జిల్లెళ్ళమూడిలో అమ్మ శతజయంతి మహోత్సవం 2023 మార్చి 28వ తేదీ మంగళవారం నుంచి ఏప్రిల్ 1వ తేదీ శనివారం వరకు వైభవంగా జరిగింది.
శ్రీ విశ్వజననీ పరిషత్ ట్రస్ట్, టెంపుల్స్ ట్రస్టుల ఆధ్వర్యంలో ఈ ఐదు రోజులూ జిల్లెళ్ళమూడిలో ఎక్కడ
చూసినా ఉత్సవ శోభ, దివ్యానంద హేల అమ్మబిడ్డ లందరినీ పరవశింప చేశాయి.
విద్యుద్దీప విరాజితమై మంగళ తోరణాలతో వివిధ పుష్పాలంకరణలతో చలువ పందిళ్ళతో అమ్మ అశేష సంతానంతో అందరిల్లు” కళకళ లాడింది. ఆలయాల్లో అర్చనలు, అభిషేకాలు, యాగశాలలో హెూమాలు, అసంఖ్యాకంగా విచ్చేసిన యాత్రికులకు అమ్మ దర్శనం, వసతి సౌకర్యాలు, వేదికపై సభలు, సాంస్కృతిక కార్య క్రమాలు, అన్నపూర్ణాలయంలో, ప్రత్యేక భోజన శాలలో అమ్మ ప్రసాదంగా ఫలహార, భోజన కార్యక్రమాలు- వేటికవే అత్యంత సంతృప్తికరంగా ఆనందదాయకంగా జరిగాయి.
ఈ ఐదు రోజులలో దాదాపు 55వేల మందికి పైగా సోదరీ సోదరులు జిల్లెళ్ళమూడి వచ్చి, అమ్మను దర్శించి, ప్రసాదం స్వీకరించి, అమ్మ ఆశీస్సులు అందుకొని ఆనందించారు.
మాతృశ్రీ స్వచ్ఛంద సేవాదళ సభ్యులు, ఓరియంటల్ కళాశాల విద్యార్థినీ విద్యార్థులు ఈ మహోత్సవంలో కార్యకర్తలుగా అందించిన సేవలు సాటిలేనివి.
శ్రీ వఝ శ్రీరామ్ రహిగారు, శ్రీ బి. వాసుగారు మార్గదర్శకులై ఈ సేవాదళం కార్యక్రమాలను క్రమశిక్షణతో, ప్రణాళికాబద్ధంగా, ప్రశాంత సుందరంగా నిర్వహించారు.
సోదరి శ్రీమతి తంగిరాల అనసూయగారు విద్యార్థి కార్యకర్తల సహకారంతో వేదికపై కావలసిన అన్ని ఏర్పాట్లనూ పర్యవేక్షించిన తీరు ముదావహం.
మార్చి 28వ తేదీ- ఇంగ్లీషు కాలెండరు ప్రకారం అమ్మ పుట్టిన రోజున సోదరులు శ్రీ కొండముది ప్రేమకుమార్ గారి నేతృత్వంలో అమ్మ జన్మస్థలమైన మన్నవ గ్రామంలో శోభాయాత్ర కనువిందు చేసింది.
ఆనాటి ఉదయం 10గం.కు శతజయంతి వేదికపై సభా కార్యక్రమం ప్రారంభమైంది. ట్రస్టు సభ్యులు, ‘విశ్వజనని’ మాసపత్రిక మేనేజింగ్ ఎడిటర్ శ్రీ డి.వి.ఎన్. కామరాజుగారి సంచాలకత్వంలో అమ్మ శతజయంతి ప్రారంభ సభ సుసంపన్నం అయింది. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వి.సుబ్రహ్మణ్యంగారు ఈ సభకు అధ్యక్షత వహించారు.
సోదరులు శ్రీ ఐ.రామకృష్ణ గారు ప్రార్థన ఆలపించగా, హెరిడిటరీ ట్రస్టీ, ప్రియతమ సోదరులు శ్రీ బ్రహ్మాండం రవీంద్ర రావుగారు, మాన్య సోదరులు శ్రీ టి.టి. అప్పారావుగారు జ్యోతిని వెలిగించారు. కుర్తాళం పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ సిద్ధేశ్వరానంద భారతీస్వామివారు, శ్రీశక్తి పీఠాధీశ్వరి శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతీస్వామినివారు, శ్రీశ్రీశ్రీ నృసింహానంద భారతీ స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు.
కాకతీయ సిమెంట్ షుగర్ అండ్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఛీఫ్ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డా. పి. అనూరాధగారు ముఖ్య అతిథిగా, ‘దర్శనం’ మాస పత్రిక సంపాదకులు శ్రీ ఎం. వి.ఆర్ శర్మగారు గౌరవ అతిథిగా, బలుసుపాడు రమణకేంద్రం సంచాలకులు శ్రీ గెంటేల వెంకట రమణగారు. విశిష్ట అతిథిగా, ట్రస్టు ఛైర్మన్ శ్రీ కుమ్మమూరు నరసింహమూర్తిగారు ఆత్మీయ అతిథిగా పాల్గొని చక్కని సందేశాలు అందించారు.
అమ్మ శతజయంతి విశిష్ట సంచిక “శారదా వైజయంతి”ని శ్రీశ్రీశ్రీ రమ్యానంద భారతీ స్వామినివారు ఆవిష్కరించగా, సంపాదకులు శ్రీ ఏవీఆర్ సుబ్రహ్మణ్యంగారు ప్రసంగించారు.
ఈ సందర్భంగా వెలువడిన ‘విశ్వజనని’ మార్చి, ఏప్రిల్ ప్రత్యేక సంచికను డా. పి. అనూరాధగారు ఆవిష్కరించగా, సంపాదకులు ఆచార్య మల్లాప్రగడ ప్రసంగించారు.
ఆనాటి సాయంత్రం 6గం.కు శ్రీ ముదపాక బాల సుందరం భాగవతార్ హరికథా గానం చేశారు.
తిరుపతి శ్రీ అన్నమాచార్య ప్రాజెక్టుకు చెందిన సంగీత విద్వాంసులు శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు, శ్రీమతి బుల్లెమ్మగారు సమర్పించిన “స్వర సుమాంజలి” అందరినీ ఎంతగానో అలరించింది.
అమ్మ శతజయంతి మహోత్సవాలలో రెండవ రోజు – 29.3.2023వ తేదీ బుధవారం ఉదయం 10గంటలకు ట్రస్ట్ చైర్మన్ శ్రీ కె.నరసింహ మూర్తిగారి అధ్యక్షతలో సభ జరిగింది.
కళాశాల కరస్పాండెంట్, అమ్మతత్త్వ ప్రచార సమితి కన్వీనర్ డా. బి.ఎల్. సుగుణ గారు ఈ సభను ప్రశాంత సుందరంగా నిర్వహించారు. సోదరులు శ్రీ వై.వి.మధుసూదన రావుగారు జ్యోతిని వెలిగించి సభకు శ్రీకారం చుట్టారు. ఈ సభలో ముఖ్య అతిథిగా హర్యానా గవర్నర్ శ్రీ బండారు దత్తాత్రేయగారు, గౌరవ అతిథిగా మాజీ మంత్రివర్యులు శ్రీమతి నన్నపనేని రాజకుమారిగారు, ప్రత్యేక అతిథిగా ఆంధ్రప్రదేశ్ భా.జ.పా. అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజుగారు పాల్గొని అమ్మ దివ్య వైభవాన్ని వివరిస్తూ సందేశాలు అందించారు. గుంటూరు విశ్వ నగర్ వ్యవస్థాపకులు శ్రీ శ్రీ శ్రీ విశ్వ యోగి విశ్వంజీ మహరాజ్ అనుగ్రహ భాషణం చేశారు.
శ్రీ ప్రసాదవర్మ కామఋషి గారి రచన “అమ్మ తత్త్వ చింతనా ప్రస్థానం – 2వ సంపుటాన్ని శ్రీ విశ్వంజీగారు ఆవిష్కరించగా, సుప్రసిద్ధ సాహితీవేత్త డా. నారాయణం శేషుబాబుగారు సమీక్షించారు. రచయిత దంపతులు ఆత్మీయమైన స్పందన అందించారు.
సోదరులు శ్రీ రావూరి ప్రసాద్ గారు ఇంటర్వ్యూలు చేసి, గ్రంథస్థం చేసిన “అమ్మతో అనుభవాలు- 3,4,5″ భాగాలను పెద్దలైన అతిథులు ఆవిష్కరించారు.
ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సభ అందరినీ అలరించింది. ఆ నాటి సాయంత్రం 5గం. కు కళాశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు అమ్మకు పద్య ప్రసూనాలనూ గీత మాలికలనూ సమర్పించారు.
చెన్నై సంగీత విద్వాంసురాలు శ్రీమతి నందిని అందించిన “వాయులీన స్వర సుధాలహరి” అందరికీ ఆనందం కలిగించింది.
విజయవాడ నుంచి వచ్చిన శ్రీ మల్లాది సోదరులు తమ తండ్రి శ్రీ సూరిబాబుగారి సారథ్యంలో “గాత్ర యుగళం” సమర్పించారు. రాజుబావ రచించిన “అనుభవ సారం” గీతాలను తమ గురువులైన శ్రీపాద పినాకపాణిగారు స్వరబద్ధం చేసిన బాణీలలో గానంచేసి మల్లాది సోదరులు అందరినీ ఆనంద పారవశ్యంలో ఓలలాడించారు.
ఈ స్వరార్చనకు సభలో అందరూ మంత్ర ముగ్ధు లయ్యారు.
30వ తేదీ గురువారం ఉదయం 10గం.కు విశ్వజనని సంపాదకులు డా.యు. వరలక్ష్మిగారు చకచ్చకిత మైన చైతన్యంతో నిర్వహించిన సభకు టెంపుల్స్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ శ్రీ ఎం.దినకర్ గారు అధ్యక్షత వహించారు.
గన్నవరం భువనేశ్వరీ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ కమలానంద భారతీ స్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. ప్రభుత్వ విప్ & శాసనమండలి సభ్యులు శ్రీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ గారు ముఖ్య అతిథిగా, భాజపా యువ మోర్చా అధ్యక్షులు శ్రీ దర్శనపు శ్రీనివాస్ గారు ఆత్మీయ అతిథిగా, ప్రసిద్ధ వేద సంస్కృత పండితులు డా. కందుకూరి సూర్య సత్యనారాయణ గారు విశిష్ట అతిథిగా పాల్గొని ఆలోచనాత్మకమైన సందేశాలు అందించారు.
నాటి సభలో అమ్మతో అనుభవాలు 6,7,8 సంపుటాల ఆవిష్కరణ అనంతరం సేకరణ కర్త శ్రీ రావూరి ప్రసాద్ గారు తమ స్పందనలో ఈ సారస్వత మహా క్రతువులో తనకు సహకరించిన సోదరీ సోదరులకు నిండుమనసుతో కృతజ్ఞతలు తెలియచేశారు. సోదరులు శ్రీ కొండముది సుబ్బారావుగారు. వ్రాసిన “అమ్మచే ప్రభావితులు” ఆవిష్కరణ అనంతరం శ్రీ డి.వి.ఎన్. కామరాజుగారు చక్కని సమీక్ష అందించారు. రచయిత శ్రీ సుబ్బారావుగారు సముచిత రీతిలో స్పందించారు.
ఆనాటి సాయంత్రం కళాశాల పూర్వ, ప్రస్తుత విద్యార్థులు అందించిన అక్షరాంజలితో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభ మయ్యాయి.
పూర్వ విద్యార్థి, నాట్యకళా విశారదులు డా.కె శ్రీకాంత్ నిర్వహణలో నరసరావుపేట నుంచి వచ్చిన బృందం సమర్పించిన “పదార్చన” నృత్య రూపకం అమ్మ బాల్య జీవితంలోని సంఘటనల సమాహారమై ఆసక్తికరంగా సాగింది.
శ్రీ కంచి కామకోటి పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతీస్వామివారి ఆశీస్సులను ఆ పీఠం ప్రతినిథిగా విచ్చేసిన సాహితీ దిగ్గజం డా. ధూళిపాళ రామకృష్ణ గారు అందించగా, తెలుగు సంస్కృతం అకాడమీ కార్య నిర్వాహక సభ్యులు డా. కప్పగంతు రామకృష్ణ గారు సభాపరిచయం చేశారు. అనంతరం శ్రీమతి ఈమని కల్యాణిగారి “వీణాగాన సమర్పణం” శ్రోతల హృదయవీణా తంత్రులను మీటి ఆనందం కలిగించింది.
విశిష్ట సారస్వత మూర్తి డా. గరిమెళ్ళ సోమయాజి శర్మగారు ఆశీఃప్రసంగం చేశారు. కళాశాల పూర్వ విద్యార్థినులు సమర్పించిన “గీతా బోధ – అమ్మ ప్రబోధం” బుర్రకథ ఆబాలగోపాలాన్నీ ఆనంద పరవశులను చేసింది.
డా.వై.నాగేంద్రమ్మ ప్రధాన కథకురాలుగా, శ్రీమతి బి. శ్రీదేవి, శ్రీమతి వై. దామోదరమ్మలు వంతలుగా సాగిన ఈ కార్యక్రమం ‘గీతా సారమే అమ్మ సందేశ’ మని అద్భుతంగా నిరూపించింది.
31వతేదీ శుక్రవారం ఉదయం 10గం.కు సోదరులు, ప్రముఖ రచయిత శ్రీ కొండముది సుబ్బారావుగారి నిర్వహణలో శతజయంతి నాలుగవరోజుసభ కవితాత్మక సౌందర్యంతో సాగింది. ట్రస్టు సభ్యులు శ్రీ బొప్పూడి రామబ్రహ్మంగారి అధ్యక్షతలో మాజీ మంత్రివర్యులు డా. పనబాక లక్ష్మిగారు ముఖ్య అతిథిగా పాల్గొని ఉత్తేజపూరితమైన ప్రసంగం చేశారు. పూర్వ విద్యార్థులు రూపొందించిన “జయహెూ మాతా అమ్మకు అక్షరాంజలి” శతజయంతి సావనీరును శ్రీ బ్రహ్మాండం రవి అన్నయ్య ఆవిష్కరించగా పూర్వ విద్యార్థి సమితి అధ్యక్ష కార్యదర్శులు శ్రీ జి. రాఘవేంద్ర రావు, శ్రీ కె. శేషాద్రి, సంచిక సంపాదకులు డా. జయంతి చక్రవర్తిగార్లు ప్రసంగించారు. ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్. మూర్తిగారు విద్యార్థుల కృషిని అభినందించగా, పెదపులిపాక విజయ రాజరాజేశ్వరీ పీఠాధీశ్వరులు శ్రీశ్రీశ్రీ వాసుదేవానంద సరస్వతీస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. గౌరవ అతిథి, ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ వి. నరేంద్ర వర్మగారు శుభాకాంక్షలు అందించారు. మరో గౌరవ అతిథి, కొప్పరపు కవుల కళాపీఠం వ్యవస్థాపకులు శ్రీ మా శర్మ అమ్మ వైభవాన్ని కీర్తించారు.
మేనేజింగ్ ట్రస్టీ శ్రీ పి. గిరిధర్ కుమార్ గారు ఈ సందర్భంలో అమ్మను సేవించుకునే అవకాశం కలిగినందుకు ఆనందిస్తూ అందరికీ కృతజ్ఞతలు ప్రకటించారు. ఆ నాటి సాయంత్రం సభలో పూర్వ ప్రస్తుత విద్యార్థులు అమ్మకు గీత నీరాజనాలు అందించారు.
అనంతరం ప్రసిద్ధ గాయని శ్రీమతి మల్లాప్రగడ చారుమతీ పల్లవిగారు (పాడుతా తీయగా ఫేమ్) సమర్పించిన “లలిత శాస్త్రీయ సంగీత వాహిని” రసరమ్యంగా సాగి, అందరి మన్ననలనూ అందుకొన్నది. ఆ తర్వాత రావులపాలెం- మిరియాల బాలాజీ బాబు బృందంచే “విశ్వజనని” బుర్రకథ జరిగింది.
ఏప్రిల్ 1వ తేదీ శనివారం చైత్రశుద్ధ ఏకాదశి- అమ్మకు శతవసంతాల పుట్టిన రోజు పండుగ. మనందరికీ మహత్తరమైన పర్వదినం.
ఆనాటి ఉదయం పదిగంటలకు శతజయంతి సమారోపన సభ ఆధ్యాత్మిక శాస్త్రవేత్త శ్రీ వి.యస్.ఆర్. మూర్తిగారి అధ్యక్షతలో సముదాత్తమైన రీతిలో సంపన్నమైంది. పూర్వ విద్యార్థిని డా. వై.నాగేంద్రమ్మ ప్రార్థనా శ్లోకాన్ని ఆలపించగా, జ్యోతి ప్రకాశనంతో శుభారంభమైన ఆ నాటి సభ శ్రీమతి బ్రహ్మాండం వసుంధర అక్కయ్య అమ్మకు సమర్పించిన పుష్పాంజలితో శ్రీకారం చుట్టుకున్నది.
శ్రీ రావూరి ప్రసాద్ గారు సేకరించిన “అమ్మతో అనుభవాలు- 9వ సంపుటం” – (శ్రీ రవి అన్నయ్యతో ముఖాముఖి) “మాతృదేవో భవ” శీర్షికతో భద్రమైన ముద్రణ పొంది, ఆ నాటి సభలో ఆవిష్కృతం కావటం విశేషం. రవి అన్నయ్య తన అంతరంగాన్ని ఆవిష్కరించగా, డా. బి.ఎల్.సుగుణగారు సంక్షిప్త సుందరంగా గ్రంథ పరిచయం చేశారు.
సంస్కృతం, ఇంగ్లీషు, తమిళం, కన్నడం మొదలైన వివిధ భాషలలో ప్రచురితమైన ‘అమ్మ శతజయంతి బహుభాషా విశిష్ట సంచిక’ను, ఆ నాటి సభలో పెద్దలు ఆవిష్కరించగా, ఆత్మీయ అతిథి, టెంపుల్స్ ట్రస్ట్ సభ్యులు శ్రీ వారణాసి ధర్మసూరిగారు ప్రసంగించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి. రామ సుబ్రమణియన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రశాంత సుందరమైన సందేశం అందించారు. భువనేశ్వర్ నుంచి విచ్చేసిన ఆదాయపు పన్ను శాఖకు చెందిన ‘ప్రిన్సిపుల్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ కంటాక్స్ (ఇన్వెస్టిగేషన్స్) శ్రీ జె.కృష్ణ కిశోర్ గారు ఈ సభలో విశిష్ట అతిథిగా పాల్గొని, అమూల్యమైన సందేశం అందించారు.
గౌరవ అతిథిగా పాల్గొన్న ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి శ్రీ బి. కృష్ణ మోహన్ గారు విశ్వజననీ వైభవాన్ని ప్రస్తుతించారు. బెంగుళూరు కైలాసాశ్రమ మహా సంస్థాన్ అధిపతులు శ్రీశ్రీశ్రీ జయేంద్రపురిస్వామివారు అనుగ్రహ భాషణం చేశారు. మాతృశ్రీ డిజిటల్ సెంటర్ జిల్లెళ్ళమూడి కార్యక్రమాలను, శతజయంతి వేడుకలను, వివిధ కేంద్రాల సమాచార విశేషాలనూ దృశ్య మాధ్యమం ఆధారంగా విశ్వ వ్యాప్తం చేస్తున్న శ్రీ కె. శ్రీకాంత్, శ్రీ వల్లూరి ప్రేమరాజ్లకు అమ్మ ప్రసాదాన్ని సత్కార రూపంలో ఈ సభలో అందించటం అందరినీ ఆనందపరిచిన అంశం. ఆనాటి సభను ‘విశ్వజనని’ మాసపత్రిక సంపాదకులు ఆచార్య మల్లాప్రగడ శ్రీమన్నారాయణ మూర్తిగారు సముచితంగా నిర్వహించారు. ఆనాటి సాయంత్రం ప్రస్తుత, పూర్వ విద్యార్థులు అమ్మకు సమర్పించిన అక్షరాంజలితో సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. హైకోర్టు అడ్వొకేట్, యువ కిశోరం డా. మజ్జి సూరిబాబుగారు ఆలోచనాత్మకమైన సందేశం అందించారు. అంతర్జాతీయ విఖ్యాతిని సముపార్జించిన శ్రీ ‘గజల్’ శ్రీనివాస్ గారు మధుర గీతాలతో అలరించారు.
రామరాజు ప్రేమకుమార్ గారి నిర్వహణలో గుంటూరు శ్రీ సాయి శృతి మ్యూజిక్ అకాడమీ బృందం సమర్పించిన “భక్తి సంగీత కదంబం” సభను భక్తిరస ప్లావితం చేసింది. అనంతరం శ్రీ సూరి సత్య ప్రశాంత్ గారు శాస్త్రీయ సంగీత సభను సలక్షణంగా నిర్వహించారు. మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అధ్యాపకులు శ్రీ బి.వి.కె. శక్తిధర్ గారు, డా. వి. పావనిగారు ప్రెస్ కవరేజిని బాధ్యతా యుతంగా నిర్వహించి సహకరించారు. అమ్మ దివ్యాశీస్సులతో సర్వాంగ సుందరంగా జరిగిన శతజయంతి సభలు అందరికీ ఆనందం కలిగించాయి.