1. Home
  2. Articles
  3. Viswajanani
  4. అంతర్ముఖ సమారాధ్య !

అంతర్ముఖ సమారాధ్య !

Keesara Pardhasaradhi Sarma
Magazine : Viswajanani
Language : Telugu
Volume Number : 10
Month : February
Issue Number : 7
Year : 2011

భయం లేని తనాన్ని నిర్భయం అంటాము. చాలా విషయాల్లో మనం మన మనస్సులోని సందేహాలని ఇతరులకి తెలియపర్చటానికి సంకోచిస్తాము. కారణాలు అనేకముగ వుంటాయి. కానీ చాలా కొద్దిమంది నిస్సంకోచముగా నిర్భయంగా ఎదుటివారిని నిలదీసి ప్రశ్నలు చేస్తారు. నిజానికి అసలు ప్రశ్నలు ఎందుకు ఎలా ఉదయిస్తాయో కూడ తెలియదు. ప్రశ్న నైజం ఏమిటంటే ప్రశ్న అడిగినది ఒకరే అయినా దాని జవాబు వల్ల చాలామందికి కొన్ని క్రొత్త విషయాలు తెలుస్తాయి. క్రొత్త విషయాలు గురించి అసలు అవగాహన లేని వ్యక్తులు ఆయా విషయాలపై ప్రశ్న ఎలా వేస్తారో ఎవరికీ తెలియని విషయం. కనుక కొంగ్రొత్త  విషయాలు బయటకు రావాలంటే, ఒక అజ్ఞాతశక్తి ప్రేరణ  అవసరమన్న విషయం స్పష్టంగా తెలుస్తున్నది. అంతర్ముఖంగా “పెళ్ళిలో పెద్దపులి లేదని తెలియచేయటానికి” నున్న ఆధ్యాత్మిక విషయాలు బహిర్ముఖంగా అవగతం కావాలంటే ప్రశ్న కూడా ఆ పరాత్పరి సంకల్పమే అని గ్రహించాలి. అంతర్ముఖ విషయాలపై ప్రశ్న వేసే శక్తి “గడ్డిపూవులం – గుడ్డిపూవులం” ఇంకా చెప్పాలంటే “చవట పెయ్యలం” మనకాశక్తి ఎలా వస్తుంది? ప్రశ్న వేసినా సమాధానం చెప్పినా విశ్వజననీ సంకల్పమే. ప్రశ్న ఎవరు వేశారన్నది ముఖ్యంకాదు. ప్రశ్నవల్ల తెలియవచ్చిన విషయాలు తెలియపర్చిన విధం గమనిస్తే మూలకారణం ఆ పరాత్పరి అనుగ్రహం అని అవగతమవుతాయన్నది సుస్పష్టం. ఈ విషయంపై ఉదాహరణలుగా ఎన్నో సంఘటనలు చెప్పుకోవచ్చు. లోకారాధ్య అనే ఖండికలో అమ్మ రచయితతో ఒక ప్రశ్న వేయించింది. ఆ ప్రశ్నకి రచయిత అమ్మతో తనకి గల అనుభవాలవల్ల అమ్మ సంకల్పంతో అడిగిన ప్రశ్నకి రచయిత నూరుశాతం సమాధానం అందించారు. కానీ ఆ ఖండికలోని ప్రశ్న నన్ను బాగా కదిలించివేసింది. ఆ ప్రశ్న ఏమిటో చూద్దాము. 

సృష్టి స్థితి ఆలయాలుచేసే సర్వేశ్వరుడివి, పరబ్రహ్మానివి (స్వయంశక్తివి) “నీకు పెళ్ళెందుకమ్మా” అని ప్రశ్న వేశారు రచయిత. అమ్మ దానికి సమాధానంగా రెండు ముఖ్య విషయాలు తెలియపర్చింది. ఆ ముఖ్యవిషయాలు తెలియపర్చటానికే అమ్మ ఆ ప్రశ్న సంకల్పం చేసి రచయితతో అడిగించింది. ప్రశ్న చాలా విచిత్రమైనది, విచిత్రమేకాదు తరచి చూస్తే ఒక తల్లిని కుమారుడు అడగవలసిన ప్రశ్న కూడా కాదు. నిజానికి అమ్మా “నీకు పెళ్ళెందుకమ్మా” అని నిజజీవితంలో ఒక తల్లిని కుమారుడు ప్రశ్న వేస్తే – సాధారణంగా తల్లులు నోరు ముయ్యరా పిచ్చినాయనా అనో వీడివన్నీ పిచ్చి ప్రశ్నలే అని కేకలెయ్యటమో జరుగుతుంది. కానీ అమ్మ ఈ ప్రశ్నకి సమాధానం ఏం చెప్పిందో చూడండి.

“ఆధ్యాత్మిక సాధనకి సంసారం అడ్డం కాదని తెలియచేయటానికి ” అన్నది.

 కనుక లోతైన సమాధానాలు గల ప్రశ్నలు అమ్మ సంకల్పంతో వచ్చేవే కాని మానవుని మేధస్సుకి సంబంధించినవి కాదని తెలుసుకోగలగాలి. (ఆ రచయితకి ఈ విషయం బాగా తెలుసు. ఎలాగో ఇంకోచోట తెలుసుకొందాము) ఇక ప్రశ్నని సమాధానాల్ని విశ్లేషించుకుందాము. ప్రశ్న చాలా చిన్నది. “నీకు పెళ్లెందుకమ్మా” అనే ప్రశ్నలో అక్షరాలు లెక్కిస్తే ఏడక్షరాలు. ఏడడుగులు వేస్తేగాని వధూవరులు ఒకటి కాలేదు. అటువంటి ఏడడుగుల కళ్యాణం గురించి అడిగిన ప్రశ్నలోని అక్షరాలు యేడు. అమ్మ సంకల్పం గమనించండి. సప్తపది గురించి తన బిడ్డలందరికి తెలియాలనే అమ్మ సంకల్పం కాదనగలమా ? అమ్మ ఇచ్చిన సమాధానం గమనిస్తే ప్రారంభంలో అమ్మ ఆధ్యాత్మిక సాధనకి అగ్రతాంబూలం ఇచ్చింది. తర్వాతనే పెళ్ళిలో పెద్ద పులిలేదని ప్రస్తావించింది. అమ్మ సమాధానంలో అంతర్గతంగా అంతర్ముఖంగా ఉన్న ఆధ్యాత్మికతను గురించి విశ్లేషించుకుందాము. “సంసారం ఆధ్యాత్మిక సాధనకి అడ్డంకాదు” అన్నది సాధారణ జీవితంలో మన లోకొక్తి ‘వివాహం విద్యనాశాయ’ అంటారు. అంటే వివాహం కాగానే ఎటువంటి సాధనలైనా అడ్డంకులు తప్పదన్న భావం తెలియవస్తున్నది. కానీ అమ్మ ఏ సాధనకైనా వివాహం లేదా సంసారం అడ్డంకి కాదన్నది. అమ్మతో దగ్గరగా మసలిన వాళ్ళకి అమ్మ చెప్పిన సమాధానం నిజమే అనిపించక మానదు. వాళ్ళు అనుభవాల విషయాలను పరిశీలిస్తే అమ్మ వివాహం చేసుకున్న తర్వాత తన బిడ్డలకి ఆధ్యాత్మికతను గురించి ఎక్కువగా తెలియచేసినట్లు తెలుస్తున్నది. అమ్మ విశ్వజనని. అమ్మకి తెలియని విషయాలు లేవు. అమ్మ సందేశాలు జాగ్రత్తగా గమనిస్తే అమ్మ పెద్ద పెద్ద విషయాలు కూడా చిన్న చిన్న మాటలతో తెలియ చేస్తుంది. ఆ చిన్నమాటల్లోనే అన్ని అర్థాలు స్ఫురించేలా చెప్పుతుంది. ఇక అమ్మ మాటల్లో అంతరార్థాలు లోతైన విషయాలు వెలికి తీసుకునే బాధ్యత మనదే గదా ! సత్సంగాలలో ఇటువంటి విషయాలు ఎన్నో తెలుస్తాయి. ఆధ్యాత్మిక సాధనలో సంసారం ఎలా అడ్డం కాదో మనం గ్రహించాలి. మన వివాహ సంస్కృతి ఆ బాధ్యత వరుడు వధువుపైనే వేసి భార్యకి అగ్రతాంబూలం ఇచ్చింది. పెళ్ళిలో బ్రహ్మముడులు వేసిన తర్వాత వరుడు వధువుతో పలికే మాటలు గ్రహించండి.

“పూషా త్వేతో నయతు హస్త గృహ్యో, అశ్వినౌ త్వా ప్రవహతాం రధేన గృహాన్ గచ్ఛా గృహపత్నీ యదాసో వశినీత్వం విదదం అవదాసి”! అంటాడు. అనగా ఓ సతీ! నిన్ను నా గృహమునకు ఆహ్వానించుచున్నాను. అంతేకాదు. నా యింటిలోనికి యజమానురాలవుగా మొత్తము అధికారము నీకు ధారాదత్తము చేయుచున్నాను” అంటాడు. మరియొక చోట ఇలా చెప్పుతాడు” ఆశాసోనాసౌ మనసం సౌభాగ్యం తనుం అగ్నేర నూరతా భూత్వా సన్నహ్యే సుకృతాయకం” అంటాడు. అనగా “నీవు మంచి నిర్మలమైన భావనతో నాతో సంతతి పొంది సౌభాగ్యము కలిగి యుండుటయే కాదు, నేను జరుపు అన్ని అగ్ని కార్యముల యందు అనగా ఆధ్యాత్మిక సాధనల యందు నాకు సహకరిస్తూ, సహధర్మచారణిపై సత్కార్యక్రమములు జరుపుటకు సహకరించవలసింది” అంటాడు. ఇలా కళ్యాణ సౌభాగ్యంలో స్త్రీకి ఇవ్వబడిన ప్రాధాన్యతను గ్రహించిన స్త్రీ ఏ పరిస్థితులలోను, తన భర్త జరుపు ఆధ్యాత్మిక సాధనా క్రమంలో అడ్డంకులు కల్పించదని గ్రహించవచ్చును. అది ఆనాటి పెళ్ళినాటి ప్రమాణంలో అటువంటి అంతర్గతంగా, అంతర్ముఖంగా ఉన్న అర్థాలు అమ్మ సంకల్పంవల్ల మనకి అవగతమవుతాయి. అందుకనే అమ్మ పెళ్ళెందుకు చేసుకున్నదంటే “ఆధ్యాత్మిక సాధనకి సంసారం అడ్డం కాదని చూపడానికి” అని తేలిగ్గా చెప్పింది. అమ్మ ఆంతర్యాన్ని గ్రహిస్తే ఇక నేటి గృహాలలో కల్లోలాలకి అవకాశం వుండదు. నిజంగా నీకు ఎంత వాత్సల్యం అమ్మా !” బిడ్డలను ఉద్ధరించటానికి ఎంత తాపత్రయం” నిజంగా అమ్మ  లోకారాధ్య. 

ఇక “పెళ్ళిలో పెద్దపులి లేదని తెలియచేయటానికి” అన్నది. ఎక్కడైనా పెళ్ళిలో బంధువులుంటారు. స్నేహితులుంటారు. శ్రేయోభి లాషులుంటారు. కానీ పెళ్ళిలో పెద్ద పులులుండటమేమిటి ? పెళ్ళిలో పెద్దపులులకి ప్రవేశం వుంటుందా ? నిజంగా పెళ్ళికి పెద్దపులి కనుక వస్తే ముందుగా అందరికి వచ్చేది భయం. పెళ్ళిలో ‘భయం’ వస్తే ఆ సంసారం సవ్యంగా సాగదు. పెళ్ళి నిర్భయంగా, నిర్మలంగా, వధువు, వరుడు వద్దకు వెళ్ళాలి. అదే భావనతో వరుడు వధువుని ఆహ్వానించాలి. ఒకరి మీద ఒకరికి న్యూనతాభావం గాని, అభద్రతా భావం గానీ కూడదనీ చెప్పటానికే అమ్మ ‘భయం’ అనే పదానికి పెద్దపులిని వాడింది. ఎప్పుడైతే పెళ్లిలో నిర్భయం, ప్రేమ వుంటాయో ఆ సంసారాలన్నీ ఆనందంగా సాగుతాయి.

ఇంత నిగూఢమైన విషయాలని అమ్మ తన సందేశాలలోని చిన్న చిన్న మాటలలో ఇమిడ్చి మనకి ప్రసాదించి వరప్రదాయిని అయింది. అదే విశ్వజనని ప్రత్యేకత. అందుకే అమ్మ అంతర్ముఖ సమారాధ్యా.

Attribution Policy : In case you wish to make use of any of the materials in some publication or website, we ask only that you include somewhere a statement like ” This digital material was made available by courtesy of Matrusri Digital Centre, Jillellamudi”.

error: Content is protected !!