరీరం కాదని.
భర్త దేహపరిత్యాగంతో, మాంగల్య చిహ్నాలను తొలగించ నవసరంలేదని,
నిజమైన పతివ్రతకు – భర్త లేకపోవడమనేది లేదని, పతి జ్ఞాపకాలు మిగిలినంత కాలం ఆ స్త్రీ పుణ్యస్త్రీయేనని, నిర్ద్వంద్వంగా చెప్పి, తను ఆ సంఘటనను తన విషయంలో సృష్టించుకుని, ఆచరించి చూపించింది.
ఇది కాక, “అమ్మ” చెప్పిన ఒక అతిసులభమైన, ఆచరణ సాధ్యమైన, ఆచరణయోగ్యమైన సూచన మరొకటి ఉన్నది. ఈ సూచనచేయడం, “అందరిల్లు” అని నామకరణం చేసిన “అమ్మ”కే సాధ్యము. ఈ ఆచరణలో, మనకు స్వయం తృప్తితో బాటు, పరహితం కూడ యిమిడి ఉన్నది.
అది రోజూ వంట చేసుకునే సమయంలో ఒక పిడికెడు బియ్యం “జయహోమాతా” అంటూ ఒక చోట సేకరించి, దానితోబాటు ఒక రూపాయి వేసి, అది వేరే వారికి ఉపయోగపడవలెనని కానీ ధాన్యాభిషేకం సమయంలో కానీ మరేదైనా సామూహిక పూజలపుడు కానీ ఈ బియ్యం వినియోగ పరచుకోవచ్చు. ఇది మనం చేయగలిగినదేకాని కష్టతరమైనది కాదు.
“అమ్మ” ఎంతో మందికి వస్త్రాలను ప్రసాదంగా యిచ్చింది. ఎక్కడున్నా చేది నేనేనని నిర్ద్వంద్వంగా చెప్పింది. అందువలన ఈ కార్యక్రమాన్ని కూడ మన ప్రణాళికలో చేర్చుకుని, నూతన వస్త్రాలను, మనకు వినియోగ పడనివి పేదలకు, అవసరార్థులకు యిస్తే చాలా బాగుంటుంది.
ఇదే రీతిలో మందుల వినియోగము. “అమ్మ” బిడ్డలలో ఎంతో మంది వివిధ రంగాల వైద్యులున్నారు. అన్ని రంగాల వైద్య విధానాలు, మీదు మిక్కిలి హోమియో వైద్య విధానం “అమ్మ”కు ప్రీతిపాత్రము. మనం ఆయా వైద్యుల సేవలను వినియోగించుకొని, వైద్య సహాయం అందించ వచ్చును.
ఈ విధంగా ఆచరణయోగ్యమైన కొన్ని కార్యక్రమాలనైనా మనం ఏ ప్రాంతం వారు ఆయా ప్రాంతాలలో ఆచరిస్తే, ‘అమ్మ’ మన వెంటనే ఉండి, మన ప్రాంతమే జిల్లెళ్ళమూడి అవుతుందనేది నిస్సంశయము.
అన్ని విషయాలను చర్చించుకుని, ముఖ్య విషయం విస్మరిస్తే ఈ వ్యాస లక్ష్యం నెరవేరదు. ఏ కార్యక్రమం జరగాలన్నా ధనం ముఖ్యము. మనం ఎక్కడికక్కడ ఏ నగర సంస్థకు ఆ సంస్థను ఆర్ధిక పరిపుష్టం చేసుకుంటేనే ఏ కార్యక్రమాలైనా చేయగలము.
ఈ మధ్య జిల్లెళ్ళమూడి అమ్మ సేవా సమితి ప్రథమ సమావేశంలో ఒక సూచన చేయడం జరిగినది.
జంట నగరాలలో సుమారు 400 500 కుటుంబాలు ఉంటాయి (విశ్వజననీ సభ్యులు) వారిని మనము ప్రాంతాల వారీగా నెలనెలా కలిసి, నెలకు ఒక్కొక్క కుటుంబం నుండి 50 రూ.ల నుండి 100/-ల లోపు ప్రతి నెల విరాళంగా సేకరించితే నెలకు 10,000/- నుండి 20,000/-, సాలీనా 1,00,000/ -లోపు వసూలు అవుతుంది. దానిలో సగం కార్పస్ ఫండ్ గా ఉంచి, మిగతా సొమ్ము వివిధ కార్యక్రమాలకు వినియోగపరుచు కొనవచ్చును. ఈ విధంగా “అమ్మ” సందేశాలకు అనుగుణంగా మెలగి, ఏ నగరానికి ఆ నగరాన్ని జిల్లెళ్ళమూడి చేసుకొనగలము.
దురదృష్టవశాన యిన్ని సంవత్సరాలుగా వివిధ సంస్థలున్నా, జంటనగరాలలో, యిప్పటి వరకు ఈ సేవా సమితికి ఒక కేంద్ర స్థానం లేకపోవడం కడుశోచనీయము. ఒక కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసుకోగలిగితే ఎప్పటికైనా ముఖ్య కూడలిలో ఈ సంస్థ తన కేంద్రాన్ని ఏర్పాటు చేసుకోగలుగుతుంది. అక్కడే మన కార్యక్రమాలు నిర్వర్తించుకునే వీలుంటుంది.
మరొక ముఖ్య విషయమేమంటే “అమ్మ” సిద్ధాంతాలలో పుణ్య, పాప ప్రసక్తి లేదు, ముక్తి అంటే ముముక్షుత్వమని, అందరూ తన ఒడిలోనే ఉన్నారని, నిర్ద్వంద్వంగా చెప్పింది. అదీ కాక తన దృష్టిలో సాధకులే లేరంది. సాధ్యమైనదే సాధన అన్నది. అయినా సాధన అంటే, 24 గంటలు ఒక చోట ముక్కు మూసుకోవడం కాదన్నది. – ధ్యాసే ధ్యానమన్నది. ఈ విధంగా ఎన్నో అద్వైత సిద్ధాంతాలను “అమ్మ” మనకు హామీలుగా వెదజల్లి, ఒక్క మాటలో – ‘మీ యిష్టం వచ్చినట్లు బ్రతకండిరా’ నేనున్నాను అన్నట్లుగా “అమ్మ” సిద్ధాంత సారాంశం ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అటువంటి విశిష్టమైన అవతారం ముందు ఎక్కడా లేదు. “అమ్మ”గా వచ్చింది కనుకనే అంత హామీ యివ్వ గలిగింది. ఆ సత్తా ఆమె స్వంతం. మరొకరికి యిది సాధ్యమైన పనికాదు. లేకపోతే శరణాగతి కూడ మీ చేతిలో లేదని, తల్లియే బిడ్డకు సరెండర్ – అని ఎవరు చెప్పగలరు.
అందుకే శ్రీపాదవారు చెప్పినట్లు ‘ఎక్కడైనా నెలవంకనే చూడ గలంగాని, పూర్ణ చంద్రుడిని చూడాలంటే జిల్లెళ్ళమూడిలోనే సాధ్యమనేది’ – అక్షర సత్యము.