ఈ సకల చరాచర జగత్ సృష్టి అంతయు బ్రహ్మమే. అందుకే కాబోలు అమ్మ “నాకు ఎక్కడ చూచినా, తాకినా, విన్నా సర్వచరాచర జీవజాలంలో “అది తప్ప ఇంకేమి నాకు కనపడుటలేదు నాన్నా” అన్నది. దీనిని ధృవపరచుటకే కాబోలు దశవతారాలుగా సర్వవ్యాప్తమైన విష్ణువు నరుడుగా (రామ, కృష్ణాదులు) వానరుడుగా (ఆంజనేయస్వామి), నరుడు మరియు మృగరాజు అయిన సింహముతో కలసిన నరసింహుడుగా, కూర్మ, మత్స్యావతారాలు మొదలైన -జలచరాలుగా, చెట్లుగా, రావిచెట్టు (అశ్వద్ధనారాయణ) జమ్మి, వేప (మహలక్ష్మి) వృక్షముల యందును, తులసి (మహలక్ష్మి లేక గౌరి) తెల్లజిల్లేడు (వినాయకుడుగా) మొదలగు మొక్కలయందును, ఆవు (మహాలక్ష్మి), ఎద్దు (శంకరుని వాహనము నందిగాను) పెద్దపులి, సింహము (దుర్గాదేవి మొదలైన దేవతలకు వాహనముగాను) దున్నపోతు (యమునకు వాహనముగాను), కుక్క (కాళభైరవుడుగాను), పాము (నాగేశ్వరునిగాను), నెమలి (కుమారస్వామికి వాహనముగాను), ఎలుక (వినాయకునికి వాసనముగాను) మొదలగు సాధు జీవులు, క్రూరమృగాల యందును సర్వాంతర్యామిగా, సర్వవ్యాపిగా గానే వున్నట్లుగా పూజింపబడటం, ఆరాధనలు అందుకోవటం మనము అన్నది అమ్మ. అనుదినము చూస్తున్న విషయమే. ఇవి అన్నియు సృష్టికి కావలసినవే కనుక మనకు ఆరాధనీయముగా నమ్మకము కలిగినది. అందుకే “నమ్మకమే భగవంతుడు” అన్నది అమ్మ. నమ్మకము లేకపోతే సృష్టి నడవటం కష్టం. అందుకే నమ్మకానికి అంత ప్రాముఖ్యము ఏర్పడినది. అంతేకాదు పంచభూతాలను మనము పూజిస్తున్నాము. వాటిని నేరుగా ఆరాధించటము కష్టం అని వాటిని personify చేసి వాయుదేవుడుగా, అగ్నిదేవుడుగా, వానదేవుడుగా దృశ్యమానమైన జగత్గా పూజిస్తున్నాము. సర్వజీవులకు కావలసిన ప్రాణవాయువును ఇస్తూ వారు విడిచిన బొగ్గు పులుసు వాయువును అవి పీల్చుకుంటూ జీవిస్తూ మనకు కావలసిన అన్ని ఔషధములకు మూలంగా ఆ మొక్కల నుండి చెట్ల నుండి తీసుకుంటూ ‘ఆ’ మొక్కలు, చెట్లు కూడా. ప్రాణి కోటితో సహజీవనం గడపటం యదార్ధమైన విషయమే. శబ్దం “ఓం” అనే ఏకాక్షరంగా పలుకుతుంది. అది ‘అ’ కార, ‘ఉ’కార ‘మ’కారాలతో కలిసి నిశబ్ధములో కలుస్తున్నది. అందుకే శబ్దము బ్రహ్మమే. నిశబ్దము బ్రహ్మమే. (God speaks in silence and silence is God) అన్నారు. “సర్వం ఖల్విదం బ్రహ్మ” ఆత్మ కానిది ఏదీ లేదు అని ఉపనిషత్తులంటే “సర్వం ఆత్మగా తోచటమే ఆత్మ సాక్షాత్కారం” అన్నది అమ్మ.
సూచిక: సర్వం తానైన బ్రహ్మను ఎట్లా తెలుసుకోవాలి? అనే దానికి విశ్లేషణే ఈ వ్యాసం.