అమ్మ వాక్యాలు :
నిగూఢ వేదాంత ప్రదర్శకాలు.
నిక్షిప్త త ప్రాపకాలు
ఉత్తమ స్ఫూర్తి దాయకాలు
ఉన్నత తేజో యోజకాలు
మనం వేదాంత చర్చ మొదలు పెట్టగానే మనకు వినిపించే పదం, ‘ఆత్మ సాక్షాత్కారం’ అనేది. అందరి సాధకుల గమ్యం చరమ లక్ష్యం. ఆత్మసాక్షాత్కారం. సకల సృష్టికి మూల పదార్థం ఆత్మ అయితే, సకల జీవుల పరమార్థం. ఆత్మసాక్షాత్కారం. మూలం లేకుండా ఎవ్వరమూ లేము. మూలం ఏమిటో తెలిసి కూడ ఎవ్వరమూ లేము. మూలాన్వేషణ మానవ సహజం.
ఆత్మ అనే శబ్దం. ‘ఆప్లు = వ్యాప్త’ అనే సంస్కృత ధాతువు నుండి పుట్టినది. వ్యాపించిన శక్తి ఒకటి నడపబట్టే మనం నడుస్తున్నాం. శక్తి కలిగి ఉండబట్టే మనం సృష్టిలో ఒక వ్యక్తిగా, శక్తిమంతుడుగా తిరుగుతున్నాం. కానీ మనకు శక్తి మీద ఆసక్తి లేదు. తల్లిని మరచి నడిచే వ్యక్తిలా వుంది మన జీవితం. మన జీవనం, జీవితం రెండూ ఆ అవ్యక్తమైన శక్తి అధీనమయ్యే నడుస్తున్నయ్. మనకు మన ఆధారమును గూర్చి ఆలోచనే లేకపోవడం సహజ లక్షణం. అందుకే మన ప్రాచీన గ్రంథాల్లో మన ఋషులు ఆత్మను గురించి కూడా కొంచెం ఆలోచించటం వినడం, అత్యవసరమయిన విధి అని మనని ప్రోత్సహిస్తూ “ఆత్మా వా అరే ద్రష్టవ్యః మంతవ్యః శ్రోతవ్యః నిదిధ్యాసై యితవ్యః” అని అంటూ రకరకాల కోణాల్లో ఆత్మను అన్వేషించమని చెప్పారు.
ఎన్నో కోణాల్లో, ఎన్నో గతులలో, ఎన్నో స్థితులలో, ఎన్నో తీరులలో ఉండేది. ఆత్మ కనుక, ఏదో ఒక రీతిలో, అందరిలో, అనంతకాలంలో ఉండేది ఆత్మ కనుక అంత ప్రయత్నంతో, అన్నిటిలో అన్వేషణ చేయమని మన ఋషుల ప్రేరణ.
మనం సృష్టిని మొత్తం ఎంతో భిన్నత్వంలో చూస్తూ ఉంటాం. ఆకారంలో భిన్నత్వం, ఆచరణలో భిన్నత్వం, ఆలోచనలో భిన్నత్వం, అలవాట్లలో భిన్నత్వం ఇట్లా భిన్నత్వం తోనే నిండినది లోకం. ఇంత భిన్నత్వ ధర్మంతో నిండిన సృష్టిలో ఎక్కడో ఒక కోణంలో ఏకత్వం కూడ ప్రస్ఫుటం అవుతూనే ఉంది. మన చర్మ చక్షువులకు మాత్రమే కనిపించేది భిన్నత్వం. సామాన్య దృష్టికి అందేది భిన్నత్వం. దీని వెనకాల నిగూఢ నిక్షిప్తంగా సూక్ష్మ దృష్టితో ఆలోచిస్తే మనకి కనిపించేది ఒక ధర్మం ఉంది. అది ఏకత్వం. అదే కనిపించనిదై, మనని నడిపించేదై మనతో, ప్రతి ఒక్కరితో సమానంగా ఉండే సామ్యస్థితి ఏకత్వ స్థితి. ఈ భిన్నత్వానికి, ఈ ఏకత్వానికి ఒక దృఢమయిన సంబంధం ఉంది. దానిని దైవత్వం అని అందాం. అమ్మ భాషణలలోకి వచ్చి చెప్తే “భిన్నత్వం లేని మనస్తత్వమే దైవత్వం” అని.
కొందరు ఈ భిన్నత్వంతో కూడిన తత్త్వంలో జీవిస్తూ కూడ ఒక కన్ను ఏకత్వం మీద ఉంచుతూ ఉంటారు. భిన్నత్వం, ఏకత్వం చాల చాల పక్కనివే. అన్వేషణలో, అన్వేషణతో ఉండే వారికి అవి అతి దగ్గరవి.. సదా ఆ సామాన్యులమయిన మనకి అతి దూరంవి.
అమ్మ మనలో ఉంటూ, మనతో ఉంటూ, మనమై ఉండున్నట్లు ఉంటూ, ఆ ఏకత్వం, దైవత్వం అనే సూత్రములతో అవిభాజ్యమయి ఉండేది. అందుకే “అంతా ఆత్మగా తోచటమే ఆత్మ సాక్షాత్కారం” అని అంటూ అంతా అనే పదంతో అంతా తానయి ఉన్న చైతన్యం వైపు మన దృష్టిని పోనివ్వమంటోంది. అదే ఆత్మ అంటోంది. అట్లా తోపింప చేసే శక్తిని ప్రాప్తింప చేసుకోండి అంటోంది. “అంతా ఆత్మ చాల తోచటమే ఆత్మ సాక్షాత్కారం” అనే ఈ వాక్యంలో “తోచటమే” అనే పదం ముఖ్యమయినది, ముద్దుగా ఉన్నది. తోచటం అనే మాట వాఙ్మయంలో చాల చాల ముఖ్యమయిన సన్నివేశాల్లో వాడే పదం. తోచటం అంటే అనుభూతి అవటం. కంటికి, అవయవాలకు కాక మనస్సు స్థాయిలో మాత్రమే అర్థమయ్యే ఒక విషయం. కొన్ని విషయాలు మనం బయటకు చెప్పలేము, కళ్ళతో చూడలేము. ఇంద్రియాలతో అనుభవించలేము. కానీ అనుభవిస్తాం. అలాంటివే ఈ తోచటం అనేది. అది మనం చెప్పినా ఒకరికి అర్థం అవదు, ఎవరికి వారికి భిన్నంగా అవగాహన అవుతుంది. అలాంటిది ఈ తోచటమనేది. అనుభూతికి మాత్రమే అందే ఆత్మని ఏ ఇంద్రియ శక్తుల ద్వారా వ్యక్తపరుస్తాం? ఎట్లా మరుస్తాం అవ్యక్తంగా ఉన్నంత మాత్రాన సర్వవ్యక్తులకు ఆధారమయిన, సర్వసృష్టికి మూర్ఖ కారణమయిన దానిని లేదని ఎలా అంటాం?
మనం చాల మందిమి. ఆత్మాన్వేషణ గూర్చి ఆత్మసాక్షాత్కారం గురించి భిన్న విభిన్న ప్రయత్నాలు, సాధనలు, చేస్తూ ఉంటాం. పూజ, జప, ధ్యానా పద్ధతులతో సాధన చేస్తూ ఉంటాం. గమ్యం దొరకలేదని దిగులు పడుతు ఉంటాం. సాధన ఆపలేకపోతూ ఉంటాం. మనందరికి అమ్మ ఒక్క వాక్యం సమాధానం చెప్పింది. అన్ని సాధనలకు సరిపోయేటట్లు చెప్పింది. సర్వుల ప్రయోగ యోగ్యంగా చెప్పింది.
ఆత్మ అనేది అందరికి చెందిన ఒక నిగూఢ నిక్షిప్త నిధి లాంటి అందుకోవటానికి మనము అందరం అర్హులమే. ఒక అవ్యక్తమయిన, చైత శక్తి ఇన్ని ప్రాణులను నడిపిస్తోందనే సత్యాన్ని మరవకుండా ఉంటూ అంతశ్చైతన్యంతో సాధన కందిన మార్గంలో ప్రయాణిద్దాం. ఆ తోచటం అ ఏమిటో తోపింప చేసుకుందాం. భిన్నత్వంలో ఉండే ఏకత్వం వైపు అవగాహన పెంపు చేసుకుందాం. అమ్మ సూక్తిని మరొక అమ్మ వాక్యాన్ని గమనిస్తే ఆత్మను గురించి ఇలా ఉంది. ఆత్మ తెలియటం గురించి ఇలా వివరించబడి వుంది. తెలియటం అంటూ వస్తే – శక్తి రూపంగానే తెలుస్తుంది” అని. కాబట్టి శక్తిని గురించి కొంచెం శ్రద్ధ పెట్టి, ఆత్మను శక్తి రూపంగా తెలుసుకుంటూ ఆత్మానుభూతిని పొందుదాం. ఆత్మ అనే శక్తి అందరిలో అన్నిటిలో అన్ని వేళలా ఉన్నదే కనుక దానిని అనుభవంలోకి తెచ్చుకుందాం. అమ్మ చెప్పినట్లు “అంతా ఆత్మగా తెలియటమే ఆత్మ సాక్షాత్కారం” అనే సూక్తికి అనుభవ పూరిత ఉదాహరణగా మిగులుదాం. ప్రభావం వలన సాక్షాత్ ఆత్మ సాక్షాత్కారానికి పాత్రులమవుదాం.