కులపతి గారికిన్ దగిన కూరిమి సోదరుడై రహించి యు
జ్జ్వలరస భావనాంచిత లసత్తర కావ్యములన్ సృజించి ని
ర్మలతర కీర్తిచంద్రిక స్థిరంబుగ దిక్కులయందునింపు య
య్యలఘని కాంజనేయ కవితాగ్రణి కంజలి సంఘటించెదన్
కళ్యాణ వీణలో కమనీయ రాగాల
పెంపగా రవళింప జేసి
శ్రీనాధ కవినాధ జీవన రేఖల
సౌందర్య మాలికల్ సవదరించె
ప్రచుర వచోదీప్తి రుచిరంబుగా నింపి
వచనరచనమందు వరలజేసె
అమ్మ పదంబులో నమృతత్త్వంబుల
ననుభవంబులపేట నందజేసె
మధుర సౌహిత్య భావనా మహితుడగుచు
పూర్ణ సారస్వత ప్రభామూర్తి యగుచు
భాసురాక్షర సేవల జేసినట్టి
కవివరుండు పీయస్సారు గారి నెంతు.
విశ్వజననిలోన వెల్లివిరియజేసె
ఆధ్యాత్మ భావ దివ్యత్వగదిల
సారస్వతగ్రంథ సంపాదకుండౌచు
శారదా వరివస్యసంతరించే
సాహితీ రూపక సభలందు ప్రభయోచు
వీర విజృంభణల్ వెలయజేసె
చిన్మయ భావనా తన్మయత్వముతోడ
నానంద భారతి నర్చజేసె
ఎంత యద్భుత సేవ గావించి నార
లెంత సౌవర్ణ సృష్టి గావించినారు
లెంత యెంతని వచియించుటెట్లు సాధ్య
మాంజనేయప్రసాదున కంజలింతు.
విమల సాహిత్యరంగాన వెల్గు యౌచు
దివ్య మాధ్యాత్మికా స్థాన తేజమగుచు
పరమ వాత్సల్యనిధియౌచు పరిఢవిల్లు
ఆంజనేయప్రసాదున కంజలింతు.
చల్లనితల్లియై జగతిసర్వము సాకెడి ప్రేమమూర్తియౌ
జిల్లెలమూడి అమ్మ మదిసీమల కెక్కిన బిడ్డగాన యు
త్ఫుల్ల సరోజ గంధ పరిపూర్ణమనస్కత సేవలోననే
యుల్లము పండిపోయిన మహోజ్వలకీర్తి సుమూర్తి నెంచెదను.
అమ్మసేవలో దివ్యజన్మమ్ము నెల్ల
ధన్యమొనరించుకొన్న యుదాత్తమూర్తి
అమ్మ చైతన్యమందు తానైక్యమయ్యె
నమ్మ హా సుతేజోమూర్తి సంజలింతు.
P.S.R. MEANS
P – for Power and Purity
S – for Speech and Sacrifice
R – for Royalty and Resourcefulness
– Sri L.Lala